సంగీత సురధార-9

0
2

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]

అధ్యాయం 9 – రెండవ భాగము

తాళము – మార్గ, దేశి తాళములు – 108 తాళములు

తాళ దశ ప్రాణములు

తాళము: మనము పాడునట్టి సంగీత రచన యొక్క కాల ప్రమాణమును చేతితో కొలిచి కాని, తాళ యంత్రము కొట్టుట వలన గాని తెలుపునది తాళము అనబడును. ఇవి రెండు రకములు. 1. మార్గ 2. దేశి తాళములు. ఇవి ఒక్కొక్కటి శుద్ధము, సాలగము, సంకీర్ణములను మూడు విధములుగా యుండును.

తాళ ప్రకరణమును నేర్చుకొనునప్పుడు తాళమును గురించి 10 విషయములు నేర్చుకొనవలయును. అవి ఏమనగా 1. కాలము 2. మార్గము 3. క్రియ 4. అంగము 5. గ్రహము 6. జాతి 7. కళ 8. లయ 9. ప్రస్తారము 10. యతి.

1. కాలము:

సంగీతము యొక్క వేగమును తెలుపునది ‘కాల’మని చెప్పబడెను. కాల ప్రాణము ఈ విధంగా నిర్వచించబడినది. నూరు తామర రేకులు దొంతిగా పెట్టి సూదితో పొడిచిన అందు ఒక తామర రేకు తెగుటకు పట్టునది ‘కాల’మని అనబడును.

  • 8 క్షణములు 1 లవమనియు
  • 8 లవములు 1 కాష్టమనియు
  • 8 కాష్టములు 1 నిమిషమనియు
  • 8 నిమిషములు 1 తృటి (లేదా) అనుధృత
  • 2 అనుధృతలు 1 ధృతము
  • 2 ధృతములు 1 చతురస్ర జాతి లఘువు
  • 2 చతురస్ర జాతి లఘువులు 1 గురువనియు
  • 3 చతురస్ర జాతి లఘువులు 1 ప్లుతమనియు
  • 4 చతురస్ర జాతి లఘువులు 1 కాకపాదమనియు

చెప్పబడినది.

2. మార్గము

సంగీత రచనలు తాళములో నడుపు విధానమును తెలుపునది మార్గ ప్రాణము. మార్గములు ఆరు కలవు. అవి యేవనగా

  1. దక్షిణ మార్గము – తాళంలో1 క్రియకు పాలులో 32 అక్షరములు
  2. వార్తీక మార్గము – తాళంలో1 క్రియకు పాలులో 16 అక్షరములు
  3. చిత్ర మార్గము – తాళంలో1 క్రియకు పాలులో 8 అక్షరములు
  4. చిత్ర తర – తాళంలో1 క్రియకు పాలులో 4 అక్షరములు
  5. చిత్ర తమ – తాళంలో1 క్రియకు పాలులో 2 అక్షరములు
  6. అతి చిత్ర తమ – తాళంలో1 క్రియకు పాలులో 1 అక్షరములు

దక్షిణ, వార్తీక, చిత్ర (లేదా) ప్రథమ, ద్వితీయ, తృతీయ (లేదా) విళంబ, మధ్య, ధ్రుత కాలములు అని పేరు.

3. క్రియ:

ఒక తాళము ఆవృత్తము నందు కొట్టుట, విసురుట, ఎంచుట మొదలగు పనులు చేయునది క్రియ.

క్రియలు రెండు విధములు – (a) మార్గ క్రియలు (b) దేశ్య క్రియలు

మార్గ క్రియలు రెండు రకాలు (1) సశబ్ద క్రియ (2) నిశబ్ద క్రియ

సశబ్ద క్రియ: ఎడమ అరచేతిపై కుడి చేతితో శబ్దము కలుగునట్టుగా కొట్టుట. ఇవి నాలుగు విధములు.

  1. ధ్రువము – శబ్దపూరకమైన చిటికె
  2. శమ్యము – కుడి అరచేతి యందు ఎడమ అరచేతితో ఘాతను వేయుట
  3. తాళము – ఎడమ అరచేతి యంచు కుడి అరచేతితో ఘాతను వేయుట
  4. సన్నిపాదము – అభిముఖముగా నిలువబడిన రెండు హస్తములతో ఘాతను వేయుట

నిశబ్ద క్రియ: ఎడమ అరచేతిపై కుడి చేతితో శబ్దము లేకుండా కొట్టుట. ఇవి నాలుగు విధములు.

  1. ఆవాపము – ఊర్థ్వ ముఖమున పైకెత్తబడిన పతాక హస్తము యొక్క నాలుగు వేళ్ళను ముడుచుట
  2. నిష్క్రామము – పైన తెలిపిన ముడిచిన వేళ్ళను క్రమముగా విప్పుట
  3. విక్షేపము – పైన తెలిపిన హస్తమును కుడి వైపుకు విదుల్చుట
  4. ప్రవేశకము – విదిలించిన హస్తమును అప్రదక్షిణముగా క్రింది వైపు నుండి ముందుకు రానిచ్చుట

దేశ్య క్రియలు ఎనిమిది రకాలు.

  1. ధవకము – శబ్దముతో కూడిన కుడి హస్తము యొక్క ఘాత
  2. సర్పిణి – కుడి చేతి పతాక హస్తమును ఎడమ వైపుకు చూచుట
  3. క్రిష్య – పై హస్తమును తిరిగి కుడి వైపుకు తెచ్చుట
  4. పద్మిని – అరచేతిని క్రిందుగా చేసి అధోముఖముగా చూచుట
  5. విసర్జితము – పైన తెలిపిన హస్తమును వెలుపలిలి విసురుట
  6. విక్షిప్త – పైన తెలిపిన హస్తము యొక్క వేళ్ళను ముడుచుట
  7. పతాక – విప్పిన అరచేతిని మీదకి ఎత్తుట
  8. పతిత – పైన తెలిపిన విధముగా మీదికెత్తిన హస్తమును దించుట

4. అంగము:

ఇవి ఆరు రకములు;

  1. అనుధృతము – ఒక ఘాత (1 క్రియ) – U
  2. ధృతము – ఘాత, ఉసి (2 క్రియలు) – O
  3. లఘువు – ఘాత వేసి వేళ్ళు లెక్కించుట – I
  4. గురువు – 2 లఘువులు కలిపిన (జాతిని బట్టి మారుచుండును) Iƨ
  5. ప్లుతము – 3 లఘువులు కలిపిన Iƨ
  6. విక్షిప్త – 4 లఘువులు కలిపిన +

5. గ్రహము:

గ్రహము అను పదమునకు ప్రారంభించు చోటు అని అర్థము. సంగీతము, తాళము ప్రారంభించు తావు అని అర్థము.

అతీత: ముందు పాట, తరువాత ఖరహర ప్రియలో ‘ప్రక్కల నిలబడి’

తాళం: తోడి. ‘ఆరగింపవే’. అ॥ ప॥ లో ‘రఘువీర’ అనుచోట.

6. జాతి:

ఇది ఐదు రకములు.

  1. త్రిశ్ర జాతి లఘువులో 3 క్రియలు
  2. చతురస్ర జాతి లఘువులో 4 క్రియలు
  3. ఖండ జాతి లఘువులో 5 క్రియలు
  4. మిశ్ర జాతి లఘువులో 7 క్రియలు
  5. సంకీర్ణ జాతి లఘువులో 9 క్రియలు

జాతి అనునది లఘువునకు సంబంధించినది. అనగా జాతిని బట్టి లఘువు సంఖ్య మారును.

7. కళ:

తాళములోని క్రియలకు, గతిని బట్టి నడుచు అక్షర కాలములకే కళలు అని పేరు. ఇవి మూడు రకములు.

  1. ఏక కళ – 1 అక్షరము వంతున
  2. ద్వికళ – 2 అక్షరముల వంతున
  3. చతుష్కళ – 4 అక్షరముల వంతున నడుచును.

8. లయ:

తాళము యొక్క వేగమును తెలుపునది. సమాన అంతర్భాగములు గల తాళక్రియలు లయలో నడుచును. లయ అనునది తాళమునకు ఆధారము. ఇవి మూడు విధములు.

  1. విలంబ లయ – బాగా చౌక కాలము (ఏలావతరామెత్తుకొంటివి – ముఖరి – ఆది)
  2. మధ్య లయ – తక్కువ, ఎక్కువగా గాక (నెనరుంచి – మాళవి – ఆది)
  3. ధృత లయ – బాగా వేగముగా నడుచునది (సుపోషిణి – రమించు వారెవరురా)

9. ప్రస్తారము:

ఒక తాళములో గల అంగములను వాటి అంతర్గత అంగములతో వీలైనన్ని విధములుగా ప్రస్తరించి తాళ భేదములను కల్పించట.

ఉదా: ఒక చతురస్ర జాతి లఘువును తీసుకొని దానిని ఈ క్రింది విధములుగా ప్రస్తరించవచ్చు.

  • 1 లఘువు – I
  • 2 లఘువులు – O O O
  • 3 లఘువులు – O O
  • 4 లఘువులు – U U U U

10. యతి:

తాళాంగముల కూర్పు యొక్క స్వరూపము తెలుపునది. ఇది ఆరు విధములు. అవి ఏవనగా

  1. సమ యతి (లేక) పిపీలిక యతి – తాళాంగముల యొక్క కూర్పు చీమల బారుల వలె తిన్నగానున్నది. ఉదా: III OOO
  2. గోపుచ్ఛ యతి – ఆవు తోక వలె మొదట లావు గాను, పోను పోను సన్నము – త్రిపుట – I O O
  3. శ్రోతోవహ యతి – నది ఆకారము వలె మొదట సన్నముగా, పోను పోను వెడల్పు – రూపక – OI
  4. మృదంగ యతి – నడుమ వెడల్పు, ఇరువైపులా సన్నముగా – U O I O U
  5. ఢమరు యతి – నడుమ సన్నం, ఇరువైపులా లావు – I O I
  6. విషమ యతి – నిర్ణీతాకారములో లేక ఇష్టమొచ్చిన రీతిలో నున్న – O I U O I U I U O

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here