Site icon Sanchika

ఒక మంచి ప్రయత్నం ‘సంజీవని’

[dropcap]‘సం[/dropcap]జీవని’ (తెలుగు చలన చిత్రం) – యూట్యూబ్ లో ఉంది.

***

ఒకసారి ఈ కింది చలన చిత్రాలను గుర్తు తెచ్చుకోండి.

ఈ చిత్రాలన్నింటిలో సామ్యం ఏమిటంటే సాహసోపేతమైన అన్వేషణ. అది నిధి కోసం కావచ్చు లేదా కావాలసిన వారికోసం కావచ్చు. అదిగో అలాంటి అన్వేషణ నేపథ్యంలో 2018లో తీయబడ్డ చిత్రం ఈ ‘సంజీవని’.

పూర్తిగా కొత్తవారితో తెలుగులో తీయబడ్డ చలనచిత్రం ఇది. అందరూ కొత్తవారు, కథ, కథనం కూడా మూసబోసినట్టు కాకుండా వైవిధ్యంగా ఉండటంతో, పంపిణీదారులు ఈ చిత్రాన్ని తీసుకోవటానికి ముందుకు రాలేదట.

ఎస్.ఎస్.రాజమౌళి గారు ఈ చలనచిత్రపు టీజర్ చూసి చాలా బాగుంది అని అభినందించిన తర్వాత దీనికి పంపిణీదారులు ముందుకు వచ్చారట.

అదే విధంగా ఈ చిత్రం తాలూకు టీజర్స్‌ని చూసి రాంగోపాల్ వర్మ కూడా అభినందనలతో ముంచెత్తాడట.

నిన్న యథాలాపంగా ఫేస్‌బుక్ చూస్తూ ఉంటే మిత్రుడు అమోఘ్ దేశపతి షేర్ చేసిన ఒక పోస్ట్ ఆకట్టుకుంది. ఆ పోస్ట్ ఏమిటంటే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మనోజ్ చంద్ర ‘సంజీవని’ చిత్రం విడుదల సందర్భంగా తన అనుభవాలని ఏకరువు పెట్టాడు. ఆ పోస్ట్ ఆకట్టుకుంది నన్ను.

ఇది ఓటీటీలో ఉందా అని విచారించాను. ఓటీటీలో ఉందని చెప్పాడు అమోఘ్. తెలుగులో యూట్యూబ్ లోనూ, హిందీలో డిస్నీ హాట్‌స్టార్ లోనూ ఉంది అని కూడా వివరించాడు.

ఇక ఈ సినిమా చూద్దామని నిర్ణయించుకున్నాను.

ఒకప్పుడు అపరాధ పరిశోధన మంత్లీలో చదివిన అనేక సాహసోపేతమైన నవలలు గుర్తు వచ్చాయి ఈ చిత్రం చూస్తుంటే.

***

కథ:

ఇంతకూ ఈ చలన చిత్రం కథేంటి? అక్కడికే వస్తున్నాను.

చిత్రం ప్రారంభం దృశ్యంలో గొప్ప పర్వత శిఖరాల మీదుగా హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ఆర్మీ (రక్షణ మంత్రిత్వ శాఖ) ఇంజినీర్లు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా సిగ్నల్స్ మాయవవుతాయి.

‘ఇలా సిగ్నల్స్ మిస్ కావటం అంత సహజమైన విషయం కాదు. ఇక్కడేదో మానవాతీత శక్తులు ఉన్నాయి. ఇక్కడ హెలికాప్టర్‌ని దింపు, ఇప్పుడే అన్వేషిద్దాం’ అని ఒక ఇంజినీర్ అంటాడు.

హెలికాప్టర్ నడుపుతున్న ఇంజీనీర్ అతని మాటల్ని తేలిగ్గా కొట్టిపారేస్తాడు.

ఇంతలో ఆ హెలికాప్టర్ పరిణామానికి రెట్టింపు సైజులో ఉన్న గండభేరుండ పక్షులలాంటి కొన్ని పక్షులు వచ్చి ఆ హెలికాప్టర్‌ని చుట్టు ముడతాయి. ఆ ఇంజినీర్లు ఇద్దరూ అయోమయంలో పడిపోతారు.

ఆ తరువాత ఆ హెలికాప్టర్ అదృశ్యం అయిపోతుంది, ఆర్మీ వారి లెక్కల ప్రకారం.

ఇక టైటిల్స్ పడతాయి ఇంగ్లీష్‍లో (బహుశా ఏ భాషలోకి డబ్బింగ్ చేసినా పనికొస్తుందని ఇలా చేసుంటారు).

ఆ తరువాత కొన్ని నాటకీయ సంఘటనల సహాయంతో మనకు ఒక మిత్ర బృందాన్ని పరిచయం చేస్తారు దర్శకుడు. ఈ మిత్ర బృందంలో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు. వీరందరికి వివిధ అభిరుచులు ఉన్నప్పటికీ, అందరికీ ఉన్న ఒక సమానాసక్తి పర్వతారోహణ.

ఈ బృంద నాయకుడు మనోజ్ చంద్ర. ఇతను తన బృంద సభ్యులచే అనేక సాహస కృత్యాలు చేయించి వారికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణభూతుడు అయి ఉంటాడు. అందుకే వారందరికీ అతని పై అభిమానం. అతని మాట మీద గురి.

వీరి సాహసాలు గమనించి భారత ప్రభుత్వం వీరి ముందు ఒక అభ్యర్థన పెడుతుంది. అది ఏమిటంటే, ఒక దుర్భేద్యమైన పర్వత శిఖరాన్ని అధిరోహించి అక్కడి రహస్యాలని తెలుసుకోవాలన్నది ఆ అభ్యర్థన తాలూకు సారాంశం. ఆ దుర్భేద్యమైన పర్వత శిఖరాలపై మృతసంజీవని మొక్క ఉందని ప్రభుత్వ అంచనా. అంతరించి పోయాయి అని మనం అనుకుంటున్న అనేక జీవరాశులు ఆ పర్వత శిఖరాలపై ఇప్పటికి నిక్షేపంగా ఉన్నాయని, అనేక ఔషధ మొక్కలు కూడా అక్కడ ఉన్నాయని ప్రభుత్వ అంచనా.

అక్కడి రహస్యాలని శోధించటానికి ప్రభుత్వం తరఫున వెళ్ళిన అనేక మంది అధికారుల ఆచూకీ తెలియరాలేదని, అనేక హెలికాప్టర్లు గల్లంతయ్యాయని, శాటిలైట్‌కు కూడా కనపడని అత్యంత అరుదైన శిఖంరం అని, ఇది అత్యంత సాహసంతో కూడిన అన్వేషణ అని కూడా తెలియజేసి భారీ ఎత్తున నగదు బహుమతి కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది.

మనోజ్ చంద్ర ఈ విషయాలన్నీ తన బృందం వద్ద దాచి, ఇంకొక మామూలు పర్వతారోహణ అని చెప్పి అక్కడికి తీస్కువెళతాడు తన సభ్యులను. అతనిపై నమ్మకంతో వెళ్ళినప్పటికీ, అక్కడ ఏర్పడుతున్న విచిత్ర పరిస్థితుల కారణంగా వారు అతన్ని నిలదీస్తారు.

వాళ్ళు ఆ పర్వత పంక్తుల పరిసర ప్రాంతాలలో కాలు పెట్టంగానే ఓ యోగి హఠాత్తుగా కనిపించి సంస్కృతంలా ధ్వనించే విచిత్రమైన భాషలో వీరిపై కేకలేస్తాడు. ఆయన కళ్ళలో తీవ్రమైన వింత కాంతి. ఆ యోగి కెమెరాలో బంధిపబడకపోవడం మనకు వెన్నులో చలి పుట్టిస్తుంది.

టాం (అమోఘ్ దేశపతి) క్రైస్తవం లోకి మారిన బ్రాహ్మణుడు కావటాన అతనికి సంస్కృతం తెలుసు. ఆ కారణంగా ఆ శాపాన్ని అర్థం చేసుకుంటాడు.

‘ఇక్కడ మృత సంజీవని ఉంది. ఇక్కడ నుంచి కేవలం పవిత్రులు, నిస్వార్థపరులే ప్రాణాలతో బయటపడతారు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి’ అని ఆ కేకలకి అర్థం అని చెబుతాడు. మిత్ర బృందం అతని మాటలకి నవ్వేస్తారు.

ఆ తర్వాత ఏమి జరిగింది, వారి అన్వేషణ ఫలించిందా? ఇవన్నీ చూడాలంటే తెరపై (అదే ఓటీటీ తెరపై) చూడాల్సిందే.

***

ఈ చిత్రం విశేషాలు:

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ ఏమిటంటే నిడివి తక్కువగా రూపొందించారు. సినిమా ఓపెనింగ్ సమయంలో వచ్చే హెలికాఫ్టర్ షాట్ చాలా బాగుంది. ఆ సన్నివేశాన్ని మంచి కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్‌తో రూపొందించారు. నూతన సాంకేతికతను వినియోగించి పర్వత ప్రాంతంలో తీసిన డ్రోన్ షాట్స్ కొన్ని బాగున్నాయి.

ఆ తరువాతి షాట్‌లో హిమాలయ శిఖరాలపై సాహసోపేతమైన ఆరోహణ. ఆక్సిజన్ టేంక్ లేకుండా అతి తక్కువ సమయంలో వారు చేరుకున్న విధానం, భారత జండా చూపడం కూడా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్స్ ద్వారా చూపించిన అరుదైన రాక్షస సాలీడు పురుగులు, రాక్షస చింపాంజి, గండభేరుండ పక్షులు ఆకట్టుకుంటాయి.

పెద్ద పెద్ద కొండ శిఖరాలు, లోయలు భీతి గొల్పుతాయి.

నిస్వార్థపరులైన, మంచి మనసున్న బృంద సభ్యులకి చివర్లో ఆంజనేయస్వామి దర్శనం ఇవ్వడం హైలెట్.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభంలో హెలికాప్టర్, గండబేరుడ పక్షుల షాట్ చూపించి ప్రేక్షకులు ఇకపై సినిమా మొత్తం ఇలానే భారీ గ్రాఫిక్స్‌తో నిండి థ్రిల్లింగా ఉంటుంది అనుకునే సమయానికి సినిమా ఆ బృంద సభ్యుల మధ్య చిన్న చిన్న ప్రేమలు, అపార్థాల వంటి అర్థం పర్థం లేని సంఘటనల వల్ల ఉత్సాహం నీరుగారి పోతుంది. ఇది స్క్రీన్ ప్లే డిపార్ట్‌మెంట్‌లో జరిగిన లోపం. కానీ ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది.

పర్వతారోహకులు బృందంలోని సభ్యుల్లో ఒకరికొకరి మధ్యన ఉండాల్సిన ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ చూపటంలో విఫలం అయ్యారు. ఇంకొంచెం బలమైన సన్నివేశాల్ని రచించుకొని ఉండాల్సింది.

ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గ్రాఫిక్స్ అక్కడక్కడా బాగున్నాయి. కెకె.శ్రావణ్ సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఉపయోగపడింది. లిమిటెడ్ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ముఖ్యాంశం:

ఉదయించిన సూర్యుడు అస్తమించక తప్పదు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించక తప్పదు, అలా కాకుండా సూర్యుడు అలాగే ఉండిపోవాలి అని భావిస్తే సృష్టి యావత్తు అల్లకల్లోలం అవక తప్పదు. ఇది ఈ చిత్రం తాలూకు సందేశం అనుకోవచ్చు.

ఆంజనేయస్వామి యొక్క దర్శనం అయినంత మాత్రాన ఆ పాత్రలో జ్ఞానోదయం అయిన విధంగా ఈ సంఘటనని చూపించటం బాగుంది.

తీర్పు ఏమిటి?

దర్శకుడు, నటీనటులు పడ్డ శ్రమ అడుగడుగునా కనిపిస్తుంది. వాళ్ళు అంత కష్టపడి, ఇష్టంగా తీసిన సినిమాని మనం ఒకసారి చూడొచ్చు. నిరాశ పరచదు.

ముఖ్యంగా తెలుగులో ఇలాంటి జానర్‌లో సినిమాలు రావటమే అరుదు. వీళ్ళకి ఉన్న బడ్జెట్ పరిమితులకి లోబడి బాగానే తీశారు.

సాంకేతిక వర్గం:

నటీనటులు:

Exit mobile version