సంకల్ప శక్తి

4
2

[శ్రీమతి అక్షర రాసిన ‘సంకల్ప శక్తి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]రుణాకరం వచ్చాడు ఆ రోజు మా ఇంటికి. కదిలిస్తే చాలు దుఃఖం ముంచుకు వచ్చేలా ఉన్నాడు. గ్లాసులో మంచి నీరు ఇచ్చి విషయం చెప్పమన్నాము. దుఃఖంతో పూడుకు పోతున్న గొంతుతో చెప్పాడు “మా అరుణకి అప్పుడే నూరేళ్ళు నిండినాయి బావా.”

“అదేమిట్రా పిచ్చి వాగుడు, సరేలే వివరంగా చెప్పు ఏమైందో?” అన్నాను.

“అరుణ కొన్నాళ్ళుగా పొత్తి కడుపులో నొప్పితో విపరీతమైన బాధ, సరిగ్గా యూరీన్ పాస్ అవక బాధ పడుతుంటే పరీక్ష్ చేయిస్తే కిడ్నీస్ బాగా పాడయనాయని, త్వరలో కిడ్నీ డోనర్ దొరికితే అరుణని బ్రతికుంచుకోగలమని చెప్పారు రా బావా.” అంటూ ఏడ్చేశాడు.

“బ్రతకటానికి అవకాశం ఉందని చెప్పారు కదరా, మరి ఏ ప్రయత్నం చేయకుండా నూరేళ్ళు నిండాయి అన్న తీర్మానానికి ఎలా వచ్చేశావురా.”

“ఇంత తక్కువ సమయంలో మాచింగ్ కిడ్నీ దొరకటం ఎలా సంభవం రా?”

“ఎందుకు సంభవం కాదు? ఇంతమంది ఉన్నాము ఆందరం టెస్ట్ చేయుంచుకుందాము. ఎవరో ఒకరిది తప్పకుండా మాచ్ అవుతుంది. మన ప్రయత్నం మనం చేసి దేముడ్ని ప్రార్థిదాము. అరుణ తప్పకుండా బాగు పడుతుంది. నువు ఊరికే భయపడి అరుణని మిగతా వారినీ గాబరా పెట్టకు” అని చెప్పి కరుణాకరాన్ని ఇంటి దగ్గర దిగపెట్టి వచ్చాను.

ఆ రెండో రోజు నించి మాకు దగ్గర వారైన ప్రతి ఒక్కరూ మా కిడ్నీ మాచింగ్ టెస్ట్‌కి ఇచ్చాము. ఆఖరికి అప్పటికి యాభై ఐదో ప్రాయంలో ఉన్న మా అమ్మ కిడ్నీ మాచ్ అయిందని తెలిసింది. క్షణం ఆలోచించకుండా ముందుకు వచ్చింది మా అమ్మ. డోనర్ దొరికారని తెలిసాక మాకు కొంత ఊపిరి ఆడింది.. అరుణ మొహంలో కొంచెం జీవకళ కనిపించింది.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యే దాకా అవసరం అయినప్పుడు డయాలసిస్ మీద ఉంచుతున్నారు. ఇంక అసలు పేపర్ వర్క్ మొదలెట్టారు. ఇలాంటి దానం చేయటానికి మన ప్రభుత్వ సహమతి ఉండాలని మాకు అప్పుడే తెలిసింది. ఆది క్లియర్ అయ్యాక ఆ తరువాత సైకియాట్రీస్ట్ దగ్గరకు మా అమ్మని తీసుకు వెళ్లమన్నారు. అమ్మ మానసికంగా శారీరకంగా ఈ డొనేషన్‌కి అనుకూలంగా, ఆరోగ్యంగా ఉన్నదని సర్టిఫై చేయించుకోవటానికి. తరువాత అమ్మ రెండు కిడ్నీస్‌లో ఏది ఎక్కువ మాచ్ అవుతుందని తెలుసుకోటానికి మళ్ళీ మరో టెస్ట్ చేశారు. ఇవన్నీ అయ్యాక అన్నింటి కంటే ముఖ్యమయినది టిష్యూ మాచింగ్ కోసం. అమ్మ టిష్యూ శాంపల్స్ తీసుకుని ఢిల్లీ పంపించారు. అందులో కనుక నెగెటివ వస్తే మన ఇంత ప్రయత్నం వృథాయే. కానీ దేముడి దయ అనండి అరుణ అదృష్టం అనండి రిపోర్టు సుముఖంగా ఉండింది. ఇంత కాలం తీసుకున్నా ఇంత కష్టపడినా ఇద్దరికీ ఒకేసారి సర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయటానికి సంవత్సరం పట్టింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆ తరువాత అమ్మ ఆరోగ్యంగా ఉంది. అరుణ పెళ్లి అయి సుఖంగా కాపురం చేసుకుంటోంది. అరుణ పాపం తన ప్రతి పుట్టిన దినం రోజు వచ్చి మా అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టకుండా ఉండదు.

ప్రస్తుతం మా అమ్మ తొంభై రెండో ఏడు. ఎక్కువగా మంచం పైనే ఉంటునది. మా అమ్మ ఇవాళో రేపో అన్నట్టు పడుకుని ఉంది. ఆవిడ వేపు బంధువులు ఎలాంటి వార్త క్షణం వస్తుందో అని అప్పటికే ఒకరు ఒకరు వచ్చి అమ్మని ఆఖరి చూపు చూసి వెళ్ళున్నారు. ఆస్పత్రిలో డాక్టర్సు “ఇక మేము చేసేది ఏమీ లేదు, ఇంటికి తీసుకు వెళ్ళిపొండి అని చెప్పేశారు. ఆవిడ ఆఖరి శ్వాస హాయిగా తీసుకునేట్టు చూడండి” అని చెప్పారు. మేమందర ఆ ప్రయత్నం లోనే ఉన్నాము. ఏదైనా చెప్పాలంటే ఆవిడ చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా చెప్తే విని స్పందిస్తుంది. ఆవిడ ఏదైనా చెప్పాలంటే సైగల తోనో లేక పోతే ఆవిడ నోటి దగ్గర చెవి పెడితే అతి మెల్లగా మాట్లాడగలుగుతోంది. మధ్యలో మెల్లగా కళ్ళు తెరిచి ఎవరి కోసమో ఆతురతతో ఎదురు చూస్తుంటే అది గమనించి అడిగితే చెప్పింది “ప్రసాదు ఇంకా రాలేదా” అంటూ. ప్రసాదు నా కొడుకు, హైద్రాబాదులో డాక్టర్‌గా చేస్తున్నాడు మూడేళ బట్టి. “ఇవాళ రాత్రికి వస్తాడు ప్రసాదు. నువ్వు విశ్రాంతిగా పడుకో. వాడు రాంగానే నీకు చెపుతాగా” అని అమ్మని ఊరుకోబెడుతుంటే నా కూతరు అంటోంది “చూశావా నాన్నా మేమందరం ఇన్ని పరిచర్యలు చేస్తున్నా బామ్మకి అన్నయ్య అంటేనే ఇష్టం. ఎప్పుడు తన కోసమే తాపత్రయం”. నాకు కూడా కొంత వింతగాగే అనిపించింది. ఎందుకా ప్రసాదు కోసం అంతలా ఎదురు చూస్తోందని.

మా అమ్మ కిడ్నీ డొనేట్ చేశాక తన బుర్రలో పురుగు దూరి పెద్దది అవుతూ వచ్చింది. ఈ లోగా నా కొడుకు ప్రసాదు ఎం.బి.బి.ఎస్. చేసి ఆర్తో స్పెషలైజేషన్ చేశాక తనని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఏదో కూడబలుక్కుంటూ ఉండేవారు. నాకు గాని మరో మనిషికి మాత్రం ఏం తెలియనిచ్చేవారు కాదు. రాత్రి పది గంటలకు ప్రసాద్ వచ్చి కనబడ్డాక అమ్మ కళ్ళలో చిన్న మెరుపు మెరిసింది. తన తలగడ కింద నుంచి ఎలామినటెడ్ కార్దొకటి తీసి తన చేతిలో పెట్టి మెల్లగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది. ఇక తనకు ఏమైనా మనవడు అన్నీ చూసుకుంటాడని ధీమా అది.

“ఏమిట్రా ప్రసాదు మీ ఇద్దరి మధ్య మాకు తెలీకూడనని రహస్యాలు ఏమిట్రా? మాకేవరికి తెలియని ఖజానా ఏమైనా ఉందేమిట్రా?” అంటూ నేను హాస్యం ఆడితే “తను ఆఖరి శ్వాస వదిలే దాకా ఎవరికి చెప్పవద్దని బామ్మ ఒట్టు వేయించుకుంది నాన్నా. తను కళ్ళు మూసే దాకా ఎవరికి విషయం చెప్పొదని మాట ఇవ్వమంది నాన్నా.. ఆఖరి రోజుల్లోతన మాట ఎందుకు కాదనాలని చెప్పటం లేదు. లేకపోతే అంత చెప్పకూడని విషయం ఏమీ లేదు” అన్నాడు ప్రసాదు. తనని చూడంగానే ప్రశాంతంగా మారిన బామ్మ మొహం చూసి ప్రసాదు గతం లోకి వెళ్ళాడు.

***

ఎనభయ్యో ఏటి వరకు అంటే తన పనులు తాను ఎవరి సాయం లేకుండా చేసుకోకలిగనంత కాలం బామ్మ బాగానే ఉంది. ఒక రోజు కన్నీళ్ళు పెట్టుకుంటూ “ఒరేయ్ ప్రసాదు నాకు ఇంక ఇలా బ్రతకాలని లేదురా. కాళ్ళూ చేతులు పూర్తిగా పడిపోకముందే నువు డాక్టర్‌వి కదా నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకునే మందు ఏదైనా తెచ్చి ఇవ్వరా. నా ఒంట్లో పనికి వచ్చే భాగాలు ఏమైనా ఉంటే ఆస్పత్రికి ఇచ్చేస్తే అవసరం ఉన్న వారికి ఎవరికైనా పనికి వస్తాయేమో చూడు” అంటూ చాలాసార్లు ప్రాధేయపడుతూ అడగటంతో నేను నవ్వుతూ “అదేంటి బామ్మా నా పెళ్లి చూడకుండానే వెళిపోతావా ఏం? అదేం కుదర్దు” అని హాస్యంగా కొట్టి పడేయటం అయింది. తరవాత తప్పనిసరి చెప్పాను “బామ్మా నీకు నీ శరీరర భాగాలన్నీ ఆస్పత్రికి దానం చేయాలన్న బలమైన కోరిక ఉండటంలో తప్పు లేదు. కానీ నీ కోరిక తీర్చటం కోసం నీ ప్రాణాలు తీయమని కోరటం మాత్రం పాపం. నన్ను ఆ మహా పాపం చేసి జైలుకి పొమ్మంటావా?” అని అడిగాను. అప్పటి నుంచి ఇక చేసేది లేక తన చావు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇన్నాలకి తొంభై రెండో ఏట బామ్మ కోరిక తీరేలా కనిపించి కిందటి సారి వచ్చినప్పుడు అడిగింది – “ఏమిరా ప్రసాదు ముందు ఎన్ని సార్లు అడిగినా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ తొంభై ఏళ్ల శరీరం ఎవరికైనా పనికి వస్తుదంటావా?” అని. మొన్న ఇలాగే మళ్ళీ సందర్భం వస్తే “ఐనా బామ్మా నీ తాపత్రయం కానీ తొంభై ఏళ్ళు దాటాక శరీరంలోని ఏ అవయవం ఎన్నాళ్ళు పని చేస్తుంది చెప్పు. అనవసరంగా నీ శరీరం కోసి మళ్ళీ అంతా పాక్ చేసి ఇచ్చేస్తారేమో చూసుకో” అని హాస్యమాడాను. కానీ దానికి కూడా బామ్మ చలించలేదు. “మొన్నెప్పుడో మాలతి నాకు గూగుల్‌లో చదివి చెప్పింది ఎవరో తొంభై ఏళ్ళ ఆవిడ లివర్ అరవై అయిదేళ్ళ ఆవిడకి డొనేట్ చేశారుట. నా ప్రాణం ఉండంగానే అటువంటి అదృష్టం నాకూ ఉందేమో కనుక్కుని చెప్పరా. ఎవరూ తీసుకోకపోతే నా దేహాన్ని మెడికల్ కాలేజ్‌కి దానం చేసెయి, కానీ నా దేహానికి దహన సంస్కారం మాత్రం వీలు లేదు..” అంది. ఆధునిక పరిజ్ఞానం కొంతవరకు ఉన్న బామ్మని మాటల్తో మభ్యపెట్టలేమని నాకు తెలుసు. తనలో ఉన్న ఈ బలమైన కోరికకి జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయాను.

***

ప్రసాదు వచ్చిన రెండో రోజుకి అమ్మ వాడి చేతుల్లోనే ప్రాణాలు విడిచింది. ఎంత మునుపటి నుంచి సిద్ధంగా ఉన్నా అందరూ దుఃఖించకుండా ఉండలేకపోయాం. నేను ప్రసాదు దగ్గరకు వెళ్ళి “ఏం రా ఇప్పటికీ ఐనా మీ ఇద్దరి మధ్య రహస్యం ఏమిటో చెపుతావా?” అని అడిగాను. మారుమాట్లాడకుండా మా అమ్మ తన అరవయ్యో ఏట తన పేరు ఆర్గాన్ డొనేషన్ కోసం రిజిస్టర్ చేయించుంచుకున్న కార్డ్ తీసి నా చేతిలో పెట్టాడు. “ఏమిటి రా ఇదంతా” అంటూ విభ్రాంతిగా చూశాను వాడి వేపు.

“అదే మరి, మనం ఎప్పుడూ కలలో కూడా అనుకోని పని బామ్మ ఎప్పుడు ఎలా ఎవరి సాయంతో చేసుకుందో తెలీదు.”

“ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా అయితే?” అన్నాను.

నా శ్రీమతి కూడా విని అబ్బురపడింది. “అత్తయ్య ఎప్పుడూ అంతే. తనకి ఉన్న మనోబలం మనెవ్వరికీ లేదు.” అంటూ కళ్ళు తుడుచుకుంది.

మిగతా బంధువులు అందరూ తలా ఓ విధంగా మాట్లాడుతున్నారు – “ఇదేం కోరిక అంట రాజ్యంది మరీనూ. శుద్ధమైన శోత్రియ కుటుంబంలో పుట్టి దహన కర్మ చేయకుండా ఎలగుటా!!! మరీ విడ్డూరం కాక పోతే..”

“వంశానికి వారసుడు లేకపోతే ఎలా అని కొడుకు పుట్టాలని ఈనాటికీ కోరుకునే సమాజం కదా మనది. చక్కగా కొడుకు, మనవడు ఉండగా రాజ్యానికి ఈ వింత కోరిక ఎలా పుట్టిందో!!!” ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా – ప్రసాదు వెంటనే మాట్లాడి ఉంచిన మెడికల్ కాలేజీ నిర్వాహకులు అవసరమైన పరికరాలతో పాటు రమ్మని – అమ్మ శరీరాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నము మొదలెట్టాడు. మిగతా అవయవాల మాట ఏమో కానీ చర్మము, కళ్ళూ ఉపయోగించవచ్చని అనుకుంటున్నాము. “ఆవిడకి అంత బలమైన సంకల్పం ఉంది, అంటే మిగతా భాగాలు కూడా పనికి రావచ్చు, చూద్దాం” అన్నారు కాలేజ్ వారు. “అన్ని పనులు పూర్తి అయ్యాక అస్థికలు తీసి ఇస్తాము, అప్పుడు రండి” అని చేప్పారు. ఛిన్నాభిన్నమైన శరీరాన్ని తెచ్చి దహనం చేయటానికి మా మనసు ఒప్పుకోక వారు అన్నదానికే సరే అన్నాము.

మిగతా కార్యక్రమాలు మాత్రం మా అమ్మ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా దశాహం. సంతర్పణ అన్నీ శాస్త్రోక్తంగానే చేశాము. అమ్మ దేహాన్ని తీసుకువెళ్లిన రెండో రోజు కాలేజ్ వారి ఫోను వచ్చింది “మీ అమ్మగారి సంకల్ప శక్తో ఏమో కానీ మేము అనుకున్న దాని కంటే మీ అమ్మగారి అవయవాలు మంచి స్థితిలో ఉన్నాయండి. ఈ అవయవాలు పుచ్చుకున్న వారు ఏవారైనా సరే కనీసం ఎనిమిదేళ్ళైనా నిశ్చింతగా బతికేయవచ్చు. మిగతా శరీరం కూడా మేము స్టడీస్ కోసం ఉంచుకుందామని అనుకుంటున్నాము, మీకు అభ్యంతరం లేకపోతే” అని అడిగారు.

మేము ఏమంటాము. ఆవిడలో ఉన్న సంకల్ప శక్తి, మనోబలం అటువంటిది ఏమో!!!! చేతులెత్తి దణ్ణం పెట్టగలిగాము అంతే.

కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాక ముందు నేనూ, నా శ్రీమతి మిగతా బంధువులు కూడా చాలా మంది ఆర్గాన్ డొనేషన్‌కి రిజిస్టర్ చేయించుకున్నామని వేరేగా చెప్పక్కర్లేదేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here