Site icon Sanchika

చదివించే కథల సంపుటి – ‘సంక్రాంతి’

[dropcap]దా[/dropcap]సరి శివకుమారి గారు ప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి. అనువాదకురాలు. హిందీ ఉపాధ్యాయినిగా పని చేసి రిటైరయ్యారు. వివిధ ప్రింట్, ఆన్‌లైన్ మ్యాగజైన్‌లలో ప్రచురితమైన వారి 13 కథలతో కూర్చిన సంపుటి ‘సంక్రాంతి’. ఈ పుస్తకంలో – సంక్రాంతి, అనుబంధాలు, ఎదురుచూపులు, కలవరం, జగమంత కుటుంబం, పెద్దగుడి తిరునాళ్ళ, బంధం, దిశానిర్దేశం, మా పుట్టింటి తోట భోజనాలు, బామ్మగారి ప్రయాణం, వసుధైక కుటుంబం, మనస్వి, పాటే ప్రాణం అనే కథలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని తమ తాతయ్య – అమ్మమ్మలకు అంకితం ఇచ్చారు రచయిత్రి.

***

“కథ ప్రకృతి అంత వైవిధ్య భరితమైనది. కథ జీవితం అంత విలక్షణమైనది. అమ్మ లాలన నుండి పిల్లలకు కథలతో అనుబంధం ఏర్పడుతుంది. కలలకు రెక్కలు మొలుస్తాయి. ఊహలకు ఊపిరులు అందుతాయి. ఎదుగుతూ సాగే క్రమంలో ఎన్నెన్నో కథలు పలకరిస్తాయి. కొన్ని కథలలో మనమే పాత్రధారులం. కొన్ని కథలకు శ్రోతలం. మనం పాత్రధారులమైన కథలను నందనవనంగా మలచుకోగలిగితే, చిన్నతనంలో అమ్మచెప్పిన నీతి కథల సారాంశాన్ని ఒంట బట్టించుకొని ఆచరిస్తే మనుగడ మరపురాని కథ అవుతుంది. జీవనయానం రంగుల కథగా సాగిపోతుంది.

~

ఒక రచయిత, రచయిత్రి కథలను అప్పుడప్పుడు వివిధ పత్రికలలో ప్రచురితం అయినప్పుడు చదివినప్పటికంటే ఒకసారి కొన్ని కథలను చదివినప్పుడు ఆ రచనల ప్రత్యేకతను, ఆ రచయిత, రచయిత్రి ప్రతిభను గుర్తించటం సులభతరం అవుతుంది. కథా సంపుటాల ప్రధాన ప్రయోజనం ఇది. సంపుటిలోని కొన్ని కథలు ఆలోచనాత్మకంగాను, కొన్ని కథలు ఆవేదనాత్మకంగానూ, మరికొన్ని సందేశాత్మకంగాను సాగుతూ రకరకాల ఫలితాలు కలిగి ఉంటాయి.

~

ప్రముఖ కథారచయిత్రిగా, అనువాదకురాలిగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీమతి దాసరి శివకుమారి గారి కథలు విభిన్న కోణాలలో తెలుగువారి సంస్కృతిని, జీవన మూల్యాలను ప్రతిఫలించాయి.

~

శివకుమారి గారి స్వీయ వ్యక్తిత్వ ముద్రకు ఆమె కథలన్నీ దర్పణాలే. ఈ కథా సంపుటిలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. ఏ కథా వస్తువును స్వీకరించినా అంతిమంగా సాంస్కృతిక మూలాల పరిరక్షణ ధ్యేయంగా రచింపబడిన కథలు. గురు-శిష్యులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, తల్లిదండ్రులు – బిడ్డలు, దీనజనులు, నిస్సహాయుల పట్ల మనస్విత. సోదరీసోదరుల కుటుంబాల పట్ల సత్సంబంధాలు పెనవేసికొని ఉంటే జీవితాలు ఎంత ఆనందమయంగా సాగుతాయో కొన్ని కథలలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. పాఠకుల హృదయాలను చూరగొన్నారు. సున్నిత మనస్కురాలైన శివకుమారి గారు తమ మనస్తత్వానికి అనుగుణంగానే కథలను తీర్చిదిదారు.

~

రచయిత్రి శివకుమారి గారిది కథా కథనశైలి. కథనంలో వేగం కనిపిస్తుంది. ఈనాటి యువతకు, సమాజానికి తాను ఏదో చెప్పాలని దిశానిర్దేశం చేయాలని ఉత్తమ సంస్కృతి అభిమానులుగా వారిని తీర్చిదిద్దాలనే తపనలో కథను వేగంగా నడిపిస్తారు. ఆమె సృజనశక్తి నిర్దిష్ట లక్ష్యం దిశగా పరుగులు తీస్తుంది. ఈనాటి పాఠకులకు కావలసినది కూడా ఆ వేగమే. పాఠకుల అభిరుచికి అనుగుణంగా ప్రతిస్పందిస్తూ సాంస్కృతిక ప్రతిబింబాలుగా శ్రీమతి దాసరి శివకుమారి గారు తమ సృజనాత్మక ప్రతిభతో అనంతమైన కథా సాహిత్యాన్ని సృష్టించాలని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.” అని వ్యాఖ్యానించారు సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి తమ ముందుమాట – ‘సాంస్కృతిక ప్రతిబింబాలు’లో.

***

మా పుట్టింటి తోట భోజనాలుకథ నుంచి కొన్ని పేరాలు:

“పట్నాల నుండి వచ్చిన అతిథులు కొందరు ఆసక్తిగా చెట్టు చెట్టునూ, కాయ కాయనూ, పువ్వు, పువ్వూను పలుకరిస్తూ తోటంతా తిరుగుతున్నారు. జామకాయలను కొరికి తినే రామచిలుకలూ, కొమ్మలపై వాలి వున్న గోరువంకలు కనువిందు చేస్తున్నాయి. తోకలు పైకెత్తి ఫింఛంలా విప్పుతూ తిరిగే పిట్టలూ, అవి పెట్టిన గూళ్లూ ముచ్చట గొలుపుతున్నాయి. ఏదో గురుకులంగా లాగా వుంది ఈ ప్రదేశమని కొందరు మెచ్చుకుంటుంటే మరి కొందరు ఫాంహౌస్ లాగా ముచ్చటగా వున్నదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏటా వినే కబుర్లే అయినా నా పుట్టింటిని అలా మెచ్చుకుంటుంటే నాకు ఎంత సంతోషంగా వుంటుందో చెప్పలేను.

వచ్చిన వారిలో బన్నూ అనే పిల్లవాడు అంటున్నాడు “తాతా! ఈ చెట్టుకు తగిలించిన ప్లాస్టిక్ డబ్బా చూశావా? దీనికున్న క్రింద అరలోని ఖాళీలోంచి ఉడుతలు పిట్టలూ లోపలికి నోరు పెడుతున్నాయి. డబ్బాలోపలుంచిన సజ్జలు, జొన్నలూ వాటి నోటి కందుతున్నాయి. ఆ గింజలు తిని ఈ నీళ్ళగోళెంలోని నీళ్లు తాగి అవి ఎగిరిపోతున్నాయి. రంగుగంగుల సీతాకోకచిలుకలు కూడా బోలెడున్నాయి. నేనొక జామకాయ ఫ్రెష్‌ది కోసుకుని తిన్నాను. ఎంత బాగుందో! మీ అందరికీ కూడా తెచ్చేదా!” అని అడిగాడు.

“పిల్లలకేం తోచక గోల పెడతారేమో అనుకున్నాను. వీళ్లకూ బాగానే సంబరంగానే వుంది” అంటున్నారు వాళ్ల తాతగారు.

***

చక్కని కథలతో హాయిగా చదివించే సంపుటి ‘సంక్రాంతి’.

***

సంక్రాంతి (కథలు)
రచన: శ్రీమతి దాసరి శివకుమారి
పేజీలు: 144
వెల: అమూల్యం
ప్రచురణ: రత్న లలిత ప్రచురణలు, కూచిపూడి, తెనాలి.
ప్రతులకు:
శ్రీమతి దాసరి శివకుమారి
301, సాకృత స్పెక్ట్రమ్,
రణవీర్ మార్గ్, సరళానగర్,
జె.ఎం.జె. కాలేజ్ దగ్గర
తెనాలి 522202
ఫోన్: 9866067664

Exit mobile version