[box type=’note’ fontsize=’16’] “సాంఖ్యం భారతదేశంలో అతిప్రాచీనమైన దర్శనం, తత్వసిద్ధాంతమూనూ. ఈ సిద్ధాంతం గురించి ఛాయామాత్రంగా తెలిసినా భారతదేశంలో ఆర్షమతం పట్ల కొన్ని అపోహలు తొలగిపోగలవు. అందుకే ఈ తత్వసిద్ధాంతం గురించి తెలుసుకోవడం ఆవశ్యకం” అంటున్నారు ఇ.ఎన్.వి. రవి ఈ వ్యాసంలో. [/box]
[dropcap]మ[/dropcap]హాభారతయుద్ధం ఆరంభమయింది. ఆ సమయాన అర్జునుడు – యుద్ధం మీద విరక్తుడైనాడు. అప్పుడు భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునునికి కర్తవ్యాన్ని బోధిస్తూ ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం భగవద్గీత అని మనకు తెలుసు. అందులో రెండవ అధ్యాయంలో ప్రముఖమైన శ్లోకాలున్నాయి.
“అశోచ్యానన్వశోచస్త్వం..”
“కర్మణ్యేవాధికారస్తే..”
“నైనం ఛిందన్తి శస్త్రాణి..”
“వాసాంసి జీర్ణాని యథా విహాయ..”
“యా నిశా సర్వభూతానాం..”
ఇత్యాదులు. ఈ అధ్యాయం పేరు సాంఖ్యయోగము. సాంఖ్యము – ఇదిమహాభారతానికి ముందు – ఆ మాటకొస్తే భారతీయ తత్వచింతనలలో అత్యంత పురాతనమైన తాత్వికచింతన. ఈ సాంఖ్యయోగపు ద్రష్ట – కపిలమహర్షి. కర్దమప్రజాపతి, దేవహూతి – ఈ దంపతులు కపిలుడి తల్లిదండ్రులు. ఈ కపిలమహర్షి విష్ణుమూర్తి అవతారంగా భాగవతం పేర్కొంటుంది. సాంఖ్యము, యోగము – సాధారణంగా ఈ రెండు చింతనలను కలిపి అధ్యయనం చేసేవారు.
బహువిస్తారమైన సాంఖ్య చింతన భారతదేశ వాఙ్మయంలోనూ, ప్రాచీన సమాజంలోనూ, ఆలోచనలలోనూ ఎంతో విస్తృతంగా వ్యాపించింది. ఈ తాత్వికచింతన ప్రస్తావనలు, తత్సంబంధమైన చర్చోపచర్చలు ఉపనిషత్తులలో, పురాణాలలో, మహాభారతంలో విస్తారంగా కనిపిస్తాయి. బౌద్ధచింతన మూలాలు కూడా సాంఖ్యంలో ఉన్నాయి. ఈ సాంఖ్యమనే తత్వ చింతన గురించి, ఆ చింతన మూలం, పర్యవసానం, ప్రభావాల గురించిన స్థూలమైన పరిచయం, విచారణ ఈ వ్యాస లక్ష్యాలు.
“అథాతో తత్వజిజ్ఞాసా”:
మానవుడు భూమిపై పుట్టి, ఆలోచించటం అన్నది ఏర్పడిన కాలం నుంచి – కొన్ని మౌలికమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నాడు. ” దుఃఖం ఎలా పుడుతున్నది? మానవ జీవితానికి పరమార్థం ఏమిటి?” ఇలా వ్యక్తితో మొదలుకుని “సృష్టి ఎలా మొదలయ్యింది? సృష్టిలో శాశ్వతమైనది ఏది? ఈ సృష్టికి కారణం ఏది? జననమరణాలు ఎందుకు ఏర్పడినవి?” అని విశ్వవ్యాప్తంగా ఈ ఆలోచనలు సాగినాయి. మనిషి ఇంద్రియాల ద్వారా – తనకు “బయట” ఉన్న (ప్రాపంచిక) విషయాలను “లోనికి” (బుద్ధికి) స్వీకరిస్తున్నాడు. ఆ స్వీకరించిన విషయాల తాలూకు జ్ఞానంతో జీవితగమనం సాగిస్తున్నాడు. “బాహ్య” విషయాలను లోనికి తీసుకోవటం జరుగుతున్నది కాబట్టి – మౌలిక ప్రశ్నలకు సమాధానం “బాహ్యంగానే” అంటే – భౌతిక ప్రపంచంలోనే వెతికే ప్రయత్నం – ఒక పద్ధతి. (ముఖ్యంగా పాశ్చాత్య చింతనలో ఈ పద్ధతి కనిపిస్తుంది.) ఆ చింతనకు అనూచానంగా ’సైన్సు’ ఏర్పడింది. బాహ్యమైన ప్రకృతిని మానవ అవసరాలకు వినియోగించుకుంటూ, సాధ్యమైనంత మేరా నైతికంగా బ్రతకడం, తద్వారా మానవుని మౌలిక ప్రశ్నలకు సమాధానాలు వెతకటం స్థూలంగా పాశ్చాత్యుల చింతనల ప్రాతిపదిక. (మొత్తంగా పాశ్చాత్యచింతన అంతా ఇలాగే ఉంటుందని ఇక్కడ భావం కాదు)
బాహ్యాన్ని సాధ్యమైనంత వర్జించి (ఇంద్రియాలను నిగ్రహించటం ద్వారా) అంతఃకరణాన్ని మథించి, “ఆలోచన ఎలా పుడుతుంది?, బుద్ధి యొక్క తత్వం ఏమిటి? మానవుని బుద్ధికి ఆవల ఉన్న ’ద్రవ్యం’ ఏమిటి?” వంటి ప్రశ్నలను, దుఃఖం,కోపం ఇత్యాది వికారాల స్వరూపాలను – ధ్యానం, యోగం వంటి సాధనాపద్ధతుల ద్వారా తెలిసుకొనే ప్రయత్నం ప్రాచీన భారతదేశంలో జరిగింది. ఇట్టి అనుభవసారంతో, భౌతికప్రపంచానికి చెందిన ఇతర మౌలికప్రశ్నలకు సమాధానం కనుక్కునే యత్నం భారతవర్షాన కొనసాగినది. అట్టి పరంపరకు చెందిన మహర్షులు తమ అనుభవజ్ఞానాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేసినారు. అందు కపిలమహర్షి దర్శించిన సత్యం యొక్క సారం సాంఖ్యం.
సాంఖ్యం అన్నది దర్శనం. అలాగే అది తాత్వికచింతన. కొంతమేరకు సిద్ధాంతం కూడానూ.
ఎవరైనా మహానుభావుని అనుభవజ్ఞానం నుండి వెలువడిన సారాన్ని మనం దర్శనం అంటాం. ఆ జ్ఞాని ద్రష్ట అవుతాడు. నిజానికి, కొన్ని అనుభవాలను భాషలోనికి అనువదించటం దుర్లభం. ఓ అనుభవం తాలూకు చిన్ని శకలాన్ని, ఒకరు “అద్భుతం” అని నిర్వచించినారు అనుకుందాం. ఈ విషయాన్ని పుస్తకంలో చదివిన వందమంది ఆ “అద్భుతాన్ని” – వంద రకాలుగా అర్థం చేసుకుంటారు. అనగా “అద్భుతం” అన్న శబ్దానికి నిర్దిష్టమైన, పరిమితమైన, స్వచ్ఛమైన, నిర్దోషమైన నిర్వచనం అంటూ లేదు. భాష జీవికోపయోగి మాత్రమే. అతి సాధారణమైన ఓ శబ్దాన్నే భాషలో అనువదించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే, ఇక బలీయమైన ఆధ్యాత్మిక అనుభవాలను భాషలో పర్యవసింపజేస్తే వచ్చే ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. ఆధ్యాత్మిక అనుభవాలు నిజానికి మౌనంలోనే భాసిస్తాయి. అనుభవసారం – గొప్ప మౌనంలో ప్రకాశిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం లో ఈ శ్లోకం చూడండి.
“చిత్రం వటతరోర్మూలే వృద్ధా శ్శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః ||”
“చిత్రంగా ఒక వటవృక్షపు మూలమున యువకుడైన గురువు, వృద్ధులైన శిష్యులు ఉన్నారు. గురువు మౌనంగా వ్యాఖ్యానిస్తున్నాడు. శిష్యుల అనుమానాలు తొలగిపోతున్నాయి.”
గొప్ప జ్ఞాని అయిన గురువు “మౌనంగా” వ్యాఖ్యానించటం గమనార్హం. కానీ మౌనవ్యాఖ్యానం అన్ని సందర్భాలలో, అందరు శిష్యుల వద్దా, అందరు జిజ్ఞాసువుల వద్దనూ పనిచెయ్యదు. జ్ఞానం – భాష సహాయంతో లోకానికి చేరాలి. భాష ఎంత అసంబద్ధమైనా, మహర్షులు, ద్రష్టలు తమ ఆధ్యాత్మిక అనుభవాల సారాన్ని జిజ్ఞాసువులకు పంచడం లోకధర్మం. ద్రష్ట -అలా తను దర్శించిన అనుభవసారాన్ని, (అనుకూలించినా, లేకపోయినా) అయినంతలో భాషలో పొందుపరిచే ప్రయత్నాన్ని “దర్శనం” అంటాము.
కాలక్రమంలో, దర్శనం అన్నది లోకంలో భౌతిక విషయాలను ప్రస్తావిస్తూ, వివిధ తలాలకు విస్తరిస్తూ, కొంత దిగువకు, సాధారణ స్థాయికి “తాత్వికచింతన” గా పరిణమిస్తుంది. అంటే కొన్ని సూత్రాలలో పొందుపరుపబడుతుంది. కపిలమహర్షి దర్శించిన దర్శనసారం సాంఖ్యం – అలా తాత్వికచింతనగా పరిణమించినది.
తాత్వికచింతన – లోకవ్యవహారంలో మరింత పలుచబడి, సిద్ధాంతంగా రూపొందుతుంది.సిద్ధాంతం అంటే – నిర్దిష్టమైన ప్రాపంచికప్రయోజనాన్ని సాధించటానికై ఏర్పడిన ప్రతిపాదన.(సిద్ధ-అంతము సిద్ధించిన పరమార్థము/ఉపయోగము/ఫలము గలది) గౌతమబుద్ధుడు పరమపదించిన తరువాత బుద్ధబోధ హీనయానం, మహాయానం, థేరవాదం, సౌత్రాంతికులు, వైభాషికులు, మహాసాంఘికులు, ఆపై వజ్రయానం ఇలా పలు విధాలుగా చీలిపోయిన విషయం మనకు తెలుసు. ఏ విధమైన మౌలిక దర్శనానికైనా ఇటువంటి గతి పట్టక తప్పదు.
ఇంతకు మునుపు చెప్పినట్టు – సాంఖ్యం నేడొక తత్వ చింతన/సిద్ధాంతం కూడానూ. సాంఖ్యకారిక చివరన ఈశ్వరకృష్ణుడు ఇలా అంటాడు.
“శిష్యపరంపరయాऽగత మీశ్వరకృష్ణేన చైతదార్యాభిః |
సంక్షిప్తమార్యమతినా సమ్యగ్విజ్ఞాయ సిద్ధాంతమ్ ||”
“కపిల మహర్షి యొక్క అనుయాయుల ద్వారా వచ్చిన ఈ సాంఖ్యాన్ని సాధ్యమైనంత మేరకు తెలిసికొని ఈ సిద్ధాంతాన్ని చేయడం జరిగినది.”
స్థూలంగా సాంఖ్యం:
భారతీయదర్శనాలను, ఆధ్యాత్మిక చింతనపై తేలికపాటి అభిప్రాయం కలిగిన వారు ఈ చింతనలు మూఢభక్తిని, భగవంతుని ఉనికిపట్ల నమ్మకాన్ని ప్రేరేపించే చింతనలనీ అపాదిస్తూ పెడవాదాలు చేస్తుంటారు. అతి పురాతనమయిన సాంఖ్యం – ఆశ్చర్యకరంగా “నిరీశ్వర”వాదానికి చెందినది. ఈ తాత్వికచింతనలో భగవంతుడు, భక్తి, నమ్మకాలు గట్రా లేవు. అంతే కాదు సాంఖ్యం వేదప్రమాణాన్ని పూర్తిగా ఒప్పుకోని తాత్వికచింతన. ఇటువంటి దర్శనం చైనాలో “తావోయిజం’ లో కనిపిస్తుంది. తావోయిజం లో ’తావ్’ అనేది ప్రకృతికి సూచకం. యిన్ – యాంగ్ అనబడే తత్వాలు ప్రకృతి – పురుష తత్వాలకు సమాంతర ప్రతీకలు. అయితే తావోయిజం ప్రవక్త, లావు-జు – తను దర్శించిన సత్యాన్ని పుస్తకబద్ధం చేయడానికి నిరాకరించినాడు. చిట్టచివర కొన్ని బలీయమైన పరిస్థితులలో ఆయన తావ్ తె చింగ్ అన్న ఓ చిరుపొత్తంలో తన దర్శనాన్ని నిక్షిప్తం చేశాడు. ఆయన తన సత్యం యొక్క సారాన్ని హెచ్చుగా ప్రతీకలతో చెప్పిన కారణాన, అది సాధ్యమైనంత మేరకు పలుచన కాకుండా నిలిచి ఉన్నది.
అనేక తత్వచింతనల వలెనే, ఈ సాంఖ్యం కూడా దుఃఖానికి మూలాన్ని కనుక్కునే జిజ్ఞాసతో మొదలవుతుంది. “దుఃఖత్రయాభిఘాతజిజ్ఞాసా..” అని సాంఖ్యకారిక ఆరంభం. తాపములు మూడు రకాలు. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలను తాపత్రయము అన్నారు. ఈ తాపత్రయనివారణ కోసమే సాంఖ్య చింతన మొదలైనది.
సాంఖ్యం నిరీశ్వరవాదమైనా, కాలక్రమంలో ఈ చింతనను ఈశ్వరవాదానికి సంధానించే ప్రయత్నాలు జరిగినట్టు కొందరు పేర్కొన్నారు. కానీ సాయణమాధవాచార్యుల వారి సర్వదర్శనసంగ్రహములో సాంఖ్యాన్ని నిరీశ్వరవాదంగానే పేర్కొన్నారు. ఆయన సాంఖ్యదర్శనమ్ చివరన ఇలా చెప్పాడు. ’ఏతచ్చ నిరీశ్వరసాంఖ్యశాస్త్రప్రవర్తక కపిలాది మతానుసారిణాం మతముపన్యస్తమ్’.
సృష్టి మూల తత్వాలు:
ఈ సృష్టిలో ప్రతి (భౌతికమైన) వస్తువూ కొన్ని మూలకాలతో ఏర్పడుతుందని సైన్స్ చెబుతుంది. ఈ మూలకాలను ఒక పట్టిక నేర్పరచి, క్రమబద్ధం చేసింది మెండలీవ్ అనే శాస్త్రవేత్త. ఈ మూలకాలు మొత్తం 106. (ఇది పాత సంఖ్య. ఇప్పుడు పెరిగి ఉండవచ్చు)
సాంఖ్యం అత్యంత పురాతనమైన భారతీయ తత్వచింతన కనుకా, భారతీయ తాత్వికచింతన భౌతికం కాకుండా ఆముష్మికం కనుక, ఇందులోనూ సృష్టికి మూలమైన తత్వాలను పేర్కొన్నారు. అవి మొత్తం 25.
అందులో ముఖ్యమైనది, మూలమైనది ప్రకృతి. ప్రకృతి కే “ప్రధానం” అని పేరు. ఆ ప్రకృతి – శాశ్వతమైనది. శాశ్వతమైనది కనుక ప్రకృతికి మూలకారణం అంటూ ఏదీ లేదు. ప్రకృతి – సత్వరజస్తమో గుణముల సామ్యావస్థ.
ప్రకృతి ఒక మూలం. అలాగే సృష్టికి కారణం పురుషుడు అనే మరొక తత్వం. పురుషుడనే తత్వం – భోక్త. ప్రకృతి – భోగ్యం. ప్రకృతి ఒక్కటే. పురుష తత్వం అసంఖ్యాకం.
ప్రకృతి – అచేతనమైనది కానీ సృష్టికి కర్త్రి.
పురుష తత్వం – సచేతనము, తటస్థము.
ఈ ప్రకృతి – పురుషుల సంబంధం పంగ్వంధ సంబంధం అని సూత్రకారుడు. పంగు – కుంటి,అంధ – గుడ్డి. ఒక కుంటివాడు, వాడి మిత్రుడైన గుడ్డివాడికి మధ్యన ఉన్న సంబంధం వంటిది. గుడ్డివాడు తన భుజాలపై కుంటివానిని ఎక్కించుకొని ముందుకు నడుస్తుంటాడు. గుడ్డివాడు ఏ దారిని వెళ్ళాలో తెలియదు. ఆ దారిని సూచించే బాధ్యత – కుంటివాడిది. (ఇక్కడ ప్రకృతి – కుంటి. పురుషుడు – గుడ్డివాడు)
పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య |
పఙ్గ్యధవదుభయోరపి సంబంధస్తత్ కృతః సర్గః || (సాంఖ్యకారిక 21)
ప్రకృతి (ప్రధానం) – తనను పురుషుడు ఆశించాలన్న పురుషాపేక్ష ఉంటుంది. దరిమిలా ప్రకృతి భోగ్యం. పురుష తత్వానికి కైవల్యం కోసం ప్రకృతి పైన ఆపేక్ష ఉన్నది. అంటే ప్రుషుడు – భోక్త. ఇలా ప్రకృతి పురుషుల సంబంధం పరస్పర అవసరాన్ని బట్టి, గుడ్డివాడికి, కుంటివాడికి మధ్య ఏర్పడిన బంధం వంటిది ఏర్పడినది.
ప్రకృతి -> మహత్ అనే తత్వం పుట్టటానికి కారణం అవుతున్నది. మహత్ అనగా బుద్ధి.
మహత్తు చేత అహంకారం జనిస్తోంది.
అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, పంచ కర్మేంద్రియాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు పుడుతున్నవి.
ప్రకృతి + పురుషుడు -> మహత్ -> అహంకారం -> 11 ఇంద్రియములు + “5 తన్మాత్రలు”-> 5 పంచభూతములు.
(పంచ జ్ఙానేంద్రియములు – శ్రోత్రము (చెవి), త్వక్ (చర్మము), చక్షు (కనులు), జిహ్వ (నాలుక), ఘ్రాణము (ముక్కు))
(పంచ కర్మేంద్రియములు – వాక్కు, హస్తములు, పాదములు, పాయువు, ఉపస్థము (లింగము))
(పంచ తన్మాత్రలు – శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము)
(పంచ భూతములు – భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము)
మొత్తం 25 తత్వాలు.
ప్రకృతి అనే మూల తత్వం నుంచి ఇతర తత్వాలు పుడుతూ వచ్చినవి కాబట్టి సాంఖ్యానికి ’పరిణామవాదం’ అని పేరు. సాంఖ్యం పరిణామవాదం. అయితే వేదాంతములు, వ్యాకరణాలు ’వివర్తవాదాలు’.
ఒక త్రాడు పాముగా కనిపించటం వివర్తము. అనగా ఉన్నది ఒకటే తత్వమైనా, అది భిన్నంగా వివర్తిస్తున్నది. శంకరుడు “జగన్మిథ్య” గా పేర్కొన్నాడు. జగత్తు అన్నది మిథ్య. ఈ మిథ్య – మిథ్యగా అవగతమైతే జ్ఞానం ఏర్పడుతుందని స్థూలంగా వేదాంతము.
పైన పేర్కొన్న 25 మౌలిక తత్వాలు – నాలుగు రకాల స్వభావాలలో అంతర్గతమవుతాయి.
మూలప్రకృతిరవికృతిర్మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త |
షోడశస్తు వికారో న ప్రకృతిర్న వికృతిః పురుషః || (సాంఖ్యకారిక – 3)
- అవికృతి – అనగా ఆ తత్వం ఏ ఇతర తత్వం నుంచి పుట్టదు. అది స్వయంసిద్ధం. ఉదా: ప్రకృతి తత్వం (అందుకనే అది ప్ర-కృతి, మరియు అ-వికృతి). మూలప్రకృతి తత్వం – అవికృతి గలది.
- ప్రకృతి వికృతులు – అనగా ఇవి ఒక కారణం నుంచి ఉద్భవిస్తాయి, మరిన్ని తత్వాలకు కారణమవుతాయి. (మహత్తు (బుద్ధి), అహంకారం, ఐదు తన్మాత్రలు)
- వికారములు – అంటే ఇవి కేవలం కార్యములు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచభూతములు. అంటే ఇవి నిమిత్తమాత్రములు. ఇవి కారణములు కావు, కార్యములు మాత్రమే.
- తటస్థము (ప్రకృతియు, వికృతియు కానిది) – పురుష తత్వము.
ప్రకృతి – ఆరంభము లేనిది. ఇంద్రియములకు గోచరం కానిది. మరి ఇంద్రియాలకు గోచరం కాని ప్రకృతిని ఎలా ఊహింపగలిగేరు?
సాంఖ్యం – మూడు ప్రమాణాలను పేర్కొంటూంది. ప్రత్యక్షము, అనుమానము, ఆప్తవచనం.
దృష్టమనుమానమాప్తవచనం చ సర్వ ప్రమాణసిద్ధత్వాత్ |
త్రివిధం ప్రమాణమిష్టం ప్రమేయసిద్ధిః ప్రమాణాద్ధి || (సాంఖ్య కారిక – 4)
ప్రత్యక్షం – చక్షుఃప్రమాణం. స్వయానా చూచి తెలిసికొనదగినది.
అనుమానం – ’ధూమవదగ్నిః’ – అన్నట్టు ఎక్కడ పొగ ఉంటుందో, అక్కడ అగ్ని ఉండవలెనని అనుమానంతో తెలియదగినది.
ఆప్తవచనం – మహనీయులయిన మహర్షుల అనుభవజ్ఞానము వలన శిష్యులకు అందినది.
భౌతిక జగత్తులోని మౌలిక తత్వాలు ఎలా వచ్చాయి? సాంఖ్యం నిరీశ్వరవాదం కనుక ప్రపంచాన్ని భగవంతుని సృజనగా అంగీకరించదు. అంతే కాక అసత్తు(శూన్యం) నుంచి భౌతిక ప్రపంచం ఉద్భవించటం అసంబద్ధం. కనుక భౌతిక తత్వములకు మూలమైన, శాశ్వతమైన తత్వం ఏదో ఒకటి ఉందాలి. ఆ తత్వమే ప్రకృతిగా సాంఖ్యులు భావించారు. అంతే కాక, సాంఖ్యం ప్రకారం కార్యకారణాలు వేరు వేరు కావు. కారణానికి అతీతమైన లక్షణాలు కార్యంలో ఉండటం అసంభవం. (అందుకే శూన్యం నుంచి ప్రపంచం పుట్టదు.) అనగా మర్రిచెట్టు పుట్టటానికి – కారణం బీజంలో ఎన్నడూ ఉంటుంది, ఉండాలి. దీనిని సత్కార్యవాదం అంటారు.
సాంఖ్యచింతనలో జగత్తు – ప్రకృతి యొక్క పరిణామము:
మరొక విషయం. బౌద్దచింతనను కూడా పరిణామవాదం అని అంటారు. సాంఖ్యమూ పరిణామవాదమే. రెంటికీ కొంత భేదం ఉంది.
బౌద్ధచింతన ప్రకారం వర్తమానం అనే ఓ క్షణం – పుట్టి తర్వాతి క్షణానికి నశిస్తోంది. ఆ నశించిన క్షణం నుంచి తర్వాతి క్షణం ఉద్భవిస్తుంది. అంటే అసత్తు నుంచి సత్ అనే తత్వం ఉద్భవమవుతోంది. ఇది బౌద్ధంలో పరిణామవాదం.
సాంఖ్యం ప్రకారం ప్రకృతి అనే ’సత్’ తత్వం నుంచి ఇతర తత్వాలు జనిస్తున్నాయి. ’సత్’ నుంచి ’సత్’ లక్షణము కలిగిన మరొక తత్వం జనిస్తోంది. అసత్తు నుంచి సత్ అనే తత్వం జనిస్తుందని సాంఖ్యం ఒప్పుకోదు. స్థూలంగా సాంఖ్యపరిణామవాదం యిది. ఈ విషయంపై సాంఖ్యశాస్త్రప్రవర్తకులు పలువాదాలు చేశారు. వీటిని ఆయా గ్రంథాలలో సుదీర్ఘంగా చర్చించినారు. సాంఖ్యకారికలో ఈశ్వరకృష్ణుడు ఈ విషయాన్ని విపులంగా పేర్కొన్నాడు.
భగవద్గీతలో సాంఖ్యయోగంలో గల శ్లోకం యిది.
నా సతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్ట్యా స్తస్త్వ నయోస్తత్త్వదర్శిభిః ||
లేని తత్వానికి (అసత్తుకు) ఉనికి (సత్ అనునది) లేదు. ఉన్నదానికి లేమి అన్నది లేదు. ఈ రెండు విషయములను గ్రహించిన వారలు తత్వదర్శనమును చేయగలుగుదురు.
ప్రకృతి త్రిగుణాత్మకమైనది. ఆ త్రిగుణాలు సత్వము, రజస్సు, తమస్సు. ఈ గుణాల మధ్య సమతుల్యత లేని కారణంవలన సృష్టి జరుగుతున్నది. అంటే ప్రకృతి వివిధ తత్వాలుగా పరిణామం చెందుతున్నది.
సాంఖ్యం శబ్ద నిర్వచనం:
సంఖ్య అనే శబ్దం గణనకు, జ్ఞానానికి కూడా సంకేతంగా ఏర్పడినట్లు కొన్ని ఉటంకింపుల ద్వారా సాంఖ్యశాస్త్ర ప్రవర్తకులు పేర్కొన్నారు.
పైన పేర్కొన్నట్టు పలు సంఖ్య గల తత్వాలను గణిస్తూ ఏర్పడిన చింతన కాబట్టి దీనిని ’సాంఖ్యము’ అని అన్నట్టు ఒక వ్యుత్పత్తి.
సంఖ్యాయంతే (గణయంతే) తత్వాని యేన తత్ సాంఖ్యమ్.(ఏదైతే తత్వాలను గణిస్తుందో అది సాంఖ్యము).
పలు సంఖ్యగల తత్వాలను సమగ్రమైన రూపంలో దర్శించి, ప్రకృతి పురుష తత్వముల ఎఱుకను అందజేయుటయే సాంఖ్యము యొక్క ధ్యేయము.
‘సంఖ్యాయతే ప్రకృతిపురుషాన్యతాఖ్యాతిరూపోऽవబోధో సమ్యజ్ఞాప్యతే యేన తత్ సాంఖ్యమ్’.
సాంఖ్యసారమ్ అనే ఒక గ్రంథంలో సూత్రకారుడు ఇలా అంటాడు. ’ శుద్ధాత్మతత్వవిజ్ఞానం సంఖ్యామిత్యభిధీయతే |’
మహాభారతం శాంతిపర్వంలో ఇలా ఉన్నది.
సాంఖ్యం ప్రకుర్వతే చైవ ప్రకృతిం చ ప్రచక్షతే |
తత్వాని చ చతుర్వింశాన్ తేన సాంఖ్యాః ప్రకీర్తితాః || (శాంతిపర్వము 306 – 42,43)
ప్రకృతి పురుషుల వివేకజ్ఞానాన్ని ఉపదేశం చేయునదియును, ప్రకృతి ప్రతిపాదన చేయుచూ, 24 తత్వములను తెలుపునదియు సాంఖ్యమనబడును.
సాంఖ్యం భారతదేశంలో అతిప్రాచీనమైన దర్శనం, తత్వసిద్ధాంతమూనూ. సాంఖ్యసాహిత్యం కూడా విస్తృతంగానే ఉన్నది. అయితే మూల దర్శనం యథాతథంగా లేదు. ప్రస్తుతం ఈ తత్వసిద్ధాంతం కేవలం Academic interest గా ఉంది. అయితే ఈ సిద్ధాంతం గురించి ఛాయామాత్రంగా తెలిసినా కూడా భారతదేశంలో ఆర్షమతం గురించి పేరుకుపోయిన కొన్ని అపోహలు తొలగిపోగలవు. ఆ కారణం చేత కొంతమేరకు ఈ తత్వసిద్ధాంతం గురించిన విషయాలు తెలుసుకోవడం ఆవశ్యకం.
దుఃఖనివారణ:
సాంఖ్యంలో పురుషుడు – అనేది జీవుడి మూలతత్వం. సృష్టిలో సుఖదుఃఖాలను తానే అనుభవిస్తున్నాడన్న భ్రమ వలన జీవుడికి దుఃఖం అన్నది జనిస్తోంది. పురుషుడు శుద్ధ చైతన్యస్వరూపుడు అన్న ఎఱుక కలిగినప్పుడు, ఆ దుఃఖం నశించే అవకాశం ఉంది. ఆ ఎఱుకకు యోగం సాధనగా ఉపయోగపడుతుంది.
సాంఖ్యం కూడా ఇతర చింతనలవలే జీవుడికి కర్మఫలం పునర్జన్మ ద్వారా లభిస్తుందని పేర్కొన్నది. ఆ పునర్జన్మను ఇతర తాత్వికచింతనలు ’ఆత్మ’ గా పేర్కొంటే, సాంఖ్యం ’లింగశరీరం’ అన్న శబ్దంతో పేర్కొన్నది.
ఉపయుక్త గ్రంథాలు:
సర్వదర్శనసంగ్రహం – సాయణమాధవాచార్యులు – ’బాలానందిని’ తెలుగు వ్యాఖ్యతో శ్రీ పుల్లెలరామచంద్రుడు.
ఈశ్వరకృష్ణుని సాంఖ్యకారిక – యుక్తిప్రదీపికా వివృత్తిసహితం – ’తత్వప్రభా’ సంస్కృత, హిందీ వ్యాఖ్య, టిప్పణి – రమాశంకర త్రిపాఠీ -చౌఖాంబా ప్రకాశన్.
భగవద్గీత
విశ్వదర్శనం(సాంఖ్యం) – నండూరి రామమోహనరావు