[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]
స్తవంతి గుర్వీమభిధేయ సంపదం
విశుద్ధి ముక్తేరపరే విపశ్చితః ।
ఇతి స్థితాయాం ప్రతిపురుషం రుచౌ
సుదుర్లభాః సర్వమనోరమా గిరః ॥
ఆటవెలది :
కొంత మంది బుధులు కొనియాడు చుందురు
సొబగు లద్ది పలుక సొంపు గాను
కొంత మంది బుధులు కొనియాడు చుందురు
దోష రహిత మైన భాషణమును
ఒకరు మెచ్చు నటుల ఒరులు మెచ్చగ బోరు
ఇదియె స్థితిర జూడ యిలను యెపుడు
సకల జనులు మెచ్చ సరస భాషణమది
సాధ్య పడదు సుమ్ము జగము నందు ౭౬
***
యథా గజపతిః శ్రాంతః
ఛాయార్థీ వృక్షమాశ్రితః ।
విశ్రమ్య తం ద్రుమం హంతి
తథా నీచః స్వమాశ్రయమ్॥
ఆటవెలది :
వృక్ష ఛాయ యందు విశ్రాంతి తానొంది
మట్టు బెట్టు దాన్ని మదపుటేన్గు
మేలు గూర్చు వారి మేలు తా గాంచక
జెఱుప జూచు కుటిల చిత్తు డెపుడు ౭౭
***
కి వాససైవం న విచారణీయం
వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః ।
పీతాంబరం వీక్ష్య దదౌ తనుజాః
దిగంబరం వీక్ష్య విషం సముద్రః ॥
ఆటవెలది :
వలువ కున్న విలువ వర్ణింప తరమౌన ?
విలువ పెంచు సుమ్మి వలువ లెపుడు
పీత వస్త్ర ధరుని పిలిచి పట్టి నొసగి
దెసల ధరుని కొసగె విషము కడలి ౭౮
***
ప్రియ వాక్య ప్రదానేనిన
సర్వే తుష్యంతి జంతవః ।
తస్మాత్ తదేవ వక్తవ్యం
వచనే కా దరిద్రతా ॥
తేటగీతి :
మాట లందున మాధుర్య మధువు లొలుక
సంత సింతురు సర్వులు స్వాంత మందు
పలుకు పలుకున మకరంద మొలుక పలుకు
వరలు వాక్కుల వచియింప వ్యయము కాదు ౭౯
***
సుఖార్థీ చేత్ త్యజేత్ విద్యాం
విద్యార్థీ చ త్యజేత్ సుఖమ్ ।
సుఖార్థినః కుతో విద్యా
కుతో విద్యార్థినః సుఖమ్ ॥
ఆటవెలది :
విద్య నేర్వ వచ్చు విడనాడ సౌఖ్యమ్ము
చదువు రాదు సుఖము వదల కున్న
విద్య దూర మగును విడకున్న సౌఖ్యమ్ము
చదువు వలచు సుఖము వదలి నంత ౮౦