సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 19

0
2

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

సంతోషామృత తృప్తానాం
యత్సుఖం శాంతచేతసామ్ ।
న చ తద్ ధనలుబ్ధానా
మితశ్చేతశ్చ ధావతామ్ ॥
ఆటవెలది :
శాంత చిత్తు లరయు సంతోష పీయూష
మవని యందు నెవరు అంద గలరు
అహరహమ్ము అర్ధ మార్జించ పరువారు
లుబ్ధ కోటి కద్ది లుప్త మౌను ౯౧

***

దారిద్య్ర నాశనం దానం
లం దుర్గతి నాశనమ్ ।
అజ్ఞాన నాశినీ ప్రజ్ఞా
భావనా భయ నాశినీ ॥
ఆటవెలది :
దాన మరసి జేయ దారిద్య్రము తొలగు
చెడిన బ్రతుకు తొలగు నడత వలన
ప్రజ్ఞ వలన తొలగు నజ్ఞాన ఘనరాశి
భావనమ్ము వలన భయము తొలగు ౯౨

***

పుస్తక ప్రత్య యాధీతం
నాధీతం గురుసన్నిధౌ ।
సభా మధ్యే న శోభంతే
జార గర్భా ఇవ స్త్రియః ॥
ఆటవెలది :
గురువు చెంత గాక గురు గ్రంథ రాజముల్
గదిసి నేర్చు విద్య గణుతి గనదు
వార లెపుడు జగతి వ్యభిచారిణుల భంగి
శోభ నొంద బోరు శుభము గనరు ౯౩

***

కామధేను గుణా విద్యా
హ్యకాలే ఫలదాయినీ ।
విదేశే మాతృ సదృశీ
విద్యా గుప్తం స్మృతమ్ ॥
ఆటవెలది :
కాని కాల మందు కామధేనువు రీతి
వెంట నుండి యెపుడు యింట బయట
కన్న తల్లి వోలె కాపాడు చుండురా
దాచు కున్న ధనమె ధరను విద్య ౯౪

***

ఉద్ధరత్యుత్తమో వంశం
మధ్యమః సముపేక్షతే ।
అధమస్తు కులే జాతః
నాశయత్యఖిలం కులమ్ ॥
ఆటవెలది :
వంశ వృద్ధి జేయు వరమైన పుత్రుండు
మనసు నందు నిడడు మధ్యముండు
వంశ క్షయము జేయు పగవాని తెఱగున
అధముడైన సుతుడు అవని యందు ౯౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here