సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 21

0
2

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

సహస్ర విదధీత న క్రియాం
అవివేకః పరమాం పదాం పదం ।
వృణతే హి విమృశ్యకారిణం
గుణాలుబ్ధాః స్వయమేవ సంపదః ॥

ఆటవెలది :
ముందు వెనుక గనక తొందర పడకుండ
పనులు సేయ వలెను మనుజు లెపుడు
ఆపదలకు మూల మజ్ఞానమే సుమ్ము
అరసి పనుల సేయ సిరులు వలచు ౧౦౧

***

మూర్ఖస్య పంచ చిహ్నాని
గర్వీ దుర్వచనీ తథా ।
హఠీ చా ప్రియవాదీ చ
పరోక్తం నైవమన్యతే ॥

ఆటవెలది :
పోటు వంటి మాట, పొగరు, మొండితనము,
పరుల నెపుడు కించ పరుచు గుణము
ఒరుల మాట వినగ నొప్పకుండెడు బుద్ధి
ఖలుల కున్న ఐదు గుణము లివియె ౧౦౨

***

మక్షికా మారుతో వేశ్యా
యాచకో మూషక స్తథా ।
గ్రామణి ర్గణక శ్చైవ
సప్తైతే పరబాధకాః ॥

ఆటవెలది :
ఈగ గాలి వేశ్య యెలుక యాచకుడును
గ్రామ పెద్ద మరియు గణకుడనగ
స్వార్థ పరత చేత సాధింతు రేడ్గురు
ఒరుల బాధ వీరు అరయ బోరు ౧౦౩

***

రాజా వేశ్యా యమో హ్యగ్ని
స్తస్కరో బాల యాచకౌ ।
పరదుఃఖం న జానంతి
అష్టమో గ్రామకంటకః ॥

ఆటవెలది :
ప్రభువు పావకుండు పాశధరుడు వేశ్య
దొంగ బిచ్చగాడు దుండగీడు
బాలకుడును అష్ట బాధకమ్ము లవని
పరుల వెతల వారు నరయ బోరు ౧౦౪

***

సానందం సదనం సుతాశ్చా సుధియః
కాంతా మృదుభాషిణీ
సుధనం సన్మిత్రం స్వయోషితి రతిః
స్వాజ్ఞాపరాః సేవకాః ।
ఆతిథ్యం శివపూజనం ప్రతిదినం
మిష్టాన్న పానం గృహే
సాధోః సంగముపాసతే చ సతతం
ధన్యో గృహస్థాశ్రమ ॥

సీసం – తేటగీతి :
ఆనందమయమైన అందాల సదనమ్ము
బుద్ధి మంతులయిన పుత్ర గణము
మనసు దోచెడి భంగి మాటాడు అర్థాంగి
మంచి దారుల గడియించు ధనము
మరచి వుండగ లేని మనసున్న మిత్రుండు
వరమైన నిజదార వలపు పొందు
అర్చనాదుల తోడ అతిథి సేవల తోడ
యెల్లవేళల విలసిల్లు యిల్లు

తరచు యాజ్ఞల పాలించు దాస జనము
మనసు దోచేటి భోజన మధురసాలు
సాధు సాంగత్య సౌభాగ్య సంపదలును
గలుగు సంసారమే ధన్య మిలను యెపుడు ౧౦౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here