సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 3

0
3

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

***

శిరశ్శార్వం స్వర్గాత్ పశుపతిశిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుంగా దవని మవనేశ్చాపి జలధిం ।
అధోగంగాసేయం పదముపగతా స్తోకమథవా
వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥

ఆటవెలది
దివిజ సీమ విడచి దిగివచ్చి గంగమ్మ
శివుని   శిరము   జేరి   చిందు  లేసె
శివుని శిరము విడచి శీత నగము జేరె
శీత  నగము  విడచి   క్షితిని   జేరె

క్షితిని విడచి తాను సింధు వందున జేరె
సింధు   సీమ   విడచి   అంధ  లోక
మందు చేరి తుదకు అణగి పోయిన యట్లు
అణగి పోదు రెపుడు అల్ప మతులు ౧౧

***

చలత్కాష్ఠో జ్వల త్యగ్నిః
క్రుద్ధః సర్పో విజృంభతే ।
క్షోభాదేవ మనుష్యస్య
శక్తేః ప్రాయో విజృంభణమ్ ॥

ఆటవెలది
కాలుతున్న కట్టె కదుపంగ జ్వలియించు
రుసలు  గొన్న  పాము  బుసలు  కొట్టు
బాధ లందె తనదు బలమెంతొ తెలివెంతొ
తెలియ  గలడు  నరుడు  తేటగాను ౧౨
వస్తేనే కష్ట కాలం !
తెలియును కదా మన బలం !!

***

ఆలస్యం హి మనుష్యాణామ్
శరీరస్థో మహాన్ రిపుః ।
నాస్త్యుద్యమ సమో బంధుః
కుర్వణో నావసీదతి ॥

ఆటవెలది
తనువు నందు దాగి తడవ విడువకుండు
బద్ధకమ్మె   మనకు   బద్ధ   రిపువు
శ్రమయె బంధు వయ్య శ్రమియించు వారల
చెంత  చేర  బోదు  చింత  యెపుడు ౧౩
శ్రమను వీడ కున్న !
చింత చేర దన్న !!

***

జీవన గ్రహణం నమ్రాః
గృహీత్వా పున రున్నతాః ।
కిం కనిష్ఠాః కిము జ్యేష్టాః
ఘటీ యంత్రస్య దుర్జనాః ॥

ఆటవెలది
జీవనమ్ము కొఱకు సిగ్గు వీడి ఖలులు
వంగి  వంగి  జేయు  వందనములు
కాంక్ష  దీఱ  గానె  కండ కావరముచే
విఱ్ఱ  వీగు  చుంద్రు  వితత  గతిని

జలము కొఱకు తాను జరజరా జాఱుచు
జలము  చెంత  చేరి  జలము  బొంది
ఎగసి ఎగసి పడెడు ఏతాముకే తాము
బంధు జనుల మనుచు బహువిధముల ౧౪

***

చందనం శీతలం లోకే
చందనాదపి చంద్రమా।
చంద్రచందనయోర్మధ్యే
శీతలా సాధు సంగతిః ॥

ఆటవెలది
చందనమ్ము జగతి యందు చల్ల గుండు
చందనము కన్న జాబిల్లి చల్ల గుండు
ధరను రెండింటి కన్నను తరచి చూడ
సజ్జనంబుల  సంగతె  చల్ల  గుండు ౧౫
సజ్జన సాంగత్యం !
హాయి గూర్చు నిత్యం !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here