సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు.
పంచాగ్నయో మనుష్యేణ
పరిచర్యాః ప్రయత్నతః । 
పితా మాతాగ్నిరాత్మా చ
గురుశ్చ భరతర్షభ ॥ 
ఆటవెలది
అమ్మ నాన్న అగ్ని ఆత్మయు గురువును
పంచ అగ్ను లనగ పరగ చెల్లు
మనుజవర్యులార ! మదిలోన నిది నిల్పి
సేవ జేయ వలయు శ్రియము నొంద ౨౬
పంచాగ్నుల సేవ ! 
సిరుల నొసగు త్రోవ !! 
***
పంచైవ పూజయల్లోకే
యశః ప్రాప్నోతి కేవలమ్।
దేవాన్ పితౄన్ మనుష్యాంశ్చ
భిక్షూనతిథిపంచమాన్ ॥ 
తేటగీతి
అవని నమరుల పితరుల నథితి వరుల
నరుల పరిశుద్ధ సన్యాసి వరులనంగ
నయిదుగురిని అర్చింపగా నహరహమ్ము
అమల యశమది వరియించు విమల చరిత ! ౨౭
పంచ మూర్తుల అర్చనం ! 
కలుగ జేయును యశోధనం !! 
***
షడ్ దోషాః పురుషేణేహ
హాతవ్యా భూతిమిచ్ఛతా । 
నిద్రా తంద్రా భయం క్రోధం
ఆలస్యం దీర్ఘ సూత్రతా ॥ 
ఆటవెలది
నిదుర తంద్ర భయము నిలువెత్తు క్రోధమ్ము
బద్ధకమ్ము నిడివి పనితనమ్ము
ప్రగతి పథము నందు పయనించు వారల
ఆరు శత్రు లనుము అవని యందు ౨౮
ప్రగతి పథమున ఇరులు !
అలసత్వాది అరులు !!
***
భీతిదః సుజనోపి స్యాత్
యది దుర్జన సేవితః । 
పన్నగ స్యాశ్రయం వృక్షం
చందనం కః సమాశ్రయేత్ ॥ 
తేటగీతి
దుర్జనమ్ముల పొందుచే సజ్జనమ్ము
భయము గొల్పును సర్వుల వసుధ యందు
సర్పగణముల పొందుచే చందనమ్ము
నాశ్రయింపగ వెఱతురు అవని జనులు ౨౯
 దుర్జన సాంగత్యం ! 
సదా పరిత్యజ్యం !!
***
పరాన్ తోషయితుర్ ధాతుః
న కదాపి ధన క్షయః । 
ఉద్ధృతేపి నదీకూపాత్
జలే తస్య న హి క్షయః ॥ 
ఆటవెలది
పరుల కిచ్చి నంత తరిగేది లేదేమి
దాత కెపుడు జూడ ధరణి యందు
ఏటి చెలమ నీరు ఎంత తోడిన గాని
ఎపుడు ఊరు చుండు నెండి పోదు ౩౦
ఇస్తే వస్తుంది ! 
దాస్తే పోతుంది !! 

