సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు.
గుణిన్యుపకృతిః స్వల్పా
గిరివద్ బహుమన్యతే । 
గుణహీనే తు గిరివత్
కృతాతు లఘుతాం వ్రజేత్॥ 
తేటగీతి
కొంచె మైన మేలు గుణవంతు కొనరింప
కొండ యంత యనును గుణము చేత
కొండ యంత మేలు గుణహీను కొనరింప
కొంచె మనును వాని గుణము చేత ౩౧
 ఒరులు చేసెడి మేలు !
ఖలులు గాంచగ లేరు !!
***
పృథివ్యాం త్రీణి రత్నాని
జల మన్నం సుభాషితమ్ । 
మూఢైః పాషాణ ఖండేషు
రత్న సంజ్ఞా ప్రదీయతే ॥ 
ఆటవెలది
వసుధ యందు మూడె వరమైన రత్నాలు
మంచి జలము తిండి మంచి మాట
రంగు రాళ్ళ జూపి రత్నసంపదనుచు
మొత్తు కొందు రెపుడు మూఢమతులు ౩౨
 అసలైన రత్నాలు చూడు 
వలసినంత మాత్రమె వాడు 
***
వసంతే జ్ఞాయతే భేదః
కాకస్య చ పికస్య చ । 
సతశ్చా వ్యసతో భేదః
సమయ ఏవ జ్ఞాయతే ॥ 
తేటగీతి
కాకి కోకిలమ్ములు జూడ నేక రీతి
సుంతయైనను గనలేము అంతరమ్ము
వరలు వాసంత మాసమ్ము వచ్చినంత
గుట్టు రట్టౌను రెండింటి గుణము లందు ౩౩
 రూపు లొకటైన ! 
గుణము లొకటౌన !! 
***
పాతితోఽపి కరాఘాతైః
ఉత్పతత్యే కందుకాః । 
ప్రాయేణ సాధు వృత్త నామ
స్థాయిన్యో విపత్తయః ॥ 
ఆటవెలది
చేయి జారి పడ్డ చెండు పయికి లేచు
క్షణము లోనె తిరిగి తొణక కుండ
సజ్జనాళి ఎపుడు చరియించు చుండును
చెండు వోలె ఇలను చింత లేక ౩౪
 చరియించ చెండు రీతి ! 
లభియించు నీకు ఖ్యాతి !!
***
గంగా పాపం శశీ తాపం
దైన్యం కల్పతరుస్తథా । 
పాపం తాపం చ దైన్యం చ
ఘ్నంతి సంతో మహాశయః ॥ 
తేటగీతి
అఖిల పాపాల హరియించు అరయ గంగ
సకల తాపమ్ము హరియించు చందమామ
కనగ దైన్యమ్ము హరియించు కల్ప తరువు
ధరను పాపమ్ము తాపమ్ము దైన్యములను
సాధు సంగమ్ము హరియించు సాంతముగను ౩౫
 సజ్జనాళి మైత్రి ! 
సకల దుఃఖ హంత్రి !! 

