సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 8

0
4

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

ఉపేక్ష్య సమయే కార్యే
భగ్నే చింతా నిరర్ధకా।
నిర్గతే సలిలే తత్ర
సేతుబంధో నిరర్ధకః ॥

ఆటవెలది
తగిన సమయ మందు తగురీతి చేయక
చెడిన పనుల జూచి చింత లేల ?
గట్టు గట్ట ఫలమ దెట్టుల గల్గురా ?
పొలము విడచి పోవ జలము లన్ని ౩౬
తగిన సమయ మందు
పనుల జేయ మందు

***

విద్యా న శోభిత పుంసో
యది న స్యాత్ రసజ్ఞతా ।
లవణేన వినా శాకాః
సుపక్వా అపి నిష్ఫలాః ॥

తేటగీతి
ఎంత శ్రమియించి వండియు ఏమి ఫలము ?
ఉప్పు వేయని పక్వమ్ము ఒప్ప దెపుడు
అటులె జూడ రసజ్ఞత అసలె లేని
విద్య నిష్ఫలమౌనుర విశ్వమందు ౩౭
ఉప్పు లేని పప్పు !
ప్రతిభ లేని విద్య !!

***

సౌలభ్య లభ్యే వస్తూనా
మనజ్ఞేవ న గౌరవమ్ ।
మలయే భిల్ల కాంతానాంయ
చందనం చేంధనాయతే ॥

తేటగీతి
వసుధ సులువుగా లభియించు వస్తుచయము
విలువ గనలేరు ఎప్పుడు వింత జనులు
అటవులందు దొరకు చందనాది తరులు
వంట చెఱకౌను భిల్లుల వంట ఇంట ౩౮
పెరటి చెట్టు విలువ !
ఎరుగ బోడు నలువ !!

***

విద్యా అనేకా లబ్ధ్వాపి
ఖలో నాప్నోతి గౌరవమ్ ।
సహన్నపి బహు స్వర్ణం
ఖరః ప్రాప్నోత్య గౌరవమ్ ॥

తేటగీతి
ఎన్ని విద్యలు నేర్చిన నెలమి తోడ
ఖలుని కేరీతి ఘనకీర్తి గలుగు నయ్య
మురిసి బంగారు మూటలు మోసినంత
కడగి ఘనకీర్తి బడయునా గార్ధభమ్ము ౩౯
విద్య లేని వాడు
గాడిదై ఓడు

***

పితా ధర్మః పితా స్వర్గః
పితా హి పరమం తపః ।
పితరి ప్రీతి మాపన్నే
ప్రీయంతే సర్వ దేవతాః ॥

కందం
తండ్రియె ధర్మము గాంచగ
తండ్రియె స్వర్గమ్ము సుమ్ము తనుజుల కెల్లన్
తండ్రియె చక్కని తపముర
తండ్రిని సంతస పరచిన తనియర సురలున్ ౪౦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here