Site icon Sanchika

సంతోషమే స్వర్గము

[dropcap]నే[/dropcap]టి మానవుని జీవితం యాంత్రికంగా మారిపోయింది. గంటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా చకచకా జరిగిపోతున్నాయి. మనం చూస్తూ ఉండగానే సూర్యోదయ, సూర్యాస్తమయాలు సాగిపోతూ ఉంటాయి. మనిషి బాల్యం, యవ్వనం, కౌమారం దాటి వృద్ధాప్యంలోకి చేరుకుంటాడు. చూస్తూ ఉండగానే జీవిత చక్రం చాలా వేగంగా గడిచిపోతుంది. ‘అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది’ అనే నమ్మకంతో ప్రణాళికలు సిద్ధం చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. వాటికి పరిష్కారం తోచక సతమతమవుతూ ఉంటాం. ఆ సమయంలో తీవ్రమైన ఆశాభంగానికి గురై దుఃఖానికి లోనవుతూ ఉంటాం.

నేటి మానవుడు శాస్త్ర సాంకేతికంగా ఎన్నో ఘనవిజయాలు సాధిస్తూ రాకెట్ యుగంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. కొత్త కొత్త ఆవిష్కరణలతో అందరాని లోకాలను అందుకుంటున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ అసాధ్యాలన్నిటినీ సుసాధ్యం చేస్తున్నాడు. ఎన్ని విజయాలను చవిచూసినా మనిషి దుఃఖాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాడు.  ఏదో ఒక సమస్య మనిషిని వెంటాడుతుంది. మనిషి బలహీనమైనప్పుడు ఆ సమస్య మనిషిని వేధిస్తుంది. వెంబడిస్తుంది. అప్పుడు మనిషికి దుఃఖం కలుగుతుంది. దానికి తరుణోపాయం వెతుక్కోలేక జీవితం నుండి పారిపోవాలనే ఆలోచన కూడా వస్తుంది. తన సంతోషమే స్వరము, తన దుఃఖమే నరకమని పెద్దలు చెప్పిన మాట. సుఖదుఃఖాలు కావడి కుండలు. రెండు కుండలు సమాన స్థాయిలో ఉంటేనే కావడి నిలబడుతుంది. మనిషి జీవితంలోని సమస్యలు సముద్రం లోని అలల్లా వచ్చిపోతూ ఉంటాయి. ఏ మనిషికీ సంపూర్ణమైన సుఖము, సంపూర్ణమైన దుఃఖము ఉండదు. భారతీయ పౌరాణికులు నాటకాలనీ, రూపకాలని వివరిస్తూ, చూపించరాని ఘట్టాలలో శోకాన్ని కూడా చేర్చారు. అయితే ఆ సందర్భంలో వెంటనే అతన్ని ఓదారుస్తూ సన్నివేశాన్ని చూపి ధైర్యాన్ని కలిగిస్తారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు కదా!’ ఇది పెద్దల మాట. ‘ఇంటిని చూచి, ఇల్లాలిని చూడు’ అంటారు. అంటే ఇల్లు ఎన్ని హంగులతో ఉన్నా, ఇల్లాలి ముఖంలో సంతోషం లేకపోతే ఆ ఇల్లు కళ తప్పుతుంది. ఇల్లాలు బాధపడితే భర్త, పిల్లలు అందరికీ బాధ కలుగుతుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇది స్త్రీకి మాత్రమే కాదు, పురుషునికి కూడా వర్తిస్తుంది. సమస్య వచ్చినప్పుడు అవగాహనతో, పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలి. ‘దుఃఖించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు’ అనే విషయాన్ని గ్రహించాలి.

సీతాన్వేషణకు లంకకు బయలుదేరిన ఆంజనేయుడు ముందుగా సీత కోసం వెదుకుతాడు. ఆమె కనబడలేదని చెప్పరాని శోకాన్ని పొందాడు. ఆ వర్తమానం రాముడికి చెప్పాలనుకుంటాడు. సీతమ్మ కనబడలేదనే వార్త రామునికి చెప్పడమంటే రాముని ప్రాణాలు నిలువునా తీయడమే. రాముడు పోతే ఆయన వెంట లక్ష్మణుడు, పిదప భరత శత్రుఘ్నులు, వారి కోసం వారి తల్లులు, రామునితో స్నేహన్ని పెంచుకున్న సుగ్రీవుడు ఇలా వానర వీరులంతా చనిపోతారు. నేనిలాగే ఇక్కడే ఉండిపోతే ఆంజనేయుడు సీతమ్మను వెతుకున్నాడనే ఆశతో అందరూ బ్రతికి ఉంటారు. వీరంతా బ్రతకాలి అంటే నా ప్రయత్నమొక్కటే ఆధారం అని భావించి తన మనసును సాంత్వన పరుచుకుని, తిరిగి సీతాన్వేషణకి పూనుకుంటాడు, విజయం సాధిస్తాడు. రామదూత, రామబంటు అయిన ఆంజనేయునికే దుఃఖం తప్పలేదు. అయితే ఆత్మవిమర్శ చేసుకుని కార్యసాధకుడు అవుతాడు. రావణుని చేత అపహరింపబడి, భర్తకు దూరమైన సీతమ్మ అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఉండి కూడా ఎప్పుడూ అధైర్యపడలేదు. తనకు కలిగిన కష్టానికి తాత్కాలికంగా దుఃఖం కలిగినా, శ్రీరాముని పరాక్రమాన్ని తలచుకుని తనకు తానే ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. ఎక్కడా మనిషిని నిరుత్సాహపరచకుండా ముందుకు సాగే మహా కావ్యం రామాయణం.

పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి మహర్షులు – సీతారాముల, నలదమయంతుల కథలను వినిపిస్తారు. అంటే తమ కంటే దుఃఖాన్ని పొందిన వారున్నారని తెలిస్తే కొంత ఉపశాంతి కలుగుతుందని మహర్షులు పాండవులకు ఈ కథలను వినిపిస్తారు. ఎవరికి వచ్చిన శోకమైనా, పుత్రుని పోగొట్టుకొన్న అర్జునుని కంటే, రాజ్యాన్నీ, భార్యనీ (జూదంలో) కోల్పోయిన ధర్మరాజు కంటే, భార్య పరాభవాన్ని కళ్ళారా చూడవలసి వచ్చిన ధర్మరాజు కంటే, దాయదుల చేతిలో అవమానం పొంది అరణ్య, అజ్ఞత వాసాలు చేసి అనేక కష్టాల నెదుర్కొని చెప్పలేని శోకాన్ని పొందిన పాండవుల కంటే మించిన శోకం కాదు.

ముల్లోకాలను ఏలే శ్రీమహావిష్ణువు రకరకాల ఆయుధాలతో రాక్షసులను మట్టుబెట్టి శిష్టరక్షణ జరిపినట్లు పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒక మంత్రం చేతనో, మాయ చేతనో సమస్యను పరిష్కరించుకున్నట్లు ఏ అవతారం లోనూ భగవంతుడు మనకు కనిపించడు. ఇక సామాన్య మానవులకు అదెలా సాధ్యమవుతుంది. ‘సుఖ, దుఃఖే సమేకృత్వా’ అన్నాడు గీతలో కృష్ణుడు. అంటే సుఖదుఃఖాలను సమదృష్టితో చూడమని. మనిషికి మితిమీరిన కోరికల వల్లే దుఃఖం కలుగుతుందని గౌతమబుద్ధుడు వివరించాడు. అష్టాంగ మార్గాన్ని అవలంబించడం వల్ల దుఃఖరాహిత్యం కలుగుతుందని బోధించాడు. ఇతరులకు బాధ, కీడు కలుగకుండా జీవించడం, సత్యం మాట్లాడటం, స్వచ్ఛమైన దృష్టితో విషయాన్ని చూడటం, ఉన్నది ఉన్నట్లుగా స్పష్టమైన ఆలోచన వీటి ద్వారా దుఃఖానికి దూరం కావచ్చని బౌద్ధం వివరిస్తుంది.

ఇంటర్నెట్‍లో ఓ బొమ్మ ఆధారంగా రచయిత్రి కుమార్తె సరోజ గీసిన చిత్రం

పరమపదసోపానం లాంటి ఈ జీవితంలో పాముల్లాంటి సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా, ప్రక్కనే ఉన్న నిచ్చెనను అందుకోగలిగితే తప్పక బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యం నెరవేరాలంటే సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎంత భయంకరమైన శోకమైనా, మరణం వైపు దారితీసేది ఏనాడు కారాదు.

Exit mobile version