[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సానుకూల ధృక్పథం ఆవశ్యకత’ అనే రచనని అందిస్తున్నాము.]
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥
[భగవద్గీత 2వ అధ్యాయం (సాంఖ్య యోగం), 3 వ శ్లోకం]
[dropcap]ఓ[/dropcap] అర్జునా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము అని పై శ్లోకం భావం.
అనుక్షణం అనే సమస్యలతో, ఆందోళనలతో, సమస్యల సుడిగుండంలో పడి ఆసరా కోసం ఎదురు చూసే మానవులు తమ హృదయ దౌర్బల్యాన్ని, మానసిక అధైర్యాన్ని త్యజించి జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, మరియు సామర్థ్యముతో ఉండి బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి అని భగవానుడు అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకొని యావత్ మానవాళికి బోధిస్తున్నాడు.
విజయం సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అన్నదే మనం సాధించే విజయాన్ని ప్రభావితం చేస్తాయి. విజయం సాధించాలంటే కేవలం విజయం సాధించాలనే కోరిక ఉంటే సరిపోదు. విజయం సాధించడానికి అనేక అంశాల్లో సరైన అవగాహన ఉన్నప్పుడే విజయలక్ష్మి మనల్ని వరిస్తుంది. అందుకు సానుకూల ధృక్పథం అలవరచుకోవడం ఎంతో అవసరం.
సానుకూల దృక్పథమనేది సమద్రంలో పయనించే నావకున్న చుక్కాని లాంటిది. వీస్తున్న గాలికి అనుగుణంగా చుక్కానిని ఉపయోగిస్తే నావ చక్కగా పయనాన్ని సాగిస్తుంది. అలాకాక చుక్కానిని అడ్డదిడ్డంగా ఉపయోగిస్తే నావ మునిగిపోయే ప్రమాదముంది. విజయాన్ని సాధించడానికి సానుకూల దృక్పథాన్ని కలిగి నిజాయితీగా కృషి చేస్తే అప్పుడు విజయం సంపూర్ణంగా మన సొంతమౌతుంది.
పుట్టుకతో ప్రారంభమయ్యే మనిషి జీవితం మరణంతో ముగుస్తుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం వున్న వ్యక్తులు ఆయుప్రమాణం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. వయస్సు అందరికీ పెరుగుతుంది కానీ, ఆ వయోభారాన్ని మీద మోయకుండా, సరదాగా జీవితాన్ని గడిపే వ్యక్తులు ఆనందంగా ఎక్కువకాలం జీవించగలుగుతారు.
ఎదురయ్యే సమస్యలు ఏవైనా అందులో మంచిని మాత్రమే వెతకాలి అన్నది నిపుణుల సలహా. సమస్యలు, ఇబ్బందులు జీవితంలో సాధారణమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. “వెతికితే ప్రతిదాంట్లో మంచి విషయం ఉండకపోదు, వేలెత్తి చూపడానికి చెడు విషయాలు ఉండకపోవు” అని పెద్దలు చెప్పే మాటలో అంతరార్థాన్ని గ్రహించాలి.
ఈ ప్రపంచంలో నిరుపయోగమైనది ఏదీ లేదు. లోపాలను కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవడం వివేకం. ప్రతి విషయాన్నీ అనుకూల, ఆశావహ దృక్పథములతో చూడగలిగితే తోటి వారి కంటే ఎక్కువగా మనం, మన ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతాము.