[‘సప్త సాగరదాచె ఎల్లో – సైడ్ A’ అనే కన్నడ సినిమాని సమీక్షిస్తున్నారు శ్రీ పి.వి. సత్యనారాయణరాజు.]
[dropcap]‘స[/dropcap]ప్త సాగరదాచె ఎల్లో – సైడ్ A’ కన్నడ సినిమా. రుక్మిణి వసంత్, రక్షిత్ శెట్టి నాయికానాయకులు. 10 కోట్లు పెట్టి తీస్తే 34 కోట్లు వసూలు చేసిందట. వెయ్యి కోట్ల వసూళ్ళ గురించి వింటున్న ఈ రోజుల్లో ఇది తక్కువ అనిపించవచ్చు. కానీ ఆరొందల కోట్లు పెట్టి తీసి వెయ్యి కోట్లు సంపాదిస్తే అది 100 శాతం లాభం కూడా కాదు. ఈ చిత్రానికి 200 శాతం పైగా లాభం వచ్చింది. కారణం కథనం లోని కొత్తదనం. నాకు తెలిసి నాయికానాయకులు పెద్ద స్టార్లు కాదు. అయినా సినిమా ఆడింది. మంచి సినిమా తీయాలే గానీ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. శంకరాభరణం ఆడలేదూ? ఈ సినిమాని ‘సప్తసాగరాలు దాటి – సైడ్ A’ అని తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా మీద అంత నమ్మకం. తెలుగులో వసూళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగులో కూడా చూడవచ్చు.
మొదట చెప్పుకోవలసింది తెలుగు డబ్బింగ్ గురించి. అద్భుతంగా ఉంది. మాటలు ఎవరు రాశారో తెలుసుకోవటానికి ప్రయత్నించాను కానీ సాధ్యపడలేదు. డబ్బింగ్ చెప్పిన వారు కూడా చాలా బాగా చెప్పారు. తెలుగు చిత్రాలలో సగటున ఉండే తెలుగు కన్నా ఈ చిత్రంలో తెలుగు స్వచ్ఛంగా ఉంది.
పేరుకో సైడ్ A అని ఉంది. ఆడియో క్యాసెట్లో సైడ్ A, సైడ్ B అని ఉంటాయి. ఒక వైపు పాటలు విన్నాక క్యాసెట్ తిప్పి పెట్టాలి. ఈ సినిమా కథ 2010 పాంతాల్లోది. క్యాసెట్లు ఇంకా వాడుకలో ఉన్నట్టు చూపించారు. క్యాసెట్లు సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ సినిమా రెండో భాగం సైడ్ B అని అక్టోబర్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో కథ అసంపూర్తిగా ఉంటుందని ముందే సిద్ధపడాలి. రెండో భాగం కన్నడలో, తెలుగులో ఒకేసారి విడుదవుతోంది.
ఈ చిత్రానికి ప్రధానమైన బలం రుక్మిణి వసంత్ నటన. పాత్ర పేరు ప్రియ. ఆమె చిరునవ్వు చూస్తే తన బ్యాటరీ చార్జ్ అవుతుందని నాయకుడు మను అంటాడు. ఆమె చిరునవ్వుకి నిజంగానే అంత శక్తి ఉంది. అందులో స్వచ్ఛత ఉంది. ఆమె కళ్ళు కూడా చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నాయి. మను ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడంటే ఆమెలోని స్వచ్ఛతే కారణం. ఏదీ దాచుకోదు. కోపం కూడా. ఆమె కాలేజీలో చదువుతుంది. బాగా పాడుతుంది. ఒక సంగీత దర్శకుడు ఆమెకి అవకాశం ఇస్తానని కబురు పంపిస్తాడు. మను ఒక గొప్పోళ్ళ ఇంట్లో డ్రైవరు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆమె “గాడిదా” అంటుంది. అతను ముద్దొచ్చినపుడు “బుజ్జీ” అంటాడు. అతనికెవరూ లేరు ఆమె తప్ప. ఆమెకి తల్లి, తమ్ముడు ఉన్నారు. వారికి మను సంగతి తెలుసు. ప్రియ తమ్ముడు మనుని బావా అని పిలుస్తాడు. ప్రియ బెంగుళూరులో ఉంటున్నా ఆమె సొంత ఊరు మంగుళూరు. సముద్రతీరం. ప్రియకి సముద్రతీరమంటే ఇష్టం. అక్కడ ఇల్లు కట్టుకుందామని అంటుంది. ఆమె అలా అనగానే మను ఇంక్వైరీ మొదలు పెడతాడు, అక్కడ ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చవుతుంది అని. “ఐదు సెంట్లు కొనటానికి జీవితం సరిపోవట్లేదు. ఇల్లు కడతాడట” అంటాడు అతను పని చేసే ఇంట్లో మేనేజరు.
మనుకి, ప్రియకి ఆ ఇల్లు తప్ప పెద్ద ఆశలేమీ లేవు. నిజానికి ఆమె ఆస్వాదించేది చిన్న చిన్న సరదాలనే. ఇద్దరూ కలిసి అతని ఇంట్లో వండుకుని తిని సరదాగా కాలక్షేపం చేయటం, మోటారు సైకిల్ మీద అతన్ని వెనక నుంచి వాటేసుకుని ప్రపంచాన్ని మర్చిపోవటం.. వదిలి వెళ్ళేటపుడు కనుమరుగయే వరకి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళటం. ఒక సన్నివేశంలో ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఆమె వెళుతుంటే ఇంకో అతను అది చూసి “మా ఆవిడ నన్ను వెనక్కి తిరిగి చూస్తుందేమో అని ఆశపడతాను. ఎప్పుడూ చూడదు. ప్రియ మాత్రం నిన్ను అలా చూస్తూ చూస్తూ వెళుతుంది” అంటాడు. ఈ సన్నివేశానికి సందర్భం చెబితే కథ చెప్పాలి కాబట్టి చెప్పటం లేదు. కానీ ఆ సందర్భంలో ఆమె అతన్ని ఎంత ప్రేమించిందో అర్థమై మనసు ఆర్ద్రమవుతుంది. నేపథ్య సంగీతం కూడా తోడై కళ్ళు చెమరుస్తాయి.
స్క్రీన్ ప్లే రాసేటపుడు చెప్పే మొదటి సూత్రం – కథ ఎలా ఉండాలంటే ఒక మనిషిని చెట్టు ఎక్కించాలి, ఇది మొదటి భాగం (యాక్ట్); తర్వాత అతని మీద రాళ్ళు విసరాలి, ఇది రెండో భాగం; తర్వాత అతను చెట్టు దిగాలి, ఇది మూడో భాగం. ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తున్నా ఈ చిత్రంలో కూడా ఆ మూడు భాగాలూ ఉంటాయి. చెట్టు ఎక్కినపుడు రాళ్ళు తప్పించుకుంటే గాయాలు లేకుండా దిగుతాడు. లేకపోతే గాయాలు ఉంటాయి. ఒంటికైనా, మనసుకైనా. ఈ చిత్రంలో పడే రాళ్ళు ఒక విధంగా స్వయంకృతమే. అంటే ఎవరికో మన మీద వేసే రాళ్ళు మనమే ఇచ్చి వేయమనటం. ఎందుకు? ఏముంది, డబ్బు కోసం. ప్రియ కోరిక తీర్చాలని మను కోరిక. దానికి డబ్బు కావాలి. వారు రాళ్ళేసినా తగలకుండా వేస్తారని, చివరికి క్షేమంగా చెట్టు దిగిపోతాననే ధైర్యంతో మను రాళ్ళ దాడికి సిద్ధపడతాడు. ఎవరికైతే రాయి వేసే అనుమతి ఇచ్చాడో వారు కాక వేరే వాళ్ళు వచ్చి రాళ్ళు వేసే సరికి చెట్టు దిగటం కష్టమవుతుంది. ప్రియ తోడు ఉంటే కాస్త ఊరటగా ఉండేది. ప్రియ ఒకచోట, తానొకచోట ఉండే పరిస్థితి. ప్రియ అతన్ని కాపాడాలని ప్రయత్నిస్తుంది. అదే ఆమె జీవితలక్ష్యం అయిపోతుంది. సంగీతాన్ని కూడా వదులుకుంటుంది. మను తప్పుడు నిర్ణయంతో ఇద్దరి జీవితాలు పక్కదారి పడతాయి. అయితే వారి ప్రేమే వారికి ధైర్యం. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు.
ఒకసారి ఆమె టేపులో తన గొంతు ఎక్కించి అతనికి పంపుతుంది. “ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ మొదలుపెట్టేసరికి ఏం చెప్పాలో తెలియటం లేదు” అంటుంది. ప్రేమించినవారికి ఇది అనుభవమైన విషయమే. కారణం నిజమైన ప్రేమలో ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏం చెప్పాలో తెలియక ఆమె ఒక జోక్ చెబుతుంది. అది విని అతను నవ్వుకుంటాడు. అది చాలు అతనికి. అతనికి అదే చాలని ఆమెకి తెలుసు.
చిత్రంలో ఒక సన్నివేశంలో ప్రియ బస్సులో వేళుతూ ఉంటుంది. బస్సు రద్దీగా ఉంటుంది. ఒక నడివయసు స్త్రీ నిలబడి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్రియ తన సీటు ఆమెకిస్తుంది. కొంతకాలానికి ఆ స్త్రీ మళ్ళీ బస్సులో కనపడుతుంది. ప్రియ కూర్చుని ఉంటుంది. ఆమె నిలబడి ఉంటుంది. ఆమె ప్రియని చూసి చిరునవ్వు నవ్వుతుంది. ప్రియ ముఖం తిప్పుకుంటుంది. ఈ చిన్న సన్నివేశంలో మనిషి మనస్తత్వాన్ని ఎంత గొప్పగా చూపించారు! ప్రియ మను లేక దుఃఖంలో ఉంది. ఆమెకి ప్రపంచం అవసరం లేదు. ఈ ప్రపంచం నాకేం చేసింది అనే భావన. ఎవరైనా మనపట్ల పరుషంగా ప్రవర్తిస్తే మనం నొచ్చుకుంటాం. కానీ ఆ మనిషి ఎంత బాధలో ఉన్నాడో మనకేం తెలుసు? ఎప్పుడూ ‘నేను, నాకు’ అనుకోవటం మానేసి ‘వారి గొడవలు వారికుంటాయిగా’ అనుకుంటే మనం ప్రశాంతంగా ఉండవచ్చు.
మనుకి, ప్రియకి ఒక రహస్య సంకేతం ఉంటుంది. దాన్ని ఆంగ్లంలో Fingers crossed అంటారు. చూపుడు వేలు మీద మధ్య వేలు పెట్టటమే ఆ సంకేతం. దాని అర్థం ‘మనకి మంచిరోజులొస్తాయి’ అని. ఆమె ఊరికి వెళ్ళినపుడు బస్సులో నుంచి అతనికి ఆ సంకేతం చూపిస్తుంది. తర్వాత అతను తనకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడని తెలిసి ఆమె కొన్నాళ్ళు అతన్ని పట్టించుకోదు. తర్వాత అతను కనపడినపుడు అతని తన దగ్గరకి రాలేని పరిస్థితి. అప్పుడు దూరం నుంచి ఆ సంకేతం చూపిస్తుంది. అదే అతనికి కొండంత బలం. ఒకదశలో ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ తనకి కనపడదేమో అని అతను అనుకున్నప్పుడు ఆమె అదే సంకేతం చూపిస్తుంది. కానీ ఈసారి అతనికి ఆశ ఉండదు. ఆమెకి ఏం జరగబోతోందో తెలియదు కాబట్టి ఆమెకి ఆశ ఉంటుంది. ఇది గుండెల్ని పిండేస్తుంది.
ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉన్నాయి. క్లోజప్ షాట్లలో ప్రియ కళ్ళు కవిత్వం చెప్పినట్టే ఉంటాయి. ఒక సందర్భంలో ఎవరో అమెరికాకి వెళ్ళారు అని చెప్పగానే తర్వాతి షాట్లో నీటిలో విమానం కనిపిస్తుంది. పక్కనే మను విచారంలో ఉంటాడు. వాళ్ళు అమెరికా వెళ్ళటం మను జీవితంలో ప్రతికూలంగా ప్రతిఫలిస్తుంది. దాన్ని దృశ్యంలో చక్కగా చూపించారు. ప్రియ టేపు రికార్డు చేసేటపుడు బటన్ నొక్కగానే కట్ చేసి మను ఉన్న చోటు చూపిస్తారు. ఆమె జీవితంలో సంగీతం ఆగిపోయింది, ఆ స్థానంలో అతని జీవితం వచ్చి చేరింది అని అర్థం. ఇద్దరి జీవితాలూ ఒకటవుతాయని ఆశ పడితే మిగిలింది ఇది! అతని జీవితం ఆమె జీవితాన్ని ఆపేసింది. ఆమె అతని జీవితమే తన జీవితమని సాగిపోతుంది.
క్లైమాక్స్ గురించి కూడా చెప్పుకోవాలి. భయపడకండి, కథ చెప్పను. క్లైమాక్స్‌లో రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఎడిటింగ్ అత్యద్భుతంగా చేశారు. ఒక సంఘటనలో మను. ఒక సంఘటనలో ప్రియ. అతను రౌద్రం. ఆమె కరుణం. అతను అడుగేస్తుంటే కట్ చేసి ఆమె అడుగు చూపిస్తారు. అతనికి దెబ్బ తగిలితే ఆమెకి నొప్పి. అతని రక్తం ఆమె బొట్టు. ఈ మధ్యకాలంలో ఇలాంటి క్లైమాక్స్ చూడలేదు. నేపథ్య సంగీతం ఈ క్లైమాక్స్ ని కొత్త ఎత్తులకి తీసుకువెళ్ళింది.
రుక్మిణి వసంత్ కి మంచి భవిష్యత్తు ఉంది. రక్షిత్ శెట్టి బాగా నటించాడు. పవిత్ర లోకేశ్‌కి మరో మంచి పాత్ర పడింది. హేమంత్ రావుకి దర్శకుడిగా ఇది మూడో చిత్రం. హిందీలో వచ్చిన ‘అంధాధున్’ కి స్క్రీన్ ప్లే రాసి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రానికి గుండు శెట్టితో కలిసి స్క్రీన్ ప్లే రాశాడు. స్క్రీన్ ప్లేనే ఈ చిత్రానికి ప్రధాన బలం. హేమంత్ రావు ఎడిటింగ్‌లో కూడా పాలు పంచుకున్నాడు. అద్వైత గురుమూర్తి ఫొటోగ్రఫీ, చరణ్ రాజ్ సంగీతం చిత్రాని నిలబెట్టాయి. అన్ని విభాగాల వారు తమ ప్రతిభని జోడిస్తే సినిమా ఎంత బావుంటుందో ఈ చిత్రం ఒక ఉదాహరణ. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమ కావ్యం ఇది. తప్పక చూడండి.