సప్తపది

0
2

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ఎంపికైన కథ సప్తపది’. రచన ఈరంకి ప్రమీలా రాణి. [/box]

[dropcap]“అ[/dropcap]బ్బా.. ఏమిటమ్మా ఈ రోజుల్లో కూడా పాతకాలంలో లాగా పెళ్లిచూపులు? వద్దంటే వినరు కదా.” విసుగ్గా అంది లావణ్య.

కూతురి లంచ్ బాక్స్ సర్దుతున్న అరవింద ఆమెకేసి ఒకసారి చూసి తన పనిలో వుండిపోయింది. “ఏమిటి లావణ్యా పొద్దున్నే అమ్మతో వాదన? నీకు ఆఫీస్‌కు టైం కావడం లేదు.” అంటూ వచ్చాడు రాఘవేంద్ర. లావణ్య కాస్త సంకోచించింది, కానీ తన మనసులో మాట వాళ్ళకి చెప్పకపోతే ఎలా?

“అదే డాడీ, అమ్మ మళ్ళీ పెళ్లిచూపులు అంటుంటే….”

“ఏం వద్దా? ఒకరి నొకరు చూసుకోకుండా పెళ్లెలా చేసుకుంటారు.” సందేహం వ్యక్తం చేసాడు రాఘవేంద్ర.

“చూడననడం లేదు, అతనొక్కడిని ఏ ‘కాఫీ డే’ లో నైనా కలుసుకుని….”

“చాల్చాల్లే ఎవరైనా వింటే నవ్వి పోతారు. నువ్వు ఒంటరిగా ఒక హోటల్లో కూర్చుని అతనితో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు?” అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ అన్నాడు.

అన్నగారు ఏ శతాబ్దానికి చెందినవాడో లావణ్యకు అర్థం కాలేదు.

“తప్పేముందన్నయ్య నేనెన్నో సార్లు మీటింగ్‌లకని వెళ్ళలేదా?”

“అది ఉద్యోగ రీత్యా వెళ్ళినది. నీతో పాటు మీ కొలీగ్స్ కూడా వుండేవాళ్ళు. అందులో ఎవరూ కామెంట్ చేయడానికి ఏమీ లేదు.”

“అయితే ఇప్పుడేం అంటావ్?” అంది లావణ్య.

“అలా అతన్ని నువ్వొక్క దానివి కలవడం నాకేం ఇష్టం లేదు.” అన్నాడు అజయ్.

తల్లి వైపు చూసింది లావణ్య నిస్సహాయంగా. “నువ్వేం మాట్లాడవేం అమ్మా.”

“ఏం చెప్పను లావణ్యా, ఈ రోజుల్లో పెళ్లి చూపులు కూడా మారిపోయాయి.”

“అంటే లావణ్య అతడిని అలా హోటల్లో కలవడం మంచిదంటావా?” అన్నాడు అజయ్.

“ఏమో నాకైతే ఇలా పెళ్లి చూపులు చూడడం బాగుండదు లావణ్యా.” అన్నాడు రాఘవేంద్ర తీర్పు ఇస్తున్నట్టుగా.

లావణ్యను రక్షించడానికన్నట్టు ఆమె వదిన అంజలి వచ్చింది. “ఆఫీస్‍౬కు టైం కావడం లేదూ లావణ్యా. పద పద.” అంది.

 అందరికీ చెప్పి లంచ్ బాక్సులు తీసుకుని ఇద్దరూ బయలుదేరారు. కారులో ఎక్కేటప్పుడు కూడా లావణ్య మాట్లాడక పోవడం గమనించింది అంజలి.

“’లావణ్యా సీరియస్‌నెస్ నీ మొహానికి సూట్ కాలేదోయ్, కాస్త నవ్వు.” అంది.

 కారు సెల్లార్ దాటాక, మాట్లడటం మొదలు పెట్టింది లావణ్య. “అబ్బా నీకేం బాబూ చెబుతావ్, మా అన్న నీకు చాలా రోజులుగా తెలుసు కాబట్టి నీకు ఈ పెళ్లి చూపుల బాధ లేదు”.

“అంతవరకే నీకు తెలుసు, మీ అన్నయ్య నాకు పరిచయం, కానీ మాఇంటిలో వాళ్ళకి కాదుగా. వాళ్ళని ఒప్పించడానికి నేనెన్ని పాట్లు పడ్డానో నీకేం తెలుసు.”

“మా ఫ్యామిలి మంచిది వెల్ సెటిల్డ్ అని చెప్పవలసింది.”

“ఆ మనం చెబితే వాళ్ళు నమ్మేస్తారు, మా బామ్మకి కుటుంబం, సాంప్రదాయం కావాలి. అమ్మకి ఆరోగ్యం గల అల్లుడు కావాలి, నాన్నకు ఉద్యోగస్థుడైన అల్లుడు కావాలి…”

“మరి మీ అన్నకు?” నవ్వుతూ అడిగింది లావణ్య.

“వాడికెలాంటి బావ కావాలో వాడికే తెలియదు అనుకుంటాం కానీ లావణ్యా అందరి చెల్లెళ్ళకు రుక్మిణి అన్నలాటి అన్న ఒకడుంటాడు.” ఆమె చెప్పిన విధానానికి నవ్వింది లావణ్య.

“భలే పోల్చావోయ్” అంటూ, “ఇంతకీ ఈ పెళ్లి చూపుల విషయంలో నీ అభిప్రాయం చెప్పలేదు.” అడిగింది లావణ్య.

“అడిగావ్ కాబట్టి చెబుతున్నా, పాత కాలం నాటి పెళ్లి చూపులే బాగుండేవి అనుకో.”

“అబ్బా ఇలా మాట్లాడిమా అన్నకు అర్ధాంగి ననిపించావు.”

“అవును లావణ్యా, మా ఫ్రెండ్ ఇలాగే నేను ఒక్క దాన్నే పెళ్లి చేసుకోబోయేవాడితో మాట్లాడాలని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలని అనుకుంది. అలా మాట్లాడి అతన్నే పెళ్లి చేసుకుంది, కానీ తీరా చూస్తే వాడు చెప్పిందొకటి, చేసేది మరొకటి అయ్యింది. తను విడాకులు తీసుకుని ఒక్కత్తి వుంటోంది.” నిట్టూర్పు విడిచింది అంజలి. లావణ్య ఏం మాట్లాడాలో తెలియనట్టుగా వుంది. అంజలి మళ్ళీ మాటలు మొదలుపెట్టింది “నన్నడిగితే సాంప్రదాయయంగా జరిగే పెళ్లి చూపులే మంచివంటాను. వాళ్ళు మనింటికీ రావడమో, మనం వాళ్ళింటికీ వెళ్లడమో జరుగుతుంది. మనతో పాటు మన వాళ్ళుంటారు కాబట్టి అబ్బాయినో, అమ్మాయినో పరిశీలనగా చూస్తారు. మెరిట్స్ వున్నా, డీమెరిట్స్ వున్నా తెలిసిపోతుంది. వాళ్ళ ఇల్లు వాతావరణం, చుట్టు పక్కలవాళ్ళతో వాళ్ళ ప్రవర్తన తెలుస్తాయి, అన్నిటిని మించి మన అమ్మాయి వాళ్లతో కలవగలదో,లేదో కొద్దిగా నైనా తెలుస్తుంది.” అంది అంజలి.

“నేనొక మాట అడుగుతాను ఏమనుకోవుగా?” అంది లావణ్య.

“నువ్వేమడుగుతావో నాకు తెలుసు. మీ ఇంటికివచ్చి నేనేమైనా ఇబ్బంది పడ్డానా అని కదు, ఉహూ లేదు నాకు నా అత్తవారింట్లో అంటే మీ ఇంట్లో ఏ ఇబ్బంది లేదు. కానీ అందరికీ అలాటి అత్తవారిల్లు దొరుకుతుందని నేను అనుకోను.”

“మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్.”

“నా అభిప్రాయం అడిగావ్ చెప్పాను. నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. ఆ మీ ఆఫీస్ వచ్చింది దిగుతావా.” అంది అంజలి కారు ఆపుతూ. “బై…బెస్ట్అఫ్ లక్.” కారు డ్రైవ్ చేసుకు వెళ్ళిపోయింది డాక్టర్ అంజలి.

లావణ్య గేటు దగ్గర నుండి ఆఫీస్ లోకి నడుస్తోంది. రెండురోజుల క్రితం, ఈ పెళ్ళిచూపుల గురించి తల్లికి తనకు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. “మా రోజుల్లో పెళ్ళిచూపులంటే పెద్ద తతంగంగా వుండేది లావణ్యా. అమ్మాయిని చూడటానికి కనీసం పదిమంది అయినా వచ్చేవారు. చుట్టరికాలు తిరగేసి ఏదో బీరకాయ పీచు చుట్టరికం కలుపుకునేవారు. ఇంక అమ్మాయిని ఏం చదివావ్? వుద్యోగం చేస్తావా? చెయ్యకపొతే ఎందుకు చేయడం లేదు… ఇలాగా… కొంత మంది చాదస్తులు నడిచి చూపించు, నీ జడ సొంతమేనా… సంగీతం వచ్చా… కుట్లు,అల్లికలు వచ్చా” ఇలా చెబుతూ అరవింద నవ్వేసింది.

“ఎందుకమ్మా నవ్వుతున్నావ్?”

“మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళక్క ను పెళ్ళివారు ఇన్ని ప్రశ్నలువేసి అన్ని ‘కళ’ల్లో ప్రవేశం వుందో తెలుసుకుని తీరా పెళ్లి అయ్యాక ఆమె ఏదో కాలక్షేపానికి పాడుకుంటుంటే అవన్నీ మానేయ్యలమ్మా పెళ్ళయ్యాక అన్నారుట. అందుకని నువ్వొక్క దానివే అతన్ని కలుసుకుని మాట్లడటం మంచిది, మీ ఇద్దరి మీదా ఎవరి ప్రభావం వుండదు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు. కాకపోతే అతని మాటలు నిజామా? కాదా? అని తేల్చుకోవలసినది నువ్వే. ఆ విషయంలో ఏ భ్రమకి లొంగకూడదు.”

లావణ్య తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ అలవాటుగా ఆఫీస్ వున్న బిల్డింగ్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. లావణ్య తల్లితో, వదినతో జరిగిన సంభాషణ గుర్తుచేసుకుంటోంది. రెండు తరాలకు చెందిన ఇద్దరు స్త్రీలు తమ పెళ్లి చూపులను, సమర్థించడం లేదు, సంతృప్తి పడడం లేదు.

బయటికి బాగుంది అనుకున్నావారి ఏదో మనసులో భావం వుంది.

మరి తనేం చేయాలి? ఆమె లిఫ్ట్ దగ్గర నిలబడిపోయింది. ఎవరైనా తనకు మంచి సలహా ఇస్తే బాగుండును.

ఆమె ఆలోచనకు మద్దతిస్తున్నట్టుగా ఆమె చిరకాల మిత్రుడు మాధవ్ లిఫ్ట్ లోంచి బయటకు వచ్చాడు.

“ఏమిటి లావణ్యా ఆఫీస్‌కు వెళ్ళవా?”

“ఆ.. ఆ.. వెడతాను… నువ్వు బయటికి వెడుతున్నావా? నాతో ఆఫీస్ దాకా రాగలవా?”

అతను ఒకసారి భుజాలు ఎగరేసి “మళ్ళీ ఏడంతస్తులు ఎక్కాలా? పరవాలేదులే లిఫ్ట్ లోనే గా పద. ఏదో ఆలోచిస్తున్నావ్? ఏమైనా సమస్యా? సహాయం కావాలా?”

ఆమె టూకీగా తన సమస్య చెప్పింది. అతను పెద్దగా నవ్వేసాడు. “పెళ్ళే చాలామందికి సమస్య అంటారు, నీకు పెళ్ళిచూపులే సమస్యగా ఉన్నాయా?”

“అబ్బా నవ్వడం కాదు మాధవ్… సలహా కావాలి..” అంది లావణ్య.

“అడిగావ్ కాబట్టి చెబుతున్నా లావణ్యా, నీకు బాగా తెలుసున్నవాడిని, పరిచయం ఉన్నవాడినే చేసుకో… అరగంట మాట్లాడడం లోనూ, అయిదు నిముషాలు పెళ్లి చూపుల్లోనూ ఎవరి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. మా బామ్మ నీకు తెలుసుగా, ఆమె అంటూండేది మంచి స్నేహమే మంచి దాంపత్యానికి పునాది అని.”

వింటున్న లావణ్య చురుక్కుమని చూసింది. ఎంత మంచి సలహా… మాధవ్ మంచి మిత్రుడు. మంచి భర్త కాగలడు… లిఫ్ట్ ఏడో అంతస్తులో ఆగింది.

“ఆ… ఏడంతస్తులు ఎక్కించావ్, నాక్కాస్త పనుంది. నేను వెళ్ళనా?”

ఆమె చప్పున అతడి చెయ్యి పట్టుకుంది. మాధవ్ ఆశ్చర్యంగా చూసాడు. “మన ఈ స్నేహాన్ని మీ బామ్మ గారి మాటలా నిజం చేద్దాం మాధవ్. నీకు అభ్యంతరం లేదుగా… ఏడంతస్తులు ఎక్కడమే కాదు ఏడడుగులు వేద్దాం… ఏమంటావ్?”

అతడు అంగీకరిస్తున్నట్టుగా ఆమె చేతిని అందుకున్నాడు.

“ఆ మాట లిఫ్ట్ ఎక్కే ముందే చెబితే లిఫ్ట్ అవసరమే వుండేది కాదుగా…”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here