సరదా కోసం కుక్కల్ని పెంచవద్దు

0
3

[dropcap]ఉ[/dropcap]దయాన్నే చేతిలో ఏ బొచ్చుకుక్కనో పట్టుకొని రోడ్డు మీద తిరగడం ప్రతివారికి ఫ్యాషనై పోయింది. ఒకప్పటి సంపన్న వర్గాల అలవాట్లన్నీ నేడు మధ్య తరగతి వారూ, దిగువ మధ్య తరగతి వారూ సొంతం చేసుకున్నారు. ఇంటి ముందు కుక్కల్ని కట్టేయడానికి తగిన ఖాళీ, ఊర్లకు వెళ్ళినపుడు వాటిని చూసుకునే మనుషులూ లేక అవస్థల పాలవుతున్నారు. వాటి కోసం తగిన సమయాన్ని కూడా కేటాయించగలగాలి. ‘జంతువుల్ని పెంచుకోవటం’ అనే ఆనందాన్ని అనుభవించేలా ఉండాలి కానీ అది మరో బరువుగా మారకూడదు. అందుకే ఒక పని చేసేటపుడు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని కాక నిజంగా ఆ పని మనం చేయగలమా! మనకు అవసరమా! అని అలోచించి చేయాలి.

జంతువుల్ని పెంచుకోవలనుకున్నవారు నిజంగా వాటి మీద ప్రేమ, జాలి, దయ, సహనం వంటివి తమకున్నాయో లేదో పరిక్షించుకోవాలి. వాటి మీద నిజంగా ప్రేమ ఉంటేనే వాటిని తెచ్చుకోవాలి. కుక్కల్ని పెంచుకోవడం స్టేటస్ సింబల్ కాదని గుర్తుంచుకోవాలి. షోకేస్‌లో ఓ బొమ్మ పగిలిపోతే మరల ఆ ప్లేస్‌లో మరొక బొమ్మను పెట్టినట్లు, ఒక కుక్క చనిపోతే మరొక కుక్కను తెచ్చు కోవడం చాలా మంది చేస్తుంటారు. కొంత మంది కొన్ని రోజులు పెంచుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ కిచ్చేస్తుంటారు. కొన్ని కుక్కలు కొత్త వారి దగ్గర, కొత్త ఇంట్లో అలవాటు పడలేక, పాత యజమానుల్ని మర్చిపోలేక చనిపోతుంటాయి. అప్పుడప్పుడు అనారోగ్యాల వాళ్ళ చనిపోవచ్చు కానీ ఎక్కువ సార్లు ఇంటివారి అజాగ్రత్త వలెనే చనిపోతుంటాయి. ఇటువంటి సంఘటనలు మన ఇంటి చుట్ట పక్కల ఎన్నో కనిపిస్తుంటాయి. మన సరదా కోసం వాటి ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం?

కుక్కల్ని పెంచుకోవడమే కాదు వాటికీ సరైన సమయంలో టీకాలు ఇప్పించడం, జబ్బులు రాకుండా చూడటం చేయాలి. వాటికీ వేళకు సరియైన ఆహారాన్ని అందించాలి. వాటి చూపులో గానీ, ప్రవర్తనలో గానీ ఏదైనా తేడా వస్తే వెంటనే డాక్టరు వద్దకు తీసుకెళ్ళాలి. రేబీస్ వ్యాధి రాకుండా నివారణే గానీ వచ్చాక తగ్గించే మందులేవి లేవు మరణం తప్ప. అందుకే ఇంట్లో పిల్లలున్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కల జుట్టు వలన ఎలర్జీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం, సాయంత్రం వాటి జుట్టును దువ్వాలి. అప్పుడు ఇల్లంతా పరచుకోకుండా ఉంటుంది. వంటింట్లోని ఆహార పదార్థాలపై మూతలు పెట్టె ఉంచడం వలన అవి ఒళ్ళు విదుల్చుకున్నప్పుడల్లా ఎగిరే జుట్టు ఆహారంలో పడకుండా ఉంటుంది.

కొన్ని ఇళ్ళలో పిల్లలకు అటబొమ్మలాగా కుక్కపిల్లను కొనిస్తారు. పిల్లలు దాన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టటం, భయపెట్టటం, విసిగించటం చేస్తుంటారు. తోక పట్టుకొని లాగటం, పుల్లలతో గుచ్చటం, ఆహారం పెట్టినట్లే పెట్టి లాక్కోవడం వంటి వాటితో బాగా విసిగిస్తారు. పిల్లలకు ఇది తప్పని చెప్పాలి. అవి కూడా ప్రాణమున్నవే. వాటికీ ఇష్టా ఇష్టాలు ఉంటాయి. ఆడుకునే సమయంలో ఆడుకుంటాయి. విసిగిపోయినపుడు అలసిపోయి నిద్రపోతాయి. ఆ సమయంలో నిద్ర లేపితే వాటికీ చాలా కోపం వస్తుంది. ఇంకా విసిగిస్తే ఉచితానుచితాలు మరిచి కరుస్తాయి.

సాధారణంగా 1,2 నెలల వయసున్న కుక్క పిల్లల్ని పెంచుకోవటానికి తెచ్చుకుంటారు. ఇంత చిన్న పిల్లల్ని గొలుసుతో కట్టేసి బాధించకూడదు. అవి పారిపోతాయి అనుకుంటే గేటు తలుపు వేసేసి వాటిని ఫ్రీగా విడిచి పెట్టాలి లేదా వాటి కోసం ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచాలి. వాటిని కూడా మన పిల్లల్లా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటి బాల్యం కూడా పిల్లల బాల్యం లాంటిదే. రెండు గంటల కొకసారి టైము చూసుకొని పాలు పట్టాలి. చిన్న కుక్కపిల్లలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని తెలుసుకోవాలనే ఆరాటంలో ఉంటాయి. పడిపోతాయి ఏది ప్రమాదమో కాదో వాటికీ తెలియదు కాబట్టి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అలా వాటిని చంటిపిల్లల్లా జాగ్రత్తగా చుసుకుంటేనే బతుకుతాయి. వాటికీ టాయిలెట్ పనులు నేర్పిందాకా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇన్ని కష్టాలు పడగలిగితేనే కుక్కల్ని పెంచుకోవాలి. అంతేకానీ ఏదో సరదాగా వాళ్ళెవరో పెంచుకుంటున్నారు అని పెంచుకోకూడదు. వాటి తిండి తిప్పలు, ఇష్టా ఇష్టాలు ఏవీ గమనించకుండా ఇష్టం వచ్చినట్లు పెంచితే చచ్చిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here