Site icon Sanchika

సరదా తీరింది

[dropcap]రా[/dropcap]జేష్, కమలకి పెళ్లయి పది వసంతాలు దాటేయి. వాళ్ళకి ఒక పాప, ఒక బాబు. ఇద్దరూ మంచి ఉద్యోగాలలో ఉన్నారు. ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కుని సంతోషంగా ఉన్నారు. ఒకరోజు కమల..

“అందరూ ఇల్లు కొనుక్కుంటున్నారండీ. మనమూ కొనుక్కుందాం” అంది.

“అలాగే, కొనుక్కుందాంలే” అన్నాడు రాజేష్ .

‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవ లేదన్నట్టు’ ఇద్దరూ సంపాదనాపరులేగా. మరింకేం కమల ఆఫీసుకి దగ్గరలో చక్కటి పొందికైన చిన్నఇల్లు కొనుక్కున్నారు. గృహప్రవేశం ఇంట్లోదిగటం అయ్యేయి. కొత్త ఇంట్లో అక్కరలేని పాతసామాన్లు వెక్కిరించినట్టుగా కనిపిస్తుంటే..

“ఏవండీ, అక్కరలేని సామాన్లు అమ్మేద్దామా?” అంది కమల.

“ఇప్పుడవన్నీ తోపుడు బండిమీద తీసుకు వెళ్లి అమ్మమంటావా? పనిమనిషికి ఇచ్చేస్తే పోతుంది” అన్నాడు చిరాగ్గా రాజేష్.

“బోలెడు, డబ్బుపోసి కొన్నాం. ఉండండి ‘ఓఎల్‌ఎక్స్’లో సేల్‌కి పెడదాం” అంది కమల.

ఉయ్యాలా, వాకర్ లాంటివే కాకుండా పాత సోఫాలు లాంటివి ఓఎల్‌ఎక్స్‌లో సేల్‌కి పెట్టేరు.

సేల్‌కి పెట్టిన గంటకే కాల్ వచ్చింది.

వెంటనే వచ్చిన కాల్‌తో సంతోషంగా ఫీల్ అవుతూ..

కస్టమర్‌తో మాట్లాడేరు. కస్టమర్ ఇండియన్ ఆర్మీట. ప్రతీమాటకు ముందు ‘జై హింద్’ అని, మాట పూర్తికాగానే ‘జై హింద్’ అంటూ మాట్లాడుతుంటే రాజేష్‍లో దేశభక్తి ఉప్పొంగింది.

ఏ వస్తువులు అమ్మాలనుకున్నారో అవన్నీ వీడియో కాల్‌లో చూపిస్తామంటే..

“వద్దండీ, మీ మీద మాకు నమ్మకముంది, అవసరంలేదు” అంటున్నా సరే..

‘తరువాత మాట తేడా రాకూడదంటూ’ అన్నీ వివరంగా చూపించేడు రాజేష్.

ఆఖరుకి, పాతికవేలకు ఒప్పందం కుదిరింది.

“సాయంత్రం వచ్చి సామాన్లు తీసుకువెళతాను” అన్నాడు కష్టమర్.

హాయిగా ఇంట్లో కూర్చుని చెత్త సామాన్లు వదిలించుకొన్నాను అనే సంతోషంతో.. “సరే, త్వరగా రండి అయితే” అన్నాడు రాజేష్.

“ఫోన్ పే, ఇప్పుడే చేస్తాను అభ్యంతరంలేదు కదా?” అన్నాడు కస్టమర్.

ముందే, డబ్బులు వస్తున్నాయనే సంతోషంలో తల ఊపేడు అన్నాడు రాజేష్.

కస్టమర్ రాజేష్ కి ఒక ‘యూఅర్‌ఎల్’ లింక్ ఇచ్చేడు. ఆ లింక్‍లో కూడా ‘ఆర్మీ’ అనే అక్షరాలు పొందుపరచబడి ఉన్నాయి.

“లింక్ మీద ఒకసారి క్లిక్ చెయ్యండి” అన్నాడు కష్టమర్.

రాజేష్ ఒక్కసారి క్లిక్ చెయ్యగానే మూడువేలు రాజేష్ కి కట్ అయ్యేయి. “ఇదేంటి? నాకు ఎందుకు కట్ అయ్యేయి?” అని కష్టమర్‌ని అడిగితే..

“మొదటిసారి యాడ్ చెయ్యటం వలన అలా అయింది. మరొకసారి లింక్‌ని క్లిక్ చెయ్యండి. మీ కట్ అయిన డబ్బు కూడా మీకు వస్తుంది” అన్నాడు కష్టమర్.

రాజేష్ లింక్‌ని మళ్లీ క్లిక్ చెయ్యబోతుంటే..

‘ఏదో తేడాగా ఉందని’ కమల ఆగమని చెయ్యడ్డంపెట్టే తొందరలో రెండుసార్లు క్లిక్ అయి, ఆరువేలు కట్ అయ్యేయి.

మినిమం ట్రాన్సక్షన్ మూడువేలు కట్ అయ్యేటట్టుగా పెట్టుకోవటం వలన మొత్తం తొమ్మిదివేలు మాత్రమే కట్ అయ్యేయి, లేకుంటే ఎంత లాగేసేవాడో అనుకుని వెంటనే, రాజేష్ గట్టిగా అరుస్తూ..

“ఒరేయ్ ఏం చేస్తున్నావురా?” అని వాణ్ణి తిడుతూ ఉంటే

వాడు వెక్కిరించి..  “జై హింద్” అని ఫోన్ కట్ చేసేడు.

కమల, నంబర్ నించి కాల్ చేసి.. “పోలీస్ రిపోర్ట్ చేస్తాంరా” అని గట్టిగా అరుస్తుంటే..

వాడు, బూతులు తిడుతూ.. “ఏం చేస్తావో చేస్కో” అన్నాడు.

పోలీస్ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్‌కి వెళ్లేరిద్దరూ.

పోలీసులు విషయం అంతా విని.. “చదువుకుని, ఉద్యోగాలలో ఉన్నారు. ఇలా ఎందుకు మోసపోయేరు?” అంటూ నాలుగు మాటలు వినిపించి కంప్లైంట్ రాసుకుని, మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు, వెళ్ళండి” అన్నారు.

‘జై హింద్ అంటూ దేశభక్తుడులా నమ్మించేడు వెధవ’ అని తిట్టుకుంటూ.. ఆశ చావక, రాత్రి మరొక్కసారి వాడికి ఫోన్ చేసేడు రాజేష్. ఫోన్ కట్ చేసి.. ‘తిక్క కుదిరిందా?’ అంటూ ఎగతాళిగా మెసేజ్ పెట్టాడు. అది చూసి, డబ్బులు పోయేయి అనే బాధ కన్నా, మోసపోయాము అనే బాధతో ‘ఆన్‌లైన్ సేల్’ సరదా తీరింది అనుకున్నారు ఇద్దరూ.

Exit mobile version