Site icon Sanchika

సరళరేఖల్లో శివశంకర్ వేదనా స్వరం

ఘనాకారంగా, దృఢంగా, నిశ్చలంగా ఉన్న వాటిని త్రోసి రాజని, మనోవేగంతో కదిలేవి, ప్రవహించేవి వ్యాప్తిలోకి రావటమే ‘ద్రవాధునికత’ లక్షణం.

జిగ్మంట్ బౌమన్ (Zygmunt Bauman) రాసిన సిద్ధాంతం ‘లిక్విడ్ మోడర్నిటీ’ ( Liquid Modernity) ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. ఈ ‘ద్రవత్వం’ మానవ జీవితాల్లోకి, జీవన విధానాల్లోకి ఎలా వచ్చి చేరిందో, ‘ఆధునికత’, ‘ఆధునికాంతర’ స్థితులను దాటి, వేగంగా ఎలా ప్రవహించిపోతోందో, మానవుడికి సంబంధించిన అన్నిటినీ ఒక వెల్లువలా తనలో కలిపేసుకుంటుందో మేధావులు ఆలోచించసాగారు. దానిలో ఆవేదన ఉంది. నిస్సహాయత కూడా ఉంది. ప్రేక్షకత్వం వహించక తప్పని పరిస్థితి ఉంది.

బతకటం ఎట్లా అనేది ఆదిమ మానవుడి సమస్య అయితే సుఖించటం ఎట్లా అనేది ఆధునిక మానవుడి సమస్య. ముఖ్యంగా ‘టైం ఈస్ మనీ’, ‘ఎంజాయ్మెంట్’ అనేవి పాశ్చాత్య దేశాల్లో పుట్టి ప్రపంచమంతా ఒక ‘యావ’ లాగా మారిపోయింది. వేగం.. వేగం.. పరిగెత్తటం.. పరిగెత్తటం.. తను.. తను మాత్రమే.. అన్న స్వార్థం వల్ల వ్యక్తి తనకు తెలియకుండానే తన చుట్టూ వలయాలు ఏర్పరచుకుంటున్నాడు. అస్థిరత్వం వల్ల, ప్రవహించి పోవటంలో ‘మునిగి’పోవడం వల్ల కుటుంబ విలువలు, సమాజ ధర్మాలు పూర్తిగా మరుగున పడిపోయాయి.

ఇటువంటి పరిస్థితులను, మానవుడి వేగవంతమైన పరుగులో ఏమేమి కోల్పోతున్నాడో గమనించి కలవరపాటుతో బౌమన్ ప్రతిపాదించిన Liquid Modernity భావాలకు అనుగుణంగా మన సమాజాన్ని పరిశీలించి డాక్టర్ పాపినేని శివశంకర్ రాసిన విమర్శ గ్రంథం ‘ద్రవాధునికత’. సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకుంటూ, కారణాలను అన్వేషిస్తూ, చేసిన ప్రతిపాదన ‘ద్రవాధునికత’ 2015 జనవరిలో ప్రచురింపబడింది. “చలన వేగం, అస్థిరత, అభద్రత, ప్రమాదం, ఉరకలేసే వర్తమానం” ఇవన్నీ ‘ద్రవాధునికత’ అంతర్భాగాలు. వీటి ప్రభావాల వల్ల వస్తువు వినియోగం అనేది ఒక అవసరంగా కాక వ్యామోహంగా, వ్యసనంగా ఎలా మారిందీ, మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నం కావింపబడ్డాయీ అనే ఆలోచన, ఆవేదనతో పాపినేని శివశంకర్ రాసిన కథలు ‘సరళరేఖలు’. అనైతికత, స్త్రీ పురుష సంబంధాలు, రాజకీయ ఆర్థిక పరిస్థితులు, సంస్కృతి, స్పందనా రాహిత్యం, వస్తు వినియోగం, ప్రకృతికి దూరమై పోవటం, చివరికి ఆహార పానీయాల విషయకంగా కూడా ఎంత వేగంగా ప్రవహించిపోతున్నాయో, జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అనే ‘ద్రవాధునికత’ కు “లక్ష్య లక్షణ సమన్వయమా’ అన్నట్టుగా ఈ కథలు ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రపంచీకరణ వలన, సాంకేతిక విప్లవం వలన మానవ వనరుల అవసరం తగ్గిపోయి, చివరికి జీవితాల్లోకి ‘యాంత్రికత’ వచ్చి చేరింది. ప్రపంచీకరణ దేశాలని, మనుషులని ఎంతగా కలిపిందో బంధాలను, ఫీలింగ్స్‌ని అంతగా విడదీసింది. ఆ ప్రవాహం ఒడిలో, ఉరవడిలో జీవన విధానం, సంస్కృతి, విద్యా రంగం, సినిమా రంగం, విలువలు, కుటుంబ సంబంధాలు, సామూహిక జీవనం అల్లకల్లోలం అయిపోయాయి. ద్రవాధునికతను అనివార్యంగా ప్రేమిస్తున్న వర్తమాన సమాజాన్ని నిరసిస్తూ – శివశంకర్ తన కథలను – “అనంతంగా నాతో సంభాషిస్తూ అనంత ప్రశాంతతను ఇచ్చే అనంతవరం కొండకి అంకితం” ఇవ్వటం చూస్తే మనిషికీ, సమాజానికీ ‘స్థిరత్వం’ ఎంత అవసరమో, ప్రకృతి విధ్వంసం ఎంత ప్రమాదకరమో చెప్పక చెప్పినట్లు ఉన్నది.

ఈ కథాసంపుటిలోని 15 కథల్లోనూ ఒక అన్వేషణ కనిపిస్తుంది. ఆ సందర్భంగా ఆయన అంటారు – “నిశ్చల నిశ్చితాలు గాక ఆలోచనాత్మకమైన ముగింపులు నాకిష్టం. కథాంతాన రచయిత విశ్రమిస్తాడు. ఆపై పాఠకుడు వివేచిస్తాడు. అంతా రచయితే వండి పెట్టటం నాకు నచ్చదు. కొంత తమ ఆలోచనలో పాఠకులు పూరించుకోవాలి”.

మొదటి కథ ‘సరళరేఖలు వక్రరేఖలు’ అనంతవరం కొండ తోనే ప్రారంభమవుతుంది. శనివారం కొండపైకి కోలాహలం లాగా జనం ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అంతట్లో ఓ ఐదారేళ్ల పాప పట్టు తప్పి రాళ్లు, తుప్పల్లోకి జారిపోతోంది. ఒక యువకుడు కిందకు దూకి పాపని పట్టుకొని భద్రంగా పైకి తెచ్చాడు. ఇదే కథ. ఇంతేనా అంటే..! ఆ తర్వాత రచయితా ఆ యువకుడి సంభాషణల్లో అతని భావాల్లోని మార్మికత అతన్ని ఒక అన్వేషిగా నిలిపి పాఠకుడిని ఆలోచనల్లో పడేస్తుంది. అతనికి ఈ ప్రపంచంలో నిర్జీవమైనది ఏది కనిపించదు. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, అడవులు, ఎడారులు.. అన్నిటి ‘ప్రకృతి భాషా’ అతనికి తెలుసు. జీవితం సరళరేఖ కాదు. ఒకవేళ అలా ఉన్నా అందమేముంటుంది! ఆనందమే ఉంటుంది! వక్రతలోనే అందం – కవిత్వంలో గాని, ప్రకృతిలో గాని, మనిషిలో గాని. ‘ఇలాగే ఉండాలి’ అనే పంజరంలో ఇమడడు అతను. “అస్తమించే సూర్యుడు వర్తులాకారంలో కదా ఉన్నది. ఈ కొండ శంఖాకారంలో ఉంది. వానాకాలంలో మనకి కనపడే ఇంద్రధనుస్సులో వక్రతే లేకుంటే అందమేముంది! నిజానికి సరళరేఖలకన్నా నిస్సరళ (వక్ర) రేఖల్లోనే సారం, సౌందర్యం ఉన్నాయి” అంటాడు.

శ్రమ, కష్టం, సేవ, జీవితం అనేకదారుల్లో స్వేచ్ఛగా, సహజంగా వెళుతుంది. విద్య, ఉద్యోగం, బ్రతుకు.. అంతా ఒక సరళాలేఖ లోనే సాగాలంటే “మేము చెప్పినట్టే ఉండాలి” అన్నది కార్పొరేట్ ఆజ్ఞ. ఈ బంధనాల నుండి మనిషి ఎప్పుడూ అన్వేషకుడి లాగానే ఉండాలి – బయట, లోపల, లోలోపల.

ఇదే విషయాన్ని ‘రజనీగంధ’ కవిత (2010) లో చెప్పారు శివశంకర్ –

“మనుషులు మరి సుబ్బరంగా/పచ్చిక మొలవని కార్పొరేట్ మనో మైదానాలైతే ఎట్లా/నవ్వీ నవ్వని అంటీ అంటని కూల్ హుందాతనంతో/నాజూకు టెక్నికల్ నడత లో సర్టిఫికెట్లు సాధించేసి/హృదయాన్ని చల్లని మంచు గడ్డతో రీప్లేస్ చేస్తే ఎట్లా/మనిషన్నాక రోజుకోసారి గొంతెత్తి అరవాల/కలవాల వాటేసుకోవాల/కలత పడాల కన్నీరై పోవాల..!”

మద్యం అనేది ఎంత భయంకరమైన వ్యసనం అంటే, అది వ్యక్తి నుండి సమాజం దాకా అన్నిటినీ కలుషితం చేస్తుంది. కుటుంబాలను కూల్చివేస్తుంది. అన్ని నేరాలకు ప్రాథమిక ప్రమేయం మద్యమే. అలాంటి మద్యాన్ని నిషేధించాల్సింది పోయి, ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావించి పెంచి పోషించడం దుర్మార్గం. పల్లెల్లోని పచ్చని చేలులా, ఏరులోని స్వచ్ఛతలా, ముత్యం వంటి మనసున్న ముత్యాలు కథ ‘వాడు నేను ఏరు’. పట్టణాల్లో ‘స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం లాగా బ్రాందీలో మునిగి తేలే’ యూత్ ప్రభావం, మందు పెత్తనం పల్లెల్లోకి కూడా పాకి ముత్యాలు లాంటి ఎందరో అమాయకులను బలి తీసుకుంటోంది. మందు ఏరులా పారుతుంటే ‘ఆనకట్ట’ కట్టాలని ఏ కొద్దిమందికో ఉన్నా – మునిగిపోవడానికి సిద్ధపడే వాళ్ళు తెగిపోయిన కరకట్టలను ఆపటానికి ముందుకొస్తారా! “అదొక మహా శ్వేత సర్పం. హోరున బుస కొడుతుంది. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు”.

అనుకున్నట్లుగానే గండి పడింది. కట్ట తెగిపోయింది. ‘పై ఎత్తున’ కరకట్ట బలహీనంగా ఉంది. జల సర్పం బుసలు ఎక్కువయ్యాయి. ముత్యాలు లాంటి వాళ్లు కొట్టుకుపోతారు అని రచయిత చెప్తారు.

‘అనగానేమి’ కథలో లాగా సుబ్బారావుకి కూడా ప్రతి విషయాన్ని, ముఖ్యంగా మాతృభాష అయిన తెలుగు భాషా సాహిత్యంలోనూ, వ్యుత్పత్తి విశేషాల్లోనూ అనగానేమి అని ఆసక్తిగా పరిశీలించడం అలవాటు. నిఘంటువులు చూసి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటాడు. ‘డ్రెస్ అనే బదులు దుస్తులు అనవచ్చు కదా’ అంటే దాన్ని ఛాందసం అంటారని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. కొన్నేళ్లు విదేశాల్లో ఉండి వచ్చిన అతను తెలుగు భాష ఎంతగా మారిపోయిందో చూసి ఆశ్చర్యపోతాడు. ముఖ్యంగా

“అదుర్స్, ఇరగతీశాడు, కుమ్మేసాడు, సైట్ కొట్టటం, లైన్‌లో పెట్టటం, తెంగ్లీష్” వంటి గందరగోళ పరిస్థితిలో పడి, శబ్ద రత్నాకరం వంటివి తిరగేసి, చివరికి ఓ లింగిస్టిక్ రీసెర్చ్ సెంటర్ కి వెళ్ళాడు. అక్కడున్న ఆర్. కె. మార్ (ఆర్. కుమార్) ప్రయోగశాలలో యంత్రాలు, కంప్యూటర్లు, ప్రజెంటేషన్ స్క్రీన్లు, ఆడియో పరికరాలు, పనిచేసుకుంటున్న స్కాలర్స్ లను చూపించాడు. “మార్ఫాలజీ, సెమాంటిక్స్ వంటి భాషా పరిణామాలు ఎప్పుడు శాస్త్రబద్ధంగా జరగవు, జరిగే వాటిని శాస్త్రబంధం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, వక్త శ్రోతల మధ్య తక్కువ శ్రమతో ఎక్కువ భావం ఎలా జరుగుతుందో పరిశీలిస్తున్నాం” అంటాడు. Triple A – భాష లో Adaptation, Assimilation, Absorption ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తున్నారు. ఉదా: రావట్లేదు పదం – “రావటం లేదు”. కానీ ఆ యంత్రం రావట్+లేదు అంటోంది. మరోటి – “అర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి లేచి, బ్రష్ చేసుకుని, టిఫిన్ చేసి, అండ్ కాఫీ తాగి, అర్జెంట్ గా ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాను”. ఇదే టెంగ్లీష్. వేగవంతమైన జీవనంలో వేగంగా మారిపోతున్న మాటలు, పదాలు, భాష. తెలుగు భాషాభిమాని, ప్రాచీన ఆధునిక సాహిత్యాలను తన రెండు కళ్ళు అనుకునే శివశంకర్ రాసిన ఈ కథ పైకి హాస్యంగా కనిపించినా మాతృభాషకి పట్టిన దుస్థితికి తన గుండెలో చెలరేగిన ఆవేదన, కళ్ళలో చెమ్మగిల్లిన విషాదం పాఠకులు గుర్తించగలరు.

‘యశ్వంతి’ కథ – “ప్రేమించు.. లేదా మరణించు.. లేదా చస్తాను..” అనే దుర్మార్గమైన నేటి యువతరం ప్రేమ కథలకు ప్రతీక. వీళ్ళకి జీవితం విలువ, ‘ఇచ్చేదే ప్రేమ’ అని తెలీదు. నాకే చెందాలి, నేనే పొందాలి అనుకుంటారు. ఐ లవ్ యు అనే నాలుగు అక్షరాలకు సరైన వ్యక్తిత్వం, అవగాహన, పరస్పర గౌరవం అనే పునాది లేకపోతే ఆశాభంగాలు వైఫల్యాలు ఉంటాయి అన్న విశ్లేషణ చేసుకోరు. అలా ఆత్మహత్యకు పాలు పడి బతికి బట్ట కట్టిన మహేంద్ర తన మామయ్య శేఖర్‌తో పూనా వెళ్తాడు. బ్రతుకు విలువ తెలిసేటట్లుగా ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉదాహరణలు, చిన్న ఉపన్యాసాలు ద్వారా “ఏ విధంగా బ్రతకడం అనేది ఎంత ముఖ్యమో, ఏ రకంగా చనిపోవడం అనేది కూడా అంతే ముఖ్యం. జీవితానికి పెద్ద ప్రాతిపదిక వేసుకున్నట్లే మరణానికీ గొప్ప ప్రాతిపదిక వెతుక్కోవాలి” అన్న విషయం తెలుసుకుంటాడు. ప్రకృతిలోని పర్వతాలు, అరణ్యాలు, చారిత్రక ప్రదేశాలు, వాటి గాథలు, కోటలు, యుద్ధాలు, విజయాలు, అపజయాలు, సాహసంగా బ్రతకటం, అదే సాహసం కోసం విగత జీవులై పోవటం.. అన్నీ అనుభవించుతాడు. అనుభూతి చెందుతాడు. “కనబడే ఆ లోయలోకి పిచ్చి మొక్కల్ని పట్టుకుంటూ మెల్లగా దిగాలని ఉంది” అని ప్రకృతిలో తాను లీనమవ్వాలన్న జీవన గానం అతనిలో ఎలా క్రమక్రమంగా పరిణామం చెందిందో వివరంగా తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చదవాలి.

మాయాబిల రహస్యం, ద్రవాత్మకం, తప్పిపోయిన వేళ కథల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివశంకర్ లోని గాఢమైన, లోతైన వ్యక్తీకరణ, మార్మికత, మాంత్రిక వాస్తవికత (magical realism) దర్శించవచ్చు. బంధక మహారాజు గారి రాజ్యంలో ‘ఉన్నట్టుండి భూములు మాయ మయ్యాయి’. నిజాయితీ గల కుర్ర మంత్రి కుమార వర్మ ఆ చిత్ర విచిత్రము ఏమిటో తెలుసుకోవాలనుకుంటాడు. చాలా ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాలు మాయమయ్యాయి. పాడిపంటలతో పాలువారిన భాగ్యసీమలో అదృశ్యం అవడం ఏమిటి? దీనికి కారణమైన ఆ అదృశ్య శక్తి ఏమిటి? దాని బలం ఎంత? దాని దాహం ఎంత? అని అన్వేషించాడు. ఇది కథ కాదు, వాస్తవమే అని చదువరులు తేలికగా గుర్తిస్తారు. ‘పెరుగుట విరుగుట’ కథలో కూడా కుర్ర మంత్రి కుమారస్వామి ముఖ్యమైన పాత్ర. వ్యవసాయం మూలబడింది. సరైన ధర లేక అప్పుల్లో కూరుకుపోతున్నారు రైతులు. అమ్మినా ‘రాజ బంధువులైన’ వారు చెప్పిన ధరకే అమ్మాలి. మహారాజు గారు ‘గడ్డం పెంచుతున్నారు’. దానివల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అన్నది కథలోని వ్యంగ్యం. అమ్ముడు పోయిన కవులు రాజు గారిని, గడ్డాన్ని పొగడటం ఆపలేం. కుమారస్వామి లాగానే ప్రజలందరం కుతుకుత లాడిపోతాం. అంతే చేయగలం.

ప్రపంచీకరణ – పోటీ – వేగం – పరుగులు – స్థిరంగా ఉండాల్సిన వ్యక్తిత్వం కోల్పోయిన మనిషి ద్రవాత్మకంగా ఎలా ‘పడమటి’ కి ప్రవహించబోతున్నాడో ప్రతీకగా చెప్పిన కథ ‘ద్రవాత్మకం’. నిలకడ లేని బ్రతుకు, చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, సంపాదన, డాలర్లు! “మనిషి చాలావరకు ఘనపదార్థమే. కాకపోతే కొంచెం నీరు, కొంచెం నెత్తురు ఉంటాయనుకో. అయితే ఘనపదార్థాలు తేలిగ్గా కదలవు. అవి ఎప్పుడూ కొంత స్థలం ఆక్రమించి అక్కడ నుంచి ఒక పట్టాన కదలవు. ద్రవపదార్థాలు మహావేగంగా ప్రవహిస్తాయి. వాటికి స్థిరంగా ఒక చోటు అంటూ ఉండదు. నిరంతర చలనం దాని లక్షణం.” అలా అంతులేని వేగంతో ఏవేవో అందుకోవడానికి ప్రవాహంలా పరిగెత్తుతూ ప్రవహించే ఒక ‘చైతన్య’ కథ ఇది. అతని తాత పల్లెటూరులోనే ఉన్నాడు. కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఒక గ్రంథాలయమూ స్థాపించాడు. ఒక వృత్తరేఖ మీదే నడుస్తున్నాడు. ఏనాడు వేగంగా పరిగెత్తలేదు. ఒత్తిడి లేదు. తపన లేదు. ఆదుర్దా లేదు. ఒక నెమ్మది ఉంది. ఒక నిశ్చింత ఉంది. “ప్రారంభ బిందువు గుర్తించలేకపోతే నిశ్చింత దొరకదు”. రెండు తరాల అంతరాలు, అనివార్యమైన పరిణామం ఈ కథ చెప్తుంది.

‘కేంద్రం చుట్టూ, కొండచిలువ 1, 2’ కథలు ప్రతీకాత్మకమైనవే. కోస్తా ప్రాంతంలో హఠాత్తుగా వచ్చిన ‘రాజధాని’ అనే నాలుగు అక్షరాల మాట వల్ల మనుషుల కళ్ళ ముందు ఇంద్రధనుస్సులు ప్రత్యక్షం అయ్యాయి. నోట్ల కట్టలు కదిలాడాయి. ‘భూ సమీకరణ’ అనే ప్రక్రియలో భాగంగా భూమి కోట్లకు పడగలెత్తింది. పాల వ్యానులు తిరిగే దారుల్లో లక్షల విలువైన కార్లు, ఖరీదైన మనుషులు వచ్చారు. డబ్బులు లెక్క పెట్టడానికి మిషన్లు వచ్చాయి. పొలాలకి వాణిజ్య రేట్లు పెరిగిపోయాయి. మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబంలో ఆత్మీయతలు కరువై పోతున్నాయి. తండ్రి మీద కొడుకుకి కోపం. కోడలికి ద్వేషం. వరకట్నం ఇచ్చి ఏనాడో వైభవంగా పెళ్లి చేసి పంపిన కూతురు “కోట్లు పలుకుతున్న భూమిలో వాటా కోసం” పుట్టింటికి వచ్చి పోట్లాట వేసుకుంటుంది. డబ్బు, చర్చలు, లెక్కలు మనిషిని శాసిస్తున్నాయి. ఆశలు, కలలు మనసుని నడిపిస్తున్నాయి. ఆత్మీయతలు మరుగున పడిపోతున్నాయి. చిన్ననాటి నేస్తగాళ్లు శత్రువుల్లా చూసుకుంటున్నారు. అధికారులు వస్తున్నారు. గజాలుగా, ఎకరాలుగా కొలుస్తున్నారు. లెక్కలు వేస్తున్నారు. ఎప్పుడూ కళ్ళ చూడని నోట్ల కట్లలు కళ్ళ ముందు కదలాడేసరికి కొందరికి ఆనందాహ్లాదలు, కొందరికి ఆవేదనాశ్రువులు. పచ్చని పొలాలు పంటలు లేక బీడులుగా మారాయి. జనాలు వ్యవసాయ పనులు లేక సోమరిపోతులయ్యారు. కొందరు పక్కనున్న పట్టణాలకు వెళ్లి చెమటని అమ్ముకొని, దుర్భ్యసనాలను కొంటున్నారు. కాపురాలు కూలిపోతున్నాయి. కొడుకు పోరు పడలేక, ఒక రైతు గత్యంతరం లేక ఆ కాగితాలపై వేలిముద్రవేసి పొలం లోకి వెళ్ళి బావురుమన్నాడు.

2000 లోనే శివశంకర్ రాసిన (ఒక ఖడ్గం ఒక పుష్పం కవితా సంపుటి) గీతలు గళ్ళు లో –

“గళ్ళు గీస్తున్నారు/ఎవరో రాళ్లు పాతుతున్నారు/మట్టిని అడుగులుగా, గజాలుగా తర్జుమా చేసి/దానికి ఇంటూ మార్క్ పెట్టి/కరెన్సీలో ఖరీదు కడుతున్నారు/అప్పటిదాకా ఆ చేలో పైరు లాగానే పెరిగిన రైతు/తల్లితో అనుబంధం కోల్పోయి/వలస పోతున్నాడు/నేల గుండెల మీద/గునపాలు దించుకున్నట్టే ఉంది/ఆర్తనాదం ఏదో వినబడుతున్నట్టే ఉంది/ఎవరెవరో వచ్చి చూసి బేరమాడుతున్నారు/ఇంత కాదు అంత/అంత కాదు ఇంత/నోట్లు చేతులు మారుతున్నాయి/అగ్రిమెంట్లు అంటున్నారు/రిజిస్ట్రేషన్ అంటున్నారు/అన్నిటికీ తహతలాడుతున్నారు/నేల నిట్టూర్పు ఎవరికీ వినపడటం లేదు..!”

మాటిమాటికి అనంతరం కొండ చుట్టూ ‘మహాసర్పం’ బుసలు కొడుతోంది. ఇది రాజకీయ కథలు కావు. ప్రభుత్వాన్ని విమర్శించేవీ కావు. ‘ధన దాహం మనిషిని ఆక్రమించుకోవడం, సుఖాలు భోగాలు పట్ల కాంక్ష మనసుని ఆవరించుకోవటం ఎంత విషాదం’ అని వర్తమాన దీనత్వాన్ని హీనత్వాన్ని వెల్లడించడం. ఇంతకీ ఆ మహాసర్పం ఏమిటో ఈ కథను పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఆ కొండచిలువ నిగనిగలాడుతూ భయంకరంగా ఉంది. గతంలో పసుపుపచ్చగా కనబడింది. ఇప్పుడు నీలం రంగు. రంగులు మారినా ప్రజల జీవన రేఖలు మారలేదు. రాజధాని లేదు. పంటలు లేవు. రైతులకు పని లేదు. గ్రామాల శోభ తరిగిపోతోంది. అడవులు విస్తరిస్తున్నాయి – భూమి మీదా, జనం మనసుల్లోనూ.

మారిపోతున్న మనుషుల ప్రవర్తనల్ని, భావాల్ని చెప్పిన కథ ‘పిరమిడ్’. “ఎక్కడానికి ఒక వీలు, వాలు అంటూ లేదు. రాళ్లు రెప్పల మీదుగా తుప్పలపక్కగా, ఏటవాలు రాతి పలకల మీదుగా పట్టు చిక్కించుకుంటూ పైకి మెల్లగా చేరడమే”. ఇక్కడ రచయిత కొండ విషయం చెప్తున్నట్టు కనిపిస్తున్నా – అది జీవితాన్ని అధిరోహించటం. తన స్నేహితుడు తానొక్కడే ఎక్కాలని, అందరికన్నా ఎంతో ఎత్తుగా కనబడాలని తాపత్రయంతో ఉండడంతో ఆశ్చర్యపోయాడు. బాధపడ్డాడు. ఆ స్నేహితుడు చిన్నచిన్న కాంట్రాక్టులు, వంతెనలు, భవనాలు, కట్టుబడి.. ఇంకా ఇంకా ఎదుగుతూ.. దాన్ని అతను స్కేళ్ళతో, చెక్కులతో, లాభాలతో కొలుస్తూ, ద్రవ్యరాశిని పేర్చుకుంటూ, ఒక పిరమిడ్ నిర్మాణం చేయడం మొదలు పెట్టాడు. ఏడాది పాటు కట్టిన ఇంద్ర భవనం లాంటి భవనంలో నేలమాళిగలో గదులు – అరలు- బంగారం- వజ్రాలు- నోట్ల కట్టలు. ఆ రహస్య ప్రదేశం ఎవరికీ తెలియదు అనుకున్నాడు. అతని ప్రవర్తనకి భార్య విరక్తి, కొడుకు విచ్చలవిడితనం, చివరికి అతని ధృఢత్వం, ఆధిపత్యం, కాఠిన్యం ఏమైంది? How much land does a man need అన్న సత్యం అతను గ్రహించాడా?

మనిషి లోంచి చాలా చాలా ‘తప్పి పోయిన వేళ’ – గొబ్బెమ్మ, గంగిరెద్దు వంటి సంస్కృతి, నాగలి కర్రు, ఎద్దులు చిహ్నంగా వ్యవసాయం తప్పిపోయాయి. ‘పడమటి’ వాగులో పడి అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎక్కడెక్కడ చదువుకున్న తలకాయలన్నీ వంతెన మీదుగా దొర్లుకుంటూ దొర్లుకుంటూ పరాయి దేశానికి వలస పోతున్నాయి. పడమటి దిక్కు నుంచి రెక్కల జంతువేదో రాత్రింబవళ్లు రంకేస్తుంది అంటూ అగ్రరాజ్య ఘాతుకాలు, మన సంస్కృతి పై దాడి చేయడం గురించి చెప్పటంలో పరాకాష్ట – “తూర్పు వీధిలో చుక్కమ్మకి తొలిచూలు లోనే పండంటి కంప్యూటర్ పుట్టింది” అనటం.

‘సందడి’ కథలో కూడా పల్లెల్లో పండుగలు, వాటి సందర్భంగా వేసే తోలుబొమ్మలాటలు, నాటకాలు, నాటక సమాజాలు, పద్యాలు, రాగాలు, వినోదాలు క్రమంగా పాశ్చాత్య ప్రభావంలో పడి కొట్టుకపోవటం, మన సంప్రదాయాలు చతికిల పడటం చెప్పారు.

జాషువా కవి గబ్బిలం సందేశ హారిణి. ఈ ‘గబ్బిలం’ కథ లోనిది ప్రమాదకారిణి. అదే ‘కరోనా’. మనుషులందరినీ ఇంటికే పరిమితం చేసిన విధ్వంసకారిణి. సహజీవనాలే దీనివల్ల విచ్ఛిన్నమవుతుంటే ఇక ‘దానితో సహజీవనం చేయక తప్పదు’ అంటారేమిటో! ప్రకృతితో సహజీవనం చేసిన సమాజం కరోనాతో చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది! స్వయంకృతాపరాధం కదా! ప్రకృతి నుండి దూరమైన మానవుడు తనకు తానే దూరమై పోతున్నాడు. మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ శవ పేటికల్లో చేరుతున్నారు. వెళ్లడానికి, చూడడానికి, పలకరించడానికి, ఓదార్చడానికి కుదరదు – లాక్‌డౌన్. కవి దార్శనికుడు. నిత్య అన్వేషి. ఈ రచయిత కూడా ఈ పరిస్థితుల్లో కలగంటున్నాడు. తరచుగా స్వప్నంలో ఒక ‘సు -జాత’.. కనిపించీ కనిపించకుండా.. మాయమైపోతూ..!

మిత్ అండ్ రియాలిటీ. రమణ తన స్నేహితురాలు రాధికను సెలవులకు తన ఊరు తీసుకువచ్చాడు. అనంతవరం కొండ, వెంకటేశ్వర స్వామి గుడి, ముచ్చబోడు చూపించాడు. వారి సంభాషణలో ఆముక్తమాల్యద, రాజా వెంకటాద్రి నాయుడు, గురుదేవులు భవఘ్ని ఆరామం, బౌద్ధ ధర్మం, అశోకుని కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్ర గురించి చరిత్ర పరిశోధకురాలు రాధిక చెప్తుంది. “మతమార్గం తొలి మెట్టు. ఆధ్యాత్మ మార్గం మలిమెట్టు. మతమార్గంలో విగ్రహాలు, పూజా పురస్కారాలు, కోర్కెలు, మొక్కులు మొదలైనవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేహం చుట్టు అల్లుకొని ఉంటాయి. దేహ సంబంధమైనవన్నీ మారేవే, పోయేవే. ‘నేను’ నశించిపోయే దేహమాత్రుడిని కాదు, పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ‘అహమాత్మా’! అలాగే అంతటా, అన్నిటా, అందరిలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడమే అసలైన ఎరుక. అప్పుడు మనుషుల్లో ప్రేమ తప్ప ద్వేషం ఉండదు”.. అని తెలుసుకొంటారు.

‘ద్రవాధునికత’ అనే పనిముట్టు సాయంతో నేటి సమాజంలో నెలకొంటున్న ప్రత్యేక పరిస్థితుల్ని విశ్లేషించటం, వ్యాఖ్యానించటం, మార్పుల్ని సూత్రీకరించటం, మార్గాంతరాలను ప్రతిపాదించడంలో భాగంగా ఈ కథలన్నీ శివశంకర్ అంతర్భావం లోంచి ఉద్భవించాయి. గ్రామీణ వ్యవస్థ, మనిషి మనుషులుగా మారే సామూహిక మార్గం, మాటలు, పనీ పాటలు, పండుగలు, పెళ్లిళ్లు, సందడి, సంతోషం, సంప్రదాయాల పట్ల కుదురైన విశ్వాసం, అనుబంధాలు, నిరహంకారం, సృజనాత్మకత, చైతన్యం వెల్లి విరియాలన్నది శివశంకర్ స్వప్నం. దానికోసం అతను నిత్యాన్వేషి. నిజానికి కవులు, రచయితలు నిత్య స్వాప్నికులు, సత్యాన్వేషకులు.

George Bernard Shaw అన్నట్లు “Imagination is the beginning of the creation. You imagine what you desire, you will what you imagine, and at last you create what you will”.

ఇవన్నీ కేవలం కల్పిత కథలు కావు. జరిగినవి, జరుగుతున్నవి. మనిషి కథలు. మారిపోతున్న మనసు కథలు. ఇంకిపోతున్న మానవత్వం కథలు. పాఠకుని మేథ ను, మనసు తాకేవి, తడి చేసేవి.

***

సరళ రేఖలు (కథా సంపుటి)
రచన: డా. పాపినేని శివశంకర్
ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 146
వెల: ₹ 140
ప్రతులకు:
నవచేతన బుక్ హౌస్, బండ్లగుడా, హైదరాబాద్ 500068
ఫోన్: +91 8014365365
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేయడానికి:
https://www.navachethanabooks.com/book/63734cd3a1f951000aec327a

Exit mobile version