విజ్ఞానపథంలో ప్రయాణం – ‘సారాంశం’ పఠనం

0
2

[డా. అట్టెం దత్తయ్య సంపాదకత్వం వహించిన ‘సారాంశం’ అనే పుస్తకం సమీక్షను అందిస్తున్నాము.]

[dropcap]డా. [/dropcap]అట్టెం దత్తయ్య సంపాదకత్వం వహించిన పరిశోధన గ్రంథాల పరిచయ వ్యాసాలు, ‘సారాంశం’ తెలుగు సాహిత్య ప్రపంచంలో అశ్యంత ఆవశ్యకమైన అమూల్యమైన నిధి లాంటి గ్రంథం. ఇలాంటి ఆలోచన చేయటమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి సమర్థవంతంగా సాకారం చేసిన డా. అట్టెం దత్తయ్య అభినందనీయులు. వారికి ఈ ప్రయత్నంలో తోడ్పడి, సహాయ సహకారాలందించి, ప్రయత్నం సఫలమవటంతో తమ వంతు పాత్ర నిర్వహించిన వారందరికీ బహు కృతజ్ఞతలు. ఈ పుస్తకం రూపు దిద్దుకుని, వెలువడటంలో సహాయం చేసిన వారందరికి తెలుగు సాహిత్యం కృతజ్ఞత  తెలుపుకోవాల్సివుంటుంది.

సమకాలీన తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులలోనే కాదు, అకడెమీషియన్‍లలోనూ, పరిశోధకులలోనూ ఒక రకమైన స్తబ్ధత, నిస్తేజం, నిరాసక్తతలు నెలకొని ఉన్నాయన్నది కాదనలేని సత్యం. నిజానికి అకడెమీషియన్లు కానీ పరిశోధకులు కానీ ఇటీవలి కాలంలో సాహిత్య పరిశోధనలు చేసి పట్టాలు పుచ్చుకుంటున్నా, వారి పరిశోధనల్లో శోధన, సాధన, అధ్యయనం వంటివి ఉండటం లేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీనికి తోడు పలురకాల సాహిత్య రాజకీయాలు పరిశోధనా రంగాన్ని తమ  పిడికిలిలో బిగించాయి. దీనికి రెండు దృష్టాంతాలు చాలు. ఒక పరిశోధకుడు తెలుగు సాహిత్యంలో ముస్లీమ్ కవిత్వంపై పరిశోధించాలనుకున్నాడు.  పరిశోధన సాగించాడు. కానీ, ముస్లిం కవుల్లో కొందరి పేర్లు ప్రస్తావించద్దని అతనిపై వత్తిడి తెచ్చారు కొందరు. ఆయన ఒప్పుకోలేదు.ఒత్తిడి అతని గైడ్‍పై వచ్చింది. దాంతో గైడ్ ఆదేశాలను పాటించక తప్పలేదా స్కాలర్ కి. దాంతో అతనికి డాక్టరేట్ వచ్చింది కానీ, అతని థీసిస్ అసంపూర్ణంగానే వుంది. అలాగే మరో స్కాలర్ కు ఒక రచయిత రచనలు నచ్చాయి. ఆ రచయిత రచనలపై పరిశోధించాలనుకున్నాడు. కానీ గైడ్ ఒప్పుకోలేదు. జాతీయభావాల రచయితపై వొద్దు, లెఫ్ట్ లిబరల్ దళిత ఉద్యమ రచనలపై చేయమని ఓ రచయిత పేరు కూడా సూచించాడు. ఒప్పుకోక తప్పలేదా పరిశోధకుడికి. ఇలాంటి కథలేకాదు, ఇంతకన్నా ఘోరమైన కథలు ఏ స్కాలర్ ని కదిపినా ప్రవాహంలా ముంచెత్తుతాయి.

తొలి సంపుటి ముందుమాటలలో ‘పరిశోధనల సారాంశం’ లో డా. నందిని సిధారెడ్డి “పరిశోధన గ్రంథాలు చదవకుండానే పరిశోధన పద్ధతులు పాటించకుండానే పరిశోధనలు తయారవుతున్నాయి. క్షేత్ర సమాచారం సేకరించకుండానే క్షేత్ర పరిశోధనలు రూపొందుతుండటం విషాదం. గ్రంథాలయాలు శోధించకుండానే పరిశోధనా గ్రంథాలు సిద్ధమవుతుండటం విచారం” అంటూ అసలు పరిస్థితిని స్పష్టంగా  వ్యక్తపరచారు.

‘పరామర్శ’ అన్న మరో ముందుమాటలో శ్రీ ఘట్టమరాజు “విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు నిర్వహించవల్సిన ఈ బరువు బాధ్యతల్ని స్వీకరించి, ఒంటి చేతి మీద మోసి, కృతకృత్యులైన ఏకవీరుడు డా. అట్టెం దత్తయ్య” అని పేర్కొనటం, డా. అట్టెం దత్తయ్య రూపొందించిన పుస్తకాల ఆవశ్యకతను, ప్రత్యేకతను, పుస్తక రూపకల్పనలోని శ్రమను స్పష్టం చేస్తుంది.

రెండవ సంపుటికి ముందుమాట ‘భావి పరిశోధకుల దిక్సూచి’లో డా. బుక్కా బాలస్వామి “విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ వంటి సంస్థలు నిర్వహించవలసిన ఈ బృహత్కార్యాన్ని అనేక వ్యయ ప్రయాసలకోర్చి సిద్ధాంత గ్రంథాల సారాంశాన్ని విజ్ఞులైన రచయితలచే పరిచయ వ్యాసాలుగా రచింపజేసి, ముద్రించటానికి పూనుకున్న డా. అట్టెం దత్తయ్య సాహసాన్ని అభినందిస్తున్నాను” అని కొన్ని సంస్థలు రూపొందించగల పుస్తకాన్ని ఒక వ్యక్తి రూపొందించటాన్ని మరింత స్పష్టం చేశారు.

“ఇప్పుడు వస్తున్న సిద్ధాంత వ్యాసాలు చాలా వాటిలో ఒరిజినాలిటీ తప్పుతున్నదని పెద్దల భావన. విద్యార్థులు కూడా చాలా సులభంగా, తేలికగా లభించే ఆధార సామగ్రి ఉన్న అంశాలనే ఎంచుకుంటున్నారు. అన్ని ప్రక్రియలను ఒకసారి బేరీజు వేసుకొని తమకు తక్కువ శ్రమతో జరిగే అంశం మీద (ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో మళ్లీ మళ్లీ) పరిశోధన చేయటానికే మొగ్గు చూపుతున్నారు” అని నిర్మొహమాటంగా ప్రస్తుత పరిశోధన స్థాయిని, నాణ్యతా లోపాన్ని ఎత్తి చూపించారు ‘ప్రదీపం’ అన్న ముందుమాటలో డా॥ భిన్నూరి మనోహరి. అంతేకాదు, అందరి మనస్సుల్లో మెదులుతున్నా ఎవ్వరూ బహిరంగంగా ప్రస్తావించేందుకు ఇష్టపడని చేదు నిజం “తెలుగు సాహిత్యం చాలా విస్తృతమైన ప్రక్రియలతో, వివిధ కోణాలలో విశ్లేషించదగిన ఒక పెద్ద భాండాగారం. ‘కానీ’ పరిశోధనాంశాల ఎంపికలో వైవిధ్యం ఉండడం లేదు” అని వ్యాఖ్యానించటమే కాదు, ఏయే అంశాలపై అత్యధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకా ఏయే అంశాలపై పరిశోధనలు జరగాలి అన్న విషయాన్ని కూడా తన ముందుమాటలో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకానికి ఈ నాలుగు ముందుమాటలు భవంతికి స్తంభాల వంటివి. చక్కని విశ్లేషణతో, ఔచితీవంతమైన వ్యాఖ్యలతో, ఎక్కడా హద్దుమీరిన పొగడ్తలు, అనవసర విశేషణాలు లేకుండా సూటిగా, చక్కగా ఉన్నాయీ ముందుమాటలు. ఇలా ఔచితీవంతమైన ముందుమాటలున్న  ఒక కాల్పనికేతర రచన పుస్తకం చదివి ఎంతో కాలమయింది. అయితే ఈ పుస్తకానికి బలమైన పునాది వంటిది డా. అట్టెం దత్తయ్య ముందుమాట ‘సారాంశ రోచనం’.

ఇటీవల తెలుగు సాహిత్యంలో సరైన అధ్యయనం, లోతైన పాండిత్యం, పరిశోధనలు కలవారు లేకపోవటంతో ప్రతి ఒక్కరూ ఓ రచన చేసి ‘తెలుగులో ఇలాంటి రచన తొలిసారిగా చేసింది నేనే’ అని ప్రకటించేసుకుంటున్నారు. వారి చుట్టూ ఉండే వందిమాగధ భట్రాజగణ భజన బృందాలు “అవును, ఆద్యులకే ఆద్యులు, మహా ఆద్యులు” అంటూ “ఇలాంటివి ఇంతకు ముందు లేవు, ఇక రావు..ఇంతకుముందు కానీ, తరువాత కానీ ఎవరైనా రాసినా మేము గుర్తించం..” అని పొగిడేస్తూ మొత్తం తెలుగు సాహిత్య చరిత్రను వర్తమానానికి, వర్తమానంలో తమ ముఠాకు చెందిన ‘మేస్త్రీ’లకు మాత్రమే  పరిమితం చేస్తున్నారు. ‘ఇది కాదు’ అని సప్రామాణికంగా నిజాలు  చెప్పేవారు తెలుగు  సాహిత్య ప్రపంచంలో లేరన్న ధీమా వారిది. ఒకవేళ ఎవరన్నా కిక్కురుమంటే వారి గొంతు అణిగి పోయేంతగా అరిచి గోల పెట్టే ‘అరుపుల గణాలు’ [అరస, విరస, కురస, నీరస, నోరస రచయితల గణం] విధేయత వల్ల విమర్శకులయినవారు , తెలుగు రాని విదేశీ నివాస విమర్శక గణాలు ఎన్నో సిద్ధంగా ఉంటాయి.

ఇలాంటి పరిస్థితులలో తెలుగు విశ్వవిద్యాలయాలలో తెలుగు సాహిత్యానికి సంబంధించి జరిగిన పరిశోధనల సారాంశాన్ని సామాన్యులకు  చేరువ చేసే ప్రయత్నాన్ని తన ముందుమాటలో చక్కగా వివరించారు అట్టెం దత్తయ్య. తెలుగు భాషా సాహిత్య రంగాల్లో అధ్యయన అధ్యాపనలు సమతుల్యతను కోల్పోవటం, విద్యార్థులకు సరైన దృక్పథం లేకపోవటం, కొత్త ఆవిష్కరణలు తక్కువై పోవటం వంటి పలు విషయాలను స్పృశిస్తూ, అందుకు కారణాలు సున్నితంగా ఎత్తి చూపించి, సమస్య పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. గతంలో జరిగిన ఇలాంటి ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, తను చేస్తున్నది  వాటికి ‘కొనసాగింపు’  అని వినమ్రంగా విన్నవించారు. “ఇలాంటి ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు కూడా జరిగింది” అంటూ ఆ వివరాలు పొందుపరిచారు. ఈ ముందుమాటలోనే మొత్తం 110 పరిశోధనా గ్రంథాలు ఎంచుకుని వాటి సారాంశాన్ని 10-15 పేజీలలో ప్రదర్శించగలిగే పరిశోధకులను గుర్తించి వారితో వ్యాసాలు రాయించిన విధానాన్ని, ఈ వ్యాసాలలో ఏకరూపత సాధించటం కోసం ఏర్పరచిన ప్రామాణికాలను సృష్టంగా తెలిపారు. ఏ సంపుటానికి ఆ సంపుటం ముందుమాటలో ఆయా సంపుటాల్లో ఉన్న వ్యాసాల వివరాలను తెలిపారు. మందుమాట పుస్తకానికి   ‘ద్వారం’ లాంటిదంటారు. ఈ పుస్తకాలకి ఉన్న ముందుమాటలు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించాయి. ఒక పరిశోధనల పరిచయ వ్యాసాల పుస్తకానికి  ఉండాల్సిన స్థాయిలో ఉన్నాయి ముందుమాటలు.

ఈ రెండు ‘సారాంశం’ పుస్తకాలు చదవటం విజ్ఞానపథంలో ప్రయాణం లాంటిది. ఆరంభం నుంచీ తెలుగు సాహిత్య పరిశోధన ప్రయాణించిన బాటలో మైలురాళ్లను చూస్తూ, మలుపులు తిరిగే దారిలో ప్రయాణం లాంటింది. ఇందులో మొదటి సంపుటం లోని పరిశోధన గ్రంథాల పరిచయ వ్యాసాలు చదవటం గమ్మత్తయిన అనుభవం. ఈ సంపుటిలో ఒక్కొక్క పరిశోధన సాహిత్యం లోలోతుల్లోంచి తవ్వి తీసుకువచ్చి సానపెట్టి అందించిన అమూల్యమైన ప్రకాశవంతమైన మణి లాంటిది. ఆనాటి పరిశోధకుల పరిశోధన విస్తృతిని, అన్ని ఆలోచనలను సమన్వయ పరిచి సమగ్రమైన పరిశోధనా గ్రంథాన్ని తయారు చేసిన దీక్షకు, వారి పాండిత్యానికి, తర్కానికి ఆశ్చర్యం కలుగుతుంది, గర్వం కలుగుతుంది. వాటిల్లో ఏ ఒక్క అంశం తొలగించినా బాధ కలుగుతుంది. అలాంటి పరిశోధనా గ్రంథాల సారాన్ని పది పేజీల్లో పొందుపరిచే అసిధార వ్రతం సమర్థవంతంగా నిర్వహించారు వ్యాస రచయితలు. పరిశోధన గ్రంథం సారం చెప్తూ, దాని ప్రత్యేకత చెప్తూ, ప్రతిపాదనలు వివరిస్తూ ఆ గ్రంథంపై వచ్చిన ప్రశంసలు, విమర్శలు చెప్తూ, చివరలో దాని ప్రాధాన్యం స్పష్టం చేసి, తమ స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేసి బిందువులో సింధువును చూపిస్తూ కూడా ఒక స్వతంత్ర పరిశోధనకు ప్రాతిపదిక వ్యాసంలా రూపొందించిన వ్యాసకర్త లందరూ అభినందనీయులు. ఈ సంపుటాలలో వ్యాసాలు చదివిన తరువాత తెలుగులో పాండిత్యానికి లేమి లేదు, విమర్శకులకు కొదవ లేదు అనిపిస్తుంది. మరి సమకాలీన సాహిత్యంపై సమతౌల్యమైన విమర్శ వెలువరించే సందర్భంలో వీరెవరి గొంతూ ఎందుకు వినిపించదన్న సందేహం వస్తుంది.

ఈ గ్రంథ ప్రామాణికతను, నాణ్యతను స్పష్టం చేసేందుకు ఒక్క ఉదాహరణ చాలు.  మొదటి సంపుటిలో డా. ఎస్వీ రామారావు పరిశోధన అంశం ‘తెలుగులో సాహిత్య విమర్శ – అవతరణ వికాసములు’ అన్నది 9వ వ్యాసం. 19వ వ్యాసం కోవెల సంపత్కుమారాచార్య పరిశోధన ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ – సాంప్రదాయ రీతి’. ఎస్వీ రామారావు గారి గ్రంథాన్ని డా. జి. బాలశ్రీనివాసమూర్తి, సంపత్కుమారాచార్య గ్రంథాన్ని డా॥ గండ్ర లక్ష్మణరావులు పరిచయం చేశారు. ఈ ఇద్దరి పరిశోధనాంశాలలో సారూప్యత కనిపిస్తుంది. ఎస్వీ రామారావు పరిశోధనను పరిచయం చేస్తూ రచయిత “కోవెల సంపత్కుమారాచార్య వంటి వారు ప్రత్యేక దృష్టితో ఆవిష్కరించిన దువ్వూరి రామిరెడ్డి గురించి కూడా రామారావు సిద్ధాంత గ్రంథంలో విశేష ప్రస్తావనలు లేవు” అని వ్యాఖ్యనించారు. అంటే వ్యాసరచయితలు కేవలం తమకిచ్చిన సిద్ధాంత గ్రంథాన్ని పరిచయం చేసి  వదిలివేయకుండా, సారూప్యం కల ఇతర పరిశోధనలతో పోల్చి విశ్లేషించి మరీ అందిస్తున్నారన్న మాట. ఇది ఇతర పలు పరిచయ వ్యాసాల లోనూ కనిపిస్తుంది. ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం రచన వెనుక ఆయా వ్యాసకర్తల అవగాహనలోతు, విస్తృతమైన  అధ్యయనం, అత్యుత్తమ స్థాయి రచన అందించాలన్న తపన, సాహిత్యంపై అభిమానాలు స్పష్టంగా తెలుస్తూంటాయి.

అయితే, రెండవ సంపుటిలోని పరిశోధనలను పరిశీలిస్తుంటే, సాహిత్య పరిశోధన పరిధి కుంచించుకుపోవటం తెలుస్తుంది. ముందుమాటల్లో వ్యక్తమైన అభిప్రాయాలు నిక్కమని నిరూపణ అవుతుంది. సాహిత్య వైశాల్యాన్ని అవగాహన చేసుకోవటం, సమగ్రమైన దృష్టిని ప్రదర్శించటం, సంక్లిష్టమైన అంశాలను కదలి, సులభమైన అంశాలవైపు దృష్టి సారించటం కనిపిస్తుంది. పరిశోధనలు  కూడా ఒకే రకమైన భావజాలానికి పరిమితమవటం కనిపిస్తుంది. ‘తెలుగులో భక్తి కవిత్వం – సామాజిక విశ్లేషణ’ అన్న డా॥ పిల్లలమర్రి రాములు పరిశోధన గ్రంథం పరిచయ వ్యాసంలో టి. శ్రీవల్లీ రాధిక ఈ విషయాన్ని ఎత్తి చూపించారు. “ఇక్కడ ‘తెలుగు భక్తి కవిత్వం’ అనే విభాగాన్ని అధ్యయనం చేయడం ద్వారా సామాజిక విశ్లేషణ చేయడం లక్ష్యం అయినప్పుడు సామాజిక విషయాలకు సంబంధించి భక్తి కవిత్వంలో కనిపిస్తున్న అన్ని రకాల భావాలను తీసుకొని విశ్లేషించవలసి ఉంటుది. కానీ పరిశోధకులు ‘ప్రస్తుత పరిశోధనలో ఆధిపత్య విధానాలను వ్యతిరేకించే కవుల భావాలను మాత్రమే పరిశీలనకు స్వీకరించడమైంది” అన్నారు.

ఈ పుస్తకంలోని పరిచయ వ్యాసాలు చదువుతుంటే ఆ పరిశోధనా గ్రంథాలన్నిటినీ చదవాలన్న తీవ్రమైన  తపన కలుగుతుంది. అంతలోనే ఈ పరిశోధన గ్రంథాలలో కొన్ని మాత్రమే సులభంగా లభ్యమవుతాయి,  మిగతావి అలభ్యం అన్న భావన బాధను కలిగిస్తుంది. ఇది అకడెమీషియన్లకూ సాహిత్య ప్రపంచానికీ, సామాన్య పాఠకులకు నడుమ ఉన్న అగాధాన్ని సృష్టం చేస్తుంది. ఈ ఆగాధాన్ని పూడ్చటంలో ‘సారాంశం’ లాంటి గ్రంథాలు తోడ్పడతాయి. పరిశోధన గ్రంథాలన్ని సరళంగా, సమగ్రంగా సామాన్యుడికి అందుబాటులోకి తేవటం అంటే సామాన్యుడిలో నిద్రాణ స్థితిలో ఉన్న పరిశోధన బీజానికి నీరుని అందించటం లాంటిది. అతడిలో తృష్ణను రేపి, సాహిత్య  స్పృహను కలిగించటం  లాంటిది.

అయితే, తెలుగు సాహిత్యంలో ఇంకా స్పృశించని పరిశోధనాంశాలు అనేకం ఉన్నాయి. కానీ రచయిత ప్రాధాన్యం, ప్రాశస్త్యం, వైశిష్ట్యాలతో సంబంధం లేకుండా సిద్ధాంతం ప్రాతిపదికన, పరిచయం ప్రాతిపదికన, సామాజిక స్థాయిలు ప్రాతిపదికలుగా పరిశోధనలు జరగటం కనిపిస్తోంది. సాహిత్యం అన్నది ఒక మహాసాగరం అనీ, అది ఒక జీవిత ప్రవాహాన్ని ప్రతిబింబిస్తుందనీ, సాగరంలో అడ్డుగోడలు గీయటం, సరిహద్దులు నిర్మించటం కూడని పని అన్న భావన పరిశోధకుల్లో, అకడెమీషియన్లలో, సాహిత్య సంఘాలలో [ప్రభుత్వమైనా, వ్యక్తిగతమైనా] కనిపించే మంచి రోజులు సాహిత్య ప్రపంచంలో వస్తాయని, అందుకు ‘సారాంశం’ వంటి పుస్తకాలు ప్రేరణాత్మకంగా నిలవాలని ఆశించటం దురాశ కాదు కద!

సాహిత్యాభిమానులందరూ చదివి దాచుకుని బహుమతిగా ఇవ్వదగ్గ పుస్తకం ఇది.

***

సారాంశం (పరిశోధన గ్రంథాలు – పరిచయ వ్యాసాలు)

(రెండు సంపుటాలు)

సంపాదకుడు: డా. అట్టెం దత్తయ్య

పేజీలు: ఒక్కో సంపుటం 608

వెల: ఒక్కో సంపుటం ₹ 360/-

ప్రతులకు:

ధృవ ఫౌండేషన్, కరీంనగర్. ఫోన్: 9989477755, 9989475899

‘మూసీ’ మాసపత్రిక కార్యాలయం, హైదరాబాద్. ఫోన్ : 9494715445, 9347971177

~

డా. అట్టెం దత్తయ్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ చదవండి
https://sanchika.com/special-interview-with-dr-attem-dattaiah/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here