సరస్వతి నమస్తుభ్యం

0
2

[box type=’note’ fontsize=’16’] “చదువుల తల్లిగాను, ఒక పుణ్యనది గాను, సరస్వతిదేవికి నమస్తుభ్యము ఉభయతారకము భక్తిభావన ఈ వ్యాసరచన ఉద్దేశము” అని ఈ వ్యాసంలో చెబుతున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు. [/box]

[dropcap]కా[/dropcap]వ్యరచనలో విఘ్నేశ్వరస్తుతి, ఇష్టదేవతా ప్రార్థన తప్పనిసరిగ ఉంటాయి. కాని మహత్వకవిత్వ కావ్యసంపద సిద్ధికి సరస్వతీ ప్రార్థనగ కవుల కావ్యరచన పలుకుబడి లేని కావ్యమరుదు. ‘తల్లీ నిన్నుదలంచి’ ఓనమాలునాడె ‘సరస్వతి నమస్తుభ్యం’ అనడం లలితకళల విద్యాపాండిత్య వినయ వరసాధనకు ప్రార్థన. చదువులతల్లి సరస్వతికి ధ్యానమది. బ్రహ్మదేవుని ఇల్లాలుగ ఖ్యాతి గాంచిన వాగ్దేవి సరసస్వతి. భారతి. వరవీణా మృదుపాణి. శంకరాచార్యవినుత శక్తిపీఠస్వరూపిణి శారద.

అయితే ‘…గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధంకురు….’ అని పుణ్యనదుల సరసన జలపూరిత జాబితాలో నిలిచింది. కలశారాధనలో నదికి ఉనికిగ సరస్వతి పేరు గల పుణ్యనది ధ్వనిస్తుంది. అందుచేత చదువుల తల్లిగాను, ఒక పుణ్యనది గాను, సరస్వతిదేవికి నమస్తుభ్యము ఉభయతారకము భక్తిభావన ఈ వ్యాసరచన ఉద్దేశము.

చదువులతల్లిగ సరస్వతి అక్షధామ, శుక, వారిజ, పుస్తకపాణిగల చతుర్భుజ. ఆలయ అర్చామూర్తిగ వెలసిన సాకారరూపిణి. ఇంకా సావిత్రి, శతరూప, గాయత్రి, బ్రాహ్మణి పేర్లుగ వేదమాత అధిష్ఠాన దేవతయై అర్చింప బడుతున్నకారణజన్మురాలు. సరస్వతి అసలు పేరుగా జన్మించిన బ్రహ్మకు మానసపుత్రిక.

త్రివేణి సంగమ పవిత్ర భారతభూమిలో ప్రస్తుతము అదృశ్యనదిగ ఈ సరస్వతి వేదములలో పేర్కొనబడింది. కుండలినీశక్తిగ సరస్వతి సుషుమ్ననాడి వెన్నెముక. దానికిరువైపులా ఉండే పింగళ, ఇడ నాడులు గంగాయమునలుగ త్రివేణిసంగమ స్నానములో కుండలినీ సాధన యోగమార్గముగ పవిత్రమని విశ్వాసము. అందుచేత నదీమతల్లిగ ఉన్న కథలు విస్మరించరానివి. ఆమె నదిగ సారస్వతుడనే కుమారునికని వేదాలు నేర్పి విద్వాంసుని చేసి నదిగా కూడ చదువులతల్లి అనిపించుకుని ప్రసిద్ధికెక్కింది, సరస్వతి నదికి దదీచుడనేముని కారణముగ సారస్వతుడు అనే కుమారుడు జన్మించాడు. శల్యపర్వములో సారస్వతుని కథ ఉంది.

దధీచముని సరస్వతీ నదిలో స్నాము చేస్తున్నాడు. ఆ సమయాన ఆకాశమార్గాన వెళుతున్న అలంబస అనే అప్సరసను చూసిన మోహ కారణంగా వీర్యపతనమైంది. నదిలో పడిన ఆ వీర్య ప్రభావమువల్ల సరస్వతీనది గర్భవతియై కనిన పుత్రుడు సారస్వతుడు. సారస్వతుని చిన్నపుడే దధీచి మరణించాడు. ఇంతలో గొప్ప కరువొచ్చింది. తట్టుకోలేక సరస్వతీ తీర మునివాసులు వలసపోయారు. సారస్వతుడు మాత్రం ఉండి పోయాడు. సరస్వతినది సాకారయై అతనికి వేదాది శాస్త్రాలు నేర్పింది. నదిలోని చేపలను తిని శరీరపోషణ చేసుకుని నదీమతల్లి ద్వారా విద్వాంసుడై పన్నెండు సంవత్సరాలు కరువుకాలము గడిపాడు.

కరువుకాటకం పోయి తీరము మళ్ళీ సుభిక్షమయాకా తిరిగివచ్చిన మునివాసులతో సరస్వతీ తీరము మళ్ళీ కలకలలాడింది. కాని పన్నెండు సంవత్సరాలు వేదపఠనమునకు దూరమైనమునులకు సాధనలో ఇబ్బందు లెదురయ్యాయి. సారస్వతపథ తైత్తరీయోపనిషత్తుగ, వేదాదిశాస్త్రములు అతని పర్యవేక్షణలో తిరిగి వల్లెవేసి ప్రతిభావంతులయ్యారు. ఆ స్థలము సారస్వతతీర్థముగా ప్రసిద్ధి అని భారతపురాణ కథనము. సారస్వతుడు తండ్రి ఆత్రేయుడని మరో కథ. మరో కథనము ప్రకారము నది దుర్వాసముని శాపానికి గురయి స్త్రీరూపధారిణయింది. ఆమె ఆత్రేయ అనే బ్రాహ్మణుని వివాహమాడితే పుట్టాడని సారస్వతుని వృత్తాంతము ఉదహరిస్తారు. గాయత్రి వలె వేదమాత విజ్ఞానముగల నదిగాకూడ నమస్తుభ్యము అనిపించుకుంది.

గంగ, సరస్వతి, లక్ష్మి త్రిశక్తులలో విష్ణువు కోరికపై లక్ష్మి విష్ణువుకు, గంగ శివుడికి, సరస్వతి బ్రహ్మకు త్రిమూర్తులు అభేధముగ భార్యలు చేసుకున్నారని కొన్నికథలు చెబుతాయి. అందుచేత విష్ణుపాదోద్భవగ గంగవలె సరస్వతికూడ నదిగ ఉనికి ఉంది. సరస్వతీ నదీతీరాన మునులు యజ్ఞము చేశారు. నదీదేవతావహనగా ఋగ్వేదములో కీర్తింపబడిందని వేదవిదులు చెబుతారు. సాకారమూర్తిగ ఇతర దేవతలతోబాటు యజ్ఞయాగాదులలో ఆహ్వనింపబడింది. కాని మానసపుత్రిక కథగా జన్మ చరిత్ర వేరు.

మానసపుత్రికగ మాత్రం కూతురుగ భావించక సరస్వతిని బ్రహ్మ భార్యగ చేసుకున్నాడన్న మత్స్యపురాణ కథ మాత్రం ఆసక్తికరముగా ఉంది. ఎందుకంటే మానసపుత్రికగ సృష్టించుకున్న సరస్వతి సౌందర్యము బ్రహ్మదేవుని వివశము చేయడము చిత్రాల విధికి కూడ మార్చలేని విధివ్రాత అయింది. సరస్వతిపేరుగ బహునామములు కల్పించుకుని తోయజాతభవ చిత్తవశీకరణైకవాణిగా రాణియై ఇల్లాలుగ పేరుతెచ్చుకో వలసివచ్చింది.

పుత్రికగా చూడవలసిన మానసపుత్రికయిన తనను కాంక్షగ చూస్తున్నబ్రహ్మను చూసి సరస్వతి విస్తుపోయింది. ముఖాముఖి ఎదురుగా నిలబడలేక విధికి కుడివైపు, ఎడమవైపు, వెనుకకుపోయి కుడివైపు, ఎడమవైపుకు దాగుడు మూతలుగ తప్పుకోసాగింది. అయినా అమె తప్పుకున్న ప్రతిదిక్కుకు ముఖము మొలిపించుకుని చతుర్ముఖుడై అనురాగము వర్షించే చూపులతో ఇబ్బందిపెట్టసాగాడు. చుట్టూ తిరుగుతూ నాలుగుముఖాల చూపులకు తట్టుకోలేక ఆకాశానికి ఎగిరితే మెడమీదనున్న అసలు తలను పైకెత్తి కళ్ళు కలిపాడు. సరస్వతి దిగివచ్చి భార్య స్థానమలంకరిచక తప్పలేదు. ఆ దాంపత్య ఫలముగ వైవస్వంతుడు లేదా విరాటుడు పుట్టారు.

సావిత్రి పేరుతో బ్రహ్మ మానసపుత్రికగ కాక సూర్యపుత్రికగ జన్మించిందట! సావిత్రిగ బ్రహ్మను వివాహమాడిందన్న కథ ఉంది. సూర్యపుత్రిక సావిత్రితో కలిసి పుష్కరనదీ తీరాన యజ్ఞము చేశాడన్నది మరో కథ. కాని అలంకరించుకుంటూ ముహూర్త సమయము మించిపోయేలా పీటలమీద కూర్చోవడానికి ఆలస్యము చేసిన కారణాన బ్రహ్మకు కోపమువచ్చింది. ఇంద్రుని పంపించి ఒక గొల్లవనితను వెదికి తెప్పించి రెండవ ధర్మపత్నిగా స్థానమిచ్చి ముహూర్త సమయానికి యజ్ఞము పూర్తి చేసాడు. గాయత్రి నామధేయముతో ఆ గొల్లవనితను వేదమాతగా లోకానికి అందించాడని స్కాందపురాణము. కాని సావిత్రి సహించలేకపోయింది.

బ్రహ్మకు దేవాలయాలు లేకుండాను, దేవతలకు భార్యలద్వారా పిల్లలు లేకుండాను శపిస్తూ సావిత్రి తన కోపాన్ని చాటింది. ఆమెను శాంతపరుస్తూ బ్రహ్మ సావిత్రిని తనలో లీనము చేసుకున్నాడు. సరస్వతిగ తిరిగి మానసపుత్రికగ సృష్టించి భార్యను చేసుకున్నాడనే మానసపుత్రిక కథకు జీవము పోశాడు.. సావిత్రిగ బ్రహ్మ నిరాదరణకు గురై పుష్కరతీర యజ్ఞములో ధర్మపత్నిగ పాల్గొనలేకపోవడానికి కారణమైన ఇంద్రుడుతో సహా బ్రహ్మాది దేవతలు వాగ్దేవివని గౌరవమిచ్చి శాపాల్నిఅంగీకరించి తలదాల్చారు..

వాగ్దేవిగా గౌరవించారుకాబట్టే దేవతలామెను ప్రార్థించి కుంభకర్ణుని నాలుకపై ప్రవేశబెట్టి నిద్ర వరము కోరుకునేలా చేయగలిగారని రామాయణ కథ. కాళిదాసు నాలుకపై సరస్వతి బీదాక్షారాలు రాసిన కాళి ఆయనకు వాగ్దేవి అవతారముగ కీర్తి తెచ్చింది. మహాకవులు, మేధావులు నాలుకపై సరస్వతి తాండవమాడుతుంది అనేమాట అందుకే పుట్టింది. వాక్శుద్ధి సరస్వతి వరము.

దేవీభాగవతము ప్రకారము శ్రీకృష్ణభగవానుని శక్తులలో ఒకటి. ఛందములో తాను గాయత్రిని అంటే వేదశక్తినని భగవద్గీత చెప్పింది. కాబట్టి స్మృతి శక్తి, జ్ఞాపకశక్తి, జ్ఞానశక్తి, విజ్ఞానశక్తి, కల్పనాశక్తి అను ఐదుశక్తులకు ప్రతిరూపము సరస్వతి. ఏ ప్రతిభ రాణింపుకైనా ఈ శక్తుల అనుగ్రహమునకు సరస్వతీ నమస్తుభ్యం మన సంప్రదాయము. సరస్వతి బ్రహ్మలోకములో ఉంటుంది. కాని ప్రత్యేకమందిరాలు బాసర క్షేత్రము వంటివి దేశమంతా కేవలము సరస్వతీ అర్చామూర్తికి జరిగేవి ఉన్నాయి. గంగ, సరస్వతి కూడ లక్ష్మివలె విష్ణువుకు భార్యలని కథలు గల ప్రాంతీయ పురాణాలు ప్రామాణికతను ప్రశ్నిస్తూనే ప్రచారములో కనిపిస్తాయి.

పాపహరిణిగ జలస్వరూపిణి నదీమతల్లిగ వేదకాలమునాటి సరస్వతినది ఉనికి కనుమరుగయిందని భావిస్తున్నారు. అయినా గంగా యమున నదులతో కలిసి త్రివేణిసంగమముగ జనబాహుళ్యము మెచ్చిన నది. ప్రయాగలో త్రివేణిసంగమ పాయలో సరస్వతి ఉందని భావించి పుణ్యపవిత్ర నదీస్నాన మాచరిస్తూనే ఉన్నాము.

నదిగా ఆమె బడబాగ్నిని సముద్రములో చేర్చింది. ఔర్వుడు అనేవాడి కథ పద్మ పురాణములో ఉంది. హేహయులు క్షత్రియులుగ భార్గవులను చిత్రవధ చేశారు. గర్భస్థశిశువుగా కాక ఊరువులనుంచి జన్మించిన భార్గవ వంశాంకురము ఔర్వుడు. హేహయరాజవంశ నిర్మూలానికి చేసిన తపస్సులో పుట్టిన అగ్ని బడబాగ్ని కాని ఔర్వుడు కోపము అణచుకున్నాడు. శివుని ఆజ్ఞగా సరస్వతి ఆ బడబాగ్నిని సముద్రములో చేర్చింది.

బ్రహ్మ పుష్కరతీరములో గాయత్రితో కలిసి చేసిన యజ్ఞప్రాంతము పుష్కరతీర్థముగ పేరుకెక్కింది. సాగరాన్ని చేరాలని నదులన్నీ కలిసి బయలుదేరాయి. గంగ, యమున, మనోరమ మొదలైన నదులు ఉదంకుని ఆశ్రమ ప్రాంతములో ఆగిపోయాక సరస్వతి మాత్రము ప్లక్ష వృక్షముదాకా సాగిందిట! అప్పుడు శివుడు ఒక పాత్రలో బడబాగ్నిని నిక్షిప్తము చేసి సరస్వతినదికిచ్చాడు. పద్మపురాణము సృష్టికాండ ప్రకారము ఆ బడబాగ్నిని సముద్రము చేర్చింది. పుష్కరతీర్థము రాజస్థాన్‌లో ఉంది. బ్రహ్మ పుష్కరాసురుడిని చంపి యజ్ఞముచేసిన స్థలమిది. ఇక్కడి అరణ్యము కూడ పుష్కరుని పేరుమీద పుష్కరారణ్యము అనిపేరు తెచ్చుకుంది.

ఈ పుష్కరారణ్యములో ఆగిన నీటిపాయకు సరస్వతిగ కాక నంద అనే నదిగా గుర్తింపుకు గోవ్యాఘ్రసంవాదము కథ ప్రచారములో ఉంది. పుష్కర అడవులలో ఒక పెద్దపులి ఉండేది. అది ప్రభంజనుడనే రాజు అనుభవిస్తున్న శాపరూపము. పొదలలో పాలిస్తున్న జింకను వేటకు వచ్చినపుడు ప్రభంజనుడు బాణముతో గాయపరిచాడు. నిద్ర, మైథునములో ఉన్నపుడు హింస చేసిన వారికి పెద్దపులి రూపము వస్తుంది. పులిగా మారిపోయి తిరుగుతున్నాడు. చుట్టుపక్కల గ్రామాలనుంచి మేత మేయడానికి వచ్చే పశువులను చంపి జీవిస్తున్నాడు.

పెద్దపులి ప్రభంజనుడు మేతమేస్తున్న నంద అనే గోవును ఆకలితో చంపబోయాడు. నంద తనకు లేగదూడ ఉందని పాలిచ్చి పులికి ఆహారమతానని మాటిచ్చి పెద్దపులిగ ఉన్న ప్రభంజనుని బ్రతిమాలింది. పులి ఒప్పుకుంది. భోజరాజీయ అనంతామాత్యుని గోవ్యాఘ్ర సంవాదముగ ఈ కథ పోలి ఉంది. మాట నిలుపుకుని తిరిగివచ్చిన గోవు సత్యసంధత పులి మానవత్వము ధర్మదేవతను ముగ్ధుడిని గావించాయి. పులి, గోవులకు మోక్షము వచ్చింది. నంద పేరు మీదుగ ఇక్కడి సరస్వతీనదికి పేరువచ్చింది. ‘సత్యమేవజయతే’ చదువులతల్లికి, ఆధ్యాత్మిక మోక్షగామినికి సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి.. విద్యారంభంకరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here