సర్దుకుపోదామా…

0
3

[dropcap]”వా[/dropcap]రుణీ! గౌతమ్ ఫోన్ చేసాడు. మన పెళ్లి సంబంధం ఇష్టమేనట. ఒక్కసారి నీతో మాటాడుతాను అన్నాడు. ఏమంటావమ్మా?” అడిగాడు రామకృష్ణ కూతుర్ని.

“నాకు నచ్చలేదు నాన్న! ఇక మాటాడేది ఏమీ లేదు.” అంది వారుణి.

“ఎందుకు నచ్చలేదు? అతను ఇంజినీరు. మంచి కుటుంబం. బాగా చదువుకున్నవాళ్ళు. గౌతమ్ ఎంత మర్యాదగా నాన్నకి ఫోను చేసాడో చూడు.” అంది సుమతి కూడా.

“అమ్మా… మీకు కాదు నచ్చాల్సింది, నాకు! అతని కాలు వంకరగా వుంది. కుంటుతూ నడుస్తాడు. నేను నా క్లాస్‌మేట్ పవన్‌ని ప్రేమించాను.” అంది వారుణి.

“ఈ మాట గౌతమ్‌ని చూడక ముందు చెప్పాల్సింది. ఇదేమైనా గేమ్ అనుకున్నావా…. నాపరువు ప్రతిష్ఠ ఆలోచించావా?” రామకృష్ణ మండిపడ్డాడు.

“మీరు నన్ను అడిగి వాళ్లతో మాటాడలేదు. స్వంతంగా నిర్ణయం తీసుకున్నారు.” అంటూ జవాబు చెప్పింది వారుణి.

“తప్పు మన మీదే వేస్తోంది. ఒక్క అమ్మాయికదాని గారం చేసాం. మనకి శాస్తి జరిగింది….” అన్నాడు రామకృష్ణ.

తన అభిప్రాయాన్ని గౌతమ్‌కు ఫోన్ చేసి చెప్పేసింది వారుణి. ఆ చెప్పడం పవన్‌ని ఇష్ట పడుతున్నా… అంటే బాగానే ఉండేది. కానీ “నీలో ఫలానా లోపం వుంది” అని వంక చెప్పింది. అసలు ఆ విషయం స్పష్టంగా చెప్పాలనే గౌతమ్ వారుణితో మాటాడుతాను అని రామకృష్ణకు ఫోను చేసాడు.

గౌతమ్ చూసిందే మొదటి సంబంధం. అతనికి ‘ఇంతకంటే మరో అమ్మాయి బాగుంటుందేమో…. ఎక్కువ సంపాదిస్తుందేమో…’ అనే స్వభావం కాదు. ఒక ఆశయం పధ్ధతి వున్నవాడు.

వారుణి ఫోన్ కాల్‌కి హర్ట్ అయ్యాడు. తండ్రితో “వుద్యోగం చేయని అమ్మాయిని చెప్పండి” అన్నాడు.

అలాగే ఈసారి మరో సంబంధం చెప్పాడు గౌతమ్ నాన్నగారు రంగారావు.

ఆ అమ్మాయి రేవతి. ఫొటోలో సింపుల్‌గా సాఫ్టుగా అనిపించింది. పెళ్లి చూపుల్లో స్పష్టంగా “నాకు యాక్సిడెంటులో కాలుకి ఆపరేషన్ చేసారు. నడవగలను కానీ స్లోగా నడుస్తాను. అందుకే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాకు మీరు నచ్చడం కాదు, మీకే నేను నచ్చితే చాలు. పెళ్లిచేసుకుందాం” అంటూ తన లోపం గురించి చెప్పేడు గౌతమ్.

రేవతి కూడా వెంటనే చెప్పింది.

“గౌతమ్! మీరు చెప్పే వరకూ అదేదో లోపంగా నేను అనుకోలేదు. అయినా మీ నిజాయితీ నాకు నచ్చింది. మీకు ఇష్టం ఉంటే నేనుకూడా మిమ్మల్ని ఇష్ట పడుతున్నా”అని.

“థాంక్స్ రేవతిగారు.”అన్నాడు గౌతమ్. రంగారావు గారు “రేపు ఫోన్ చేస్తాను రామారావ్ గారు…” అన్నాడు.

వాళ్ళు వెళ్ళిపోయాక రేవతి నాన్నగారు “అతను ఇంజినీరు, ప్రభుత్వ ఉద్యోగి అవ్వచ్చు. కానీ కుంటుతూ నడుస్తున్నాడు. కొన్నాళ్ళకి ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయో…. నాకు ఇష్టంలేదమ్మా ఈ సంబంధం…” అన్నాడు.

“ఇంకా అనుమానం ఏమిటి? ఇప్పుడే ఇలా వున్నాడు. రిటైర్ అయ్యేసరికి వీల్ చెయిర్లో తిప్పాలేమో… చూస్తూ ఎలా ఇస్తాం” అంది రేవతి అమ్మగారు.

“చూడండి అమ్మా నాన్నగారూ…. భవిష్యత్ అనేదాన్ని గురించి లేనివి ఊహించడం అనవసరం. మీరింకా ఇద్దరు చెల్లెళ్లని తమ్ముణ్ణి చదివించాలి. మీరా చిన్న ఉద్యోగి. నేను వుద్యోగం చేసి కొంత కాలం మీకు సాయపడిన నాకు పెళ్లి తప్పదు. వయసు దాటిన నాకు ఇలాటి సంబంధం రాదు. నాకేమీ భయం లేదు. నేను గౌతమ్ గారినే చేసుకుంటాను.”అంది రేవతి స్పష్టంగా.

“ఇదెక్కడి నిర్ణయం రేవతీ! కోరి కష్టాలు తెచ్చుకుంటావా? అబ్బాయిని చూడకుండా వాళ్ళని ఇంటికి పిలవడం నా తప్పు.”అన్నాడు రామారావ్.

“నాన్నగారు తప్పులు ఎంచుకుంటే చాల ఉంటాయి. ఇప్పుడు ఉపయోగంలేదు. పెళ్లి చేయాలి అనుకుంటే ఈ సంబంధమే కుదర్చండి. లేదంటే ఆ విషయం వదిలేసి నాకు వుద్యోగం చేయడానికి అనుమతి ఇవ్వండి..” అంది రేవతి ధైర్యంగా.

రామారావు ఆలోచించాడు రేవతి చెప్పినట్టు రేపు ఏమి జరుగు తుందో అనే భయం వదిలి ఈ సంబంధం చేయడం మంచిది….అనుకున్నాడు.

రేవతి గౌతములకు పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళిలో లేవడానికి కూర్చోడానికి ఇబ్బంది పడుతున్న అతనికి తన చేయి అందించి సహాయం చేసిన రేవతిని చూస్తే కొడుకు జీవితం పట్ల అతడి అమ్మా నాన్నగార్లకు భరోసా ఏర్పడింది.

మన అదృష్టం మంచి కోడలు వచ్చింది అని సంతోష పడ్డారు.

గౌతమ్ మంచివాడే మంచి ఆశయాలు ఉన్నవాడే… కానీ చాలా త్వరగా కోపం వస్తుంది. అంత త్వరగాను పోతుంది. ఆ కోపానికి అర్థం ఉండదు. ఫోను దగ్గిర పెన్ పెట్టేది అతనే అదే తీసి ఏదో నోట్ చేసి ఎక్కడో పెట్టేది అతనే. అది మర్చిపోయి రేవతి మీద విరుచుకు పడతాడు. తర్వాత పెన్ కనిపించాక ‘తప్పు నాది’ … అని సారీ చెప్పడు. కనీసం అదీ సంగతి అనీ చెప్పడు.

రేవతి అది అతడి స్వభావం అని గ్రహించి సర్దుకు పోతుంది. ఎవరైనా బంధువు మీ ఇంటికి వస్తాను… వుంటావా అంటే… మా చెల్లి వచ్చింది… అనో …అత్తా మామలు… వస్తున్నారు. నీకే సదుపాయంగా ఉండదు…. నీ ఇష్టం అనో …. మా రేవతికి హెల్త్ బాగా లేదనో అబద్దం చెబుతాడు.

అది ప్రేమ అనుకోవాలా…. మరొకటా… అర్థం కాదు. ఎవరూ రావడం మాత్రం ఇష్టం ఉండదు అని తెలుసుకుంది.

అలాగే అతని కోప తాపాలను భరించే సహనం ఆమెకు గొప్ప ఆభరణం. ఇలా బంధు మిత్రులతో కలిసి మెలిసి ఉండక పొతే పిల్లల చదువులు అవసరాలు ఎలా? గౌతంకి వుద్యోగం గొప్ప జీతం తక్కువ. నిజాయితీ పరుడు. కనుక అదనంగా వచ్చే అవకాశాలు బోలెడు వున్నా పొరబాటున కూడా ఆశించడు.

ప్రతి మనిషిలో లోపాలు వున్నట్టే మంచి లక్షణాలు కూడా ఉంటాయి అనుకుంటుంది.

ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరూ మాల్‌కి వెళ్ళినప్పుడు గౌతమ్‌కి మొదటి పెళ్లి చూపుల్లో చూసిన వారుణి కనబడింది.

“రేవతీ… అదిగో… ఆవిడను చూడు…!” అన్నాడు కొద్దీ దూరంలో ఉన్న వారుణిని చూపించి.

వెనక్కి తిరిగి చూసింది రేవతి .

“అరే… ఆవిడ ఎవరో కాదు…. నాకు డిగ్రీలో క్లాసుమేటు. వుండండి ఇక్కడే. నేను పలకరించి వస్తాను…” అని అతడికి చెప్పి వేగంగా అటు వెళ్ళింది.

‘కర్మ. నీకు తెలుసునని నాకు తెలిసుంటే చెప్పేవాడిని కాదు. ఇప్పుడు ఆవిడ గారిని ఇంటికి రమ్మని పిలుస్తావు. నీకు స్పీడు ఎక్కువ, ఆలోచన తక్కువ. నేనేమో నీకు రివర్స్.’ అని విసుక్కున్నాడు గౌతమ్. భార్యతో మాల్‌కి వచ్చిన ఆనందం కాస్త కోపంగా మారింది.

ఫోన్లో ‘నేను ఇంటికి వెడుతున్నా… నువ్వు నీ ఫ్రెండుతో ఎంజాయ్ చేసి నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికిరా…’ అని మెస్సేజ్ పెట్టి, ఆటోలో ఇంటికి వచ్చేసాడు.

రేవతికి కారు డ్రైవింగ్ వచ్చు. గౌతమ్‌కి ఎటూ ఆఫీసు కారు ఉంటుంది. అది ఆఫీసుకు మాత్రమే వాడుతాడు. రేవతి మెస్సేజి చూడలేదు. “మావారిని పరిచయం చేస్తా, అక్కడ షాపులో కూర్చున్నారు” అంటూ వచ్చేసరికి అక్కడ గౌతమ్ లేడు.

దాంతో పాపం రేవతి కంగారు పడిపోయి అటూఇటూ పరుగులు పెట్టి వెదికింది.

గౌతమ్ త్వరగా నడవలేడు. కనుక ఎక్కువ దూరం వెళ్ళడు. ఐతే ఆ షాపు ఎంట్రెన్స్‌కి పక్కనే వుంది.

ఎవరో మాల్‌కి ఆటోలో వచ్చిఉంటే అందులోనే ఇంటికి వెళ్ళవచ్చు. ఎప్పుడు ఇలా కోపం వచ్చి ఇంటికి వెళ్ళలేదు. ఫోన్ చేసి చూద్దాం, బాత్ రూముకి వేళ్ళాడేమో… అని చూస్తే … మెస్సేజ్ కనబడింది. విషయం అర్థమైంది రేవతికి.

వెర్రిమొహంతో వారుణిని చూసి “గౌతమ్ బాత్ రూంకి వెళ్లి వుంటారు. నీకు ఆలస్యం అవుతుంది వెళ్ళిపో. ఫోన్లో మాటాడుకుందాం…” అని పంపేసి ఒక అరగంట తర్వాత వాలెట్ పార్కింగ్లో కారు తీసుకుని ఇంటికి వెళ్ళింది.

మొదటిసారి గౌతమ్ ఇలా అవమానించడం భరించలేక పోయినది రేవతి. కానీ తొందర పడకుండా ఆ ప్రసక్తి తీసుకు రాకుండా ఊరుకుంది. గౌతమ్ మాటాడకుండా భోజనం చేసి పడుకున్నాడు.

రేవతి రాత్రి అంతా ఆలోచించింది. ప్రతిదానికి సర్దుకుపోవడం చాల కష్టం. భార్యగా గౌరవం లేదు. ఇలా ఇంట్లో కూర్చుని ఉండటం కంటే వుద్యోగం చేయాలి అని నిర్ణయించుకుంది.

ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు చెప్పింది.

“నేను స్కూల్లో టీచర్ పోస్టుకి అప్లయ్ చేశాను. చేరాలనుకుంటున్నా.”

వివరాలు తెలుసుకుని “చేరు. జీతం బాగానే వస్తుంది.” అన్నాడు.

‘వద్దు’ అని గొడవ చేస్తాడు అనుకుంది. జీతం బాగా వస్తుంది కనుక నా ఖర్చు కలిసి వస్తుంది అని ఒప్పుకున్నాడు. అతడి బుద్ధి క్రమంగా బయట పడుతోంది. నాకు మనశ్శాంతి ఇచ్చేది వుద్యోగం ఒక్కటే. ప్రతి మనిషికి రెండు విభిన్న రూపాలు ఉంటాయన్నమాట.

పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆదర్శ రూపం. పెళ్లి అయ్యాక అసలు రూపం.

పెళ్లికి వచ్చిన బంధువులు “అబ్బాయికి లోపం వున్నా రేవతి ఒప్పుకుంది. పాపం తండ్రి కట్నాలు భారీగా ఇవ్వలేడని. పిల్ల అందం ముందు అతను తక్కువే…” అనడం… విన్న గౌతమ్‌కు ఎవరూ ఇంటికి రావడం నచ్చకపోవడం…. ఎందుకో స్పష్టంగా అర్థమైంది.

అలాగే సర్దుకుపోయిన రేవతికీ ఇద్దరు అమ్మాయిలు. అటు వుద్యోగం ఇటు పిల్లలు నెగ్గుకువచ్చింది.

పెద్ద పాపా పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంటాను…అని రేవతి అడిగితే … “రెండోసారి అబ్బాయి పుడతాడు…వద్దు” అన్నాడు గౌతమ్.

ఇప్పుడు ప్రతిదానికి “ఇద్దరికీ బోలెడు ఖర్చు” అంటాడు. తేడా ఏమిటో రేవతికీ అర్థం కాదు.

అబ్బాయి అయినా అమ్మాయి ఐనా చదువు పోషణ ఒకటేగా!

“నీ జీతంలో సగం ఇవ్వు. పెద్ద పిల్ల పేరున బ్యాంకులో వేస్తాను. నీ చీరలు, నగల ఖర్చు తగ్గించు…..నీ అందానికి అవేమి అక్కరలేదు…” అంటూ మొదలుపెట్టేడు.

స్కూలుకు వెళ్ళినపుడు పది చీరలైనా లేకపోతే ఎలా… చేరిన తరువాత…. తనకోసం కాదని పిల్లల కోసం రెండేళ్ళకి ఒకసారి ఏదో ఒకటి బంగారపు వస్తువు అమర్చేది. అదీ గొడవ.

కాదంటే వుద్యోగం మానుకో అని తల తిక్కగ అంటాడేమో అని “అలాగే లెండి…”అని ఇచ్చేది. పిల్లలకు చదువులు వచ్చాయి్. పెళ్లిళ్లు అయ్యాయి. మంచి అల్లుళ్ళు దొరికారు.

గౌతమ్ ఇక అయిదు ఏళ్లకు రిటైర్ అవుతాడు అనగా ఇంటి పక్కనే ఉన్న సెలూన్‍కి వెళ్ళివస్తూ ఎవరో బైక్‍తో డాషిస్తే పడిపోయాడు. అంతే అంతదాకా ఏదో గడిచిపోయింది అనుకుంటే ఇప్పుడు పూర్తిగా కాలు దెబ్బతిని నడవలేని స్థితికి వచ్చాడు.

ఇంట్లో అతనికి సాయంగా మనిషిని పెట్టింది. “స్కూలు మానేస్తా… మీరు ఒంటరి తనం ఫీలవుతారేమో” అంది రేవతి.

“నయం, వచ్చే జీతం వదులుకుంటావా… ఏమీ ఫర్వాలేదు. నాకు తోడుగా పనివాడు ఉంటాడు…వెళ్లు” అన్నాడు.

కానీ ఇంటికి వచ్చాక “నీకేం హాయిగా వెడతావు వస్తావు. నేను ఈ పనివాడి మీద ఆధారపడాలి” అంటూ సాధిస్తాడు.

ఏమి చేయలేని నిస్సహాయత అతన్ని కృంగదీస్తూ ఉంటే ఎదో ఒక పోట్లాట పెట్టుకుంటాడు. అలాగే భరిస్తూ సాధ్యమైనంతగా అతడిని కనిపెట్టి ఉండేది. రాను రాను పనివాడిని కూడా తిట్టసాగాడు. అతను విసిగిపోయి మానేసాడు.

“మీరిలా గొడవ చేస్తే ఎలాగండి? నేను మీకు చేయగలనా? మీ బలం ముందు నేను ఎంత? పాపం వాడు మంచివాడు. మిమ్మల్ని బాగా చూస్తున్నాడు…. ఇంకెవరు పని చేయరు మీతో….” అని నచ్చ చెప్పినా.. కొత్త వాడిని కుదిర్చినా ఎవరూ నచ్చరు అతనికి.

ఈ పరిస్థితిలో వారుణి ఆ రోజు మాల్ దగ్గిర కలిసిన తర్వాత ఫోన్ చేసింది.

“సారీ! రేవతీ…. కంపెనీ వర్క్ మీద …. యూకే వెళ్లి చాలాకాలం ఉండిపోయాను. ఇంటి దగ్గిర వున్నావా? అటువైపు పనుంది, వస్తున్నా….” అంది.

“అలాగే రా…” అంటూ అడ్రస్ చెప్పింది.

గౌతమ్‌ని చూసి గుర్తుపట్టింది వారుణి. గౌతమ్ మాత్రం… షేమ్ ఫీలయ్యాడు. వారుణి అసలు గౌతమ్ గురించి ఏమీ చెప్పనే లేదు. కాసేపు మాటాడి వెళ్ళిపోయింది.

అప్పుడు గుర్తు వచ్చింది రేవతికి గౌతమ్ “ఆవిడను చూడు…” అనడం… తాను వెనక్కి తిరిగి చూసి … “ఆ తను నా క్లాస్‌మేట్, పలకరించి వస్తాను అనడం…”. అసలు ఆ రోజు … వారుణిని గురించి ఏమీ చెప్పబోయాడు?

ఆ ప్రసక్తి రానేలేదు.

వారుణి వెళ్లిపోయాక గౌతమ్ “అసలు నాతో చెప్పకుండా వారుణిని ఎందుకు ఇంటికి పిలిచావు….” అన్నాడు.

“అదేమిటి? మీ ఫ్రెండ్ అయితే నేను పిలవను. అది నా… ఫ్రెండ్… కనుక పిలిచాను! మధ్యలో మీకేమిటి బాధ? అవును…. అసలు ఆరోజు వారుణి గురించి ఏమి చెప్పాలనుకున్నారు? ఇంటికి ఎందుకు వెళ్లిపోయారు?” అని అడిగింది.

వారుణి నన్ను అవమానించిందని… చెప్పాలా… మరో కారణం చెప్పాలా అని ఆలోచించి… “అబ్బే మా బంధువు ఒకరు ఆవిడలా అనిపించి నిన్ను చూడు అన్నాను. నీ ఫ్రెండ్ అన్నవుగా… సందేహం తీరిపోయింది” అన్నాడు.

తరువాత ప్రశ్న కూడా అర్థం ఐంది. ఇంటికి ఎందుకు వెళ్లి పోయావు….. అంటుంది. దానికి రెడీ అయిపోయి అడగకుండానే చెప్పేసాడు.

“ఆ రోజు నాకు గుండెలో నొప్పిగా అనిపించి ఇంటికి వచ్చేసాను. నీతో చెబితే కంగారు పడతావు. అదృష్టం బాగుంది. ఇంట్లో టాబ్లెట్ ఉంటే వేసుకున్నా. తగ్గిపోయింది. అసిడిటీ అయ్యుండాలి. ఆ రోజు ఇంటికి వచ్చాక నువ్వు అడగలేదు. నేను చెప్పలేదు.” అన్నాడు.

కానీ రేవతికి అది అబద్ధం అని తెలుసు. ఇప్పుడు మొండితనంగా అదేమిటని ఆరా తీయడం అనవసరం. అతను ఎలాగా నిజం చెప్పడు….. ఇకమీదట ఇతనితో ఎలా…? భరించడమే.

“చూడండి. వారుణి వచ్చినందువల్ల మీకు నష్టం కష్టం ఏమిటి? కనీసం భోజనం కూడా చేయలేదు కదా! మీకు మనుషులంటే కిట్టడం లేదు.” ఉన్న మాట చెప్పింది.

‘ఆ రోజు అమ్మ – గౌతమ్ నాకు నచ్చలేదు. నువ్వు వీల్ చెయిర్లో తిప్పాలేమో… అన్నమాటే నిజం అయింది. పైకి ఎలా తెలుస్తుంది? అనుభవంతోనే కొన్ని తెలుస్తాయి. వుద్యోగం చేయడం ఒక్కటే మనశ్శాంతి.’ అనుకుంది రేవతి ఎప్పటిలా సర్దుకుపోతూ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here