Site icon Sanchika

సరి లేరు మీ కెవ్వరూ

[dropcap]ఎం[/dropcap]డాకాలంలో వర్షం ఎంత హర్షం? మత్తెక్కించే మట్టి పరిమళం. చల్లని గాలి మలయమారుతంలా, కానీ ఈ వాతావరణాన్ని ఆహ్లాదంగా అందుకునేలోపే కీచురాళ్ళ రొద. ప్రకృతిని అమితంగా ఆరాధించే తనకు అదేమిటో అది మాత్రం నచ్చదు.

“నీకు నచ్చనివి ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదుగా” అంతరంగం అప్పుడే నిద్రలేచినట్లు వచ్చింది మాటల్లోకి.

అది చెప్పింది నిజమే. తన కళ్ళముందు ఏదీ అసహజంగా కనిపించినా తను తట్టుకోలేదు. దాని గురించే లోలోపల మథనపడిపోతుంది. అంత సున్నితత్వం ఈ కాలంలో పనికిరాదని మనసుకు ఎంత చెప్పినా వినిపించుకోదు.

దానితో రాజీపడటం తప్ప తాను ఏమీ చేయలేకపోతోంది. కానీ ఇదేదో పెద్ద ఉపద్రవానికి సూచనగా తన మనసు చేసే హెచ్చరికలను మాత్రం ప్రక్కన పెట్టలేకపోతోంది.

ప్రక్కనే పసిపిల్లవాడిలా అమాయకంగా నిద్రపోతున్న భర్త ‘ధృవ’ను తదేకంగా చూసింది.

అతనిలో ఎంతో ప్రశాంతత. అన్నీ పట్టించుకుంటాడు. కానీ ఏమీ పట్టించుకోనట్లే ఉంటాడు. అన్నిటికీ ఆలోచిస్తాడు. కానీ ఆలోచిస్తున్నట్లే కనిపించడు. ఏ విషయం చెప్పినా ఇట్టే సమాధానమిచ్చేస్తాడు, ‘దట్సాల్’ అన్నట్లు. ఏదో చెప్పాడు అని కాదు కానీ అది నిజంగానే బాగుంటుంది. దాన్ని మెచ్చుకోకుండా ఉండలేదు.

కానీ తనే పగలంతా అలసిపోయి వచ్చిన అతనికి మళ్ళీ సమస్యల చిట్టా ముందు పెట్టడం ఎందుకని ఊరుకుంటుంది. ఇంతకీ అవి తనవి కాదు. చుట్టుప్రక్కల తన అత్మీయులవి. అలాగని అతనికి చెప్పకుండా ఉండదు. కాకపోతే తను ఆలోచించినా ఏమీ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు బయటపడుతుంది. మనవాళ్ళు అనుకుంటే అది మన సమస్యగానే అనిపిస్తుందిగా.

ఏమిటీ ద్వంద్వ సిద్థాంతాలు మనసులో యుద్ధం చేసుకుంటున్నట్లు ఉంది తన పరిస్థితి.

కాసేపు ఆగితే ఇప్పుడున్న ప్రశాంతత అంతా హుష్ కాకే! అనుకుంది ‘హృదయ’.

***

“అమ్మా!”

“ఏమిటి నీ సందేహం?” అంది హృదయ ప్లేటులో పెసరట్టు పెట్టి అల్లప్పచ్చడి వేస్తూ.

“అదే! రాగ గురించి ఆలోచించావా?” ఆమెనే గమనిస్తూ అంది ఆనంద.

“ఆఁ! నువ్వు చెప్పిన దగ్గరనుంచీ అదే పనిలో ఉన్నానే!”

“మరి ఏమనిపిస్తుంది?”

“నువ్వు తనకి దగ్గర స్నేహితురాలివి కదా! ఇంకాస్త చనువు తీసుకుని విషయం తెలుసుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది.”

“ఎంత అడిగినా ఏం లేదు, అంతా బాగానే ఉంది అంటుంది.”

“మరి నీకెందుకలా అనిపిస్తోంది?”

“నీకు ఎన్నోసార్లు చెప్పేదాన్ని కదమ్మా! దాని నవ్వు పసిపాపలా హాయిగా ఉంటుంది అని. ఇప్పుడు అది కనిపించడం లేదు.”

“ఇంకా”

“ఇదివరకు అన్నీ నాతో పంచుకునేది. ఇప్పుడు ఏదో దాస్తోంది అనిపిస్తోంది.”

“అవును! ఒకటా… రెండా! మూడేళ్ళ సాహచర్యం మీది. అక్కాచెల్లెళ్ళ కంటే బాగా కలసిపోయారు కదా!”

“అవునమ్మా! మీకు దూరంగా క్షణమైనా ఉండాలనిపించని నాకు అలా అక్కడ పూనాలో ఉన్నానంటే అంతా దాని దయే. అది నాతో అలా సొంతవారిలా ఉండకపోతే ఎప్పుడో ఆ ఉద్యోగం వదులుకుని వచ్చేసేదాన్ని.”

“అవునే! వాళ్ళాయన చక్కగానే వుంటున్నాడంటావు. ఇక వాళ్ళ అత్తగారి వల్లేగా సమస్య రావాలి”

“అవును, చెప్పిందే చెప్పటం ఎందుకని ఊరుకుంటోందేమో?”

“ఒక్కడే కొడుకు. అందులో భర్త చనిపోవడంతో వాళ్ళిద్దరికీ అటాచ్‍మెంట్ ఎక్కువ ఉంటుంది. అది సహజం. నువ్వే చెబుతావుగా పెళ్ళయిన పదేళ్ళకే ఆయన చనిపోయాడని. మరి అక్కడి నుంచీ అమె ఒక్కర్తే అతని అలనాపాలనా చూసుకుందని”

“కూతుర్లా చూసుకుంటానని చెబుతూనే ఏదో ఒకటి తెచ్చిపెట్టేస్తుంది ఆవిడ. ఉద్యోగం చేసుకుంటూ రోజుకు గంటసేపు ఆవిడతో మాట్లాడంటే ఎలా అమ్మా! నువ్వే ఆలోచించు.”

“ఈ కాలంలో మాట్లాడేవాళ్ళే కొదువ అయిపోయారు. అందుకే మనసువిప్పి మాట్లాడటానికి ఎవరు దొరుకుతారా అని అందరికీ ఎదురుచూపు ఎక్కువై పోయింది. అందుకే ఆవిడ అంతసేపు మాట్లాడుతోందేమో?”

“అవునమ్మా! పెళ్ళికాకముందు సరే. ఇప్పుడు సంసారం, వంట, టిఫిన్, క్యారేజీ ఇన్ని చూసుకోవాలిగా. ఇప్పుడూ కూడా అలా అంటే ఎలా?”

“అలాంటప్పుడు రాగకి ఏ టైమ్ కుదురుతుందో ఆ టైమ్ చెప్పమను. పనులలో టైమ్ సరిపోవడం లేదని. అందుకే మీతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని మాటల్లో చెప్పమను. అయిపోతుంది” అప్పటిదాకా మౌనంగా టిఫిన్ తింటున్న ధృవ ఠక్కున చెప్పాడు.

ఇద్దరూ అతనివైపు ప్రశంశాపూర్వకంగా చూశారు.

“అదొక్కటే కాదులే ధృవా! ఆవిడ మొదటినుంచీ కాస్త తేడాగా కనిపించారు. ఒక స్టేజిలో పెళ్ళి ఆగిపోతుందేమో అన్నంత వరకూ వెళ్ళింది. ఈవిడేమో ఎక్కువ కట్నం రాబట్టాలని, వాళ్ళేమో ఇవ్వలేమని, ఇద్దరూ చక్కగా బ్యాంకుల్లో పని చేసుకుంటున్నారు. మంచి జీతాలు తెచ్చుకుంటున్నారు. అయినా ఆవిడకి ఆ తాపత్రయమేమిటో అర్థం కాదు. వీళ్ళకు లేకపోతే అనుకోవాలి. ఇల్లు ఉంది, డబ్బు ఉంది.”

“అవునమ్మా! అదే నాకు అర్థం కాదు. అందుకే అసలు కట్నం లేకుండా చేసుకునే వాడయితేనే చేసుకుంటామని అమ్మాయిలంతా గట్టిగా పట్టుబడితే అసలు ఇలాంటివి రానే రావుగా!”

“నువ్వలాగే చేసుకుందువుగానీలే ఆనందా”

“థ్యాంక్యూ నాన్నా!” అంది. “హర్షితకు ఇలా వాళ్ళ నాన్న ఒప్పుకుంటే ఇన్ని బాధలు ఉండేవి కావు.”

“తనకేమయింది?” అడిగాడు ధృవ. ‘ఈ మధ్య పనుల ఒత్తిడి బాగా ఎక్కువయింది. కుటుంబంతో కాలం గడిపే సమయం తక్కువయింది. లేకపోతే అన్ని విషయాలు ఎప్పటికప్పుడూ తెలిసిపోతుండేవి. ఈ కాసేపటిలో ఎన్ని మిస్ అయ్యానో అర్థమవుతోంది’ అనుకున్నాడు మనసులో.

“అది గలగల పారే సెలయేరు అనుకునేవాళ్ళం కదు నాన్నా!”

“అవును. వచ్చిందంటే చాలు అపకుండా మాట్లాడుతూనే ఉండేది. అంత మాట్లాడినా విసుగుపుట్టదు. ఇంకా మాట్లాడితే బాగుండుననిపిస్తుంది.”

“హర్షిత నవ్వు కూడా ఎంతో బాగుంటుంది. నవ్వినప్పుడల్లా ఒకవైపు కాదు రెండువైపులా చొట్టలు పడి ఎంత అందంగా ఉంటుందో?” అంది హృదయ.

“ఆ నవ్వు ఇప్పుడు మాయమైపోయిందమ్మా!”

“అదేమిటి? నాకు నువ్వు చెప్పనేలేదు.”

“నేను బాధపడుతున్నది చాలక నిన్నూ ఎందుకు బాధపెట్టటమని నేనే.”

“ఇదెప్పటినుంచీ ఆనందా!” అంది కలవరంగా హృదయ.

“నాకూ ఈ విషయం ఈ మధ్యే తెలిసిందమ్మా. మొన్న నా పుట్టినరోజునాడు. ఆ రోజు నా స్నేహితులందరికి పార్టీ ఇచ్చానుగా అప్పుడు.”

“ఏమయింది?”

“పది దాటితే మా ఆయన ఒప్పుకోడు. నేను రానే అంటుంది.”

“అది మంచిదేగా. ఆడపిల్లలు ఆలోపు ఇంటికి రావడం ఎంతో శ్రేయస్కరం. అసలే రోజులు బాగోలేవు” అన్నాడు ధృవ వత్తాసు పలుకుతూ.

“అది కాదు నాన్నా! నేను మన కారులో తీసుకువెళ్ళి తీసుకువచ్చి దింపుతాను అన్నాను. కాస్త ఆలస్యమైనా ఏమవదుగా. అసలు దానిలాంటిది అలా భయపడటమేమిటి? అది ఇక్కడ ఉంది. వాళ్ళాయన ఓరుగల్లులో. ఎలా తెలుస్తుంది?”

“అది తప్పటే ఆనందా! ఎక్కడ వున్నా వాళ్ళకు తెలియదులే అని ప్రవర్తించటం తప్పు. ఆ విషయంలో తనే కరెక్ట్.”

“నువ్వెన్నయినా చెప్పమ్మా! స్వేచ్ఛగా ఎగిరే పక్షి పంజరంలో చిలుకలా మారిపోయిందేమో అనిపిస్తుంది నాకయితే.”

“అదేం కాదులేవే”

“కాదమ్మా! దానికి జాబ్ అంటే ఎంత ఇష్టం? వాళ్ళ నాన్న దానితో సంప్రదించకుండా వ్యాపారస్థుడితో ముడిపెట్టేశారు. ఇది పిచ్చముఖంలా తాళి కట్టించేసుకుంది. ఇప్పుడు ఉద్యోగం వదిలేసుకుని అక్కడకు వెళ్ళిపోతోంది. ఒక్క పెళ్ళితో ఇన్ని మార్పులా? ఇదంతా చూస్తే సహజత్వాన్ని అసహజత్వం మింగేస్తుంది అనిపిస్తోంది.”

“అంత పెద్దపెద్ద మాటలు ఎందుకే?”

“ఇదేదో చిన్నవిషయంలా మాట్లాడతావేంటమ్మా! పెళ్ళి చేస్తే చిన్నప్పటినుంచీ పెంచుకున్న ఇష్టాలను దూరం చేసుకోవాలా? ఇలా అయితే అసలు నేను పెళ్ళిచేసుకోను.”

“అనూ! అందరూ అలా ఉండర్రా. అమ్మ, నేనూ లేమా? మమ్మల్ని చూడు.”

“అదే నాన్నా! ఇన్నాళ్ళూ మిమ్మల్ని చూసే పెళ్ళంటే ఇంత హాయిగా ఉంటుందా అనుకునేదాన్ని. ఇప్పుడా భ్రమలన్నీ తొలగిపోతున్నాయి.”

“అంత తొందరగా నిర్ణయాలు తీసుకోకు ఆనందా!” అంది హృదయ నెత్తిమీద చిన్నగా తడుతూ.

“సరే! ఈ విషయం మళ్ళీ తాపీగా చర్చిద్దాం. నాకు టైమ్ అవుతోంది” అని ధృవ వెళ్ళిపోవటంతో అక్కడ ఆ విషయం ఆగిపోయింది.

***

“హృదయా! కాస్త వేడివేడిగా కాఫీకానీ, టీ కానీ పెట్టరా, బుర్ర బద్దలయిపోతోంది.”

“ఏమయ్యింది ధృవా? ఎందుకలా ఉన్నావు? ఫ్యాన్ వేస్తున్నాను. కాస్త రిలాక్స్ అవ్వు. ఈలోపు నేను టీ చేసుకువస్తాను. ఏ.సి. వెయ్యనా?”

“ఆఁ! వెయ్యి. మెదడు కూడా కాస్త చల్లబడుతుంది.”

“అరె! ఎప్పుడూ లేనిది ఈయనేమిటి ఇంత టెన్షన్ పడుతున్నారు. పెళ్ళయి ఇన్నేళ్ళయింది. ఇప్పటివరకూ తనని ఇలా ఎప్పుడూ చూడలేదు” అనుకుంది మనసులో టీ కెటిల్‍లో పాలు పోసి టీ పొడి వేస్తూనే.

అవి మరిగేదాకా ఆమెలో ఆలోచనలూ అలా మరుగుతూనే ఉన్నాయి. తెలిస్తే ఒకలా, తెలియకపోతే ఇంకోలా. మనిషిని ఆలోచనలు పట్టుకున్నంత గట్టిగా మరేవీ పట్టించుకోవేమో! పాలు మరుగుతుండటంతో పంచదార వేసింది.

ధృవను అంత చికాకు పెట్టించే సమస్య ఏమిటి?

మళ్ళీ ఆలోచనలు మొదలు. రకరకాల ఆలోచనలు తేనెటీగలులా ముసురుతున్నాయి. టీ తెర్లుతుండటంతో కప్పులోనికి వడగట్టింది.

“ధృవా! తీసుకో! నీకిష్టమైన స్ట్రాంగ్ టీ!” అంటూ చేతికందించింది.

“థాంక్స్! దయా! కరుణించావు. వేడివేడిగా పొగలు కక్కుతున్న ఈ టీని చూడగానే నా చికాకు సగం ఎగిరిపోయింది.”

“ఇంకేం! తాగేసి ఆ సగం కూడా పోగొట్టేసుకో” అంది నవ్వుతూ. బాగా ఇష్టమైనప్పుడు తనను పిలిచే పిలుపు ‘దయా’. అది గుర్తు వచ్చి నవ్వుకుంది.

“లోలోన ఆ నవ్వులెందుకో మాకూ చెప్పవచ్చుగా.”

“ఏం లేదులే. నువ్వు ముందు చెప్పు. ఏమిటో తెలుసుకోవాలని మహా ఆతృతగా ఉంది.”

“ఏం లేదురా. నా స్నేహితుడు కళ్యాణరావు తెలుసుగా. అతను ఈ మధ్యే వాళ్ళ అమ్మాయికి పెళ్ళిచేశాడు. అంతా సవ్యంగా ఉందనుకుంటుంటే పెద్ద బాంబు పేల్చాడు.”

“ఏమని?”

“తాము పిలల్లని కనమని అన్నారట”

“అదేమిటి?”

“చిన్నప్పటినుంచీ కనీ పెంచీ పెద్ద చేస్తే చివరకు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలకి పంపాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళను కనటం ఎందుకు? పెంచటం ఎందుకు అన్నదే వాళ్ళ ప్రశ్నట. ఆయన తల పట్టుకు కూర్చున్నాడు.

ఇప్పుడు నాకు అర్థమయింది. నా మనసుని గూఢంగా తొలుస్తున్న ఉపద్రవం ఇదేనని.

“వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను.”

“అక్కర్లేదు నేను కన్విన్స్ చేసే వచ్చాను.”

“ఏమని?” అతని చేతిలోని ఖాళీ కప్పును తీసుకుంటూ.

“అలా కాకుండా మిమ్మల్ని మంచిగా చూసుకొనేలా చేసుకోవటంలోనే మీ ప్రతిభ ఉందని, అలా పిల్లల్ని పెంచమని.”

“ఓఁ! బాగా చెప్పారు. కానీ అందరూ అలాగే పెంచుతారుగా. అమ్మ అల్లం, పెళ్ళాం బెల్లం అయ్యేది పెళ్ళి అయ్యాకేగా!”

“దానికీ చెప్పా! వాళ్ళు అలాగే అన్నారు”

“పిచ్చిముఖాల్లారా! పసిపాప రావటం, పెంచటం, ఆ అనుభూతులను పంచుకోవటం ఒక అదృష్టం. ప్రతిక్షణం ఓ ఆనందం అందులో ఉంటుంది. వాళ్ళు చూస్తారా లేదా అన్నది వదిలేసెయ్యండి. చక్కగా వీటిని ఆనందించటానికయినా పిల్లల్ని కనాలని.”

“ఏమన్నారు?”

“ఆలోచిస్తామన్నారు.”

“పోనీలే అంతదాకా తీసుకువచ్చావు అసలు వద్దన్న వాళ్ళని”

“ఏమిటో దయా! ఉండేకొలదీ అనుబంధాలు అన్నీ కరిగిపోతున్నాయి.”

“వాళ్ళ పెళ్ళాలను బాగా చూసుకుంటున్నారుగా. అదిపోతే నువ్వన్నట్లే ఆ మోజులో పడి కన్నవాళ్ళను కాదనుకుంటున్నారు. వాళ్ళకు తలనొప్పి అంటే విలవిలలాడిపోతారు. కన్నవాళ్ళు మూలుగుతున్నా డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళాలన్న ఆలోచన రాని స్థితిలో ఈనాటి పిల్లలు. ఛ! ఛ!  ఇలాంటివి వింటానికే బాగోటం లేదు. ఇక అనుభవించే వారికి నరకమేగా!

“పిల్లల్ని కనటం మానేస్తే ఇక వంశాభివృద్ది ఏముంటుంది? ఇక అలా వారి తరం ముగిసిపోతుందిగా.”

“అందరూ అలా ఉండరుగా ధృవా!”

“తన కళ్ళముందు జరుగుతున్నవి చూసి మన ఆనంద అసలు పెళ్ళే చేసుకోనని అనటంలా. దాని పర్యవసానం ఫలితం కూడా ఇదే!”

“అవును ధృవా! మనం రాబోయే తరాల వారికి ఆదర్శంగా కనబడాలి కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారకులుగా మాత్రం ఉండకూడదుగా”

“అన్నీ సెట్ రైట్ అవుతాయి. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు.”

“అంతేనంటావా? నువ్వా మాత్రం భరోసా ఇస్తే అదే చాలు.”

“ఏమిటో శ్రీవారు ఈ రోజు ఇంత డల్‍గా మాట్లాడుతున్నారు. మీకు నేను చెప్పగలిగేదాన్నా”

“ఇప్పుడు మనకి మనం కాదు, వాళ్ళకు చెప్పగలగాలి శ్రీమతి గారూ.”

“హఁ… హఁ…. హఁ….” అని నవ్వుకున్నారు ఇద్దరూ.

***

“అమ్మా!”

“ఏమిటే చాలా సంతోషంగా ఉన్నావ్?”

“రాగ వాళ్ళ అమ్మగారు వచ్చారట”

“ఓఁ! ఇంకేం? అందరినీ భోజనానికి పిలువు. పనిలో పనిగా మన ప్రయత్నం చేద్దాం.”

“అందుకేనమ్మా నాకీ సంతోషం.”

“నాకు తెలియదా?”

“మా మంచి అమ్మ” దగ్గరగా వచ్చి ముద్దుపెట్టుకుంది.

“రాగ నాకూ కూతురే పిచ్చిపిల్లా”అంది ఆనందను దగ్గరకు తీసుకుంటూ.

“మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలియదు. రాగ మళ్ళీ రాగాలు తీయాలి.”

“అలా చేతులు దులిపేసుకుంటానంటే ఏం కుదరదు. నువ్వు ఓ పాత్ర పోషించాలి.”

“ఏమిటది చెప్పు… చెప్పు. నేను రెడీ.”

“అత్తలంటే అపరకాళికలని, వాళ్ళని దూరంగా ఉంచాలని ముందునుంచే అనుకుంటున్నారుగా. అది నీ మాటల ద్వారా రాగలో కూడా ఉందనిపించింది. అది తొలగాలి.”

“ఎలా?”

“అమ్మను విడిచిపెట్టి అత్తింటికి వెళతారుగా. అక్కడ అత్తనే అమ్మగా అనుకొంటే అసలు సమస్యలే రావు. వాళ్ళమ్మను బాగా చూసుకొంటే భర్తా చేరువవుతాడు.”

“నిజమమ్మా! రాగలో నేనిది గమనించాను. నేనేమన్నా అంటే పెళ్ళయ్యాక నీకు తెలుస్తుంది అని త్రోసిపారేస్తుందేమోనని ఊరుకున్నా!”

“నందా! స్నేహితుల మధ్య ఏదైనా తప్పు కనిపిస్తే తప్పక ఖండించాలి. బంధం ఏమౌతుందో అని ఆలోచిస్తే అది అసలు బంధమే కాదు. ముందు అత్తగార్లని కోడళ్ళు అర్థం చేసుకోవటం మొదలుపెట్టాలి. అవహేళనలు చేయటం, దూరం పెట్టటాలు ఆపేసి దగ్గరతనాన్ని ప్రదర్శించాలి. మాట్లాడిన నాలుగుమాటలు పెదాలమీద నుంచి కాకుండా మనసులోనుంచి రానివ్వాలి.”

“మరి ఆవిడ సంగతి…?”

“అది నేను చూసుకుంటా”

“ఏం మాట్లాడతావు?”

“చెప్పాలా?”

“చెప్పమ్మా!”

“ఆడపిల్లలంటే అప్పిచ్చి డబ్బు లాక్కున్నట్లు కాదని, రేపు వాళ్ళే ముసలి వయసులో మిమ్మల్ని మంచిగా చూసుకోవాలంటే మీరూ మొదటి నుంచీ మంచిగా ఉండాలని, కూతురిలా చూసుకుంటా అంటే సరిపోదు. అలా చూసుకోవాలని.”

“డైరెక్ట్‌గా చెప్పేస్తావా?”

“పిచ్చిపిల్లా! అలా ఎందుకు చేస్తాను? నా స్నేహితురాలికి ఇలా జరిగితే అలా చెప్పాను అన్నట్లు చెబుతా. అప్పుడు చేరవల్సిన మనసుకు చేరతాయి. రావల్సిన మార్పు వస్తుంది.”

“ఇప్పటికిప్పుడే నీకీ ఆలోచన వచ్చేసిందా?”

“లేదే! నువ్వు రాగ గురించి చెప్పినప్పుడు ధృవ, నేను చర్చించుకుని ఇలా చెయ్యాలని అనుకున్నాం” అంది నవ్వుతూ.

“అందరి గురించి నువ్వు భలేగా ఆలోచిస్తావు అమ్మా!

ఇక రాగది సెట్ అయిపోయినట్లే. నాకు నమ్మకం వచ్చేసింది. మరి నాకు నిద్ర వస్తోంది, పడుకోనా?”

“అలాగే” అని వెళ్ళిపోయింది హృదయ. అలా రాగ జీవితం రాగరంజితమయ్యింది.

***

ధృవ ‘హస్మిత’ భర్తతో పరిచయం పెంచుకున్నాడు ఫోన్‍లోనే. మంచిమంచి కబుర్లతో చనువును కూడా!

ఆ కబుర్లలోనే తను భార్యతో ఎంత స్నేహంగా ఉంటాడో మధ్యమధ్యలో మాటల్లో చెప్పేవాడు.

అది నెమ్మది నెమ్మదిగా పని చేయటం ప్రారంభించింది. ఆ ప్రభావం హస్మిత వదనంలో కనిపించేది ఫోటోలలో ఆనందకు.

ఇక ఏదో వ్యాపకం ఏర్పరచాలి అనుకున్నాడు ధృవ. ఆ ఏదో ఎందుకు? అతని షాపుకే వెళితే సరదాగా వుంటుంది. అతనికి సహాయం చేసినట్లూ ఉంటుంది. అదేం తప్పుకాదుగా అనుకుని సలహాఇచ్చాడు.

దానితో తను అనుకున్న జాబ్ కాకపోయినా హస్మితలో ఉత్సాహం నిండుకుంది. వాళ్ళిద్దరితో హృదయ కూడా మధ్యమధ్యలో మాట్లాడుతూ ఉండేది.

తాను చెప్పినదే వినాలనే సిద్ధాంతంలో కాస్త కాస్త మార్పూ వచ్చింది అతనిలో.

ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా కంటే స్నేహితుల్లా మెసలుతున్నారు. అదంతా ధృవ, హృదయ మనసు విప్పి వారితో మాట్లాడటం వలనే జరిగింది.

ఇక ఆ విషయంలో ఆనంద ఆనందాన్ని ఎవరూ పట్టలేకపోయారు. తల్లిదండ్రులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఆమెకు అర్థంకాలేదు. మూగగా కళ్ళలో నిండైన సంతోషాన్ని చూపించటం తప్ప.

***

“ఏరా! నందా! ఇప్పటికైనా పెళ్ళికి గ్రీన్‍సిగ్నల్ ఇస్తావా?”

“ఎందుకు ఇవ్వను? కాకపోతే మీలాంటి మంచి మనస్తత్వం ఉన్నవాడిని వెతికి తీసుకురండి. మాట్లాడకుంటా తలవంచి తాళి కట్టించేసుకుంటా. అదేం పెద్ద పనికాదు మీకు. కళ్యాణరావు కూతురునే మార్చేశారు చివరికి.”

“పెద్దభారం నామీద మోపావు. అందరూ వాళ్ళే వెతుక్కుని ప్రేమించాం అని చెబుతుంటే నువ్వేంటిరా మీ నాన్న మీదకు నెట్టేశావు?”

“నాన్నా! చిన్నప్పట్నుంచీ మీరు నన్ను పెంచారు. నా అభిరుచులు, అలవాట్లు బాగా తెలిసినవారు. నాకు ఎలాంటి అతను సరిపోతాడు అన్నది నాకన్నా మీకే బాగా తెలుస్తుంది.”

“చాలురా. నామీద ఆ మాత్రం నమ్మకం ఉంచావు. అది నిలబెట్టుకుంటా…”

“పెళ్ళాంకి విలువ ఇచ్చేవాడిని, తల్లిని చిన్నబుచ్చని వాడిని, ఇద్దరినీ తక్కెడలో సమానంగా చూసేవాడిని తీసుకువచ్చి నా బంగారుతల్లిని పెళ్ళికూతురిని చేస్తా” అన్నాడు ధృవ.

“ఎప్పటిలానే ఈ విషయంలో నా సహకారం సంపూర్తిగా ఉంటుంది, అల్లుడిని వెతకటంలో” అంది హృదయ వెనుకనుంచీ హఠాత్తుగా వచ్చి.

ఇక ఈ యింట్లో తొందరలోనే పెళ్ళిబాజాలు మ్రోగుతాయి.

***

సమాజం అంటే మనం, మన తోటివారమే. మనలో తప్పులను మనకి మనమే సరిచేసుకోవాలి. అప్పుడే తృప్తి… సంతృప్తి… మనసులోనే అనుకుంది హృదయ తేలికపడ్డ మనసుతో.

Exit mobile version