విజయవాడ పుస్తక మహోత్సవంలో ‘సరియైన ఉచ్చారణ’ ఆవిష్కరణ!

0
2

[‘సరియైన ఉచ్చారణ’ పుస్తకావిష్కరణ సభ నివేదికని అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

2024 జనవరి 6వ తేదీ, విజయవాడ లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పుస్తకాల పండుగ జరిగింది. డిసెంబరు 26 నుండి జనవరి 7 వరకు జరిగిన పుస్తక మహోత్సవంలో ప్రముఖ ప్రచురణ సంస్థల స్టాళ్లు కొలువుతీరాయి. ‘పుస్తకం హస్త భూషణం’ అనీ, స్మార్ట్ ఫోన్ కాదనీ, నమ్మే పుస్తకప్రియులకు ఇది నిజంగా పండుగే.

ఇందులో రెండు సాహితీ వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన సాహితీవేదికకు శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి పేరును, విద్యార్థుల ప్రతిభావేదికకు శ్రీరమణ పేరును పెట్టడం సముచితంగా ఉంది.

జనవరి 6న శ్రీ సత్తి సునీల్ రెడ్డి, శ్రీమతి లలితా రెడ్డి, కుమారి స్నిగ్ధ, సంయుక్తంగా సంకలనం చేసిన ‘సరియైన ఉచ్చారణ’ అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సాహితీ పోషకులు శ్రీ గోళ్ల నారాయణరావు గారు సభకు అధ్యక్షత వహించి, ప్రయోక్తగా కూడ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఎ.ఎమ్.డి. శ్రీ ఇంతియాన్ అహ్మద్ I.A.S. గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

పుస్తకాన్ని పరిచయం చేసి, సమీక్షించారు ప్రముఖ సాహితీవేత్త, రచయిత, కవి, విమర్శకులు, కాలమిస్ట్, గాయకులు, శ్రీ పాణ్యం దత్తశర్మ. ఇంగ్లీషు భాషలోని స్పెల్లింగ్‌లలో, అక్షరానికి, ధ్వనికి పొంతన ఉండదని, ఒకే ధ్వనిని రకరకాల అక్షరాలు పలికిస్తాయని, దాని వల్ల ఇంగ్లీషు పదాలను చాలా మంది తప్పుగా పలుకుతుంటారని దత్తశర్మ చెప్పారు. తెలుగు భాషకు ఆ దౌర్భాగ్యం లేదని స్పష్టం చేశారు. ‘మోడీ’ అని పలకడం అలాంటిదే అనీ, ‘దీ’ ని సూచించడానికి ‘d’ అనే అక్షరం ఉండటమే దానికి కారణమనీ ఆయన అన్నారు. ‘బ్రోచర్’ అని అందరం అంటూ ఉంటామని, ‘బ్రోషుర్’ అనాలని తాను ఈ పుస్తకం చదివిన తర్వాత, తెలుసుకొన్నానన్నారు.

ఇంగ్లీషు సాహిత్యంలోని ‘మాల్‌అప్రోపిజమ్’ (malapropism) గురించి వివరించారు. ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు దీనిపై కృషి చేసి – మీడియా, సోషియల్ మీడియా చలనచిత్రాలలో, ‘ఉచ్చారణ’లో వస్తున్న అపభ్రంశ రూపాలను, వాటి సరైన ఉచ్చారణను అకారాది క్రమంలో, మూడు కాలమ్స్‌లో పట్టికల రూపంలో తెలిపారన్నారు. స్నిగ్ధ తన Snippets లో వివరించిన సంగతులు ఆసక్తికరంగాను, నిర్మాణాత్మకంగాను ఉన్నాయని కొనియాడారు.

విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, ‘మధురవచస్వి’ బిరుదాంకితులు, సాహితీవేత్త డా॥ శ్రీ జెట్టి యల్లమంద (విశాఖపట్నం) గారు పుస్తకాన్ని నిశితంగా విశ్లేషించారు. ‘సకృదుచ్చరితం సన్మానం వహతి’ అన్న జగన్నాథ పండితరాయల వాక్యాన్ని ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ‘శతా౦ధాః కూపం ప్రవిశన్తి’ అనే న్యాయము ప్రకారం, ఒకరు తప్పుగా పలికితే, దాన్ని చాలామంది అనుసరిస్తున్నారనీ, ‘పదుగురాడు మాట పాటియై ధరజెల్లు’ అన్నది తాను అంగీకరించననీ స్పష్టం చేశారు. ‘ఆడియన్స్’ అన్నది నిత్య బహువచనమనీ ‘ఆడియన్’ అన్నపదమే లేదనీ, ప్రముఖ సినీ దర్శకులు, నటులు సైతం ఆ తప్పు చేస్తుంటారనీ ఉన్నారు. పుస్తకంలోని కొన్ని సరైన ఉచ్చారణలను ఆయన వివరించారు. తొలుత కవిసమ్రాట్ విశ్వనాథవారు తెలుగుభాష పై వ్రాసిన పద్యాన్ని, చివర, భాషకు ఉచ్చారణ ఎంత ముఖ్యమో తెలుపుతూ తాను రాసిన పద్యాన్ని, డా॥ యల్లమంద సుమధురంగా ఆలపించినపుడు, ప్రేక్షకులు పరవశించి, కరతాళధ్వనులు చేశారు.

శ్రీ ఇంతియాజ్ అహ్మద్, I.A.S. వారు మాట్లాడుతూ, జేమ్స్‌బాండ్ పాత్రను అప్పట్లో అద్భుతంగా పోషించిన ‘సీన్ క్యానరీ’ అన్న హాలీవుడ్ నటుని పేరును ‘షాన్ క్యానరీ ‘ అని పలకాలని, తన కూతురు తనకి చెప్పిందని గుర్తు చేసుకోన్నారు. పుస్తకాన్ని రూపొందించిన శ్రీ సత్తి సునీల్ గారిని, ఆయన కుటుంబ సభ్యులను ఆయన ప్రశంసించారు. సునీల్ గారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నతాధికారి అనీ, ఆయన ప్రవృత్తి విశేషమైనదనీ అన్నారు. ‘లెఫ్టినెంట్’ అన్న పదం స్పెల్లింగ్‍లో ‘f’ ఉండదని చమత్కరించారు. పుస్తకాన్ని అద్భుతంగా సమీక్షించి, విశ్లేషించిన పాణ్యం దత్తశర్మ, శ్రీ జెట్టి యల్లమందలను ఆయన కొనియాడారు.

ప్రయోక్త శ్రీ గోళ్ల నారాయణరావుగారు ఆద్యంతం తమ చతురోక్తులతో సభనీ రంజింపచేశారు. యల్లమంద గారి ఇంటిపేరు ‘జెట్టి’, ఆయన సాహిత్యంలో ‘గట్టి’ అని ఆయన అన్నప్పుడు సభలో నవ్వులు విరిశాయి.

చివరగా గ్రంథ రచయిత సత్తి సునీల్ రెడ్డిగారు మాట్లాడుతూ, పత్రికా, ఎలక్ట్రానిక్ రంగాలలో వస్తున్న ఉచ్చారణా దోషాలను తాను ఆయా పత్రికాధిపతుల దృష్టికి మాత్రమే కాదు, ఆయా ప్రభుత్వశాఖల దృష్టికి ఉత్తరాల ద్వారా తీసుకువెళ్లి, వాటిని సరిదిద్దుకొనేలా కృషి చేస్తున్నానన్నారు. మొదటగా ‘ఈనాడు’ పత్రిక స్పందించి, తన సవరణలను అనుసరించిందని గుర్తు చేసుకున్నారు. సినిమా నటులు, క్రికెట్ స్పార్స్, ప్రదేశాల పేర్లు, ఇలా ఎన్నో తప్పుగా పలుకుతున్నామని సోదాహరణంగా వివరించారు.

ఆవిష్కరణ సభకు పోలీస్ ఉన్నతాధికారి శ్రీ మురళీమోహన్ గారు, ఆయన సతీమణి శ్రీమతి మైధిలి గారు తమ సహకారాన్ని అందించారు. సాహితి పబ్లికేషన్స్ కార్య నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మిగారు, సాహితీవేత్త శ్రీ గుమ్మా సాంబశివరావుగారు, చాలామంది భాషా ప్రేమికులు సభకు హాజరైనారు. పాణ్యం దత్తశర్మగారి వందన సమర్పణతో పుస్తకావిష్కరణసభ ముగిసింది.

శ్రీ మురళీమోహన్ గారు, ఆయన సతీమణి శ్రీమతి మైధిలి గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here