[dropcap]వి[/dropcap]శాఖపట్టణానికి చెందిన సత్తి లలితారెడ్డి, సత్తి సునీల్, సత్తి స్నిగ్ధలు చాలా పరిశోధన చేసిన రాసిన పుస్తకం ‘సరియైన ఉచ్చారణ’. శ్రీ సత్తి సునీల్ గారు భారత ప్రభుత్వం లోని, దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర గూఢచార సంస్థ (సెంట్రల్ ఇంటెలిజెన్స్) లో యస్.పి.గా సేవలందించి రిటైరైనారు. నా సైన్స్ ఫిక్షన్ నవల (బాలల) ‘అడవితల్లి ఒడిలో’ చదివి, దానికి ఇంగ్లీష్ సమీక్ష వ్రాశారు. సహగ్రంథకర్తలు శ్రీమతి లలిత, స్నిగ్ధ.
తెలుగు భాషలోని ఉచ్చారణ దోషాలపై వీరు సమగ్ర పరిశీలన జరిపి, ఈ పుస్తకాన్ని తెచ్చారు. ‘పత్రికలను దారికి తెచ్చిన దంపతులు’గా వీరిని ప్రముఖ సంపాదకులు శ్రీ గోవిందరాజు చక్రధర్ గారు ప్రశంసించారు. కేవలం తెలుగే కాదు, మనం నిత్యవ్యవహారంలో వాడే ఆంగ్ల, హిందీ, ఉర్దూ పదాలు కూడా, తెలియక, మనం తప్పుగా ఉచ్చరిస్తున్నామని తెలిసి ఆశ్చర్యపోతాము. ఈ తప్పులు చాలా మటుకు అన్నిరంగాల వారు చేస్తున్నారు.
‘ప్రమాదో ధీమతామపి’ అని సరిపెట్టుకోవడానికి లేదు. తప్పు తప్పే! చేసిన వారు ధీమంతులయినంత మాత్రాన ఒప్పుకాదు కదా!
రచయితల్లో కొంతమందికి భాష మీద పట్టు ఉండదు. పుస్తకం వెనుక, ఇది ఎవరెవరికి ఉపయోగమో ఒక లిస్టు ఇచ్చారు. అందులో రచయితలను చేర్చలేదు. చేరిస్తే బాగుండేది!
భాషలో దొర్లే ఉచ్చారణా దోషాలను అల్ఫాబెటికల్ ఆర్డర్‍లో, పట్టికల రూపంలో ఇచ్చారు. పట్టికలో 3 కాలమ్స్ ఉన్నాయి. 1) ఇంగ్లీషు పదం (క్యాపిటల్స్‌లో) 2) తప్పుగా పలుకుతున్న పదం (తెలుగులో), 3) ఒప్పుగా పలకాల్సిన పదం (తెలుగులో).
వీటిలో ఊర్ల పేర్లు, వ్యక్తుల పేర్లు, ఇలా అన్నిరకాలు ఉన్నాయి.
ప్రతి విభాగం చివర స్నిగ్ధ గారు రాసిన స్నిప్పెట్స్ (చిరు వివరణలు) ఉన్నాయి. అవి చాలా informative గా, educating గా ఉన్నాయి. చాలా పదాలు నేను కూడా తప్పుగా పలుకుతున్నానని తెలుసుకొని సిగ్గుపడ్డాను. మొన్న సునీల్ గారు నాకు ఫోన్ చేశారు. మేము మధ్యప్రదేశ్ టూరు వెళ్లి వచ్చాము ‘ఖజురహో’ చూశామని వారితో చెబితే, దానిని ‘ఖజురాహో’ అనాలని సరిదిద్దారు!
సినిమా నటుడు ‘ఆలీ’ ని ‘అలీ’ అనాలని, నేరములలో దోషి ఉండే స్థలకాల సాక్షాన్ని ‘ఎలిబీ’ అనకూడదనీ, ‘ఎలిబై’ అనలనీ, ఇంకో పేరును సూచించడాన్ని ‘అలియాస్’ అనకూడదనీ, ‘ఇలియాస్’ అనాలనీ, ఐశ్వర్యరాయ్‌ని ‘ఐశ్వర్య రై’ అనాలని, చుక్కా రామయ్య గారిని ‘చుక్క రామయ్య’ అనాలని, కార్ప్స్ (Corpse) కాదనీ, ‘కోర్’ అనీ, సి.బి.సి.ఐ.డి. అనేది ఇప్పుడు లేదనీ; ‘డయాస్’ ను ‘డెయస్’ అనాలనీ, ఢిల్లీని దిల్లీ అనాలనీ, మోడీని ‘మోదీ’ అనాలనీ’, ‘దేశాయ్’ కాదనీ, ‘దేసాయ్’ అనీ, ధావన్ కాదు ‘ధవన్’ అనీ, ‘ఢాబా’ (dhaba) కరెక్టనీ, ధాబా కాదనీ, అజిత్ దోవల్ కాదు ‘దోభాల్’ అనీ, ఎలాన్ మస్క్‌ను ఈలాన్ మస్క్ అనాలనీ, ఫాసిమైల్ కాదు ఫాక్సీమలీ అనీ, ఫీజు కాదు ఫ్యూజ్ అనే ‘గినియా’ కాదు ‘గినీ’, హిండ్ (rear) కాదు హైండ్ అనీ, హోటల్ కాదు హోటెల్ అనీ, హౌరా కాదు హావ్‌డా అనీ, ‘నిఘావర్గాలు’ అని రాయకూడదనీ, జిలేబీ కాదు జలేబీ అనీ, బృందా కారత్ కాదు బృందా కరాట్ అనీ, కాశ్మీర్ కాదు కశ్మీర్ అనీ, ముఖేష్ కుమార్ మీనా కాదు ముఖేశ్ కుమార్ మీణా అనీ, నరేష్, సురేష్, మహేష్, దినేష్ లాంటి పేర్లలో ‘ష్’ కాదు ‘శ్’ వాడాలనీ, నెంబర్ కాదు నంబర్, చెఫ్ కాదు, షెఫ్ అనాలని, ‘ట్విట్టర్’ కాదు ‘ట్విటర్’ అనీ, ‘వారణాసి’ కాదు ‘వారాణసీ’ అనాలనీ చెప్తారు. ఇలా ఎన్నో విషయాలు మనకు ఈ పుస్తకం వల్ల తెలుస్తాయి. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో కూడా ఈ తప్పులు చేస్తారు. ఆఁ, ఎలా పలికితే ఏమి? కొంప మునిగేదేముంది అనుకుంటే చేసేదేం లేదు. నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తమైన పుస్తకం.
***
సరియైన ఉచ్చారణ (వ్యక్తిత్వ వికాస గ్రంథం)
రచన: సత్తి లలితారెడ్డి, సత్తి సునీల్, సత్తి స్నిగ్ధ,
వెల: ₹ 100/-
ప్రతులకు:
సత్తి సునీల్,
సెల్ నెం: 9492641252, లేదా 9502936848