Site icon Sanchika

సరిగ్గా వ్రాద్దామా? -1

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

కం.
చక్కని తెలుగును మనమే
మక్కువ పలికినటుగాను మంచిగ పేర్చన్
ఇక్కడ యక్షరమును గన
మిక్కిలి బాధను నలుగును మెరమెర మనసే!

*

[dropcap]భా[/dropcap]షా ప్రేమికులకు కష్టమే కదా, ముఖ పుస్తక టపాలలో వ్రాసే తెలుగు పదాలను చదవటం, ఆస్వాదించటం!

ఒకప్పుడు రచన చేయటమంటే కేవలం కాగితాల పైన వ్రాసుకుంటూ పోవటమే. ఆ కాలంలో ఎన్ని వందల కాగితాలైనా అలాగే వ్రాసుకుంటూ వెళ్ళేవారు. ఎక్కడైనా తప్పు వస్తే ఆ కాగితం చించివేసి మళ్ళీ వ్రాయటమే తప్ప మరో మార్గం లేదు.

అయినా ఎన్ని పుస్తకాలు! ఎన్ని కథలూ, నవలలూ? అక్షరదోషాలు ఉన్నాయా? లేవు! విరామ చిహ్నాల తప్పులు ఉన్నాయా? లేవు! మరి మనమెందుకిలా వ్రాస్తున్నాము?

మనకు ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు! చక్కనైన కంప్యూటర్‌లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాపులు, మొబైళ్ళూ… మంచి తెలుగును వ్రాసుకోవటానికి ఉపయోగపడే కీ బోర్డులు… మళ్ళీ వీటిలో అచ్చతెలుగు కీ బోర్డ్‌లు, ఆంగ్లంలో టైప్ చేస్తే తెలుగు వచ్చే ట్రాన్సిలిటరేషన్ కీ బోర్డ్‌లు కూడా. ఎమ్మెస్ వర్డ్ డాక్యుమెంట్‌లు, గూగుల్ డాక్స్. తప్పు వస్తే వెంటనే సరిచేసుకోగలిగే సౌలభ్యం. వ్రాస్తుండగా ఏదైనా ఆలోచన వస్తే మధ్యలో దాన్ని ఇమిడ్చి (insertion) వ్రాసుకోగలిగే సౌకర్యం.

అయినా మనం తప్పులే వ్రాస్తాము. సరియైన పదాలను తెలుసుకోవటానికి ప్రయత్నించము. తెలిసినవారు చెబితే కోప్పడతాము. తప్పులకు కారణం టైపోస్ అని, మొబైల్ తెలుగులో తప్పులు వస్తాయని సాకులు చెబుతాము. కారణమేమిటి? కేవలం అలక్ష్యం! నిబద్ధత లేకపోవటం. మళ్ళీ సరిచేసుకోవాలంటే, తిరగ వ్రాయాలంటే బద్ధకం! సరిగ్గా నేర్చుకోవాలంటే అనాసక్తత. అసలు నేను తప్పులే వ్రాయననే ఓ చిన్న అహంకారం!

ఇప్పటి బడులలో తెలుగే లేదు. అంచేత సరియైన బోధన, శిక్షణ లేవు. పోనీ స్వయంగా నేర్చుకుందామన్న తపన కూడా అంతంత మాత్రంగానే ఉంది. మాతృభాష పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని కేవలం తెలుగు వారిలోనే చూస్తాము.

మనం వ్రాసే విషయం/వ్యాసం/కవిత/గేయం/కథ/ నవల ఎంత మధురమైనవి అయినా చదివింపజేయాలి కదా! అందుకని మనం తప్పులు వ్రాయకూడదు. తప్పులుంటే ఎవరికీ చదవాలని అనిపించదు. ఇక ఆ రచన నిరర్థకమే కదా!

ఇక టంకణ దోషాలు. మనం వ్రాస్తున్న పదాల భావం మనకు తెలుసు. అలాగే వాటి సరియైన వ్రాసే పద్ధతి కూడా. కానీ ప్రాణం లేని మొబైల్‌కి కానీ, కంప్యూటర్‌కి కానీ తెలియవు. అవి యంత్రాలు మాత్రమే. అందుకే వ్రాసిన తరువాత మనం తప్పకుండా ఓ సారి చదువుకుని, తప్పులుంటే సరి చేసుకున్నాక మాత్రమే పోస్ట్ చేయాలి.

అది మన ప్రథమ విధి.

(మళ్ళీ కలుసుకుందాం.)

Exit mobile version