Site icon Sanchika

సరిగ్గా వ్రాద్దామా?-15

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

[dropcap]ఈ[/dropcap] భాగంలో స్థూలంగా రచనలు – ముఖ్యంగా కథారచన చేయాలంటే మనం తప్పనిసరిగా అనుసరించవలసిన విషయాల గురించి చర్చించుకుందాము.

  1. పుస్తక పఠనం అనే అంశాన్ని తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎన్ని ఎక్కువ కథలు చదివితే అంత మంచి శైలి మనకు అలవడుతుంది. విషయాన్ని ఎలా చెప్పాలో, ఎంత వరకూ చెప్పాలో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే, పుస్తకాలు చదవని వారికి వ్రాసే అర్హత లేనట్టే. మంచి పాఠకుడు మాత్రమే మంచి రచయిత అవగలడనటం నిర్వివాదాంశం. అందుచేత తొమ్మిది కథలు చదవండి. పదవ కథ మీరు వ్రాయండి.
  2. తప్పులు లేకుండా వ్రాయాలి. అక్షరదోషాలు సరిచేసుకోగలగాలి. పదాలు సరిగ్గా ఎలా వ్రాయాలో తెలుసుకొని వ్రాస్తే, టైపో దోషాలను సరిచేసుకోవటం అంత కష్టమేమీ కాదు.
  3. పంక్చుయేషన్ పాటించాలి. పదాల మధ్య స్పేసింగ్ పాటించాలి. అలాగే పేరాగ్రాఫ్‌ల మధ్య కూడా. సంభాషణలు వ్రాసినపుడు కొటేషన్స్ తప్పనిసరి అని గుర్తించాలి. ఇవన్నీ మనం ఇదివరలో విశదంగా చర్చించుకున్న విషయాలే.
  4. మనం తెలుగు భాషలో వ్రాస్తున్నాము కనుక సాధ్యమైనంత వరకూ పరభాషా పదాలను నివారించాలి. అంటే గ్రాంథిక భాష వ్రాయమని కాదు. వాడుక తెలుగు పదాలను ఉపయోగించాలి. అత్యవసరమైతే తప్ప ఆంగ్ల పదాలను ఉపయోగించకండి. పదాల సంపదను పెంపొందించుకోవాలి. అందుకు గల ఏకైక మార్గం పుస్తక పఠనమే. సందేహం కలిగినా, తెలియక పోయినా, కొత్త పదాలు నేర్చుకోవాలన్నా నిఘంటు సహాయం తీసుకోవాలి.
  5. కథ వ్రాసేటప్పుడు దాన్ని సూక్ష్మంగా వ్రాసుకోవాలి. దీనినే ఆంగ్లంలో సినాప్సిస్ అని అంటారు. ఇలా చేయటం వలన ఒక క్రమపద్ధతిలో వ్రాయటం అలవాటు అవుతుంది.
  6. కథ యొక్క ఎత్తుగడ, నడక, ముగింపు చక్కగా రావాలి. మనకు తెలిసిన విషయాలన్నీ కథకు అవసరం లేకపోయినా వ్రాస్తూ పోకూడదు. ఎంత అవసరమో అంతే వ్రాయాలి. కథ వ్రాసిన తరువాత కనీసం రెండుసార్లు చదివితే అనవసరమైన విషయాలు మనకే తెలిసిపోతాయి. నిర్దాక్షిణ్యంగా వాటిని తొలగించాలి. ఇలా అనవసరమైన దానిని తొలగించి, ముఖ్యమైన విషయాలను మాత్రం ఉంచటమే శిల్పం అంటే.
  7. ఒక పురుషలో కథ మొదలు పెట్టి, మరొక పురుషలో కొనసాగించకండి. మోహన్ అంటూ మొదలు పెట్టి, మధ్యలో అన్నాను, చేసాను అని వ్రాసేస్తూ ఉంటారు కొందరు. అది తప్పుగా భావించరు కూడా. కానీ పాఠకులకు అది ఎంత తికమకగానో ఉంటుంది. కనుక చూసి సరిచేసుకోండి.
  8. సాధ్యమైనంత వరకూ పెద్ద పెద్ద పేరాగ్రాఫ్‌లను నివారించాలి. చిన్న చిన్న పేరాగ్రాఫ్‌లుగా వ్రాస్తే, పాఠకులకు చదవటానికి ఆసక్తికరంగా ఉంటుంది. లేకపోతే పేజీలు తిప్పేస్తారు. మనం చెప్పదలచుకొన్న విషయం అవతలి వారికి మరి చేరదు.
  9. చక్కని విషయ పరిజ్ఞానంతో వ్రాయాలి. ముఖ్యంగా చారిత్రక విషయాలను, రాజకీయ, సామాజిక విషయాలను ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తగా వ్రాయాలి. ఇందిరాగాంధీ ఎవరంటే మహాత్మా గాంధీ గారి కోడలని వ్రాయకూడదు. అన్నమాచార్యుడు, త్యాగరాజు ఇద్దరూ వాగ్గేయకారులే కదా అని, ఇద్దరినీ సమకాలీనులుగా వ్రాయకూడదు. తెలియని విషయాలను ప్రస్తావించకపోవటమే మంచిది.
  10. వ్యక్తిత్వ వికాసాన్ని, ఆత్మబలాన్ని పెంపొందించేలా పాత్రలను సృష్టిస్తూ సాధ్యమైనంత సానుకూల దృక్పథంతో వ్రాయాలి. నెగిటివిటీని, వ్యతిరేక భావనలను, నైరాశ్యాన్ని పెంచేలా వ్రాయకూడదు. దానివలన కథ చదివే పాఠకులకు ఆనందం బదులుగా విసుగు, విషాదం పెరుగుతాయి. కరుణరసం వ్రాసినా అది పరిమితులకు లోబడి ఉండాలి. ఎక్కువైతే ఏదైనా వికటిస్తుంది కదా!
  11. హాస్యం, వినోదం పేరుతో మానవులలోని అవకరాలను గురించి, శారీరక లోపాల గురించి హేళనగా వ్రాయకండి. అప్పుడు అసలైన మానసిక వైకల్యం మీదే అవుతుందని మరువకండి. మన కలానికి సైతం ఒక సంస్కారం ఉండాలి కదా!
  12. అలాగే అసభ్య పదజాలాన్ని, వెకిలి హాస్యాన్ని విడనాడండి. హాస్యమంటే గిలిగింతలు పెట్టే ఆరోగ్యకరమైన హాస్యంగా ఉండాలి కానీ, అశ్లీలతతో కూడి కాదు. లలితమైన ప్రేమకథలలో విపరీతమైన శృంగార రసాన్ని నింపకండి. పాత్రల ఔచిత్యం దెబ్బతిని, పఠితలకు వెగటు కలుగుతుంది. రచయిత అనేవాడు సభ్య సమాజానికి ఒక కరదీపిక వంటి వాడని మరువకండి. అతని బాధ్యత చాలా పెద్దది.
  13. కుదిరినంత వరకూ వ్రాసే ఆశయాలు, ఆదర్శాలు ఆచరించటానికి ప్రయత్నించండి. ‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అనే కవి మాటను నిజం చేయకండి. మన పాత్రలు ఎంత హుందాగా ఉంటాయో వాటి సృష్టికర్తలమైన మనం మరింత హుందాగా ఉండాలి కదా!
  14. రొటీన్ కథావస్తువులు కాకుండా కొత్త కథావస్తువులను ఎన్నుకోండి. ఉదాహరణకు ప్రధాన పాత్రలుగా ఒక కొబ్బరి బొండాలమ్మే వ్యక్తిని లేదా కార్పొరేట్ ఆసుపత్రిలో ఐసీయూలో పనిచేసే నర్స్‌ని ఎంచుకొని కథలల్లండి.
  15. ఎక్కువ పాత్రలతో కథ వ్రాయకండి. దాని వలన ఒక దశలో రచయితకే తికమక కలుగుతుంది. ఒకటి లేదా రెండు సంఘటనలు, నాలుగుకి మించకుండా పాత్రలు ఉంటే కథ రక్తి కడుతుంది. అలాగే ఒకేలాంటి పేర్లతో ఎక్కువ పాత్రలు సృష్టించవద్దు. రామయ్య,. రామారావు, రామ్ అనే మూడు పాత్రలతో కథ వ్రాసారనుకోండి, పాఠకులకు ఎవరు ఎవరో అర్థం కాదు.
  16. ‘నిర్ణయం’, ‘అనురాగం’, ‘స్వయంకృతం’, ‘మంచితనం’, ‘స్వార్థం’, ‘అసమర్థత’, ‘బాధ్యత’ వంటి పాత చింతకాయ మకుటాలకు స్వస్తి చెప్పండి. కొత్త టైటిల్స్‌ని సృష్టించండి. ‘ఆ గదిలో…’, ‘గడియారంలో మూడు ముళ్ళు’, ‘అమ్మా! నా వేలు పట్టుకో…’, ‘రహదారిలో అగ్నిపూలు’, ‘గుడ్ బై మధూ!’ వంటి కొత్త టైటిల్స్ కథ పట్ల ఆసక్తినీ, చదవాలన్న తహతహనూ కలిగిస్తాయి. శారద, అరుంధతి వంటి ప్రధాన పాత్రల పేర్లతో గల శీర్షికలకు కాలం చెల్లిపోయింది, గమనించండి.
  17. మన చుట్టూ ఉన్న పరిసరాలను, దైనందిన జీవితంలో మనకు కలిగే అనుభవాలను, తారసపడే వివిధ వ్యక్తులను గమనిస్తే, మీకు కథావస్తువులకు లోటుండదు.
  18. ఎవరిమీదనైనా ఆగ్రహం కలిగితే దానిని ప్రకటించటానికి ఒక విమర్శాస్త్రంగా మాత్రం కథ వ్రాయకండి. విచక్షణారహితంగా వ్రాసే ఆ వ్రాతలు కేవలం డైరీలలో పేజీల వంటివి. పూర్తిగా వ్యక్తిగతం. కథ అంటే విషవృక్షం కాదు, అమృతఫలం.
  19. కథకు ముగింపు అనేది ఒక ప్రాణం. కథ వ్రాసి, అసంపూర్తిగా వదిలేయకుండా సరియైన ముగింపునివ్వండి. పాఠకుల ఊహలకు వదిలిపెట్టవద్దు. ముక్తాయింపు, కథను సృష్టించిన వాడు చేస్తేనే బాగుంటుంది.
  20. క్లుప్తత, కొంచెం భావుకత, విషయ వివరణ, చక్కని సంభాషణలు, అంతర్లీనంగా ఒక చక్కని సందేశం, తీరైన ముగింపు మీ కథను రత్నసింహాసనం మీద కూర్చోబెడతాయి. ఈ విషయం మరువకండి.

కథారచన పైన నాకున్న అనుభవం తక్కువే అయినా, నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పాను. ఇంకా మనం తెలుసుకోవలసిన విషయాలు అనంతం. ఈ వ్యాసాలు మీకు ఉపయోగపడతాయనే నేను ఆశిస్తున్నాను.

*

గత పధ్నాలుగు వారాలుగా నా ‘సరిగ్గా వ్రాద్దామా?’ శీర్షికలో ప్రచురితమైన వ్యాసాలను చదివి, ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు. నాకీ అవకాశం కలిగించిన ‘సంచిక’ సంపాదక వర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

(సమాప్తం)

Exit mobile version