సరిగ్గా వ్రాద్దామా?-2

0
2

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

కం.
తెలుగున మాటలు పలుకుచు
తెలుగున పదములు లిఖించు తీరునెరుగవా?
తెలుగున దోసములెందుకు?
తెలివిగ నేర్చియు రచింప తెలుసుకొనుమిదే…
*

అవునండీ. మనందరి మాతృభాష తెలుగు. మనకిష్టమైన, మాటలాడటానికి ఎంతో అనువైన మన భాష తెలుగే. మరి ఇంత మధురమైన భాషను వ్రాయటానికి సమస్య ఎందుకు వస్తోంది?

ఇప్పటి యువతకు, బాలబాలికలకు కొరవడినది, యాభై సం. వయసు పైబడిన వారందరికీ లభ్యమైనదీ ఒక సౌలభ్యం, పాఠశాలలోనే తెలుగు అక్షరముల అభ్యాసం. అవును కదండీ?

మరి అ నుంచి క్ష వరకూ గల ఆ ‘అక్షరమాల’ను ఒక్కసారి మననం చేసుకొని వ్రాయాలి కదా! అదే… త-ప్పు-లు-లే-కుం-డా! అప్పుడే కదా మనం అక్షరాన్ని గౌరవించినట్టు! ఈ నిబద్ధత లేనంత వరకూ మనమెన్ని వ్రాసినా, వ్రాయనట్టే లెక్క.

కొన్ని పదాలు తెలియక తప్పుగా వ్రాస్తాము. మరికొన్ని తప్పుగా వ్రాసామని తెలిసినా చప్పరించేసి తప్పుకుని పోతాము. సరియైన పదాలు తెలుసుకొని సక్రమంగా వ్రాయాలన్న ఆరాటం మొగ్గ దశలోని రచయితలకే కాదు, పరిణతి చెందిన రచయితలకు సైతం ఎంతో ముఖ్యం.

సాధారణంగా మనం తప్పుగా వ్రాసే పదాలు కొన్ని ఉంటాయి. అది ఒక తికమక ఉండటం వలన జరుగుతుంది. అచ్చులు మాత్రమే ఉపయోగించవలసిన చోట హల్లులు ఉపయోగించటం తగనిది.

ఈ పదాలు పరికించండి.

తప్పు              ఒప్పు
యెలా? ఎలా?
యెంత? ఎంత?
యెక్కడ? ఎక్కడ?
యేమని? ఏమని
యెందుకు? ఎందుకు?
యేం? ఏం?
యెప్పుడు? ఎప్పుడు?
యెద/యద ఎద
వుంది ఉంది
వూరు ఊరు
వూయల ఊయల
వుడుత ఉడుత
వుంగరము ఉంగరము
వూట ఊట
వొక్కటి/వక్కటి ఒక్కటి
వొంటరి/వంటరి ఒంటరి
వొంటె/వంటె ఒంటె
వొళ్ళు/వళ్ళు ఒళ్ళు
వొడ్డు/వడ్డు ఒడ్డు
వోడ ఓడ
వత్తు ఒత్తు
వత్తిడి ఒత్తిడి

నియమబద్ధంగా వ్రాయాలనుకునే వారు పై పదాలను ఒక పుస్తకంలో వ్రాసుకోండి. ఒప్పుగా ఉన్న పదాలను మాత్రమే వ్రాసే అభ్యాసం చేయండి.

ఇంకో దోషం ‘థ’ – ‘ధ’.

అంటే థ వ్రాయవలసిన ప్రతీచోటా ధ ఉపయోగించటం! కొన్నాళ్ళకు పాపం అక్షరమాలలో థ కు స్థానమే ఉండదేమో అని భయంగా ఉంటున్నది.

ఈ పదాలు చూడండి.

  • రథికుడు
  • సారథ్యం
  • దాశరథి
  • దశరథుడు
  • రథము
  • సారథి
  • కథ
  • కథనము
  • కథకుడు
  • ప్రార్థన
  • అర్థము
  • స్వార్థము
  • సార్థకత
  • అనాథ
  • నాథుడు
  • పథము
  • అతిథి
  • తిథి
  • పథ్యము
  • తథ్యము
  • అంతర్థానము
  • ప్రస్థానము
  • స్థానము
  • స్థావరము
  • స్థాణువు
  • అవస్థ
  • వ్యవస్థ
  • సంస్థ
  • స్వార్థము
  • స్థాపన
  • పథికుడు
  • గాథ
  • మైథిలి
  • మిథిల
  • మిథునము
  • స్థిరము
  • స్థైర్యము
  • పథకము
  • వ్యర్థము
  • పదార్థము
  • తీర్థము
  • స్థాయి
  • వానప్రస్థము
  • తథాస్తు
  • యథాతథంగా
  • యథా
  • ప్రథమ
  • ప్రమథ గణము
  • అశ్వత్థామ
  • ఉత్థానము
  • థాంక్స్
  • అభ్యర్థి
  • అర్థించు
  • ప్రార్థించు
  • పార్థుడు
  • పృథ
  • పంథా
  • మిథ్య
  • తథాగతుడు
  • మథనము
  • మన్మథుడు
  • మథించు
  • మథిర
  • శిథిలము

పై పదాలన్నింటిలోనూ, థ కు బదులుగా ధ అక్షరాన్ని యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. అది నివారిస్తే బాగుంటుందని, నివారించమని నా మనవి.

తికమకలో తప్పుగా వ్రాసే పదాలు మరికొన్ని. బాధ, బాధ్యత, భేదము, సందర్భము, అద్భుతము మొదలైనవి. (బేధము, భాద, భాద్యత, సంధర్భము, అధ్భుతము అని వ్రాస్తారు.)

ఇంకా కొన్ని పదాలలో ఒక అక్షరానికి ఒత్తుగా దాని మహా ప్రాణాక్షరం వస్తుంది. అవి కూడా తప్పుగానే వ్రాస్తారు.

ఉదా: ప్రసిద్ధి, సిద్ధి, బుద్ధి, సిద్ధము, యుద్ధము, ఇచ్ఛ, స్వేచ్ఛ, ఉచ్ఛము, పుచ్ఛము, గుచ్ఛము మొదలైవి. (ప్రసిద్ది, సిద్ది, బుద్ది, సిద్దము, యుద్దము, ఇచ్చ, స్వేచ్చ, ఉచ్చము, పుచ్చము, గుచ్చము ఇలా వ్రాస్తారన్న మాట!)

మరి ఇది చదువుతున్న మిత్రులు ఈ తప్పులు మరి చే(వ్రా)యరు కదూ?

వచ్చే వారం కలుద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here