Site icon Sanchika

సరిగ్గా వ్రాద్దామా?-7

[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]

~

[dropcap]క్రిం[/dropcap]దటి తరగతిలో వివిధ పంక్చుయేషన్ మార్క్‌ల గురించి తెలుసుకున్నాము. ఈనాటి తరగతిలో మనం స్పేసెస్ గురించి తెలుసుకుందాం.

“చాలా బాగున్నాయండీ మీ మొక్కలు, మీ తోట… ఎంతో శ్రమపడి పెంచారు…” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు శ్రీహరి. “థాంక్స్ బాబూ… నాకూ, మా ఆవిడకూ తోట అంటే ప్రాణం… తప్పనిసరియై ఇల్లు అద్దెకు ఇస్తున్నాము కానీ మా ప్రాణాలన్నీ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి…” దిగులుగా అన్నాడు జగన్నాథం. “మాలీ ప్రతీరోజు వస్తాడు… తోట సంరక్షణ అంతా అతనే చూసుకుంటాడు… కానీ మీరు కూడా ఓ కంట కనిపెట్టి చూసుకోండి బాబూ… అమ్మాయికి కూడా చెప్పండి…” దిగులుగా అంది మాణిక్యాంబ. “అయ్యో పిన్ని గారూ, మీరింతగా చెప్పవలసిన అవసరం లేదండీ, మా ప్రాణంలాగే చూసుకుంటాము… మీరు నిశ్చింతగా వెళ్ళి రండి…” చెప్పాడు శ్రీహరి.

పైన వ్రాసిన మేటర్ ఎలా ఉంది? సులభంగా చదవగలిగేలాగానే ఉందా? ఉహూ. పేరాగ్రాఫ్‌లుగా విడగొట్టబడకుండా ఒకే పేరాలా ముద్దగా ఉంది కదా? దీనిని ఇలా విభజిస్తే?

“చాలా బాగున్నాయండీ మీ మొక్కలు, మీ తోట… ఎంతో శ్రమపడి పెంచారు…” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు శ్రీహరి.

“థాంక్స్ బాబూ… నాకూ, మా ఆవిడకూ తోట అంటే ప్రాణం… తప్పనిసరియై ఇల్లు అద్దెకు ఇస్తున్నాము కానీ మా ప్రాణాలన్నీ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి…” దిగులుగా అన్నాడు జగన్నాథం.

“మాలీ ప్రతీరోజు వస్తాడు… తోట సంరక్షణ అంతా అతనే చూసుకుంటాడు… కానీ మీరు కూడా ఓ కంట కనిపెట్టి చూసుకోండి బాబూ… అమ్మాయికి కూడా చెప్పండి…” దిగులుగా అంది మాణిక్యాంబ.

“అయ్యో పిన్ని గారూ, మీరింతగా చెప్పవలసిన అవసరం లేదండీ, మా ప్రాణంలాగే చూసుకుంటాము… మీరు నిశ్చింతగా వెళ్ళి రండి…” చెప్పాడు శ్రీహరి.

ఇలా పేరాలుగా విభజించి, లైన్ల మధ్యన ఖాళీలు వదలటాన్నే లైన్ స్పేసింగ్ అంటాము. మనము వ్రాసిన విషయము చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి, చదువరులకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. దీనికి చేయవలసిందల్లా ఎంటర్ బటన్ నొక్కటమే.

ఇది చూడండి.

“చాలా బాగున్నాయండీ మీ మొక్కలు, మీ తోట… ఎంతో శ్రమపడి పెంచారు…” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు శ్రీహరి.

“థాంక్స్ బాబూ… నాకూ, మా ఆవిడకూ తోట అంటే ప్రాణం… తప్పనిసరియై ఇల్లు అద్దెకు ఇస్తున్నాము కానీ మా ప్రాణాలన్నీ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి…” దిగులుగా అన్నాడు జగన్నాథం.

“మాలీ ప్రతీరోజు వస్తాడు…తోట సంరక్షణ అంతా అతనే చూసుకుంటాడు… కానీ మీరు కూడా ఓ కంట కనిపెట్టి చూసుకోండి బాబూ… అమ్మాయికి కూడా చెప్పండి”… దిగులుగా అంది మాణిక్యాంబ.

“అయ్యో పిన్ని గారూ, మీరింతగా చెప్పవలసిన అవసరం లేదండీ , మా ప్రాణంలాగే చూసుకుంటాము… మీరు నిశ్చింతగా వెళ్ళి రండి”. చెప్పాడు శ్రీహరి.

పై పేరాలు గమనించండి. సంభాషణలో ప్రతీ సారీ కొటేషన్ తరువాత స్పేస్ ఇచ్చి మరీ వాక్యం వ్రాయటం మొదలైంది. ఇది సరికాదు. ప్రారంభ కొటేషన్‌కి అంటిపెట్టుకుని పదం మొదలవాలి. అంతిమ కొటేషన్‌కి అంటిపెట్టుకొని లోపలిభాగంలో విరామ చిహ్నాలు ఉండాలి. పైన వ్రాసిన పేరాలలో కావాలని కొటేషన్స్ ముగిసిన తర్వాత విరామచిహ్నాలు పెట్టటం జరిగింది. అది సరి కాదు.

ప్రతీ వాక్యం ఏదో ఒక విరామ చిహ్నంతో ముగుస్తుంది. (ఉదా: బిందువు, ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకము, మూడు చుక్కలు.) కొత్త వాక్యం వ్రాసేటప్పుడు ఆ విరామ చిహ్నాన్ని అంటుకొనేలా కొత్త వాక్యం మొదలు పెడుతూ ఉంటారు. అది సరికాదు. ఖచ్చితంగా ఒక స్పేస్ ఇచ్చిన తరువాత మాత్రమే కొత్త వాక్యం మొదలవాలి.

కేవలం ఫుల్‌స్టాప్ తరువాత మాత్రమే కాదు, వాక్యం మధ్యలో వచ్చే పదాల మధ్య కూడా కామా తరువాత స్పేస్ ఇవ్వటం తప్పనిసరిగా చేయాలి.

ఉదా 1: మా నాన్న సంతనుంచి నా కోసం కందికాయలు , మొక్కజొన్న పొత్తులు , పల్లీకాయలు , సపోటా పళ్ళు తెచ్చాడు. (తప్పు)

పైన ఇచ్చిన ఉదాహరణలో కందికాయలు అనే పదం తరువాత, స్పేస్ ఇచ్చి, కామా వ్రాయబడింది. అలాగే పొత్తులు, పల్లీకాయలు, సపోటా పళ్ళు మొదలైన పదాల తరువాత కూడా. ఇది తప్పు. ఖచ్చితంగా పదాన్ని అంటిపెట్టుకొని మాత్రమే కామా ఉండాలి. అలాగే తదితర విరామ చిహ్నాలు కూడా.

ఉదా 2: మా నాన్న సంతనుంచి నా కోసం కందికాయలు,మొక్కజొన్న పొత్తులు,పల్లీకాయలు,సపోటా పళ్ళు తెచ్చాడు. (తప్పు)

పైది కూడా తప్పే. కామాల తరువాత ఇవ్వవలసిన స్పేస్ లు ఇవ్వలేదు కనుక.

ఉదా 3: మా నాన్న సంతనుంచి నా కోసం కందికాయలు, మొక్కజొన్న పొత్తులు, పల్లీ కాయలు, సపోటా పళ్ళు తెచ్చాడు. (ఒప్పు)

మీకు తేడా అర్థమైందనుకుంటున్నాను. ఇలా స్పేస్‌లు ఇవ్వవలసిన చోట మాత్రమే ఇవ్వాలి. ఇవ్వకూడని చోట ఇవ్వకండి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలున్నా నిస్సంకోచంగా నన్ను అడగండి.

విరామ చిహ్నాలలో (…) మూడు చుక్కల గురించి ఒక వివరణ. నేను గమనించిన విషయమేమిటంటే, సోషల్ మీడియాలో వ్రాస్తున్న ఎందరో యువ రచయితలు, వర్థమాన రచయితలు చుక్కలను విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల రెండు చుక్కలు (..), కొన్ని చోట్ల మూడు (…) ఇలా. ఎంత ఎక్కువగా అంటే, ఫుల్‌స్టాప్‌ల బదులుగా కూడా ఇవే వాడుతున్నారు. ఇలా వ్రాయటం వలన ఆ కథ కానీ, వ్యాసం కానీ చుక్కల మయమైపోయి, ముగ్గులూ, ఆకాశంలో నక్షత్రాలు గుర్తు వస్తాయి తప్ప మేటర్‌ను చదవలేము. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదండీ. కాబట్టి మోతాదు మించి ఏది ఉపయోగించినా వికటిస్తుంది.

స్పేస్‌ల గురించి మీ అవగాహన ఈ పాఠంతో పెరిగిందనే అనుకొంటున్నాను.

మరి ఇక సెలవా?

వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము.

Exit mobile version