Site icon Sanchika

సరిహద్దు

[dropcap]నా[/dropcap]కైతే….
అటూ ఇటూ మనిషే కనిపిస్తాడు
నాకైతే….
అంటూ సెంటూ లేని మనిషే అనిపిస్తాడు

వాళ్ళకేమో….
అటూ ఇటూ ఘాతకులే కనిపిస్తారు.
వాళ్ళకేమో….
అటూఇటూ పాతకులే అనిపిస్తారు.

వాళ్ళ హస్తాలతో నన్ను కదుపుతారు
వాళ్ళ శస్త్రాలతో మన్ను కుదుపుతారు

దేశాలంటూ గీతల్ని గీస్తారు
ఉపదేశాలంటూ గోతుల్ని తీస్తారు

ఆదేశాలంటూ రాతల్ని తీస్తారు
సందేశాలంటూ కోతల్ని కోస్తారు
సందేశాలంటూ రోతల్ని మోస్తారు
సందేహాలంటూ కోతల్ని కోస్తారు

వాళ్ళ రక్తాలతో నన్ను తడుపుతారు
వాళ్ళ రక్తాలతో కళ్ళు
తడుపుతారు

ఆశలంటూ నన్ను తడుముతారు
ఆశయమంటూ నన్ను చిదుముతారు

రాజులు చదరంగంలో గళ్ళు కదుపుతారు
రాజ్యాల చెదరంగంలో కుళ్ళు
కలుపుతారు

కత్తులమ్మే కసాయిలు నిప్పులో ఉప్పులేస్తారు
జిత్తులమ్మే కసాయిలు తప్పులో
ముప్పులేస్తారు

నాకైతే అటూఇటూ….

ఆకలే కనిపిస్తుంది
రోగాల కధే వినిపిస్తుంది
మూగ వ్యధే వినిపిస్తుంది
పాత కధే కనిపిస్తుంది

పాలకులనే పారసైట్ల కంటికి కనబడని కథే కనిపిస్తుంది
శాటిలైట్ల మింటికి కనబడని కలే కనిపిస్తుంది

గతించిన ఘోరచరిత్రలో గతించని,
గణించిన ఘనచరిత్రలో గణించని,
సామాన్యుల అసమాన అసహాయ పోరాటమే కనిపిస్తుంది.

రచించిన ఘనచరిత్రలో రచించని,
రచించిన మనచరిత్రలో రుచించని,
సామాన్యుల అసమాన అసహాయ ఆరాటమే కనిపిస్తుంది

కుంటు బడ్డ కుటీరమే కనిపిస్తుంది.
పురిటి బిడ్డ కళేబరం కనిపిస్తుంది
తిరగబడ్డ వారి తిప్పల కధలు…
తరమబడ్డ వారి తప్పుల కధలు…
తరగబడ్డ వారి ముప్పుల వ్యధలు…
తపనపడ్డ వారి నొప్పుల వ్యధలు…
అన్నీ అన్నీ కనిపిస్తాయి.
ఎన్నో ఎన్నో వినిపిస్తాయి.

భరించలేని, చరించలేని భారమైన బతుకులు ఒకవైపు….
చలించలేని, జ్వలించలేని ఘోరమైన బతుకులు ఇంకోవైపు….
రెండు వైపులా కనిపిస్తాయి.
అన్ని వైపులా వినిపిస్తాయి.

టీకాలకు లేదు డబ్బు దేశాలకు
టీకాలకు పోదు జబ్బు దేశాలకు

పీఠాలపై మోజు జబ్బు
పీడనకై మోజు జబ్బు
తరంతరం నిరంతరం ఇదే జబ్బు
చిరంతనం నిరంతరం ఇదే జబ్బు

అవసరమే అన్ని ధర్మాలను నిర్ణయించు కాలం
అవకరమే అన్ని మర్మాలను నిర్ణయించు జాలం

దేశమంటే మనుషులైతే….
మట్టిలో కలిపే మారణహోమాలెందుకో???
దేశమంటే బతుకులైతే….
మట్టిలో కలిసే దారుణహోమాలెందుకో???

Exit mobile version