సరికి సరి – పై వాడి లెక్క!!

0
2

[dropcap]వి[/dropcap]శ్వనాథానిది ఒకటే సిధ్ధాంతం, డబ్బు విషయంలో!

తనది అయితే చిల్లి గవ్వైనా వదలకూడదు, తనది కానిది పొన్ను గిన్నైనా తాక కూడదు అని!!

మహా ఖచ్చితం!!

అట్లా అని పిసినారి అనలేం, అవసరమైన చోట దర్జాగా ఖర్చు పెడతాడు, వెనక్కి వెళ్ళకుండా!!

కథలో ముందు కెళ్ళాలంటే, అతని ఉద్యోగం గూర్చి రెండు ముక్కలు చెప్పాలి. అసలతనికి ఉన్న ఆ జాగ్రత్త లక్షణానికి, అతను చేసే ఉద్యోగమే సగం కారణమేమో కూడా!

ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకులో మంచి హోదాలో ఉన్న ఆఫీసర్, విశ్వనాథం.

రోజూ తన కార్లో, మహానగరపు ట్రాఫిక్ సంద్రంలో ఈదుకుంటూనే వెళ్తాడు ఆఫీస్‌కి.

ఆ రోజెందుకో, విసుగు పుట్టి, ఓ నాలుగు నెల్ల కింద కొనుక్కొని, కృష్ణరథం లాగా పరుగెత్తుతుందని మురిసిపోయే తన కారు నుంచేసి, స్కూటర్ మీద వెళ్ళాడు!

వెళ్ళి స్కూటర్ పార్క్ చేస్తుంటే, “సార్, ప్లీజ్ హావ్ ఎ లుక్”, అని ఒక కుర్రాడు టై గట్రా కట్టుకుని శుభ్రంగా ఉన్నవాడు, అతని దగ్గరికొచ్చి, రెండు ‘Know All’, అన్న పుస్తకాలు చూపించి కొనమన్నాడు.

పాపం, MBA చదివి రోడ్డు మీద ఈ అమ్మకంతో జీవనం ఆరంభించినట్టున్నాడని కాస్త జాలి కలిగింది విశ్వనాథానికి. పిల్లలకు ఉపయోగిస్తాయి, అతనికీ కాస్త బేరం అయినట్టుంటుందని, సీటు కింద ఉండే డిక్కీ తెరిచి, అందులో ఉన్న బాగ్ లోపలి పౌచ్‌లో నుంచి, ఆ కుర్రాడు కోట్ చేసిన 500/- చెల్లించాడు, ఒక్క నోటుతో!!

ఆ అబ్బాయి, పుస్తకాలు ఇచ్చి, thanks చెప్పి వెళ్ళిపోయాడు.

టైం అయిపోయిందని, గబగబా, బాగ్ తీసుకొని, డిక్కీ లాక్ చేసి ఆఫీసు లోకి వెళ్ళి మామూలుగా తన పనిలో నిమగ్నమై పోయాడు, విశ్వనాథం.

***

ఉన్నట్టుండి, ఒకసారి తన అకౌంట్‌లో బాలెన్సు ఎంత ఉందో చూద్దామని  చూసుకుంటే, క్రితం రోజే కారు అప్పు కింద ఆ నెల ఇన్‌స్టాల్‌మెంట్ కట్టయినట్టు కనిపించింది. తీసుకున్నప్పటి నుంచీ దాదాపుగా పదివేల రూపాయలు వడ్డీ కిందే కట్టినట్టు తెలిసింది. నాల్గు నెలల్లోనే ఇంతయితే, ఈ లెక్కన బోలెడు డబ్బు, అప్పు తీర్చే లోపల, వడ్డీ కిందే, బ్యాంకు వారు చడీ చప్పుడూ లేకుండా వసూలు చేస్తారన్న మాట, ‘హౌరా’ అనుకున్నాడు!

తెలిసిన విషయమే అయినా, తలనొప్పి కూడా తనకు వచ్చినప్పుడే, తెలిసినట్లు!!

అన్నట్టు, ఇది కలకత్తా దగ్గరి హౌరా కాదు లెండి, తేలిగ్గా పలికే ‘ఔరా’!

ఎంత పిచ్చితనం, బ్యాంకులో పనిచేస్తూ, మన డబ్బునే ఇట్లా అప్పనంగా ధారబోయటం, శుద్ధ బుధ్ధూతనం, వెంటనే ఆ లోన్ క్లోజ్ చేసేద్దాం అని నిర్ణయానికి వచ్చేశాడు!

వచ్చేయటమే తడవుగా, పై ఫ్లోర్ లోని auto loans manager, గడుసు పిండం గంగాధరానికి ఫోన్ చేసి చెప్పేశాడు, తను లోన్ క్లోజ్ చెయ్యాలనుకుంటున్నట్టు, కాస్త అంతా కలిపి ఎంత కట్టాలో చెప్పేస్తే, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను అని!

కానీ గంగాధరం కొత్తగా ఒక మధ్య ముడి గురించి చెప్పాడు. అది ఏమిటీ అంటే, సంవత్సరం లోపల కనక లోన్ అకౌంట్ క్లోజ్ చేస్తే, ప్రీ క్లోజర్ చార్జెస్ పడతాయని!!

“అదేమిటి బాస్ నీకు చెప్తోందే అందుకు, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం రికెమండ్ చేసి స్పెషల్ పర్మిషన్ తీసుకొని చార్జెస్ waive చేయిస్తావనే కదా!”, అన్నాడు విశ్వనాథం చొరవగా! గంగాధరం, “సర్లే, ట్రై చేస్తాను” అని, ‘వీడు ఒక పట్టాన వదిలే రకం కాదుగా’ అని అనుకున్నాడు కూడా!

సరే, waive అయిపోతుందిలే అని ధీరసాగా, లంచ్ టైం అయితే, అడపాదడపా తమ స్టాఫ్  వెళ్ళే హోటల్‌కే వెళ్ళి టిఫిన్ చేసి బిల్ చెల్లించాడు, విశ్వనాథం! చెల్లించి బయటకు వస్తుంటే, పర్సులో ఉండాల్సిన దాని కంటే, దినుసు పల్చగా ఉన్నట్టు అనుమానమొచ్చి, తెరిచి డబ్బు లెక్కపెట్టి చూసుకున్నాడు. ఒక 500/- తగ్గుతున్నట్టు అనిపించింది.

పొద్దున ఇంట్లో బయలుదేరే ముందు చూసుకున్నాడు, 2500/ ఉంది, -అయిదు 500 నోట్ల రూపంలో! ‘డైరెక్ట్‌గా ఆఫీసు కొచ్చాను, అంతే, ఏం ఖర్చు పెట్టలేదే, మధ్యలో’, అని ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్ళి కూడా చూసుకున్నాడు, కరెక్టే ఎక్కడా ఆగలేదు, ఏమీ ఖర్చూ పెట్టలేదు!, మరి 500/- తగ్గి కనబడతోందే, ఏంటబ్బా అనుకున్నాడు!

ఆఫీసు దగ్గర ఆ అబ్బాయి ఎవరో కొనమని అర్థిస్తే, ఆ బుక్స్ కొన్నాను, 500/-నోటు ఇచ్చి, అంతే అనుకుంటూండగా, అనుమానం వచ్చింది, అతని కేమైనా రెండు 500/-నోట్లు ఇచ్చేశానా పొరపాటున అని!

మళ్ళీ ఒకసారి పర్సు చెక్ చేశాడు, ఏ మార్పు లేదు, 500/- తగ్గే ఉంది అందులో!

హారి, తుంటరీ, దయతలచి కొని, పొరపాట్న ఎక్కువ ఇస్తే, అదే అదను అని తీసేసుకొని ఉడాయిస్తావా! అని వాణ్ణి తిట్టుకున్నాడు, ఎంతో నొచ్చుకున్నాడు, ఈ అనుకోని నష్టానికి!

సరే, ఇంక చేసేదేముంది, టైం అయిపోయింది, అని బ్రాంచ్  చేరి, పని చూసుకోవటం మొదలెట్టాడు, పూర్ విశ్వనాథం!

అదే లెండి, ఒరిజినల్‌గా, రియల్‌గా పూర్ అని కాదు, ఇప్పుడు 500/-లాస్‌తో ఆ మేరకు, పూరైన అని!!

సుమారు, 5.30 ప్రాంతాల్లో గంగాధరం నుంచి కబురొచ్చింది, ప్రీ క్లోజర్ చార్జెస్ 50% వైవ్ అయినట్టు! దాదాపు 2500/-. హమ్మయ్య, నష్టం కాస్త పూడిందిలే అనుకున్నాడు. రూ.2000/- నికర లాభంగా తేల్చుకొని, లోన్ అకౌంట్ చకచకా క్లోజ్ చేసే నిర్ణయం తీసుకున్నందుకు తనను తాను అభినందించుకున్నాడు కూడా!

బ్యాంకు క్లోజింగ్ అవర్స్ అవగానే, రూ 500/-ల నష్టం తాలూకు ఆలోచనల నుండి తేరుకుని, ఋణ భారం తగ్గి, హెచ్చిన ఉత్సాహంతో, బ్యాంక్ ఎదురు రోడ్డు మీది  పార్కింగ్ స్థలాన్ని చేరుకున్నాడు విశ్వనాథం.

చేరుకోవటం, ఏదో బోసిగా ఉన్న స్కూటర్‌ని చూసి హతాశుడవడం, ఒకేసారి జరిగినై!!

వెనకాల సూర్యబింబంలా, విష్ణు చక్రంలా ఫిట్ చేసి ఉండిన స్టెప్నీ ఉన్నట్టు లేదే అనిపించింది చూడగానే!

లేదనే రూఢి అయింది, దగ్గర కెళ్ళగానే!!

ఉన్నట్టు లేదే అంటే, అవును లేనట్టుంది, అన్నట్టయ్యింది!! అసలు అర్థం లేదనే, కాస్త అట్లాంటి సమయాల్లో ఎవరికి వారు ఓదార్చుకునే ఎక్స్‌ప్రెషన్ అది, అంతకు మించి ఏమీ లేదు దాంట్లో!!

వెనక భాగం, నగలు తీసేసిన డాన్సర్ లాగా, ఖాళీగా కనిపించింది విశ్వనాథానికి! కారణం స్టెప్నీ అనే పెద్దాభరణాన్ని, ఇనుప ఫ్రేమ్‌లో బోల్టులతో బిగించి ఉన్నదాన్ని, ఎవడో చోర శిఖామణి లాఘవంగా, నడిరోడ్డు మీద, అన్నీ విప్పతీసి మరీ, తన స్వంతం చేసేసుకున్నాడు!

అంత మెయిన్ రోడ్డులో, అందరి కళ్ళు కప్పి, ఎట్లా నట్లు బోల్టులు విప్పతీసి మరీ తస్కరించాడో ఎంత ఆలోచించినా అంతు పట్టలేదు అతనికి!

ఎవ్వరూ చూడకుండా ఉండటానికి, ఏ కృష్ణుడో మాయాచక్రం వేసి సూర్య గోళాన్ని మూసేశాడనుకోవటానికి, ఇది ద్వాపరం కాదే!

 దొంగల నేర్పులకు, రక్షక శాఖలో కొందరు, కొండొకచో ఇచ్చే సహాయ సహకారాల మాయేమో అనిన్నీ అనుకోకపోలేదు, ఏ యుగంలో ఉంటున్నాడో మర్చిపోని, విశ్వనాథం!

ఏదో ఒకటి – సింగినాదం, స్టెప్నీ చౌర్యం!

పోయింది అనే మాట తథ్యం!

ఉస్సురని నిట్టూరుస్తూ, తన ఆఫీస్ బ్యాగు పెట్టటానికి డిక్కీ తెరిచాడు, విశ్వనాథం!

తెరవటం తోటే, ఈ సారి ఆశ్చర్యం ఎదురైంది!

పోయిందనుకున్న 500/- నోటు అక్కడ బుధ్ధిగా కూచుని కనిపించింది!

అంటే, పాపం ఆ  పుస్తకాలమ్మిన అబ్బాయి పాత్ర ఏమీ లేదన్న మాట ఈ నోటు స్థానచలనంలో!

తను పౌచ్ తీసి పొద్దున గబగబా అతనికి ఇచ్చి వెళ్తున్నప్పుడు జారి, కింద ఎక్కడో పడకుండా, తన అదృష్టం కొద్దీ డిక్కీలోనే పడ్డదన్న మాట!

అతని గురించి తక్కువ అంచనా వేసి అనుమానించి నందుకు మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు, సహ్రృదయ శిరోమణి, విశ్వనాథం!!

ఇవాళ అంతా ఏమిటో కన్ఫ్యూజింగ్ ఉందే, కాస్సేపు 500/- పోగొట్టానని బాధ, అంతలో చార్జెస్ waive అయ్యాయని ఆనందం, ఈ స్టెప్నీ మాయమవడం, మాయమైంది అనుకున్న 500/- నోటు మళ్ళీ కంటపడటం! విచిత్రంగా అనిపించింది విశ్వనాథానికి!

ఇంతకీ జరిగింది లాభమా, నష్టమా?!

ఛార్జీల మిగులు, పోయి దొరికిన నోటు, కలిపితే సుమారు 3000/- లాభం!తక్కెడలో ఆ వైపు, ఇనుప ఫ్రేమూ, టైరూ అన్నీ కలిపి దాదాపు అంతే ఖరీదు చేసే స్టెప్నీ నష్టం!

అంటే, చెల్లుకు చెల్లు, సరికి సరి అన్నమాట!

ఆ పై నున్న లెక్కలు మాస్టారు ఎంత సరికి సరి లెక్కలు రాస్తాడ్రా బాబూ అనుకుంటూ, దొంగ గారు దయ తలచి వదిలేసిన స్టెప్నీ కవర్ డిక్కీలో పెట్టుకొని, భారంగా స్కూటర్ బయటకు తీశాడు, విశ్వనాథం.

గుండె కొంచెం భారంగా, స్టెప్నీ బరువు లేకపోవడంతో బండి కాస్త తేలికగా అనిపించింది, పాపం విశ్వనాథమనే ఆ అయోమయానికి ఆ క్షణంలో!!

***

పైన ఉండి, మన లెక్కలు గట్రా చూసే దేవుడికి కూడా పెద్ద బ్యాంకులో, అదే ఈ లోకమనే బ్యాంకులో- ఉద్యోగమేమో, సాయంకాలానికల్లా, అణా పైసలతో సహా అందరి లెక్కలూ ట్యాలీ చేస్తే కాని, షట్టర్ మూయలేని పరిస్థితేమో పాపం, మా బ్యాంకు వాళ్ళ లాగా అనుకున్నట్టున్నాడు, విశ్వనాథం, చిరునవ్వుతో!

ఏమో, మనం చూశామా?!

***

(కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా వ్రాసినది! నమ్మండి ప్లీజ్!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here