[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సర్వాంతర్యామి భగవంతుడు’ అనే రచనని అందిస్తున్నాము.]
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥
(భగవద్గీత 10వ అధ్యాయం, 20 వ శ్లోకం)
ఓ అర్జునా! సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. సమస్త ప్రాణుల యొక్క సృష్టిస్థితిలయములకు కారణము నేనే అని పై శ్లోకం యొక్క భావం. పరమ చైతన్యవంతుడు మరియు సనాతనుడు అయిన భగవంతుడు మనలోనే అంటే జీవాత్మ లోనే ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత మనం మన దినచర్యలను చేయగలుగుతున్నాము. కాబట్టి శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నాను అని అంటున్నాడు. ఈ విధంగా ఈ సకల చరాచర సృష్టి యందు ఆవరించి వున్న సర్వ హృయదాంతర్వర్తి అయిన వాడు భగవంతుడు తానూ మరేదో లోకంలో లేనని, తాను సృష్టించిన జీవకోటి హృదయాలలోనే కొలువై వున్నానడని, ప్రాణులు చేసే ప్రతీ చర్యను సాక్షీభూతంగా చూస్తున్నాడన్నది విస్పష్టం.
భగవంతుని సర్వాంతర్యామి తత్వాన్ని తెలిపే అద్భుతమైన పద్యం పోతన భాగవతంలో వుంది –
ఇందుగలడందు లేడని
సందేహమ్ము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే గలడు దానవాగ్రణి! వింటే
నీ హరి ఎక్కడున్నాడురా అనే తండ్రి హిరణ్యశిపుని ప్రశ్నకు పైవిధంగా సమాధాన మిచ్చాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో నీ హరిని చూపించమని కొడుకుని అడిగిన హిరణ్య కశిపునికి సమాధానంగా, ఉగ్రనరసింహమూర్తిగా స్తంభం లోంచి శ్రీహరి దూసుకుని రావడానికి ప్రహ్లాదుడు కారకుడయ్యాడు. సర్వవ్యాప్తుడైన భగవంతుడు ఆ స్తంభంలో కూడా తప్పక ఉన్నాడని ప్రహ్లాదుడు నిస్సంకోచంగా సమాధానం ఇచ్చాడు. ‘సర్వోన్నతుడు’ అనే మాటకు అర్థం అదే. భగవంతుడు సర్వాంతర్యామి అనీ, రాజమందిరంలోని స్తంభంలో సైతం భగవంతుడు ఉన్నాడని చెప్పిన ప్రహ్లాదుడి మాటలను నిరూపించడానికే.. దేవదేవుడైన శ్రీహరి అంతకుముందు నృసింహ రూపంలో అవతరించాడని ‘శ్రీమద్భాగవతం’ వివరిస్తోంది.
ఈ ఘటన బట్టి భక్తుడు చిత్తశుద్ధితో, శరణాగతి తత్వంతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే భగవంతుడు తానే స్వయంగా ప్రత్యక్షం అవుతాడని రుజువయ్యింది కదా. భగవంతుడు సర్వాంతర్యామి అయితే తప్ప ఇట్టి విభూతి సాధ్యం కాదు. భగవంతుడు సర్వాంతర్యామి. తనచే సృష్టించిన ప్రపంచంలో అన్నింటా, అంతటా ఉంటాడు. అంతా తానై ఉంటాడు. పువ్వులో, నవ్వులో, నేలలో, నింగిలో, రాయిలో, రప్పలో, చెట్టులో, చేమలో, గుట్టలో, పుట్టలో, ఆకులో అలములో దేవుడుంటాడు. జీవం నిర్జీవం అనే తేడా లేకుండా, ప్రతి చోటా ప్రతి పదార్ధంలోను పరమాత్ముడుంటాడు, అట్లే ప్రతీ జీవి హృదయంలో కూడా కొలువై వుంటాడు. అదే విధంగా ‘నేను వైకుంఠంలో లేను. యోగులు హృదయాల లోనో, సూర్యునిలోనో కనిపించను. నా భక్తులు తలచే చోట, నన్ను కీర్తించేచోట ఉంటాను’ అని శ్రీ మహా విష్ణువు దేవర్షి నారదమునితో అన్నట్లు పద్మ పురాణం పేర్కొంటోంది. ఈ తత్వం కూడా భగవంతుడుని సర్వాంతర్యామి అనే విషయాన్ని దృఢతరం చేస్తోంది.