Site icon Sanchika

సర్వదా విధేయ భారత్

[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం డా. ప్రభాకర్ జైనీ గారు పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]

[dropcap]‘శ్రీ [/dropcap]వినోబా భావే బ్యాంకు’ (SVB) అనే బోర్డు ఉన్న పాత కాలపు భవంతి ముందర ఆటో ఆగింది. అందులో నుంచి ఒక వృద్ధుడు దిగి రెయిలింగును పట్టుకుని అపసోపాలు పడుతూ అక్కడ ఉన్న పది మెట్లు ఎక్కి బ్యాంకు హాల్లోకి నడిచాడు. కౌంటర్ లోపల ఉన్న క్లర్కు దగ్గరకు వెళ్ళి, ఒక చెక్కు ఇచ్చాడు. క్లర్కు ఆ చెక్కు చూసి, తలెత్తి, వృద్ధుణ్ణి చూసాడు. అవునన్నట్టుగా తలూపాడు.

అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలయినట్టుగా, పాత గోడ గడియారం రెండు సార్లు మోగింది. కౌంటర్‌లో ఉన్న క్లర్కు లేచి నిలబడి, ఉన్న ఇద్దరు ముగ్గురు కస్టమర్లను ఒక గంట ఆగి రమ్మని చెప్పి, వాళ్ళు వెళ్ళగానే,

“లంచ్ టైమ్ ఇమ్మీడియేట్లీ!” అని గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు తలుపులు మూసేసి, ‘భోజన విరామం 2 నుంచి 3 గంటల వరకు’ అన్న బోర్డు తగిలించాడు.

ప్రధాన ద్వారం మూసిన మరుక్షణం వృద్ధుడు తన వేషాన్ని విప్పేసి, సైనికాధికారి దుస్తుల్లో ఉన్న యువకుడిలా రూపాంతరం చెందాడు. ఆ బ్యాంకులో పని చేస్తున్న ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు వెంటనే అటెన్షన్‌లో నిలబడి వందనం చేయగానే అందరూ కలిసి, ఆ భవంతి అంతర్భాగంలోకి నడిచారు. కొన్ని మీటలు నొక్కగానే అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న, ఎల్ఈడీ స్క్రీన్స్ బయటకు చొచ్చుకొచ్చాయి.

బయట నుంచి చూడడానికి పురాతనంగా కనిపిస్తున్న ఆ భవంతి అంతర్భాగం మాత్రం అత్యంత ఆధునికమైన, సాంకేతిక హంగులతో నిర్మించబడిన, భారత రక్షణ దళాలకు సంబంధించిన వార్ రూమ్. బయట బ్యాంక్ అన్నది ఒక ఫసాడ్ {Facade}, ఒక బూటకం. ఆ బూటక నాటకాన్ని రక్తి కట్టించడానికి, అక్కడికి కస్టమర్లుగా వచ్చేది కూడా, వాళ్ళు నియమించిన రక్షణ దళ సిబ్బందే.

మిలిటరీ దుస్తులలో ఉన్న వ్యక్తి మేజర్ కిశోర్, గొంతు సవరించుకుని,

“మిత్రులారా! మన SVB విభాగం ద్వారా మనం అనేక విజయాలను సునాయాసంగా సాధించాము. మన పై అధికారులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము కానీయలేదు. నేనిప్పుడే మన ప్రధాన కార్యాలయంలో మన దేశ రక్షణ మంత్రిని, జాతీయ భద్రతా అధికారులను కలిసి వస్తున్నాను.

వారు మనకొక గురుతరమైన కష్టతరమైన, క్లిష్టమైన బాధ్యతను అప్పగించారు. మనం చేయగలమా లేదా అనే విషయాన్ని మన టీమ్‌తో మాట్లాడి, సాయంత్రానికల్లా ధృవీకరించమన్నారు.

ఆ బాధ్యత గురించి నాకు చూచాయగా మాత్రమే తెలిపారు. ఇది ఇంతకు ముందు చేసిన పనుల వంటిది కాదు. ‘విజయమే వీర స్వర్గమో’ అనే దృఢసంకల్పం ఉన్నవాళ్ళే ఇందులో పాల్గొనగలుగుతారు. మనం దేశమాత సేవలో ‘unsung heroes’మేనని మీ అందరికి తెలుసు. మనం విజయం సాధించినా మనకేమీ మెడల్స్ రావు. మనం విధి నిర్వహణలో మరణించినా మనను భారత ప్రభుత్వం, తమ దేశపు గూఢచారులుగా గుర్తించదు.

ఈ మిషన్‌లో మనం శత్రుదేశంలోకి ప్రవేశించి, అక్కడ బంధించబడి ఉన్న, మన దేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని రక్షించి తీసుకు రావాలని చెప్పారు.

ఏం చేద్దామంటారు? మనం అందుకు సిద్ధమేనా? మనం ప్రాణాలను ఫణంగా పెట్టి, మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడి ప్రపంచం ముందర, మన దేశ జాతీయ పతాకం గర్వంగా రెపరెపలాడేట్టుగా పోరాడుదామా?” అని గంభీర స్వరంతో, గట్టిగా, దిక్కులు పిక్కటిల్లేటట్టుగా ప్రశ్నించాడు.

అదే రణ నీతి. అదే రణ నినాదం. సమరంలో సైనికులను సమాయత్తం చేసి, మాటలతో రెచ్చగొట్టి, ఒక రకమైన యుద్ధోన్మాదాన్ని వారిలో నింపాలి. అప్పుడే వారు నాయకుణ్ణి, గుడ్డిగా అనుసరిస్తారు. వారి రక్తంలోని కణకణం ఉత్తేజితమై పరుగులు పెడుతుంది. దేశం కోసం చివరి రక్తపు బొట్టు కూడా ధారపోయడానికి వెనుకాడరు.

మేజర్ కిశోర్ మాటలకు వారంతా అనుకున్నట్టుగానే, ఉత్సాహంగా ప్రతిస్పందించారు. దేశమాత సేవకై ప్రాణాలర్పించడాన్ని వాళ్ళు తృణప్రాయంగా భావించారు.

రవి, రామ్, జమీల్, క్రిస్టఫర్, మల్లయ్య లను ఒక్కొక్కరిని, విడిగా పిలిచి, వారి అభిప్రాయాలను తీసుకున్నాడు. మహిళలిద్దరు లాజిస్టిక్ సపోర్ట్, కంప్యూటర్ మానిటరింగ్ చేయడంలో నిష్ణాతులు. వారి దేశ సరిహద్దులను దాటవలసిన పని లేదు. కానీ, సరిహద్దుకు అతి దగ్గరగా ఉన్న శిబిరంలో ఉండి పని చేయవలసి ఉంటుంది.

అందరూ ఏకాభిప్రాయం తెలపడంతో, మరిన్ని వివరాలు, ప్రణాళికలు వారితో చర్చించాడు మేజర్ కిశోర్.

ఆ రాత్రి కుటుంబ సభ్యులతో గడిపి, మరునాడు తెల్లవారుజామున మూడింటికి, ఇంట్లోంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు.

మూడు కాగానే, బ్యాంకు ప్రధాన ద్వారం తెరుచుకుంది. ముసలి వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ, మెట్లు దిగి, సెక్యూరిటీ అతనితో,

“నాయనా! ఒక ఆటో చూడు. కరోల్ బాగ్ వెళ్ళాలి.” అని చెప్పాడు.

ఆటో రాగానే, సెక్యూరిటీ చేతిలో పది రూపాయల నోటును బట్టి, ఆటో ఎక్కి, “ఛలో భాయ్ సాబ్!” అన్నాడు.

***

పోర్టికోలో ఆగిన ఆటో నుండి మారువేషంలో దిగిన భర్తను చూడగానే సుమంగళి గుండె దడదడలాడింది. భర్త మారువేషంలో ఉన్నాడు అంటేనే మరో మారణకాండకు సిద్ధమవుతున్నట్టేనని ఆమెకు ఈ పదేళ్ళ కాపురంలో అర్థమయింది. భర్త పది అడుగులు వేసి ఆమె దగ్గరకు వచ్చేసరికే ఆమె కళ్ళు నిండిపోయి, కంటి గవాక్షం మీద కన్నీటి తడి మెరుస్తుంది. కిశోరు ఆమె భుజాల మీద చేయి వేసి, ఆప్యాయంగా కౌగిలిలోకి తీసుకుని, లోపలికి నడిచాడు.

కిశోరుకు భార్య పడుతున్న ఆందోళన అర్థమయింది.

‘ఇక ఈ క్షణం నుండి తమకు క్షణక్షణమూ నరకయాతనే. భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఎప్పుడొస్తాడో తెలియదు. వస్తాడో రాడో కూడా తెలియదు. ఏ రూపంలోనో ఎవడో వచ్చి, ‘మీ వారు ఇక రారు’ అని చెప్తారేమోనని గుండె దడ మొదలవుతుంది. ఈ విషయం పెళ్ళైన మూడు నెలలకే అర్థమయింది. మొదట్లో గర్వంగా ఉండేది. తన భర్త దేశ రక్షణ శాఖలో గూఢచారిగా పనిచేస్తున్నాడని. కానీ, ఆ గర్వం ఒక్క రోజు కూడా నిలవ లేదు.

ఆ మొదటి రాత్రి సమాగమం తర్వాత, భర్త చెప్పిన అనేక విషయాలు విని, ఆమె నిశ్చేష్టురాలై, స్తబ్దుగా ఉండిపోయింది. కిశోర్,

‘తన ఉద్యోగం విషయం బయటకు ఎక్కడా పొక్కకూడదనీ, దేశ అవసరాల దృష్ట్యా వేర్వేరు పట్టణాలలో నివసించాల్సి ఉంటుందని, మంచి బట్టలు కట్టుకోకూడదని, నగలు పెట్టుకోకూడదనీ, కారూ, బంగళా వంటి ఆడంబరాలు నిషిద్ధమనీ, పుట్టింటికి దూరంగా ఉండాలని, పిల్లలు ఇప్పుడే వద్దనీ’ చెప్పడంతో సుమంగళి గుండెల్లో శతఘ్నులు పేలినట్టయింది.

తను పేరుకు మాత్రమే సుమంగళినని, కానీ, సన్యాసినిలా జీవించాలని ఆమెకు, ఆనాడే, అర్థమయింది. మనసు లోనే బాధను దిగమింగుకుని, భర్త ఉద్యోగ బాధ్యతలకు, ఆశయాలకు అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకుంది. తను కాకపోతే, ఎవరో ఒక స్త్రీ ఇటువంటి త్యాగం చేయవలసిందే కదా అని సర్ది చెప్పుకుంది. కానీ, తనలాంటి మహిళలు కొన్ని వేల మంది ఉన్నారని తెలిసినప్పుడు మాత్రం కొంచెం ఆమెలోని ఉద్వేగం ఉపశమించింది.

ఆనాటి నుండి, ఏ రోజైతే, భర్త మారువేషంలో కనిపిస్తాడో, అతని మీద శత్రువుల నిఘా మొదలయిందనీ, శత్రువును ఎదుర్కోవడానికి తన విభుడు సిద్ధమవుతున్నాడని అర్థం చేసుకుంది. అయినా ప్రతీసారీ గుండెలను కోసేస్తున్న బాధతో హృదయం అల్లల్లాడుతుంది.

అందుకే, దిగులుగా ఉన్న సుమంగళిని చూసి, కిశోర్,

“అమ్మడూ! నీకర్థమయిపోయిందని నాకర్థమయింది. నన్ను పెళ్ళి చేసుకోవడం వల్ల నీకు జీవితంలో ఏ కోరికలూ నెరవేరలేదు. మామూలు మధ్యతరగతి వివాహిత స్త్రీలకు జరిగే ఏ శుభకార్యమూ నీకు జరగలేదు. నన్ను చేసుకుని, నువ్వు చాలా కోల్పోయావు సుమా!

దీనికి నేనే దోషిని. పెళ్ళికి ముందే నా ఉద్యోగ విషయం నీకు చెప్పాల్సి ఉండేది. కానీ, పెళ్ళిచూపుల్లో నువ్వు నాకు బాగా నచ్చావు. నీతో జీవితం పంచుకోవాలని ఎంతో ఉబలాటపడ్డాను. అందుకే, అసలు విషయం దాచి పెట్టి పెళ్ళి చేసుకున్నాను. కానీ, నాతో పాటు నిన్నూ అంతమే లేని యుద్ధ రంగంలోకి దింపుతున్నానని ఆలోచించలేక పోయాను. నీ జీవితాన్ని కూడా బలిపీఠం ఎక్కిస్తున్నానని ఊహించలేకపోయాను. నన్ను క్షమించు సుమా!

అయినా ఈ పదేళ్ళూ నన్ను నీ ప్రేమానురాగాలతో అలరించావు. నా కోసం ఎన్నో త్యాగాలు చేసావు. నేను ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, నా దృష్టి శత్రువు మీద ఉన్నా, నా మనసు నీ గురించే తపిస్తూ ఉంటుంది. నా తుపాకీ గుండు శత్రువుకు తగిలితే అతడు మరణిస్తాడు. అతను పేల్చిన తుపాకీ గుండు నాకు తగిలితే నేను మరణిస్తాను. అంతే తేడా! వెంట్రుక వాసి గ్యాప్‌లో మరణం దోబూచులాడుతూ ఉంటుంది. ఆ క్షణంలోనూ ముందు మన దేశం, తర్వాత నువ్వే నాకు గుర్తుకొస్తావు.

దేశం కోసి ప్రాణాలు ఆహుతి ఇచ్చే వీరుల్లో ఎవరో ఒకరు నా స్థానాన్ని భర్తీ చేస్తారు. కానీ, నీ జీవితంలోని శూన్యాన్ని ఎవరు భర్తీ చేయలేరనే దుఃఖంతో నా మనసు ఉద్విగ్న భరితమవుతుంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా మనదే విజయం. ఈ బాధ్యత నెరవేరిస్తే, యాక్టివ్ ఫీల్డ్ డ్యూటీలో నాది పదిహేనేళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. కాబట్టి, ఇది నా ఆఖరి ఆపరేషన్. తరువాత డిపార్టుమెంటులో ప్లానింగ్ విభాగానికి నాకు బదిలీ అవుతుంది. అప్పుడు ప్రతీ రోజూ, సాయంత్రానికల్లా దేవేరి సన్నిధికి చేరుకుంటాను. మన ఊరెళ్ళి మూడు నెలలు సరదాగా గడిపి వద్దాము. అంతేకాదు సంవత్సరంలోగా నీకొక పాపను బహుకరిస్తాను. తర్వాత నువ్వు ఎంత మందిని కంటానంటే అంత మంది.. నేను రెడీ!” అన్నాడు కిశోర్.

ప్రతీ దాడికి ముందు, కిశోర్ ఇటువంటి మాటలే చెప్పి యుద్ధ రంగంలోకి వెళతాడు. కాబట్టి, అతని మాటలను నమ్మకపోయినా నమ్మినట్టు నటించింది సుమంగళి. తను, అతని మాటలను నమ్మానని అతను భావిస్తేనే, అతను హుషారుగా బయల్దేరుతాడు. లేకపోతే, బాధపడుతూ వెళతాడు. అందుకే, అతని మాటలను నమ్మినట్టుగా సుమంగళి,

“నిజంగానా?” అని అడిగింది.

‘ఔను’ అన్నట్టుగా కిశోర్ తలూపాడు.

మధ్యాహ్నం తన సైన్యాన్ని పురిగొల్పడం ఒక బాధ్యత. అలాగే, ఇంట్లో భార్యను ఒప్పించడం కూడా ఒక కళే!

సుమంగళి ఆ మాటలు వింటున్నంత సేపూ అతని కౌగిలిలోనే ఉండి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చివరగా కిశోర్ అన్న మాటలకు కొంత తెప్పరిల్లింది. తలెత్తి అతన్ని చూసింది. కిశోర్ ఆమె కళ్ళను ముద్దాడడంతో, అక్కడ గుమికూడిన జలరాశులు టపటపా రాలాయి.

***

భారతదేశం, ఈ గత పదేళ్ళలో, యుద్ధరంగ సాంకేతిక నైపుణ్యంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. అంతకు ముందు మన మీద ఏ దిక్కు నుండి, ఏ దేశం దాడి చేస్తుందోనని బిక్కబిక్కుమంటూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్న సైనిక బలాలు, ఇప్పుడు ఏ దేశం మీదికైనా, ఆఙ్ఞలు అందుకున్న మరుక్షణం యుద్ధరంగంలోకి దూకడానికి ఉరకలెత్తే ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పుడు యుద్ధాలు ముఖాముఖీ యుద్ధాలు కావు. ఒక డ్రాయింగ్ రూములో కూర్చుని, అత్యంత ఆధునిక సాంకేతికంగా సైనిక పరిజ్ఞానంతో జరిగే యుద్ధాలు.

ఈ మధ్య మనం జరిగిన ‘సర్జికల్ స్ట్రైక్స్’ అందుకు మొదటి ఉదాహరణ.

అమెరికా యుద్ధ హెలికాప్టర్లు, పాకిస్తానులోని ‘అబోటాబాద్’లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్‌ను, అత్యంత ప్రిసిషన్‌తో మట్టుబెట్టారు. అది అమెరికా సైనిక నైపుణ్యానికి గొప్ప ఉదాహరణగా, అమెరికా చెప్పుకుంటుంది.

అయితే, అమెరికా ఒక్క ఒసామా బిన్ లాడెన్ కుటుంబాన్ని మాత్రమే చంపగలిగింది.

కానీ, భారత సైన్యం, ‘ఫుల్వామా’ దాడికి ప్రతీకారంగా, ఆక్రమిత కాశ్మీరులో ఉన్న ఐదారు జైషే ముహమ్మద్, ఐఎస్ఐ ఉగ్రవాద శిక్షణా శిబిరాలలోకి చొచ్చుకుని పోయి, కేవలం 27 నిముషాలలో సుమారు వందమందిని చంపి, వారి ఆయుధ భాండాగారాలను భస్మీపటలం చేసి, తిరిగి మన భూభాగంలో అడుగుపెట్టింది.

అమెరికా ‘అబోటాబాద్’ దాడికన్నా మన ‘సర్జికల్ స్ట్రైక్స్’ ఎంతో గొప్ప రణనీతితో నిర్వహించబడిన యుద్ధ తంత్రం. ప్రపంచ దేశాలన్నీ, భారతదేశ యుద్ధ నైపుణ్యానికి విస్తుపోయాయి. మన దేశ చాణక్యనీతికి, యుద్ధ ప్రణాళికకు జేజేలు పలికాయి.

ఆ సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొని వచ్చిన రోజు కిశోరును చూసి, సుమంగళి పొంగిపోయింది. ఎందుకంటే, ఫుల్వామా దాడితో దేశం మొత్తం అవమానభారంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న వారిలో తన భర్త కూడా ఉండడం ఆమెకు గర్వకారణంగా అనిపించింది. ఎంత మంది భార్యలకు అటువంటి అరుదైన భాగ్యం కలుగుతుందని అనుకుంది.

భారత ప్రధానమంత్రి స్వయంగా సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న వీరుల కుటుంబాలను పిలిచి, అందరికీ విందు ఇచ్చినప్పుడు, మాట్లాడిన ప్రధానమంత్రి మాటల్లో ఆయన ఆ సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడం పట్ల ఎంత గర్వంగా ఉన్నారో తెలిసింది. కానీ, అది అత్యంత రహస్యంగా జరిగిన విందు. ఫోటోలు, ఫోన్లు నిషిద్ధం. ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియకుండా జరిగిన సమావేశం అది.

ఈ మధ్య ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇరుపక్షాలు బాంబు దాడులు జరుపుకుంటున్నాయి. ఒక్కోసారి ఒక్కొక్కరిది పై చేయి అవుతుంది. అయితే, ఇజ్రాయెల్ పన్నిన ఒక పన్నాగానికి మాత్రం ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది.

హిజ్బుల్లా ఉగ్రవాదులు వాడుతున్న ఫోను సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి, వారి పైన ఇజ్రాయెల్ దాడులు జరుపుతుండడంతో, వాళ్ళు సెల్ ఫోన్లను పక్కన పడేసి ‘పేజర్ల’ను వాడడం మొదలుపెట్టారు. వాటిని ట్రాక్ చేయడం అసంభవం కాబట్టి కొంత కాలం పేజర్ల ద్వారా రహస్య సందేశాలతో పని కానిచ్చారు.

అయితే, ఒక శుభోదయాన, హిజ్బుల్లా, హమాస్, ఇరాన్ ప్రెసిడెంట్ వాడుతున్న పేజర్లన్నీ ఒక్కసారిగా పేలిపోయాయి. వందలాది మంది చనిపోయారు, వికలాంగులు అయ్యారు. సుమారు నాలుగు వేల మంది తీవ్రవాదులు బలిపశువులయ్యారు. అదే ఊపులో టీవీలు, రేడియోలు, ఆఖరికి బాత్రూముల్లో వాడే వాటర్ హీటర్లు, కమోడ్లూ పేలిపోయాయి. దాంతో ఏ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ పరికరం ముట్టుకోవాలన్నా గజగజ వణుకుతున్నారు ఉగ్రవాదులు.

రణనీతిలో ఇదొక డెవలప్మెంట్.

***

డీఆర్డీవో – యుద్ధ పరికరాలను, అత్యంత ఆధునిక క్షిపణులను తయారు చేసే ఒక భారత ప్రభుత్వరంగ సంస్థ. హైదరాబాదులోని డీఆర్డీవోలో పని చేసే నాయుడు సీనియర్ మోస్ట్ సైంటిస్ట్. వయస్సు యాభై ఏళ్ళు ఉంటాయి కానీ, మంచి క్రమశిక్షణతో, వ్యాయామంతో ఫిట్‌గా ఉంటాడు.

భారత ప్రభుత్వం నిర్మిస్తున్న ‘కాళీ’ ప్రాజెక్టులో ప్రధానపాత్ర తనదే.

అయితే, అతనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రతీ శని, ఆదివారాల్లో బాగా తాగడం, పబ్బుల్లో తిరగడం, అమ్మాయిల పిచ్చి అతని హాబీస్. అందుకే, నాయుడు వల్ల దేశ రహస్యాలు బయటపెడతాడేమోనని, పై అధికారులు భయపడుతుంటారు. అతని మీద నిఘా పెంచారు. అతను ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాడీ గార్డ్స్ అతన్ని రహస్యంగా అనుసరించేవారు.

ఒక వీకెండుకు అతను వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్సుకు బయల్దేరాడు. అతను వెళ్తున్న మిలిటరీ వాహనానికి జీపీయస్ ట్రాకర్ పెట్టారు. కాబట్టి అతని కదలికలన్నీ హెడ్ క్వార్టర్స్ లోని మానిటర్ మీద కనపడుతూనే ఉన్నాయి. అనంతగిరి చేరుకున్నాక నాయుడు ఒక కాటేజ్ బుక్ చేసుకున్నాడు. వెళ్ళేటప్పుడే కారు నిండా మందు బాటిల్స్ పెట్టుకున్నాడు.

కాటేజ్ బాయ్ వచ్చి అవన్నీ రూములోకి తీసుకువెళ్తున్నప్పుడు, నాయుడును అనుసరించి వచ్చిన కమెండో ఒకడు, అటుగా నడిచి వెళ్తున్నట్టుగా వెళ్ళి, ఆ బాటిల్స్ ఉన్న అట్టపెట్టెకు ఒక మైక్రో చిప్ అంటించాడు.

ముగ్గురు కమెండోలలో ఒకడు ఆ బాయ్‌ని అనుసరించి వెళ్ళి, నాయుడు ఉన్న కాటేజ్ పక్కనే మరో కాటేజ్ బుక్ చేసుకుని అందులో కూర్చుని, చిప్ ద్వారా వచ్చే సిగ్నల్సును క్యాచ్ చేసే పరికరాలను అమర్చి, రెండవ కమెండోను పైకి రమ్మన్నాడు. మూడవ కమెండోను కిందనే ఉండి వాచ్ చేయమని చెప్పారు.

నాయుడు కాటేజికి వచ్చిన తర్వాత ఓ ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు యువకులు వచ్చి చేరారు. అప్పుడు పార్టీ మొదలయింది. గోలగోలగా అరుస్తుండడం, మైక్రో చిప్ ద్వారా వినపడుతుంది. అలా సాయంత్రమయింది.

కమెండోలు బాయ్‌ని పిలిచి భోజనం తెమ్మని చెప్పారు. అలాగే కింద వెహికల్‌లో ఉన్న మూడో కమెండోకు కూడా భోజనం ఇవ్వమని చెప్పారు.

భోజనం తిన్నారు.

***

మరునాడు వాళ్ళు ఉదయం లేచేసరికి ఎనిమిది అయింది. అంత మొద్దు నిద్ర పోయినందుకు తమని తామే తిట్టుకున్నారు. హెడ్ క్వార్టర్స్ నుండి ఎన్నో సార్లు కాల్స్ వచ్చినట్టుగా కాల్ లాగ్ చూపిస్తుంది. ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తే తమకు భోజనంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయేలా చేశారని అర్థమయింది. పక్క కాటేజ్ ఖాళీగా ఉంది. కింద గార్డుగా ఉన్న మూడో కమెండో పక్కన పొదల్లో చనిపోయి కనిపించాడు. వాళ్ళకు జరిగింది అర్థమయింది.

హెడ్ క్వార్టర్సుకు రిపోర్ట్ చేసారు. జరిగిన సంఘటనలన్నీ విశ్లేషిస్తే, అనంతగిరి హిల్సులోని కాటేజ్ నుండి శత్రువులు, నాయుడిని కిడ్నాప్ చేసినట్టు అర్థమయింది.

వెంటనే, రక్షణ శాఖ కార్యాలయానికి సమాచారం పంపించారు. జాతీయ భద్రతా సలహాదారు వెంటనే రంగంలోకి దిగి, అన్ని రక్షణ శాఖ ఏజెన్సీలను హెచ్చరించారు. ఏం జరిగిందో, ఈ కిడ్నాపును ఎవరు చేసారో కనుక్కోమని ఉత్తర్వులు జారీ చేసారు. దేశ సరిహద్దులను కట్టుదిట్టం చేసారు. అన్ని విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు, నౌకాశ్రయాలకు అలర్ట్ జారీ చేసారు. కానీ, అదంతా వృథా ప్రయాస అని అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పటికి కిడ్నాప్ జరిగి పన్నెండు గంటల పైనే కాలం గడిచిపోయింది. అనంతగిరి నుండి హైదరాబాదుకు రెండు గంటల్లో చేరుకోవచ్చు. అక్కడి నుండి ప్రపంచంలోని ఏ మూలకైనా, ఆ పది గంటల్లో చేరుకోవచ్చు. అయినా, ప్రోటోకాల్ కాబట్టి, అటువంటి ఆఙ్ఞలు జారీ చేయబడుతుంటాయి.

***

మూడు రోజుల తర్వాత నాయుడిని బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ అడవుల్లో బంధించారని తెలిసింది. ప్రతీ దేశ రక్షణ దళాలకు, ముఖ్యంగా భారతదేశానికి, మన శత్రుదేశాల రక్షణ దళాల్లో ఏజెంట్లు ఉంటారు. పైకి వారు పాకిస్తాను కోసం పని చేస్తున్నా, ముఖ్యమైన రహస్యాలను మన దేశానికి చేరవేస్తుంటారు. వీరిని ‘డబుల్ ఏజెంట్స్’ అంటారు. మన దేశ సైనిక దళాలలో కూడా, విదేశీ గుఢచారులు ఉంటారు. అటువంటి డబుల్ ఏజెంట్ ద్వారానే నాయుడి ఆచూకీ దొరికింది.

గత కొంత కాలంగా బంగ్లాదేశ్‌లో రాజకీయాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. షేక్ హసీనాకు వ్యతిరేకంగా, ప్రతిపక్షాలు, సైన్యం, ఐఎస్ఐ, ఎఫ్ బీఐ లు తమతమ బలాలను సమీకరించుకుంటున్నాయి.

ఇదే అదనుగా, ఐఎస్‌ఐ – సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రతీకారంగా, అంతకు ముందు అనేక కుట్రలు చేసింది. కానీ, అవన్నీ విఫలమవడంతో, డీఆర్డీవో సీనియర్ సైంటిస్ట్ అయిన నాయుడిని కిడ్నాప్ చేసే పథకంలో భాగంగా అతన్ని హనీట్రాప్ చేసింది. అమ్మాయిలను ఆశ చూపించి, అనంతగిరికి రప్పించి అక్కడ స్టాఫుకు డబ్బులు ఇచ్చి అందరినీ గుప్పిట్లో పెట్టుకుని, నాయుడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్, నేపాల్ గుండా బంగ్లాదేశ్‌కు తరలించింది. సాధారణంగా, షేక్ హసీనా అధికారంలో ఉండి ఉంటే, భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేది కాదు.

***

ఇప్పుడు నాయుడిని బంగ్లాదేశ్ నుండి శత్రువుల చెర నుండి తప్పించి తీసుకు రావలసిన బాధ్యతను, SVB యూనిట్ – అంటే శ్రీ వినోబా భావే బ్యాంకు కాదు – SVB అంటే ‘సర్వదా విధేయ భారత్’ యూనిటుకు చెందిన మేజర్ కిశోరుకు అప్పగించారు జాతీయ భద్రతా సలహాదారు.

***

మేజర్ కిశోర్ బంగ్లాదేశ్ లోని, చిట్టగాంగ్ అడవికి రెండు వందల మీటర్ల దూరంలోని ఎత్తైన ప్రదేశం మీద ఉన్న మంచె మీద నిలబడి, నైట్ విజన్ బైనాక్యులర్సుతో చూస్తున్నాడు. ఆ రోజు అమావాస్య. కన్ను పొడుచుకున్న, దట్టంగా అలుముకున్న చీకటి తెరలను తొలుచుకుని, చూపు ముందుకు సాగడం లేదు. కానీ, నైట్ విజన్ బైనాక్యులర్స్ వల్ల కిశోర్ స్పష్టంగా చూడగలుగుతున్నాడు. దట్టమైన అడవి మధ్యన ఉన్న ఒక పురాతన భవనంలో నాయుడు ఉన్నట్టుగా ఆ భవనంలోని థర్మల్ ఇమేజింగ్ వల్ల కనుగొన్నారు సరిహద్దుకు అవతల మన దేశంలో ఉన్న బ్యాక్ అప్ గూఢచారులు. అందుకు ఒక కమెండో FLIR (Forward Looking Infrared) కెమెరాతో షూట్ చేస్తుంటే, ఆ సిగ్నల్సును విశ్లేషణ చేసి క్షణాల్లోనే ఫలితాలను కిశోర్‌కు అందచేస్తుంది బ్యాక్ అప్ టీము. నాయుడుతో పాటు ఆ భవంతి లోపల నలుగురు ఉగ్రవాదులు; బయట మరొక పదహారు మంది ఉగ్రవాదుల అత్యాధునిక ఆయుధాలతో పహారా కాస్తున్నట్టుగా తెలిసింది. ఆ సమాచారంతో పాటు తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలను అనుసంధానం చేసుకుని, తన మనసులో ఒక ప్రణాళిక రచించుకున్నాడు మేజర్ కిశోర్.

అంతకు ముందు కురిసిన వర్షాలతో వారి ముందు ఒక చిన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగును దాటితే, ఆ ఉగ్రవాద శిబిరానికి యాభై గజాల దూరంలోకి చేరుకుంటామని కిశోర్ అంచనా వేసాడు. అందుకే, తన టీములోని గజ ఈతగాడైన సిపాయ్ దురైను, వాగును దాటడానికి అనువైన పాయింటును చూడమని చెప్పాడు.

దురై చూపించిన పాయింట్ గుండా వాగును దాటి, నిశ్శబ్దంగా, ఆయుధాలను గురి చేసుకుంటుండగా, లెఫ్టినెంట్ ప్రసాద్ కాలు చిన్న కొమ్మ మీద పడి అది చటుక్కున విరిగింది. కిశోర్ అందరినీ ‘ఫ్రీజ్’ అంటూ ఆగమని సైగ చేసాడు. అందరూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. కానీ, ఆ చిన్న చప్పుడును కూడా పసిగట్టిన ఉగ్రవాది ఒకడు పరిసరాలను చూస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కిశోర్ అతని నోరు మూసి మెడ విరిచేసి, కూల్చి పడేసాడు.

ఇంతలో, అతని చెవుల్లో, “మేజర్ కిశోర్! బీ అలర్ట్! మిమ్మల్ని శత్రువులు ఐడెంటిఫై చేసారు. వాళ్ళు దాడి చేయకముందే మీరు యాక్షన్ తీసుకోండి. ముందుగా నాయుడిని రెస్క్యూ చేయండి.” అని హెడ్ క్వార్టర్సు నుండి ఆదేశాలు వచ్చాయి.

కిశోర్ తన సహచరులందరికీ ‘గో అహెడ్’ అని సంఙ్ఞ చేసాడు. వాళ్ళందరూ వెంటనే భూమ్మీద పడుకుని, ఫైరింగ్ మొదలుపెట్టారు. శత్రువు తమను నిలుచుని ఉన్న భంగిమలో ఊహించుకుని ఫైరింగ్ ప్రారంభిస్తాడు. కానీ తమ సైనికులు పడుకుని, వాళ్ళు కనపడగానే రివర్స్ ఫైరింగ్ చేయడంతో శత్రువు చావుదెబ్బ తింటాడు. ఇది మేజర్ కిశోర్ పాటించే యుద్ధ విద్యలో ఒక అంశం. అటువంటివి తను స్వయంగా సిద్ధం చేసుకున్న అనేక చిట్కాలు, కిశోర్ అమ్ముల పొదిలో చాలానే ఉన్నాయి.

తనను కవర్ చేయమని ఒక లెఫ్టినెంటుకు చెప్పి, అతను నిర్విరామంగా, ఫైరింగ్ చేస్తుండగా, కిషోర్, ఆ భవంతి వైపు పరిగెత్తాడు. తమ పైన భారత సైన్యం దాడి చేస్తున్నట్టు గ్రహించిన ఉగ్రవాదులు, నాయుడిని హతమార్చడానికి సిద్ధపడుతుండగానే, కిశోర్ లోపలికి ప్రవేశించి, తన AK 47 కు పని కల్పించాడు. అది గర్జించడంతో నలుగురు ఉగ్రవాదులు క్షణాల్లోనే హతమయ్యారు.

నాయుడు కిశోరును చూసి, “హాయ్! థ్యాంక్యూ సోల్జర్! భారత సైన్యం నన్ను తప్పక కాపాడుతుందని నాకు తెలుసు.” అంటూ బేడీలు తీయమని, చేతులను ముందుకు చాచాడు. అతని నిర్లక్ష్య ధోరణికి కిశోరుకు ఒళ్ళు మండింది. చాచి నాయుడి చెంపలను వాయించాడు.

“నువ్వు తాగి తందానాలాడి, అమ్మాయిల కోసం దేశ రహస్యాలను ఫణంగా పెడుతుంటే, మేము మా ప్రాణాలను ఫణంగా పెట్టి నిన్ను కాపాడవలసి వస్తుంది. బ్లడీ ఫూల్!” అంటూ బేడీలను కట్ చేసి, అతన్ని పట్టుకుని, అక్కడ నుంచి బయటకు పరిగెత్తాడు.

అప్పటికీ బయట ఇరుపక్షాల మధ్య భీకర పోరాటం జరుగుతుంది. నాయుడును సేఫ్‌గా సెక్యూర్ చేసి, కిశోర్ కూడా తన టీముతో కలిసి పోరాటంలో పాల్గొన్నాడు.

***

తన ఇంటి ముందు ఆగిన వాహనంలో నుండి దిగిన జాతీయ భద్రతా సలహాదారును చూసి ఆశ్చర్యపోయింది. పదేళ్ళుగా మేజర్ కిశోరుతో కాపురం చేసిన ఆమెకు, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో, ఒక మేజర్ ఇంటికి వస్తాడో తెలుసు. ఏం జరిగిందో ఆమెకు మరు క్షణంలో అర్థమయి, కుప్పకూలిపోయింది.

జాతీయ భద్రతా సలహాదారుతో పాటు అనేక మంది భద్రతాదళాల అధికారులు వచ్చారు.

జాతీయ భద్రతా సలహాదారు, సుమంగళిని లేపి, సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమె పక్కన కూర్చుని, భారత ప్రధాన మంత్రి తరఫున తన సంతాపాన్ని తెలియచేసి, మేజర్ కిశోరుకు చెందిన మెడల్స్, టోపీ, పర్సు అందించాడు.

సుమంగళి వాటిని నిర్లిప్తంగా స్వీకరించింది. ఆమె హృదయాంతరాళాల్లోని మమతల చెలిమె ఎండిపోయినట్టుగా, ఆమె కళ్ళు, ఎడారుల్లో మరీచికల్లా చిత్ర విచిత్ర దృశ్యాలను దర్శిస్తున్నాయి. వాటన్నింటిలో మేజర్ కిశోర్ నవ్వుతూ తనను పిలుస్తున్నాడు. ఒక రకమైన డెలీరియంలో పడిపోయింది.

“మేజర్ కిశోర్ అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. తనే ముందుండి, తన టీమును నడిపించాడు. సైంటిస్ట్ నాయుడిని తనే విడిపించి తీసుకుని వచ్చి సరిహద్దు దాటించి మన సైన్యానికి అప్పచెప్పి, మళ్ళీ తన టీమును కలిసి పోరాటం చేస్తుంటే, కిశోరుపై వెనుక నుండి దాడి చేసి చంపాడు ఒక ఉగ్రవాది. భరతమాత సేవలో అసువులు బాసిన మేజర్ కిశోరుకు మరణానంతరం ‘పరమ వీర్ చక్ర’ను ప్రధానమంత్రిగా ప్రకటిస్తా..” అంటూ ఎవరో చెబుతున్న మాటలు సుమంగళికి వినపడటం లేదు.

ఎవరో అడిగితే మరెవరో, “ఆమె పేరు ‘సుమంగళి’” అని చెప్పడం లీలగా వినబడింది.

‘హుఁ సుమంగళి’ అని పిచ్చిగా నవ్వుకుంది ఆమె.

Exit mobile version