Site icon Sanchika

సర్వేజనా సుఖినో భవంతు

[dropcap]“పెం[/dropcap]డ్లికూతురు వాళ్లు ఇక్కడే రెండు అపార్టుమెంట్లు అద్దెకు తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి వాళ్లు ఇక్కడికి వచ్చి రెండు వారాలైంది. వాళ్ల తరఫు బంధువులంతా ఇటువేసి వుండటం వలన పెళ్ళి ఇక్కడే పెట్టుకున్నారు. ఇవ్వాళ పెళ్లికూతుర్ని చేస్తున్నారు. దగ్గర బంధువుల్ని తీసుకుని రండి. పెళ్లికొడుకు కూడా రావాలి. తల్లిదండ్రులతో పాటు అందరూ వచ్చి మా అమ్మాయికి అక్షింతలు వేసి వెళ్లండి అని రాత్రే కబురు చేశారు. అన్నీ పద్ధతి ప్రకారం చేస్తున్నామంటారు. మేం మాత్రం తిరగలేక చస్తున్నాం” అంటూ విసుగ్గా చెప్తున్నది కృష్ణకుమారి.

“ఏదైనా మన వినోద్ చాలా అదృష్టవంతుడు. మంచి సంబంధం దొరికింది.”

“ఆ.. మరే, మనవాడి చదువేమైనా తక్కువదా? సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టరు. అదృష్టమంటే ఆ పిల్లదే. ఆ పిల్ల వట్టి బి.టెక్కేగా. వీడేమో, సరేనంటూ చేసుకుంటున్నాడు. ఏదో జాబ్ చేస్తుందనుకోండి. నాకైతే కోడల్ని కూడా డాక్టరే తెచ్చుకోవాలని వున్నది. ‘ఇష్టమైతే ఉద్యోగానికి వెళ్తుంది. లేకపోతే ఇంటిని చూసుకుంటది’ అంటూ వినోద్ తలతిక్క వాగుడు వాగాడు. సరే, మాదేం పోయింది? అని ఒప్పుకున్నాం” అంటూ, “వినోద్! మీ డాడీని పిలువు. త్వరగా బయల్దేరాలి. సుహాసినీ! నీ ముస్తాబు త్వరగా కానివ్వు. గంటలు గంటలు చేయకు” అంటూ కృష్ణకుమారి హాల్లోకి దృష్టి సారించింది. తన తోటి కోడళ్లు, ఆడపడుచులూ కనుపించారు. అక్కడే చిన్నకూతురు ఉమారాణి మాట్లాడుతూ కనిపించింది.

“మామయ్యా! పదండి, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్లి వినోద్ వాళ్ల ఆవిడకు అక్షింతలు వేసి రావాలట” అంటూ మేనమామల్ని వాళ్ల భార్యలనూ బయల్దేర తీసే ప్రయత్నంలో వున్నది.

“ఉమా! ఇలా రా, పెళ్లికాని దానవు. నువ్వు రానక్కల్లేదు. అలాగే మామయ్య, అత్తయ్యలూ వద్దు. ఈ పంచెకట్టు మగవాళ్లనీ, నేత చీరల ఆడవాళ్లనీ చూస్తే అవతలివాళ్లకు చిన్నచూపు కలగొచ్చు. అక్కా, నేనూ, మీ డాడీ కొంతమంది బంధువులూ వెళ్లి త్వరగా వచ్చేస్తాం. మనకూ ఇంట్లో పెండ్లి కొడుకును చేసే కార్యక్రమముందిగా. ఆ పనులన్నీ చూస్తూ వుండండి.” అంటూ నాగరికంగా, దర్జాగా కనపడే తన అత్తింటి తరుపు బంధువులతో కలిసి బయటకు నడిచింది కృష్ణకుమారి.

ఆమె పుట్టింటి తరుపు వారు ముఖముఖాలు చూసుకున్నారు. పెద్ద కూతురు సుహాసినీ, ఆమె భర్తా పెండ్లికొడుకును వెంటబెట్టుకుని ప్రత్యేకంగా వెళ్లారు. ఇవ్వాళ రాత్రికే పెళ్లి కాబట్టి దగ్గర బంధువులంతా ఉదయానికల్లా వచ్చేశారు.

కృష్ణకుమారికి ఎపుడూ పుట్టింటి వారంటే చిన్న చూపే, “ఎంత సిరిసంపదలున్నా అన్నలూ, వదినలూ అనాగరికంగా వుంటారు. పల్లెటూరి హంగుల్తో వుంటారు. ఎప్పటికీ వీళ్లు మారరు.” అంటూ విమర్శిస్తూ వుంటుంది. ఏ చిన్న అవసరమొచ్చినా, పెద్ద ఖర్చొచ్చినా, ఆదుకునేది వాళ్లే. రెండు చేతులా పుట్టింటి సొమ్ము తెచ్చుకుంటూ వుంటుంది. ‘ఒక్కగానొక్క ఆడపడుచును. నాకెన్నటికి, మీరు లాంఛనాలు జరుపుతూనే వుండాలి’ అని డిమాండ్ చేస్తూ వుంటుంది. తన భర్తా మోతుబరి రైతే. పిల్లలకు చదువులు రావాలి అంటూ ఇరవై ఏళ్ల క్రిందటే సిటీ కాపురం పెట్టారు. వేషభాషల్లో మార్లు తెచ్చుకుని మా లెవెలే వేరు అన్నట్లుగా ప్రవర్తించటం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ. సుహాసిని పెద్ద. బి.టెక్. చేసింది. కాంపస్ సెలక్షన్ అంటూ ఏమీ తెచ్చుకోలేకపోయింది. హైద్రాబాద్ వెళ్లి ఏదో చిన్న కంపెనీలో జాయినయ్యింది. ఉమారాణి రెండవది. తమ యమ్.బి.యే. కంప్లీట్ చేసింది. బాగా చురుగ్గా వుంటుంది. ఎప్పుడూ తనవారికి ఏదో చెయ్యాలని తపన పడుతూ వుంటుంది. చదువు అవుతూనే మంచి కాబ్ తెచ్చుకోగలిగింది. మూడవవాడు వినోద్ మెడిసిన్ చేశాడు. నరసింహారావు, కృష్ణకుమారి కోరుకున్నట్లు పిల్లలకు చదువులు వచ్చాయి కాని వున్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి. నరసింహారావు ఏనో వ్యాపారాలు అంటూ చేశాడు. ఏదీ కలిసి రాలేదు.

ఉమారాణి యు.యస్. వెళ్లింది. అక్కకు కూడా యు.యస్. వచ్చే మార్గం సులువు చేసింది. ఆమెనూ అక్కడ ఉద్యోగస్థురాల్ని చేసింది.

***

“సుహాసినీ ఇంటికేమైనా డబ్బు పంపరాదూ? వినోద్ పి.బి. ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతున్నాడు. చాలా ఖర్చవుతుంది. మాటిమాటికీ ఉమారాణే పంపుతున్నది.”

“అమ్మా! నేను కూడా డబ్బుపంపట మెందుకు? ఎలాగూ ఉమ పంపిస్తున్నది గదా? దాంతో వినోద్ చదువూ, మీ ఖర్చులూ నెట్టండి. నేను జాగ్రత్త చేసేది మా ఇద్దరి పెళ్లిళ్లకుంటుంది. నేను ఆ ఉద్దేశంతోనే వున్నాను. పైగా ఉమ చేసేంత పెద్ద ఉద్యోగం కాదు నేను చేసేది. కొన్నాళ్లువుంటే కొన్నాళ్లు వుండటం లేదు. నేనే నానా తంటాలు పడుతున్నాను.”

‘దీని కన్నీ నా బుద్ధులే వచ్చినట్లున్నయ్’ అనుకుంది మనసులో కృష్ణకుమారి.

“నాన్నా! నాతోపాటు పనిచేసే కుమార్ అక్క గురించి మాట్లాడాను. కంపెనీ పనిమీద అక్కడి సి.ఇ.వోను కలవటానికి చెన్నయ్ వస్తున్నాడు. కుమార్ పద్ధతి కలవాడు. అమ్మా, మీరు చెన్నయ్ వెళ్లి అతన్తో మాట్లాడండి. మర్యాదగా వుంటుంది. ఆ తర్వాత వాళ్ల పేరెంట్స్ తోనూ మాట్లాడండి. అక్క క్కూడా ఈ సంబంధం ఇష్టంగానే వున్నది.”

“ఉమా! నువ్వు ఫోన్లో చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు. ఇప్పుడు పెళ్లంటే చాలా ఖర్చవుతుంది. యన్.ఆర్.ఐ. కదా! బాగా కట్నం ఆశిస్తారేమో?”

“మీ అమ్మాయి యన్.ఆర్.ఐ. కాదా నాన్నా? వున్న పొలమూ, విజయవాడలోని స్థలమూ అక్క కివ్వండి. దాని దగ్గర బాగానే డబ్బుంది. కావాల్సిన నగలు అమ్మా, అక్కా, కొనుక్కుంటారు. పెళ్లి ఖర్చులకు నేను ఎలాగూ పంపిస్తాను కదా?”

“సరే తల్లీ! భారమంతా నువ్వే మోస్తున్నావు. వినోద్ చదువూ ఎక్కువ భాగం నువ్వే చూస్తున్నావు.”

“సరేలే నాన్నా! వీటికేం గాని నేను చెప్పిన పని చెయ్యండి. వుంటాను” అంటూ ఫోను పెట్టేసింది, ఉమారాణి.

***

“ఉమా! సత్యసాయి ట్రస్టు జరిపే సేవాయజ్ఞంలో భాగం పంచుకోవాలంటూ, చాలా డబ్బు పంపుతూనే వున్నావు. మళ్ళా ఇప్పుడు వైట్‌ఫీల్డ్‌లో ఏదో కార్యక్రమం ఉందని ఇంతదూరం లక్షలు ఖర్చుపెట్టి వెళ్లాలా? బెంగళూరు వెళ్లిందానివి, అమ్మావాళ్లను కలవటానికి కుదరదు, వెంటనే యు.యస్. వచ్చేయాలి అంటున్నావు. నీ పనులు, నీ ఖర్చులు నాకేం అర్ధం కావటంలేదు.”

“అక్కా! మన సంపాదనలో కొంతైనా సమాజానికి ఉపయోగపడుతుంటే చాలా తృప్తిగా వుంటుంది. వరల్డ్ వైడ్ వలంటీర్లకంతా రెండు రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఇండియాలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని నిరుపేద వృద్ధులకు భోజనం అందించే కార్యక్రమం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి వెళ్లి అందర్నీ కలవాలని వున్నది.”

“వృద్ధులకు భోజనాలు, రోగులకు వైద్యాలు, విద్యార్థులకు చదువులూ, ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి వుంటూనే వుంటుంది. నీలాంటి వాళ్లు కో-ఆపరేట్ చేస్తూనే వుంటారు. నా పెళ్లి కాగానే నువ్వూ, నీ పెళ్లి సంగతి ఆలోచించుకో, వినోద్ చదువు కూడా అయిపోవస్తుంది.”

“వినోద్ చదువు ఎక్కడవుతుంది? ఇప్పుడు పి.జి. కేగా ప్రిపేరవుతున్నాడు! ఇదయ్యాక సూపర్ స్పెషాలిటి చేయాలంటున్నాడు. ఈలోగా మన పేరెంట్స్‌కు ఏర్పాటు చెయ్యాల్సినవి చాలా వున్నాయి. నా పెళ్లికి ఇప్పుడేం తొందరలేదు. ముందు నీ పెళ్లి అనుకుంటున్నాంగా, అది కానీ నీ పెళ్ళై నువ్వు సెటిలయితే మన పేరెంట్స్‌కు కొంత నిశ్చింతగా వుంటుంది. పడుకుంటాను. ప్రొద్దున్నే లేచి ఫ్లైట్‌కు వెళ్లాలిగా, గుడ్‌నైట్.”

“ఈ జన్మలో నువ్వు మారవు. సమాజసేవలోనే తరిద్దువు గాని” అంటూ ఈసడించింది సుహాసిని.

***

కొన్నాళ్లకు సుహాసిని పెళ్లైంది. ఇప్పుడు తనకిద్దరు పిల్లలు. తల్లిదండ్రుల గురించి కాని, తమ్ముడి చదువు నిమిత్తం గాని ఏనాడూ సుహాసిని అలోచించలేదు. సీనియారిటీతోను, తన తెలివి తేటలతోను పదోన్నతులు పొంది ఉమారాణి మరింత సంపాదనా పరురాలైంది. న్యూయార్క్ విశాలమైన ఇల్లు ఏర్పాటు చేసుకున్నది.

“మీ అందరి చదువుల కోసం సిటీ కొచ్చాం. ఇక్కడే అలవాటయిపోయింది. ఎన్నాళ్లని అద్దె ఇళ్లలో వుంటాం? మనవాళ్లే అపార్ట్‌మెంట్స్ కడుతున్నారు. మనల్నీ తీసుకోమంటున్నారు. ఏమంటావు ఉమా?” అంది తల్లి.

“మీకు నచ్చితే అలాగే తీసుకోండి. డబ్బు జమచేస్తాను.” అంటూ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏర్పాటు చేసింది తల్లిదండ్రులకు. ఆ ఫ్లాట్ గృహప్రవేశానికి ఉమారాణి వెళ్లలేకపోయింది.

మరో ఏడాది గడిచింది.

“బాడుగ కార్లలో తిరగలేకపోతున్నాం. కొన్నింటికి ఏసీనే పని చేయదు. బాడుగలు కూడా బాగా అడుగుతున్నారు. మీ నాన్నగారికి ఎలాగూ డ్రైవింగ్ వచ్చుగా, ఒక కారు కొనుక్కుంటే బావుంటుంది అనుకుంటున్నాం” అని మరోసారి ఫోన్, తల్లిదండ్రుల దగ్గర్నుంచి. అలా స్విప్ట్ డిజైర్ కారు ఫ్లాట్‍లో అమరింది. వినోద్ పి.జి. పూర్తిచేశాడు. సూపర్ స్పెషాలిటీలో జాయినవటానికి ప్రిపేరవుతున్నాడు.

ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బు ఇబ్బందుల గురించే కాని ‘నీకొక సంబంధం చూశాం’ అన్నమాట మాత్రం వుండేది కాదు తల్లిదండ్రుల్నుంచి.

సేవా యజ్ఞకార్యక్రమంలో ఉమారాణి మరింత చురుగ్గా పాల్గొంటున్నది. ఇండియాలోనే కాక మిగతా దేశాలలో కూడా కార్యకర్తగా తిరగసాగింది. తనవంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూనే వున్నది. ఇండియా వచ్చి కుటుంబంతో గడపటం పూర్తిగా తగ్గిపోయింది. బంధువులు కూడా ఉమ పెళ్లెప్పుడు అని అడగటం మానేశారు. సంవత్సరాలు గడుస్తూ వున్నాయి.

“అక్కా! ఎమ్.సి.హెచ్. కూడా పూర్తవస్తున్నది. ఇప్పటిదాకా మాకెంతో చేశావు. ఇకనైనా మారేజ్ చేసుకో.” అన్నాడు వినోద్.

“థాంక్యూ వినోద్. నీ పెళ్లి కూడా కానీ, తర్వాత ఆలోచిద్దాం. నీ ఫ్యూచర్ ప్లానేమిటి? ఓన్‍గా ప్రాక్టీనా? లేక ఏదైనా హాస్పిటల్లో తాయినవుతావా?”

“రిజల్ట్ రాగానే ఏదైనా హాస్పిటల్లో జాయినవుతాను. ఇక నుంచీ ఇంటి బాధ్యతలు నేను చూసుకుంటాను. నువ్వు మారేజ్ చేసుకుని సెటిలయ్యే సంగతి ఆలోచించు. ఇప్పటికే నీకు ముఫ్పై అయిదేళ్లు వచ్చాయి.”

“చెప్పాను గదా నీ మారేజ్ కూడా కావాలని. నేనెప్పుడూ నా పెళ్లనీ, నా కుటుంబమనీ ఆలోచించలేదు. మన కుటుంబానికే ప్రాధాన్య మిచ్చాను. సేవాయజ్ఞంలో పాలుపంచుకోవటమూ చాలా తృప్తి కలిగిస్తున్నది. ఇంకా ఎందర్నో ఎన్నో విధాలు ఆదుకోవాలనే వున్నది. సరే వుంటా” అంటూ ఫోన్ పెట్టేసింది.

మరో రెండేళ్లు గడిచాయి. వినోద్ ఆంధ్రా హాస్పిటల్లో జాయినయ్యాడు. కృష్ణకుమారి దంపతులకు ఏ పెళ్లి కూతురూ నచ్చలేదు. చాలా గొంతెమ్మ కోరికలే కోరుతున్నారు. పిల్ల డాక్టరయివుండాలి. కోట్ల కొద్దీ ఆస్తి తేవాలి. రూపం బాగుండాలి. ఒక్కతే పిల్ల అయితే మరీ మంచిది వగైరా వగైరా, తమ పెద్దకూతురి పెళ్లి ఉమ పూనుకుని చేసింది. ఉమా, సుహాసినుల సంపాదనతోనే పెళ్లి జరిపించారు. లక్షల ఖర్చుతో సరిపెట్టారు. ఇప్పుడు కోడలి దగ్గరకొచ్చే సరికి కోట్లు కావాలని కోరిక పుట్టింది.

రెండేళ్లపాటు పెళ్లికూతుళ్లను చూసి చూసి వినోద్‍కు విసుగొచ్చేసింది. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేసే అమ్మాయి అయినా ఫర్వాలేదు అని ఒప్పేసుకున్నాడు. పిల్ల చామన ఛాయలో వుంది. “రేపు పుట్టే వాళ్లు కూడా ఆ రంగులోనే పుడతారు” అంటూ గునిసింది కృష్ణకుమారి.

“ఉమక్కా! నీ పెళ్లి సంగతి నీవేమీ ఆలోచించటం లేదు. అమ్మావాళ్లు ఆ ఊసెత్తరు. ఉమకు పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదు అని మాట దాటిస్తున్నారు. ఇప్పుడు నా పెళ్లి కుదిర్చేసుకున్నాం. ఆనాటికైనా నువ్వు రావాలి. లేకపోతే నేననలు పెళ్లి చేసుకోను” అంటూ వినోద్ మరీ మరీ ప్రాధేయపడ్డాడు.

“నీ పెళ్ళికొస్తే అందరి చూపులూ నామీదే వుంటాయి. వారందరి ప్రశ్నలకూ నేను సమాధానాలు చెప్పగలగాలి. సరే చూద్దాం. టైముందిగా” అని సర్దిచెప్పింది. కాని తమ్ముడు మరీ మరీ అడిగేటప్పటికి ఉమ ఇండియా వచ్చింది పెళ్ళి ముందు రోజుకు. అమ్మలో అప్పటికి, ఇప్పటికి ఏం మార్పు రాలేదు. ఇంకాస్త డబ్బు ధీమా పెరిగింది అనుకున్నది ఉమ.

బంధువులందర్నీ చూస్తుంటే ఉమకు చాలా సంతోషంగా వున్నది. నాన్న వైపు నుంచి కానీ, అమ్మ వైపు నుంచి కానీ బంధువుల్లో చిన్నచిన్న వాళ్లెవరూ ఉమకు తెలియటంలేదు. ముఖ్యంగా దగ్గరి చుట్టాల ఇంటి అల్లుళ్లూ, వాళ్ల కోడళ్లూ ఎవరూ పరిచయం లేదు. వాళ్ల కడుపున పుట్టిన పిల్లల సంగతి సరేసరి. ఈ మధ్య ఇండియా రావటం, ఇక్కడి ఫంక్షన్లలో పాల్గొనకపోవటంతో పరిచయాలే లేకుండా పోయినయి అనుకున్నది. నెట్లో నైనా చూచి వీళ్లందరితో సన్నిహితంగా వుండాలనే కుతూహలం కూడా లేకపోవటంతో మరీ అపరిచితురాల్లా మిగిలిపోయింది.

“ఓ నెలరోజులైనా వుంటావా ఉమా? ఎన్నేళ్లయింది నిన్ను చూసి, ఈ పెళ్లి హడావుడి తగ్గగానే మా ఇళ్లకురా.”

“తప్పకుండా అత్తా. చిన్నప్పుడు సెలవులకు అక్కడికేగా వచ్చేవాళ్లం. మీరంతా బావా వాళ్లతో పాటు మాకూ అన్నాలు తినిపించటం నాకింకా బాగా గుర్తుంది. మా బొమ్మల పెళ్లిళ్లకు మీరెన్ని చేసి పెట్టేవాళ్లు. ఎంతో బాగా ఆడుకునేవాళ్లం. ఆ చెట్ల కిందబడి ఎన్నిరోజులు బొమ్మరిళ్ళు కట్టి గంతులేసే వాళ్లం?”

“మీ అమ్మమ్మ, తాతయ్య మిమ్మల్నెంతో గారంగా చూసేవాళ్లు. పట్నం నుండి వచ్చారు. వాళ్లకు అవి చేసి పెట్టండి. ఇవి చేసి పెట్టండని పురమాయించేవాళ్లు.”

“మామయ్యలు మమ్మల్ని తక్కువ చూశారా? మీరేమన్నా తక్కువ చేసి పెట్టారా? నేనెప్పుడూ ఆ రోజులు మర్చిపోలేను. మామయ్యలు మాకు ఎంతలేసి సాయాలు చేశారో నాకు బాగా గుర్తుంది అత్తా. ఇంతకీ కేశవ మామయ్య గారి కోడలు కేమయింది? వేణు బావ ఎట్లా వున్నాడు? చిన్నప్పుడు వేణు బావ తెగ ఏడిపించేవాడు నన్ను చిట్టి! పొట్టి అంటూ జడ పట్టుకు గుంజేవాడు.”

“బావ ఇప్పుడు యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. వేణుకు నిన్ను చేసుకోవాలని కేశవ మామయ్యకు బాగా వున్నది. మీ అమ్మా నాన్నలకు ముఖ్యంగా మీ అమ్మకు మేమంటే బాగా చిన్న చూపు. ఇప్పుడప్పుడే ఉమకు పెళ్లి చెయ్యం. అయినా అమెరికాలో పెద్ద ఉదోగ్యం చేసుకునే దాన్ని అడగటానికి మీకు నోరెలా వచ్చింది? యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నంత మాత్రాన ఉమను అడగటమేనా? అయినా మేనరికాలు ఎలా చేసుకుంటాం? వేణుకు మీరు ఏదైనా సంబంధం చూసి పెళ్ళి చెయ్యండి. అని ఖచ్చితంగా చెప్పింది, మీ అమ్మ. ఆ తర్వాత స్వాతితో వేణుకు పెళ్ళైంది. ఇప్పటి వరకూ పిల్లలు పుట్టలేదు. ఈ మధ్యే హైద్రాబాద్ వెళ్ళి వైద్యం చేయించుకున్నారు. ఏ దేముడో వరమిచ్చినట్లుగా స్వాతి కడుపు పండింది. కవలలు పుడతారు బాగా తాగ్రత్తగా వుండాలి అని చెప్పారు డాక్టర్లు. కాని మధ్యలోనే ఇంకోమాట కూడా చెప్పారట. గర్భాశయంలో ఇబ్బంది ఏర్పడింది. ఇంకా ఈ గర్భం వుంచుకుంటే తల్లికి, బిడ్డలికి ప్రమాదం. గర్భాన్ని తీసి వేయించుకుంటే మంచిది అని. కానీ స్వాతి వినలేదట. ఎంత కష్టమైనా ఓర్చుకుని బిడ్డల్ని కంటాను. పైన భగవంతుడున్నాడు. నాకు ఏం కాదు. ఒకవేళ నాకేమయినా ఫర్వాలేదు. బిడ్డలు బాగుంటే అంతే చాలు అంటూ మొండి కేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రసవం జరిగే రోజులు. కేశవ మామయ్య వాళ్లంతా అక్కడే వున్నారు. ఎలా వుంటుందో ఏమో?” అంది.

కేశవమామయ్య, అత్తా, వేణుబావా అందరూ కళ్లముందు మెదిలారు ఉమకు, మామయ్యలందర్లోకి ఈ మామయ్య అమ్మను, తమను బాగా ప్రేమగా చూసేవాడు. తామక్కడికి వెళ్లినా, వాళ్లక్కడికి వచ్చినా తమ కోసం ఎన్నెన్నో కానుకలు ఇచ్చేవాడు మామయ్య. తోటలో కాయకాసినా, దొడ్లో ఆవు ఈనినా అమ్మాయి కోసం అంటూ పరిగెత్తుకు తెచ్చేవాడు. మామయ్యను బట్టి అత్తా బాగా చూసేది ఉమని. వేణు బావ చిన్నప్పుడే కాస్త పెద్దతరహాగా వుండేవాడు. ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ వుండేవాడు. కేశవ మామయ్యకు బాగా కోరికగా వుండేది తనను కోడలిగా చేసుకోవాలని. అమ్మా, నాన్నలకు ఆ ఊసే గిట్టేదికాదు. అమ్మకు మరీను. తనతో వియ్యమందే వాళ్లు ఎక్కడో ఆకాశం నుంచి దిగి రావాలని కోరికగా వుండేది. అస్తులన్నీ కరిగించుకున్నా తమ వారికి డాబుసర్లు ఏ మాత్రం తగ్గలేదు. “అమెరికాలో ఇద్దరు కూతుర్లు సంపాదిస్తున్నారు. కొడుకు డాక్టరయ్యాడు. మరి మా స్థలాలూ, పొలాలూ వీళ్లను పెంచటానికి, చదివించటానికే ఖర్చుపెట్టాం. మేమేం దుబారా చెయ్యలేదుగా, ఇప్పుడు మాత్రేమేం తక్కువ మాకు? నగలూ, నాణ్యాలతో సహా అన్నిట్లోనూ బాగానే వున్నాం.” ఇది కృష్ణకుమారి ధోరణి.

“ఏంటి కృష్ణా! ఇకనైనా ఉమ పెళ్లి చెయ్యరాదా? వయసు మీరిపోతున్నది. వినోద్ పెళ్లి కూడా చేయబోతున్నారు. ఉమ క్కూడా చేస్తే ఒకింటిది అవుతుంది. దానికి మాత్రం ఒక కుటుంబం కావద్దా?”

“అయ్యో అన్నయ్యా! మేం చేయనన్నామా? దానికి పెళ్లి ధ్యాసే లేదు. దగ్గర దగ్గర నలభై రాబోతున్నాయి. ఇంకేం చేసుకుంటుంది? ఇంకా ఈ వయసులో చేసుకున్నా పిల్లా జెల్లా ఏం పుడతారు? దాన్ని అట్లా ఫ్రీగా బ్రతకనిద్దాం అని మేమూ ఈ ఊసే తేవటంలేదు.”

“నలభై వస్తున్నాయంటే ఇప్పటిదాకా ఇంటి బాధ్యతలన్నీ మోస్తూనే వున్నది. ఆ బాధ్యతలు నెరవేర్చటటానికే ఉమ తన పెళ్లిని వాయిదా వేసుకున్నది. ఇప్పటికైనా బాధ్యతల్నుంచి తప్పిస్తే అది ఫ్రీ అవుతుంది. పెళ్లిచేసుకుని స్థిరపడుతుంది.” వినోద్ పెళ్లి కార్డు ఇవ్వటానికి పుట్టింటి కెళ్లినప్పుడు కృష్ణకుమారికి, కేశవన్నయ్య చేసిన హెచ్చరిక అది. ఇప్పటికి ఉమ ఎంతో తెలివిగలదనీ, పుట్టింటి బాధ్యతలన్నీ నెత్తినేసుకుని మోస్తుందనీ కేశవరావుకు ఉమంటే ప్రత్యేకమైన అభిమానమే.

ఎవరైనా తెలిసిన వాళ్లు అమెరికా నుంచి వస్తుంటే అత్తలకూ, మామయ్యలకు చిన్న చిన్న బహుమతులు సంపుతూనే వుంటుంది ఉమ. అలా పంపటం కృష్ణకుమారికి అసలు ఇష్టం వుండదు. వారికివ్వమని అలా పంపిన బహుమతులు కృష్ణకుమారి దగ్గరకు గాని చేరితే సగం కూడా బయటపెట్టదు. పుట్టింటి వాళ్లకు సరిగా ఇచ్చేదే కాదు.

“పెళ్లి కాని దానివి, ఆశీర్వదించటానికి నువ్వెందుకులే” అన్న తల్లి మాటల్తో ఉమ ఆ తర్వాత వినోద్ పెళ్లి వేడుకల్లో దూరందూరంగానే వున్నది. పెళ్లికి వెళ్లబోతూ వినోద్ మాత్రం పెద్దలందరితో పాటు ఉమ కాళ్లకూ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. సుహాసిని మాత్రం తమ్ముడి తరుఫు నుంచి అటు మరదలి తరఫు నుంచి వచ్చిన ఆడపడుచు లాంఛనాలన్నీ తనక్కావలసిన రీతిలో అడిగి మరి తీసుకున్నది.

“మా పెద్దమ్మాయి నుహాసిని, మా అల్లుడు కుమార్ ఇద్దరికి అమెరికాలోనే ఉద్యోగం, పిట్స్‌బర్గ్‌లో వుంటారు. ఆ చక్కని ఇద్దరూ వాళ్ల పిల్లలే. గులాబీ రేకుల్లాంటి వాళ్లు ఇండియాలోని ఈ ఎండలకు వడబడిపోతున్నారు. తను మా రెండో అమ్మాయి ఉమారాణి. న్యూయార్క్ లోనే  వుంటుంది. న్యూయార్క్‌లో మంచి సెంటర్లో పెద్ద విల్లా కొనుక్కుంది. అక్కడి బ్రాంచ్ మానేజర్‌గా, ఉద్యోగం చేస్తున్నది” అంటూ గొప్పగా పరిచయాలు చేసిస్తున్నది కృష్ణకుమారి కొత్త వియ్యాలవారికి,

“మీరు ఆ పిల్లల తల్లిగా లేరు. మీరు ముగ్గురూ అక్కా చెల్లెళ్లలాగా వున్నారు.” అని వారి దగ్గర్నుంచి ప్రశంసలూ అందుకున్నది. పెళ్లి వేడుకలు ముగిసి ఇంటికి తిరిగి వచ్చారు.

***

కేశవరావు కోడలు చనిపోయింది. కవలపిల్లలు ఒక ఆడా ఒక మగా. వాళ్లు మాత్రం ప్రస్తుతానికి బాగానే వున్నారు. శవాన్ని హైద్రాబాద్ నుంచి తీసుకుని ఊరికి వస్తున్నారు అన్న సమాచారం వచ్చింది.

“పెళ్లి చేసి వున్నాం. పెళ్లింట్లో నుంచి సూతకపు ఇంటికి ఎలా వెళ్తాం? వెళ్లకూడదు. అయినా వేణు పెళ్లాం చేతులారా చేసుకున్నది. మధ్యలో ఎబార్షన్ చేసేస్తామని డాక్టర్లే చెప్పినప్పుడు వినొద్దూ? తగుదునమ్మా నేను పిల్లలే కంటాను అని మొండిపట్టు పట్టిందట. వేణు అయినా నచ్చచెప్పుకోవద్దూ?”

“కావాలని ఎవరైనా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారా? ఎన్నో ఏళ్లు ఎదురుచూసి ఎన్నో ప్రయత్నాలు చేసినందువలన కనబోయే బిడ్డల్ని వదులుకో లేకపోయింది. తాను బ్రతుకుతానన్న నమ్మకంతో వుండి వుంటుంది. నువ్వేం విమర్శించకు. మీ అందరికి సూతకం ఇంటికి వెళ్లటానికి పట్టింపు కాని నాకేం వుండదు. నేను మామయ్య వాళ్ల ఇంటికి వెళ్తాను. దుఃఖాల్లోనే మనుషులు ఒకరినొకరు ఓదార్చుకోవాలి. దుఃఖాన్ని పంచుకోవాలి” అంటూ ఉమ ప్రయాణమైంది.

“నువ్వు ఎవరి మాటా వినవుగా, వెళ్తే వెళ్లావు చూసి వెంటనే వచ్చెయ్” అంది బాగ్‌లో డ్రస్సులు పెట్టుకుంటున్న కూతుర్ని చూచి.

“చూద్దాం” అంటూ బయల్దేరి కేశవరావింటికి వచ్చింది ఉను.

స్వాతి పోయిన దుఃఖంలో వుండి ఆ పసికూనలని ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. రెండు చిన్న ఉయ్యాలల్లో పడివుండి కేర్ కేర్ నుంటున్నారు. వేణు మూసి వున్న గదిలో మంచం మీద పడి మౌనంగా రోదిస్తున్నాడు. ఉమ పెద్దత్త సహాయం తీసుకున్నది. పసిబిడ్డలకు ఏం కావాలో చూడమన్నది. ఊళ్లోని ప్రైమరీ హెల్త్ సెంటరుకు కబురు చేసి అక్కడి డాక్టరు గారిని ఒకసారి వచ్చి పిల్లల్లి చూడమని రిక్వెస్ట్ చేసింది. “ఒక నర్సును రెండు రోజులు ఇక్కడే వుండి పిల్లని చూచుకొమ్మని చెప్పండి. మీ చేతి క్రింద ఇంకా నర్సింగ్ స్టాఫ్ వున్నారు. ఎ.ఎన్.ఎమ్.లు వున్నారు. మీ సర్వీసెస్ కొద్ది టైమ్ ఈ పసిపిల్లలకు అందించండి. ఇది కూడా మీ డ్యూటీలో భాగమే అనుకోండి. తర్వాత మేం ఏదో ఒక ఏర్పాటు చూసుకుంటాం” అని వాళ్లని ఒప్పించింది.

నాల్గు రోజులు గడిచాయి. దుఃఖపు ఉద్వేగం కొంత తగ్గింది పెద్దవాళ్లల్లో. ‘వీళ్లందరికి ఇంకా మనోధైర్యం కలగాలి. ఈ పసిపిల్లలు కూడా ఆరోగ్యంగా పెరగాలి. దేవుడా! దయచూపు’ అని వేడుకుది ఉమ.

“పిల్లల్ని మనమే పెంచుకుందాం. మా అత్త మామలకు ఇవ్వొద్దు అంటున్నాడు వేణు. ఈ వయసులో వీళ్లను పెంచటం మావల్ల అవుతుందా? ఉద్యోగానికి వెళ్లే వేణు పిల్లల బాగోగులు ఎలా చూడగలుగుతాడు?” అని కేశవరావూ, అతని భార్యా మథన పడుతున్నారు.

తల్లి వెంటనే వచ్చెయ్యమని ఫోన్ చేసినా ఉమ పట్టించుకోలేదు. కేశవ మామయ్యనూ, అత్తనూ తనకు చేతనైనట్లుగా ఓదార్చసాగింది. మధ్యమధ్యలో వేణుతో మాట్లాడుతూ చిన్ననాటి ముచ్చట్లనూ గుర్తు చేసింది. స్వాతి జ్ఞాపకాలను వాళ్లతో బాటు తనూ పంచుకున్నది.

ఉమ మనసులో ఎడతెగని ఆలోచనలు. ఈ కుటుంబానికి తాను చేయగలిగినదేమైనా వున్నదా అని? పంచెకట్టు అన్నలని తన తల్లి తీసిపారవేస్తూ వుంటుంది. వాళ్ల సంప్రదాయ వస్త్రధారణ వెనుక నున్న ఆప్యాయతలు తల్లికెప్పుడూ అర్థం కావు. అనుబంధాల విలువేంటో తను గ్రహించిన కోణంలో తల్లి గ్రహించదు.

వేణు బావ చిన్నప్పట్నుంచీ వయసుకు మించిన పెద్దరికంతో మనలుతూ, ఎవరినీ నొప్పించని మృదుస్వభావి. కేశవ మామయ్య, అత్తా, ఇద్దరూ ఆప్యాయతను మాత్రమే పంచే మంచి మనుషులు. ఇప్పుడు వీళ్లు చాలా పెద్ద ఇబ్బందిలో పడ్డారు. దుఃఖపు కాసారంలో మునిగి వున్నారు. భగవంతుడు వీళ్లందరికీ ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆ పసిపిల్లలు కూడా ఆరోగ్యంగా పెరగాలి. దేవుడా దయ చూడు అని మరోసారి వేడుకున్నది ఉమారాణి. కర్మకాండలనీ పూర్తయినాయి.

మధ్యలో ఇంటికి వెళ్లి మరలా వచ్చింది ఉమ. “ఎప్పుడోగాని రానిదానివి. ఎన్నో ఏళ్ల తర్వాత ఇండియా వచ్చావు. నెల్లాళ్లు వుందామనుకున్నావు. సగం రోజులు మా ఇంట్లోనే గడిచిపోయాయి ఉమ తల్లీ, మా కందరకూ ఎంతో అండగా వున్నావు. నీకు ఋణపడి పోతున్నామే అమ్మా” అన్నారు అత్తామామలిద్దరూ.

“మీ అమ్మానాన్నలకు నీ మీద బాగా కోసం వస్తుంది. సుహాసిని క్కూడా నువ్విక్కడ ఇలా వుండటం ఇష్టముండదు. ఉమా మా తిప్పలేవో మేం పడతాం. నేను యూనివర్శిటీకి ఇంకో రెండు నెలలు శెలవు పెట్టాను. నువ్వు బయలుదేరి వెళ్లు ఉమా.”

“బావా! మీరెవరూ బలవంతపెట్టలేదు నన్ను ఇక్కడ వుండమని. కష్టాల్లో వున్న సాటివారికి సాయపడటం నూ సేవాయజ్ఞంలో ఒక భాగం. నేను అదే నిర్వర్తిస్తున్నాను. దీన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు.”

“ఉమా! ఇకనైనా పెళ్ళి చేసుకో. ఎన్నాళ్ళిలా ఒంటరిగా వుంటావు? నీ ఈడు వాళ్లందరి పెళ్లిళ్లూ అయిపోయాయి. వాళ్ల పిల్లలూ హైస్కూల్ చదువుల కొచ్చేస్తున్నారు.” ఒంటరిగా వున్నపుడు మేనమామ అన్నాడు.

“నిజమే మామయ్య. బాగా లేటయ్యింది. నీకు తెలియంది ఏముంది? ఇపుడు చేసుకోవాలనే అనుకుంటున్నాను. మీరందరూ ఒప్పుకుంటే మీ ఇంటికే, కోడల్ని అయి ఈ పిల్లలకి తల్లి నవ్వాలని వుంది.”

ఆ మాటలతో కేశవరావు నిశ్చేష్టుడయ్యాడు. అది కలేమో అనుకున్నాడు.

“ఉమా” అని మాత్రం అనగలిగాడు.

“ఇప్పుడప్పుడే తొందరేం లేదు. నేను మళ్లీ అమెరికా వెళ్లి పూర్తిచేసుకోవాల్సిన పనులు చాలానే వుంటాయి. ఈలోగా నిదానంగా వేణుబావతో మాట్లాడు. స్వాతి పోయిన కొద్దిరోజులకే ఈ మాట చెప్పటం భావ్యం కాదు. పెళ్లి మాట వచ్చేసరికి నీతో చేప్పేశాను. మా అమ్మా వాళ్లకు ఇప్పుడప్పుడే ఏం చెప్పకండి. మిమ్మల్ని బాగా ఆడిపోసుకుంటారు. ఊపిరి కూడా తీసుకోనివ్వరు. ఈ వయసులో నేను కనకుండా నాకు ఇద్దరు పిల్లలూ, సద్గుణవంతుడైన భర్త దొరుకుతుంటే వదులుకోవాలని లేదు. నా కింకా వేరే పిల్లలెవరూ వద్దు. ఇలా అయితే నేను బావను పెళ్లాడినా మేనరికాల భయమూ వుండదు. నిదానంగా అత్తా, నువ్వూ ఆలోచించుకుని బావని ఒప్పించండి. ఇప్పటికిప్పుడు హడావిడి పడవద్దు. బావను కాస్త స్తిమిత పడనివ్వండి. నేను రేపు బయలుదేరి వెళ్తాను. ఇంటి దగ్గర కొన్ని రోజులు వినోద్‌తో కలిసివుండాలి. ఆ తర్వాత అమెరికా బయల్దేరిపోతాను. మీ సమాధానం విని నా పనులన్నీ పూర్తి చేసుకుని ఇండియా ఎప్పుడు రావాలో నిర్ణయించుకుంటాను. సంపాదన కోసం ఇన్నాళ్లూ విదేశాల్లో వుండి నా కుటుంబానికి ఆసరాగా వున్నాను. సమాజానికి నావంతు ఆర్థిక సహాయం అందించాను. ఇప్పుడు ఇండియా వచ్చేద్దామన్న కోరిక బాగా వున్నది. ఇక్కడ అందరికీ దగ్గరగా వుండి నా సేవాకార్యక్రమాలేవో చెయ్యాలనుకుంటున్నాను. విదేశాల్లో వున్నా నా మూలాల్ని నేను మర్చిపోను. నేను భారతీయరాలిని. ఇక్కడుండటమే నాకు ఇష్టం. అమెరికా దేశం, అక్కడి కంపెనీలు నాకొక వ్యక్తిత్వాన్ని, సంపదనూ ఇచ్చాయి. అందుకు నేను కృతజ్ఞురాలిగా వుంటాను. కాని ఇండియా వచ్చి మన ఊళ్లకు దగ్గరగా, మనవారితో వుండాలన్నదే నా కోరిక” అంటూ కొంత ఉద్విగ్నంగా, దృఢంగా చెప్పింది ఉమారాణి.

Exit mobile version