వందేళ్ళ మార్పులకు ప్రతిబింబం ‘శత వసంతాల తెలుగు కథ’

0
2

(‘శత వసంతాల తెలుగు కథ’ సంకలనంలో గురుజాడ మొదలు రావిశాస్త్రి వరకు (53) మంది రచయితల కథలున్నాయి. నేను (24) మంది రచయిత కథల్ని మాత్రమే యిక్కడ స్పృశిస్తున్నాను. ఆయా కథల యొక్క సారాంశాల్నిగాక కథల్లో విశేషంగా తోచిన కొంత కొంత భాగాల్ని మాత్రమే యిక్కడ యథాతధంగా పేర్కొంటున్నాను. – నల్ల భూమయ్య.)

~

1.‘దిద్దుబాటు’ గురజాడ (1861-1915)

గోపాలరావు “రామా! రా” యని పిలిచెను. నౌకరు రాముడు గతుక్కుమని చుట్ట పారవైచి “బాబు!” అని డగ్గెరను.

“మీ అమ్మేదిరా?”

“మాయమ్మ? ఇంటనున్నది బాబూ”

“మీ అమ్మకాదురా బుద్ధిహీనుడా! నా భార్య”

“అమ్మగారా…. పడున్నారు.”

“ఇంట్లోనే లేదు.”

రాముని వీపుపై వీశడు గుద్దులు రెండు పడెను.

“చంపివేస్తిరి బాబూ” అని రాముడు నేల కూలబడెను.

గోపాలుడు సదయ హృదయుడు. అక్రమ మాచరించినను జ్ఞానము వెంటనే పొడమి పశ్చాత్తాపము కలిగెను. రాముని చేత లేవనెత్తి, వీపు నిమిరి పశువువలెనాచరించితి ననియనుకొని గదిలోనికి తీసుకొనిపోయెను.

“రామా! యేమాయెరా?” యనెను దైన్యముతో.

“ఆడారు చదువు నేరిస్తే యేటౌతది బాబూ!”

“ఓరి మూర్ఖుడా! ఉత్కృష్టమైన వస్తువు విద్యనేర్చిన స్త్రీ రత్నమే. శివుడు సగం దేహం పార్వతికి పంచియిచ్చాడు. ఇంగ్లీషు వాడు భార్యను ‘బెటర్ హాఫ్’ అన్నాడు. అనగా పెళ్ళాము మొగునికన్న దొడ్డది అన్నమాట…”

“…ఏటో బాబూ! బాబు నా ఈపు పగలేసినారు. రండమ్మా అంతాను…”

“దెబ్బల మాట మరచిపో. కొట్టినందుకు రెండు రూపాయలిస్తాను. తీసుకో… నువ్వు అమ్మకు చెప్పవల్సిన మాటలు – పంతులుగారికి బుద్ధి వచ్చింది. ఇక ఎన్నడు సానులపాట వినరు. రాత్రులు యిల్లు కదలరు.”

“అమ్మా! ఆడోరు యెజమాని చెప్పినట్టల్లా యిని పల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతుల్లాగా అయ్యగారు కూడా సానమ్మను వుంచుకుంటారు. పట్టణంలోకి బంగారు బొమ్మలాంటి సానమ్మ వచ్చింది…” అని చెపుతాను అన్నాడు రాముడు.

2.‘మొదటి బహుమానము’ చింతా దీక్షితులు (1891-1960)

రవివర్మ వ్రాసిన పార్వతి బొమ్మను చూపి అటువంటి వేషం వేసుకోరాదా అంటే కొంత సందేహించి అనాగరకమంటూ సణుగుకొని కొంత సేపటికి వప్పుకొంది నా భార్య.

ఈ ‘నగర సంకీర్తనం’ పరమార్థమేమిటంటే శివుడు విష్ణువును మేల్కొల్పాలి అనగా జ్ఞానశక్తి క్రియా శక్తిని మేల్కొల్పాలి. భర్త భార్యను మేల్కొల్పాలి.

“…నా భార్య ఇంటికి వచ్చీరావటంతోనే ఆమె నన్ను కౌగిలించుకుని ఊపిరి సలపకుండా ముద్దెట్టుకోవడం మొదలు పెట్టింది. తన కంటిపాపనట నేను. పీచీ అనే పండునట, తన మొహం మీది మొటిమెనట, తన చీరెనట, తన రవికనట. ప్రతి మాట మధ్య, నా పెదవి మీద ముద్దు పెట్టుకొనేది… ”

3. ‘కలుపు మొక్కలు’ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (1891-1961)

… మన ప్రెసిటెంటుగారు – రాత్రి పగలు కూడా – కేవలమూ వేశ్యావాటికలోనే.

… బ్రాహ్మణుడు కనకనే మాఘస్నానాలు, దొమ్మరి గుడిసెలూను.

అలాకాక ఏ రెడ్డో, నాయుడో చౌదరో అయితే-

“వా! బ్రాహ్మణయుక్తి అంతా కురిపిస్తున్నావే… అవునవును బెల్లం మాటకేంగానీ – వెధవ బెల్లం. మా యింట్లో ఈగలు కూడా దాని మీద వాలవు గానీ – నువ్వు కాఫీ అంటే జ్ఞాపకం వచ్చింది. నీ దగ్గిర ఈ మధ్యనే ఈనిన ఆవుందిట కదూ? బ్రాహ్మలకిస్తే ఏ పేరు పెట్టినా దానమే అవుతుంది? గాని మాకిచ్చింది విన్నామా? సప్లయి… ఇనాము… నజరానా… నేమాను… ముక్కు మూసుక్కూచో లేదు బ్రాహ్మలు ముక్కుదాళ్ళు పోసి జాతినంతనూ నిర్వీర్యం చేశారు.

మనిషినీ మనిషినీ విడదీసి, దూరం చేసి, అసూయపెంచి…”

 “…పొద్దున దాకానా, కాకులు కూశాటప్పుడు వచ్చి తమర్ని లేపనూ?”

“అదీ తెలివంటే, ఏమంటే? వెలుగు వచ్చాక అయితే దిక్కుమాలిన ప్రజలు-”

(2)

“మణుగు నెయ్యే?”

“ఇన్నాళ్ళనుంచి కాపరం చేస్తున్నాను. ఇంత మందిని కన్నాను గాని పండుగ రోజున అయినా మిల్లి గరిటెడు కంటె ఎరగం.”

“ఈ వుద్యోగాలు లేనప్పుడు ఆ నిర్భాగ్యుడు మాత్రం ఎరుగునా? వాడి రోజిది.”

“…నలుగురూ గడ్డి పెట్టరూ? ”

“నలుగురూ పెట్టే గడ్డెక్కువా, ఆయన పెట్టే అన్నం ఎక్కువా?”

“ఆనక ఆయన గతి ఏమిటె కాని, యిప్పుడు పిల్ల కడుపు మాడుతుంది. ఇక డబ్బాపాలు పోయాలి.”

“మొదటి నెల జీతం (రూ.50 అక్షరాల యాభై రూపాయాలు) కామధేనువును కొనేస్తాను. అప్పడింటిల్లిపాదికీ పెరుగు. రెండో నెలజీతంతో ఒక్క బనారసు చీర. మూడో నెల జీతంతో బుల్లెమ్మకి బాలతొడుగు. దాంతో దాని కడుపు గొట్టిన దోషం – పోతుంది. తరువాత సంసారం పూటుగా.”

“ఇది గొప్పగా చెప్పుకోకండి. నలుగురూ తాటాకులు కడతారు.”

(3)

“ఆవిడ వేశ్య. ఏం మైల పడ్డావా? సచేలస్నానం చేయాలా?”

“ఏమయితేనేం, సెలవివ్వండి.”

“అది చాలా అందగత్తె, మాంచి ముమ్మరంలో వుంది. అప్పుడే నలుగురైదుగురు పకీరులయ్యారు… అది శిపారసు చేస్తే, అంటే సరసానికి వప్పుకుంటే అన్నమాట…”

“వేదం చెప్పుకున్నవాడ్ని. ఘనాపాటిని…”

“మరి నీ కొడుక్కి కూడా ఆ వేదమే చెప్పకుంటే ఈ తిప్పలు లేకపోవును కాదూ? వేదాలు, శాస్త్రాలూ మీకే వుండాలి. ఉద్యోగాలు మీరే కొట్టేయాలి. అవునా? మీ పూర్వులు మాకు సర్వనాశనం చివరకు దాస్యం అయినా విధించారు. మీరు అది కూడా లేకుండా చేస్తున్నారు కదూ?”

“పుండు మీద కారం చల్లుతున్నారు మీరు.”

“చీము పట్టకుండా నయమైపోతుంది కాదుటయా?”

“ఆ పని చెయ్యక తప్పదంటారా?”

“తప్పకేం. నిర్భంధమా ఏమిటి, మరి ఉద్యోగ వాంఛను వదిలించుకో గిలిగితివా.. ఇక వేశ్యా దర్శనమే కాదు, దేవతా దర్శనం కూడా అక్కర్లేదు. నిశ్చింతగా కూర్చుని జంద్యాలు మెట్టుకుంటూ, వేదవేదాంగాలు…”

“…నేను వేదాలు వల్లించాను. ఆ విద్యలో ఈ జిల్లాలో నా అంతటివాడు మరి లేడు. అన్నం పెడతావని వచ్చాను. వేశ్యా వాటికలో అడుగుపెట్టడం నాకిదే మొదలు. సగం చచ్చి వచ్చాను. కాని, నీ యోగ్యత చూడగా సిగ్గు పడవలసిన ఆవశ్యకం ఎంత మాత్రమూ కనబడదు…”

“మా వేశ్యల ద్వారా నెరవేరే రాచకార్యమేమీ వుండవు. ఉన్నా ఆ పనేమిటో ముందు తెలవాలి. నీతి మాలోనే కాదు, మన దేశంలోనే లేదు. బ్రాహ్మణుల్లో కోటికి ఛండాలులు ఉన్నరంటారా, లేదంటారా? ఆ ఛండాలులకు తమరు చెప్పిన ప్రెసిడెంటు కుల పెద్ద.”

“కాని పాకీ వాళ్ళ స్వాధీనంలో కూడా కొన్ని పనులున్నాయి.”

“నిజమే కానీ పాకీ పని వాళ్ళకి వృత్తి. వృత్తికీ ప్రవృత్తికీ సంబంధం ఏమిటి? మా పింతల్లి కూతురుకీ ఆయనకీ సమ్మందం వుంది. దాంతో నేను వల్లకాదన్నాను. నేనెప్పుడూ, ఎక్కడా ఎవరి బసకీ వెళ్ళను. పైగా మేళం వెళ్ళిన చోట బ్రహ్మచర్యం ఆచరిస్తాను. వల్లకాదని చెప్పేశాను…”

“…అగ్రజాతుల్లో పుట్టవలసినదానవమ్మా నీవు.”

“అదే మన్నమాట బాబయ్యా. అగ్రజాతుల్లో మాత్రం స్త్రీలకు ఆదరగౌరవాలున్నాయా? స్త్రీ అంటే బానిసేకదా? ఆట బొమ్మేకదూ? మేము డబ్బు తెచ్చిన వాడినల్లా చేరనిస్తాము…”

“నువెంత యోగ్యురాలవు! వేశ్య అయినా కులాంగన లాగ… అభిజాత్యం కల ఒక కళావతిని తార్చడానికి సాహసించేను తల్లీ. నన్ను క్షమించు. ”

“నా మూలంగా ఒక పేదమూర్తి కుటుంబం జీవనాధారం పొందుతుందంటే అది నా అదృష్టం. ఇంతకీ నేను పతివ్రత నెలాగూ కాదు. మగనాలినంత కంటే కాదు. కనక దీని వల్ల నాకిప్పుడు కొత్తగా సంభవించే పాతిత్యం కూడా ఏమీ లేదు… వేశ్యం కులం అంత చెడిపోయిందా బాబయ్యా? అగ్రజాతి గృహిణులందరూ మచ్చలేని వారేనా?… ”

4.‘డిప్రెషన్ – చెంబు’ – వేలూరి శిమరామశాస్త్రి (1892-1967)

రామారావుకు కొలువులేని లోటు లేదు. ఓరంత ప్రొద్దు పెండ్లాముతో పేరంటము. ముక్కోటినాడు ముక్తిద్వారములే తెరవ బడియుండును గాని రామారావు మేడ బందు. మిత్రులెవరేని వచ్చి ‘రామారావు, రామారావూ’ అని రెట్టింప మొదలిడగానే మహాలక్ష్మి(రామారావు తల్లి) అసత్య భీతిలేక “అయ్యా! అతగాడు అత్తింటికి వెళ్ళాడ”ని వారిని పంపివైచెడిది.

గ్రీకు – చిత్రకళలోని నగ్నసౌందర్యముతో పాటు అఱచాటగు ఆంధ్ర కళయందుము రామారాయనీ గదియలంకరించుకొనెను. ప్రాచ్య రసాయనములతో పాటు అప్రాచ్య రసాయనములను అతని బల్లనెక్కెను. కోహళ వాత్స్యాయనులు మొదలు Marry Stopes తరువాతి వారి వరకును గల సారస్వతమతని బీరువాలు ప్రదర్శించెను. ఇటులొక ఏడాది గడిచెను. ఈ సంసార యాత్రకు మహాలక్ష్మి నగలు చాలా వరకు మంగళమాయెను. సంసారమా గంపంత, ఈతడా యిహ మృగనాయకుడు – అనుకొను ‘తులసి’ (రామరావు భార్య) ‘మనిషికి ఏమీ అక్కర లేదు – ఆడుది వున్నచో సరి’ అని లోపల అనుకొనుచు ఆవలకు నడచెను.

అత్త పిల్లలకు అన్నము పెట్టుచుండెను. కోడలు మొదటి సారిగా ప్రక్కగదిలో గూరుచుండెను.

“ఎప్పుడూ ఒక్క ఆవకాయే. లేకపోతే గోంగూర పచ్చడి. పాడు పచ్చడి ఆంధ్రమాత, నేయైనా వెయ్యవు. ఇందాక కాకరకాయ వేయించిన వాసన కొట్టలేదేం?” అన్నాడు పద్మనాభుడు.

“నాయనా, నేయి వేసుకుంటే నాలుక జిడ్డెక్కి చదువురాదు.” అన్నది మహాలక్ష్మి.

“అన్నయికెల్లా వచ్చింది?”

“అన్నయ్య మాత్రం చదువుకోకముందు…”

“అన్నాయి కోసం ఎన్ని అబద్ధాలన్నా ఆడుతుంది” అని రమణయనెను,

“మనకే నయం – ఆవకాయం, గోంగూర వుంది. అన్నయ్య వఠ్ఠి అన్నం తిని వూరుకునేవాట్ట” అని ఆఖరు వాడు పుండరీకాక్షుడు వట్టయన్నమును నోరుగూరుకొనెను.

“అది పెరుగు కాదు. అన్నాయి లేచాక విస్తరికి చీమలు పట్టకుంటవని ముగ్గోశాను. అది గాక పెరుగోసుకుంటే పిలక పెరగదు”

“అలా అయితే నేను పోసుకోను” అని సుందరియనెను.

“మహా పోసినట్టు, నీవు పోసికోనట్టు! ” అని రమణయనెను.

పక్కగదిలో నన్ను కోడలికి ఈ మాటలు సరి కొత్త, పిల్లల నోట గడ్డ కొట్టుచున్నామని మనసులో ననుకొనుచు తులసి మెల్లగా మేడ మెట్లెక్కదొడగెను. ఆమె వెనుకనే రామారావు.

“మీరు కాసేపు కిందికి వెళ్ళి సంసారమంతా గమనించుకోండి! నన్ను కాసేపు ఒంటరిగా ఒదిలిపెట్టండి” అనెను.

“ఇది పతివ్రతల లక్షణం కాదు. భర్త మాటకు ఎదురాడితే గుడ్లగూబ అయి పుట్టుతుందట కాదూ, పుట్టుతుంది!” రామారావు.

“ఈ ఆడంగి రేకులవాళ్ళ మాట మగాళ్ళకు సిగ్గు లేదు? ఎవళ్ళెలా పోతే ఏం? ఆడది దగ్గర వుంటే చాలు. ఉద్యోగసద్యోగాలు లేని పిన్నవాళ్ళ సంగతంతా యింతే…” తులసి.

“ఏమో అనుకున్నాను. కోపం వచ్చినపుడే ఆడది చాలా అందంగా వుంటుంది. కావలసినవన్నీ కనిపస్తాయి?” రామారావు.

“సైతాన్! మీరు కిందికి వెళతారా వెళ్ళరా?” తులసి.

“…ఎంత దప్పిక అయినా చాతకం అకాశగంగ కెదురు చూస్తుంది కానీ చెరువులకు ఎగబడదు” రామారావు.

“ఎంత మాటా! గుంట మీదకే ఎగబడిందిప్పుడు. హిందూదేశంలో పెళ్ళి అనే ఆచారం ఎప్పుడంతరిస్తుందో కదా!” తులసి.

“నీవు విడాకులిచ్చేట్టున్నావే?”

“ఆ బిల్లు వస్తే ఆంధ్రదేశంలో తులసే మొదటిది.”

టపా కచేరి నుండి వచ్చిన ఒక జాబు రామారావు గౌరమునకు హాని కలిగించెను. దానిని చూడగానే అతని ముఖము తుమ్మలలో ప్రొద్దు గ్రుంకినట్లాయెను. దాని మీద B.A (Hons) కాని, M.A అని కానీ తుదకు ‘రామారాయ్ ద్వివేది’ అని కానీ లేదు.

దాని మీద నున్న చిరునామా ‘శ్రీరస్తు చిరంజీవ ద్వివేదుల రామయ్య’. పేరు చేతనే గౌరవము పుడికిపుచ్చుకొనదలచువారికి మొండి పేరు బండబూతు కాదా?

తులసి క్రింద నుండి మీదికి రాగానే పొంచియున్న రామారావు ఆమెను కౌగిటిలో నలిపివేసెను.

“అబ్బ ఏమిటీ మోటపని? లంఘనములలో మనుగుడుపు. ఆ అలుగోలులో ఈ బాలుగోపెందుకు? బాగుండదు. మీరూ మీయమ్మగారితో వెళ్ళుడు” తులసి.

“అమ్మో, నీయడబాటు నాకు Anarchy” రామారావు.

“కాదు. Diarchy” తులసి.

బండి యెక్కి అత్తయిట్లనెను “ఎప్పుడూ ఎరుగని దానవు. ఈ యింటి మోహం – సూది పొట్ట మాత్రం పాము పొట్ట. దీనిని నీ భుజాలకు ఎత్తి వెళుతున్నాను.”

లక్ష్మి ఒక పొట్లము తీసి తులసికిచ్చి “దీనిలో వంటయింటి సామానంతా వున్నది.” అని చెప్పుచుండగా ఆమె రెప్పలు క్రమముగా తడిసికొనుచువచ్చేను. కంఠము స్తంభించెను. అత్తగారినటుపంపి తులసి యిటు వంట యింటికి జని పొట్లము విప్పెను. మట్టియలు, మంగళసూత్రం తన సంసారయాత్ర కవి దారి బత్తెము… తానీ యింటికి వచ్చిన నాడీ పిల్లలకు నగలు కూడా కలవు. ఇప్పుడు లజ్జాదేవి వారి మీద కాపురము. కడుపున కార్చిచ్చు. పుండువంటి పువ్వు మాసమున గూడ వారికి కప్పదుప్పటి లేదు. పద్మనాభుడు గోచీతో, మూడవవాడు మొలనూలుతో, పెద్దయాడు పిల్లకు మాసికల పరికిణీ, చిన్నదానికి చినుగులది. రాత్రి వారలందరికీ ఒకరి చర్మమింకొకరికి దుప్పటి. వారి తల్లి తన కొంగును కొంతయు, తనను కొంతయు వారికి గప్పి పిల్లల కోడివలె నడుమ నిదురించను.

వీరికి ఆరు నెలలనుండి చల్దియన్నము లేదు. “అన్నయ్యకు ఉద్యోగం అయ్యాక పొద్దున్నే వేడి వణ్ణమే పెడతానని అమ్మ అన్నది” అని సుందరియనెను.

“చలదియన్నము జబ్బు చేయదూ?” అని రమణయనెను.

బంగాళదుంప కూరయు, వడియములును, వంకాయ బజ్జియు, పప్పుచారును, సెనగబజ్జీలును తమకు మాత్రమే వైవేద్యమాయె – ననుకొనెను తులసి.

వసంత కాలమునందు తుమ్మెదల వలె పిల్లలంతయు కొదచేయుచు తిరుగుచుండిరి. నూరు మారులు రామారావు కిందికిదిగి పొంచిపొంచి నూరు మారులు మేడమీదికి పోయెను, కాని తులసి వచ్చు జాడ కానబడలేదు. కొంతతన కడుకు రానిచో మహమ్మదేకొండకడకేగెను.

“…ఆడుదాని కడకెపుడు రాదగునో, యెపుడు రాగూడదో మీకు తెలియదు… దవ్వుగా పొండు…” తులసి.

“నేడు అస్పృస్యత లేదు” రామారావు.

“మీవంటి వారి యెడల అస్పృస్యతయు, అదృశ్యతయల, అసంభాష్యతయు గలవు” తులసి.

“భార్యయనగా?”

“డుభృఇన్ భరణపోషణయోః భరింపబడునది, పోషింపబడునది భార్య” రామారావు.

“అబ్బో పాండిత్యము. ఈ డుడూ ఏమిటి? భరింపబడునది భార్య యగునో నేను మీ యమ్మగారికి భార్యను” తులసి.

“కాదు తులసీ,” అని రామారావు తులసిని ఎత్తుకుని “ఇదుగో – నేనే భరించితిని” అని యనెను. పంజరబద్ధయగు కొత్త చిలుకవలె తులసి విదలించుకొని గుంజుకుని తప్పించుకొనెను. ఆమె కాటుక కన్నుల నుండి ఒక కృష్ణ ప్రవహించుటకుగాను కట్టలను తప్పించుకొను చుండెను. మరల రామారావు అట్టులే చేయుట కాయత్తుడాయెను. తులసి అతని చెంప చిటేలున గొట్టెను.

“ఎశ్! సత్యాభామ కాలితో దన్నెను. నీవు చేతితో వేసితివి. నీవు సత్యభామవు” అంటూ రామారావు రెండవ చెంప యొగ్గెను.

తులసి ఛెళ్ళుమనిపించెవు. రామారావు తులసి రెండు చెక్కుల మీద రెండు చుంబనముద్రలు వేసెను.

“ఇది సిలువ” అని తులసి యనెను.

“రామ రామ. ఎవరేని ఒక చెంప మీద వేయుచో రెండవ చెంప గూడ వేయించుకొనుమని క్రీస్తు చెప్పెను. నేనటుల వేయుటయేగాక నీ రెండు చెక్కులు గూడ ముద్దాడితిని” అని రామారావనెను.

“క్రీస్తునుదహరించువారు ఇంటిల్లిపాదిని పస్తులో నుంచరు” తులసి.

“నీకు బైబిలు రానటులున్నది. రేపటి సంగతి నీకెందుకు? రేపటి సంగతి రేపే చూచుకొనగలదు అని ఏసు అనెను” రామారావు.

“నేను చచ్చినను అత్తగారి ఈ మంగళసూత్రము గాని, మట్టెలు గాని ఈయనుకాని, నా తాళి తీసియుత్తును” అని తులసి తన పుస్తెను పుట్టుక్కున తెంచి రామారావు మీద పడవయిచెను.

“పైసాలేనిచో పరస్త్రీ విముఖుడనుమాట జూటా. పైసా లేనిచో స్వపరస్త్రీ విముఖుడు” అనుకున్నాడు రామారావు.

“ఇక ఈనాడు మాకెవరికీ అన్నప్రాప్తిలేదు” అని తులసి భోషాణము తలుపు లోపలికి దిగి వెదకి పెద్దరాగి చెంబోకటి తీసెను. దానికి చింతపండు పులుసు పట్టించి తోముచుగూరుచుండెను.

“బిక్షాందేహి”

డిప్రెషన్ – చెంబు.

మిసెస్ రామారావు ద్వివేది.“బి.యే. ఆన్‍స్” అని తారులో వ్రాసిన రాగి చెంబుపట్టుకొని తులసి – ఆమె వెనుక సుందరి, రమణ, పద్మనాభుడు అందరును గలసి “బిక్షాందేహి” అనిరి.

5.‘మా బావమరది పెళ్ళి’ మొక్కపాటి నరసింహం (1892-1973)

రాత్రంతా నిద్రలేక తెల్లవారు ఝామున 3 గం॥ కన్ను మూసినపుడు కోకిలకూసినా దాన్ని మందలించ బుద్ధి వేస్తుంది… నాలుగు వందల పరకాళాతాన్లు ఒక్కమాటు చించినట్లు బర్రున బాకా పట్టాడు. తేనెపట్టులో ఈగలు లాగా ఇంట్లో అందరూ కిలకిల్లాడుతూ లేచారు. ప్రభాత వాయువులలో కొత్త సౌరభము వున్నట్టూ, స్త్రీల ముఖాల్లో వింత సౌరు వున్నట్టూ తోచింది.

భోగము మేళము వచ్చింది. ఎంత ‘యేంటీనాచ్’ అయినా కళ్ళముందు నుంచి వాళ్ళు వెడుతూ వుంటే తల వంచుకునేనా వాళ్ళకేసి చూడబుద్ధి అవుతుంది. తలవంచుకుని క్రీగంట చూస్తే వాళ్ళకు సైగ చేస్తున్నాననుకుంటారేమోనని నేను ఎప్పుడూ బాహాటంగా తల ఎత్తే చూస్తాను. బ్యూటీ ఎక్కడున్నా సౌందర్య పిపాసకులు చూచి ఆనందించక మానరుగదా?

అనిత్య సువాసినుల సౌందర్యము చూస్తుంటే వళ్ళు గరిపొడిచింది. ఏదో పది వూళ్ళు తిరిగేవాణ్ణి, అనేక రకాల ముఖాలు చూసే వాణ్ణి, నాకే హడలు పుడితే ఇంక ఆడవాళ్ళు, పిల్లలూ చూస్తే ఏమవుతారా అనిపించింది. ఏది ఎలా వున్నా మన వాళ్ళు మేజువాణి పెట్టించక మానరు, పిల్లలు వీళ్ళను చూసి జడుసుకోకమానరు. అందుకని పిల్లల మట్టుకైనా ఇంద్రాక్షి విభూతి చెప్పడానికి ఒక బ్రాహ్మణ్ణి తీసుకువస్తేగాని వల్లకాదని మా మామగారితో దెబ్బలాడాను.

పురోహితుడికి కొంచెం వయసు మళ్ళినా దృష్టి అంతా మేజువాణీ మీదనే వున్నది.

రూపాయలు పళ్ళెములో ఘల్లు ఘల్లు మనగానే పాటలు పాడి మంగళహారతులిచ్చారు ఆడపడుచులు. గమ్మతేమిటోగాని మామూలుగా మనవాళ్ళ కంఠాలెంత అసహ్యంగా వున్నా, ఇటువంటి సమయాలలో వాళ్ళు నలుగురూ కలిసి పాడుతుంటే అది ఆనందముగానే వుంటుంది. అవతల భోగము వాళ్ళు మట్టుకు వీళ్ళ కంఠాలూ, పాటలూ విని నవ్వుకుంటూనే వున్నారు.

మా ఆవిడా పెట్టె దగ్గర కూచుని పెట్టెలోని బట్టలు ఇవతల పారేసి, బయటనున్నవాటిని పెట్టెలో పడేసి, అన్నీ కలిపి ఒక మారు యివతలకు తీసి, మళ్ళీ అన్ని కలిపి పెట్టెలో పెట్టింది. ఇంతా చేస్తే పెట్టెలో ఏ బట్టలు పడ్డవో, ఏవి పడలేదో జ్ఞాపకము లేకపోయింది. అందుకని తన వెనకాల కూచుని ప్రపంచమంతా మరచి బొమ్మలకు తలంటినీళ్ళు పోసుకుంటున్న కూతురిని అల్లరి చేస్తున్నననే మిషతోటి ఒకటి తగల్నిచ్చి మళ్ళీ పెట్టెలో బట్టలు ఒకటొకటే వెయ్యడము మొదలు పెట్టింది.

నేను ‘హాత్ హూత్’ అని పెద్ద పెద్ద కేకలు వేశాను. ఇదంతా చూసి ప్రక్కనున్న మా పిల్ల వాళ్ళ తల్లిని కోడతానేమోనని భయపడి తల్లిని కౌగిలించుకుని రాగాలు పెట్టడం మొదలుపెట్టింది.

ఇసుకలో నడక… ఎండ పైన నెత్తి మాడుస్తున్నది, అడుగున కాళ్ళు అంటుకుపోతున్నవి.

మన ఆడవాళ్ళకు పాపం ఎప్పుడూ వర్తమానమేమీ లేదనుకుంటాను. గతము సృతికి తెచ్చుకోవడం, బవిష్యత్తును గురించి ఆలోచించిడమూ…

6. ‘ఏమి సంబంధము’- విశ్వానాథ సత్యనారాయణ(1895-1976)

నాకు 16, 17 ఏండ్ల వయసు. అప్పుడు ఆ పిల్లకు పదేండ్లు. ఆ పిల్లను చూచి నేనెంత సంతోషించానో మనసులో అంత దిగులూ పడ్డాను. మా నాయనగారు నా (10వ) ఏటనే పెండ్లి చేశాడు.

ఆ పిల్ల ఎంత అందెగత్తెయో అంత చిలిపి పిల్ల, ఆ పిల్ల నాతో సరాగాలాడటం మొదలు పెట్టింది.

…నేను సీమ మిపరకాయను మాత్రమెరుగను. అది సరిగ్గా గండుచీమంత వుంటుంది. ఆ ప్రమాణంలోనే పండుతుంది. ఆ పిల్ల దాన్ని తెచ్చి నాకిచ్చి యిది తియ్యగా వుంటుంది తినుమన్నది. నోట్లో వేసుకుని నమిలితిని. ఇంక నోరు మండిపోయింది. పరుగెత్తి నీళ్ళు పుక్కిళించి ఉమిసి… కళ్ళ వెంట నీళ్ళు, చెవుల్లోంచి పొగలు రావడం.

ఆ పిల్ల నవ్వటం… ఆ పిల్ల తల్లి చిరునవ్వుతో తూష్ణీభావం వహించడం తరువాత ఏడాదికో, రెండేండ్లకో నా భార్య కాపరానికి వచ్చింది. ఆ పిల్ల గురించి ఐదారేండ్లు తలచుకొంటూ వండేవాడిని.

(2)

ఏ స్టేషనులోనూ నీళ్ళు లేవు.

ఆడవాళ్ళ పెట్టెలో ఆవిడ ముఖ రేఖలు నాకు స్పష్టంగా కన్పించడం లేదు. స్థూలంగా చూస్తే చాలా అందగత్తె వలె కన్పించింది… దప్పిక స్థితిలో స్త్రీ పురుష బేధం లేదు. పరపురుష విభేదం లేదు. ఆవిడ చేయి నాకు తగిలింది. అందుకునేను సంతోషించడం అధర్మలక్షణమా? జంతులక్షణమా?… ఆవిడ చెంబు పుచ్చుకొనటంలో ఈ సారి తన చేయి నా చేతికి తాకకుండానే పుచ్చుకున్నది… ఆమె మొగము చూస్తే కృష్ణ గోదావరి జిల్లాల స్త్రీ వలె వున్నదిగాని దత్త మండలపు స్త్రీ వలె లేదు. ఆమె సుందరమైన ముఖం నా మనస్సులో ముద్రితమయ్యేవున్నది.

తర్వాత రెండేండ్లకు ఆ వూళ్ళో నాకు వుద్యోగమైంది. ఆయన సబ్ మెజిస్ట్రేట్ చేసి మళ్ళీ కలెక్టరు ఆఫీసులో పెద్ద గుమాస్తాగా వచ్చాడు. ఎంత అనుకొన్నా ప్రక్కగా ఒక మనిషి వుంటే తల ఎత్తి చూడడం మానవ సహజం. తాను మెజిస్ట్రేటు భార్య రేపు పొద్దున మగడు తహసీల్దారౌతాడు. మనసులో ఆ అహంకారం ఉండి యుండవచ్చు.

…ఆవిడ బండి దిగి యింట్లోకి వెళ్ళే వరకూ నేను ఆవిడ వంకే చూస్తున్నాను. భర్త కూడ వెంటనే వున్నాడు. నేను తన భార్య వంక చూస్తున్నాని ఆయనకు తెల్సు. నన్ను మర్యాద తెలియని వాడు అని అనుకోవాల్సిందేగానీ గద్దించడానికి వీలులేదు. ఆయన నడకలో, చూపులో ఒక తిరస్కృతి కనిపించినా పైకి పొక్కలేదు.

ఆ వూళ్ళో నూతులు పాతాళగంగలు. ఓ రోజు వాళ్ళ పనిమనిషి రాలేదు. ఆవిడే నీళ్ళు తోడుకోవాలి. మనిషి పాపం, నీరస స్థితిలో వుంది. తొమ్మిదిన్నరకు అన్నం పెట్టపోతే ఆ మొగుడు ఆమె మీద కూడా మెజిస్ట్రేటగిరీ చెలాయిస్తాడు.

“…ఓరేయి, ఈ అమ్మాయి ఎవరో ఎరుగుదువా? నీ చిన్నప్పుడు మనం మీ వూరు పెళ్ళికి వెడితే నీ చేత సీమ మిరపకాయ కొరికించిందే ఆ అమ్మాయి.”

మీ అమ్మ ఈ మాట చెప్పిన మరునాడే వాళ్ల యిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళాయానకు తహసీల్దారైంది. వాళ్ళు యిల్లు ఖాళీ చేసి వెళ్ళిన రోజు నేను వూర్లో లేను.

తర్వాత మూడేండ్లకు నేను ఆ వూళ్ళో ఉద్యోగం మానేసి మా వూళ్ళో చేరాను. ఆవిడ తమ్ముడు మా యింటి దగ్గర్లోనే అద్దెకుంటున్నాడు. తెల్సిందేమంటే ఆమె మళ్ళీ కడుపుతో వుండి తమ్ముడు అక్కను పురిటికి తీసుకుని వస్తాడనీ.

..ఆమెకు ప్రసవ సంబంధమైన వ్యాధి కాదు. వేరే వ్యాధి ఏదో వచ్చింది. నేనూ వెళ్ళి చూశాను. అప్పటికే ఆమే ప్రాణనిష్క్రమణ వేళ అయింది… మరునాడు రెండు ప్రాణులు, మిగత జీవులయ్యాయి.

నేను కూడా వాడుకలలో నొకడనైనాను…

7.‘వెండి కంచం’ మునిమాణిక్యం నరసింహరావు (1898-1973)

కానీకి ఒకటే విస్తరి. రోజుకు నాకు రెండు, మా ఆవిడకు రెండు విస్తళ్ళు కింద ఆవుతుంది. ఒక వెండి కంచం కొనుక్కుంటే బాగుండును. నెలకు రెండు రూపాయల చొప్పున సంవత్సరానికయ్యే (24) రూపాయలు పెడితే వస్తుంది. దానికి పెట్టిన ధర నాలుగేండ్లలో తిరిగి వచ్చినట్లే. పైగా సాలుకు(24) రూపాయలు ఆదా కూడా.

ఒక కంచం కొంటే అర ఎకరం, పొలం కొని పారేసినట్లే. అరఎకరం మీద అంత కన్నా ఎక్కువ ఆదాయం రాదు. (20) ఏండ్లలో నాల్గు వందలు. ఏ సంవత్సరం మిగిలిన (20) రూపాయలు ఆ సంవత్సరం వడ్డీకిస్తే (20) ఏండ్ల తర్వాత వెయ్యి రూపాయలు. ఓ యిల్లు కట్టుకోవచ్చు. ఆలోచిస్తే ఓ వెండి కంచం కొనడం వల్ల భవిష్యత్ జీవితం అంతా బాగుపడేట్లు వుంది.

అయితే నెలకు(50) రూపాయల జీతంలో ఈ పెద్ద సంసారం, ఒక్కసారి (80) రూపాయలు పెట్టు వెండి కంటం కొనడం ఎట్లాగు?

ఒక ఉపాయం తోచింది. ఎంతో ఆలోచించగా ఆలోచించగా వెండి పూత పూసిన పళ్ళాలు వుంటాయి. అది కొంటే? భలే! ఈ ఆలోచన నాకు ఆదివారం పొద్దున్నే రావడం ఒక అదృష్టమే. వెంటనే పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ హెబ్బారు షాపుకు వెళ్ళాను. ధర ఇరవై రూపాయలు.

“దీని కోసం చాలా మంది తిరుగుతున్నారు. సి.సి రావుగారు నిన్న వచ్చి చూచి వెళ్ళారు” హెబ్బారు.

మా ఆవిడ ఏదైనా కాస్త డబ్బు ఆదా అయ్యే విషయంలో నాతో ఏకీభవిస్తుంది. నేను కుర్చీ కొంటానంటే, వద్దు అది అయితే నాల్గు ఏండ్లలో పాడైపోతుంది. ఇనుప కుర్చీ కొంటే శాశ్వతంగా వుంటుందని సలహాయిచ్చింది. ఈ విషయం చెప్పాను ఆవిడతో.

“ఆ కంచం వెండి కంచం లాగా తెల్లగా మెరుస్తోంది” నేను.

“అట్లాగే మెరుస్తంది. అది భోగం మెరుపు” అని ఆవిడ చీదరించుకుంది.

నా యింట నా మాటకు యింత విలువ లేకుండా పోయిందేమా అని విచారం కలిగింది. నేను గనుక ఆ కంచం కొనకపోతే… అని ఏదో అనుకోబోయి ఏమనాలో తోచక వూరుకున్నాను.

విస్తట్లో తినడం అంత దరిద్రపు పని ఇంకొకటిలేదని తోచింది.

పుల్లలు వూడి నోటిలోకి వస్తున్నాయి. అరటి ఆకులేమో చాలా ఖరీదు.

మనిషి అయిన ప్రతి వాడికి సౌందర్య తృష్ణ వుంటుంది. ఎన్నో అందమైన వస్తువుల కోసం మానవ హృదయం పరితపిస్తుంది.

అద్దాల బీరువాలో కొన్ని గ్లాసుల ప్రక్క పగలు సూర్యకాంతిలోనూ, రాత్రి ఎలక్ట్రిక్ లైటు కాంతిలోనూ ఆ కంచం ధగధగా మెరిసిపోతూ వుంటున్నది… నా చేతిలో దమ్మిడీ లేకపోవడం మూలాన నా యిబ్బందీ పడుతున్నాను. సిగరెట్లకు, కిళ్ళీలకు ఓ అర్థరూపాయికి…

…కాంతం నా వంక వికారంగా చూసి “అమ్ముకొందామన్నా మనకేమీ లేదుగా” అన్నది చేతులు త్రిప్పుడూ వెక్కిరింతగా.

నాకు లేని మాట నిజమే. కానీ, అయితే మాటకు అల్లాగంటే కష్టంగా వుండదూ?

“అల్లాగ అంటేనే నాకు ఒళ్ళుమండేది” అన్నాను కోపంగా.

“లేనప్పుడు లేదంటే కోపమెందుకూ?”

“అందరూ వుండే అమ్ముతున్నారా ఏమిటి? అమ్మాలని బుద్దే పుట్టాలి గానీ ఏదైనా అమ్మవచ్చు!”

“ఏమి అమ్ముతారో కాస్త చెప్పండి చూద్దాము?” అన్నది దీర్ఘం తీస్తూ.

“ఏమి అమ్ముతానా? గుంటూరులో అరండల్ పేటలో ఇల్లు ఒకటి అమ్మేస్తాను” అని పెద్దగా అరిచాను.

“గుంటూరులో మనకు ఇల్లు ఒకటి ఉందా ఏమిటండీ?” అంది తొణక్కుండా. “నా కెప్పుడూ చెప్పలేదు” అన్నది తెల్లబోతూ.

“ప్రతి విషయమూ ఆడదానికి చెప్పాలని లేదు.”

“పోనీ లెండి. ఇది వరకు చెప్పలేదు సరే. ఇప్పుడు చెప్పండి. అక్కడ మనకో యిల్లు ఉందా? ఎప్పుడు కొన్నారండీ” అని నవ్వింది.

“నేను కొన్నానని చెప్పలేదే” అన్నాను.

“కొనకపోతే ఆ యిల్లు మనదెట్లా అవుతుంది ”

“అమ్మడానికి హక్కు వుంది కాబట్టి… ఏమీ లేదు, ఆక్కడ మా అత్తగారి యిల్లు ఒకటి వుంది. అది కాస్తా అమ్మేస్తాను.”

కాతం విరగబడి నవ్వుతూ “వాళ్ళు వూరుకుంటారుటండీ?” అన్నది. “అత్తగారి ఆస్తిపై అల్లుడికి ఆ మాత్రం హక్కులేదా?” నేను.

“ఎవ్వరైనా వింటే నవ్విపోతారు” ఆమె.

… వెండి పూత కంచం కొనడానికి ఎంత కాలమైనా డబ్బుల్లేక ఈ తీరని కిరిక నన్ను చాలా బాధ పెట్టింది…

ఆరు నెలలు గడిచిపోయాయి. కానీ, డబ్బుల్లేక ఆ వెండిపూత గిల్టు కంచాన్ని కొనలేకపోయాను.

ఆరోజు,

ఇంట్లో నేను పెద్ద పీటా, దాని ముందు ఒక వెండికంచం.

“అరే? ఎక్కడిదీ కంచం?”

“మనదే, కొన్నాను” అన్నది నవ్వుతూ కాంతం. “88 రూపాయలు” అంది.

“వెండికంచం! డబ్బు ఎక్కడిదీ?”

“రామన్న పేటలో ఇల్లు అమ్మేశాను” కాంతం.

“రామన్న పేటలో నీకు ఓ ఇల్లు వున్నదా?” నేను.

“ఉండాలా ఏమిటండీ. అంతా వుండే అమ్ముతారా?…”

నా మొగుడు గారు నెలకు 75 రూపాయలు(జీతం 50 రూ + ట్యూషన్లు చెప్పిన డబ్బు 20 రూపాయలు) సంపాదిస్తున్నారు. నా చేతిలోనే పెడుతున్నారు. నేను ఎట్లాగో మిగిల్చి ఇది కొన్నాను. మీకు ఇష్టం గనుక…

8.‘చంద్రేణైక పుత్ర’ – శ్రీనివాస శిరోమణి

నారయ్య మామూలు గ్రామ మున్సబు మాదిరిగా కరణాల దస్త్రాల కావలివాడు కాదు. అతడు శ్రీమంతుడు. ఇంగ్లీషు నేర్చుకున్నాడు. ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడుతాడు. దొరలకు ఇంగ్లీషులోనే జవాబు చెపుతాడు. పితపితామహార్జితము (80) ఎకరాల మాగాణి, నూరు ఎకరాల మెట్ట, ఇసుక పర్రలు వందల కొద్దీ యకరాల సరుకు వనాలు అయిపోయినవి. కర్రల అడితీ, రైసు మిల్లు… ఆయన గ్రామ పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు కూడా. వ్యాపారాలు, వ్యవహారాలు నారాయ్య వంతు, వ్యవసాయమూ, గొడ్డుగోదా అన్నీ భార్య సుబ్బమ్మకు.

సుబ్బమ్మకు (45) ఏళ్లవయస్సు, (30) ఏళ్ళకాపరం. కానీ, పిల్లలు లేరు. జ్యోష్యులు “నారయ్య మంచి అందగత్తెను కొద్ది రోజులలో పెండ్లి చేసుకొంటాడు. ఆ అందగత్తెకు ఒక పిల్లవాడు పుట్టుతాడు.”

“… మొగడికి పుట్టిన పిల్లవాడు అయినా, పెండ్లానికి పుట్టిన పిల్లవాడు అయినా ఉపయోగపడుతాడు గానీ ఏ అయ్యకో, ఏ అమ్మకో పుట్టిన వాడు ఎప్పుడూ అక్కరకు రాడు” అంది.

సుబ్బమ్మ వంశము నిలవడానికి ఇంకొక పిల్లను పెండ్లి చేసుకోవలసిందేను అని సుబ్బమ్మ పట్టిపట్టింది. సవతిని సంపాదించడానికి సుబ్బమ్మే పూనుకొన్నది.. పిల్లకు (20) సంవత్సరాలు. బీదరికం వల్ల పెళ్ళి కాలేదు. సుబ్బమ్మ పెనిమిటి నారయ్యకూ, సవతి మంగమ్మకూ మూడు ముళ్ళూ వేయించింది.

మానవుల ఎదుగు బొదుగులు తిండి మీదా ఆధారపడవు – అని ఇంగ్లీషు వైద్యులు అంటారు. ఇది నిజమో బేనిజమో తెలియదు గానీ మంగమ్మ మండలము రోజులలో గుర్తు పట్టడానికి వీలు లేకుండా మారిపోయింది. బంగారు సలాక మాదిరిగా తయారైంది.

…సుబ్బమ్మగారి పుట్టింటి నుంచి జట్కా బండి వచ్చింది. ఆమె తాతగారు అప్పడో యిప్పుడో అన్నటువంటి కబురు. …సుబ్బమ్మ పుట్టింటికి వెళ్ళిన రెండు రోజులకు నారయ్య జిల్లా బోర్డు మీటింగుకు వెళ్ళాల్సి వచ్చింది. …వారం రోజులైనా సుబ్బమ్మకానీ, నారయ్యకానీ తిరిగి రాలేదు.

రాత్రి తొమ్మిది గంటలు అయింది. గాలి ఈలలు, వాన ఎడాపెడా… దీపాలు ఎప్పుడో ఆరిపోయినవి. అంతా అంధకార బంధురం. వసారా పెంకులు లేచిపోతూ ఠపీల్ ఠపీల్ మంటూ చెప్పుడు చేస్తూ వున్నవి. మంగమ్మకు భయం వేసింది.

“గురవా, గురవా” అనికేక వేసింది. నౌకరు గురవడు జవాబు లేదు. నాల్గు జతల ఎడ్లను హాలులో వదలిపెట్టి గురవడు బయటకు వెళుతున్నాడు. మధ్యమధ్య మెరుపులు పట్టపగలు అంత వెలుతురును వేస్తున్నవి. వాన దంచుతూ వుంది. ఉత్తరపు గాలి పడమరకు తిరిగింది. గాలి ఒక్క విసురు విసిరింది. మంగమ్మ కాళ్ళు నిలుపలేకపోయింది. వెల్లకిలా పడ్డది. గురవడు పరిగెత్తి కొని వచ్చి పసిపిల్లను రెండు చేతులతో ఎత్తుకున్నట్లుగా మంగమ్మను ఎత్తుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు.

గోడ పక్క లాంతరు దీపం గంతులు వేస్తోంది. మంగమ్మ తల తుడుచుకొని చీరె, రెవిక తీసి వేసి ఒళ్ళు తుడుచుకుని పెట్టెలో చీరె కట్టుకుంటూ ఇంటు చూసింది. గురవడు వాకిలి పక్కను నిలుచుని వున్నాడు. వాడు తనను చూసినాడా అనే సందేఙం వచ్చింది. చీరె కట్టుకుంటూనే “గురవా, ఏమి చేస్తున్నావు?” అడిగింది.

“చలికి వణుకుతూ వున్నానండీ” అన్నడు. బ్యాటరీ దీపము వేసింది. గుండు వంటి గురవడు. కండలతో మలుపు తిరిగిన వాడి జబ్బలూ.

“ఒరేయ్! చలికి ఎంత సేపు అట్లా వణుకుతావు” అంటూ పెట్టి లోనుంచి తువాలూ పంచె తీసి “ఈ పంచె కట్టుకో” అంది మంగమ్మ.

“ఇవి దొరగారివి” అన్నాడు గురవడు.

మంగమ్మ ఒక్కనవ్వు నవ్వి “ఇప్పుడు నీవే దొరవు!” అని వాడి ముఖం వంక చూసింది. వాడికి సిగ్గు వచ్చి తల వంచుకున్నాడు. బ్యాటరీ, దీపములో బ్యాటరీ అయిపోయింది. దీపము ఎప్పుడో ఆరిపోయింది. అంతా చీకటి గుయ్యారము గావుంది. మంగమ్మ ఒళ్ళు అంతా తిమ్మరి తిమ్మిరిగా వుంది!

“గురవా” అనిపిలించింది.

“ఆఁ” అనిపలికినాడు.

“ఒరేయ్, నాకు భయము వేస్తూవుంది. నీవు ఇక్కడకురా” అన్నది వాడు ఆ చీకటి గదిలోకి వచ్చాడు…

సుబ్బమ్మతాతగారి దిన వారాలు అయిన తర్వాత తిరిగి వచ్చింది…

అంత వరకూ మందకొడిగా అయోమయంగా వుంటూ వచ్చిన గురవడు మహాహుషారుగా వుండడం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపోయింది…

మంగమ్మకు నెల తప్పింది.

సుబ్బమ్మ వెయ్యి కళ్ళతో గురవణ్ణి కనిపెడుతూ వుంది.

గురవడు యథా ప్రకారం డాబా మీదికి మంచి నీళ్ళు వగయిరాలు తీసికొని పోతూ మంగమ్మ వంక చూడడమూ ఆమె వాడితో నేత్రావధాము చేయడమూ కనిపెట్టింది సుబ్బమ్మ.

…తెల్లవారు ఝామున (3) గంటలకు సుబ్బమ్మకు హఠాత్తుగా నిద్ర మెలుకువ వచ్చింది. పక్క గదిలో మనిషి అలికిడి… క్షణ లేశము ఆలికించింది.. చప్పుడు లేకుండా బయటకి నడిచింది. గొడ్ల కొట్టములో గురవడి గది దగ్గరకు పోయింది. తలుపులు బయట తాళం వేసి వుంది. మారు తాళం చెవితో తాళమును తీసింది, లోపలికి పోయింది.

తన మెడలో వున్న కాసులదండ తెంచింది. కొన్ని కాసులు కింద పడ్డవి. యథాప్రకారం తలుపుకు తాళం వేసింది. వచ్చి పడుకొంది.

… గురవడి మీద కాసుల దండ దొంగిలించినట్లు రుజవైంది. గురవడికి సంవత్సరం కఠిన శిక్ష విధించినాడు మేజిస్ట్రేటు…

(9) మాసములు వెళుతుండగా మంగమ్మ ప్రసవించింది. దుండు ముక్కవంటి మగపిల్లవాడు పుట్టాడు…

9.‘నువ్వులూ – తెలకపిండీ’ – కొడవటిగంటి కుటుంబరావు(1909-80)

సోమయాజులు నా ఆప్త స్నేహితుడు. సోమయాజులుకు రాగజ్ఞానం లేదు. తాళజ్ఞానం లేదు. పాటలో తన్మయత్వం తీసుకురావడానికి మూడూ అవసరం లేదని నాకు సోమయాజులు రుజువు చేశాడు. ఒక్క సాహిత్యంతో తప్ప తన్మయత్వం రాని నాకు వాడి పాట వెర్రెత్తించింది.

జయలక్ష్మి వకీలు సత్యనారాయణ చెల్లెలు. ఆమె తండ్రి పట్నంలో గొప్ప వ్యాపారస్థుడు. జయలక్ష్మి సోమయాజులు చేత గంటల తరబడి పాడించుకునేది. వాణ్ణి అనుకుని కూర్చునేది. మరీ ఆపేక్ష వస్తే వాడి ఒళ్ళోనే కూర్చునేది. సోమయాజులు బీదవాడైనా, పాటగాడైనందున అతడ్ని తప్ప పెళ్ళి చేసుకోను అంది. పెళ్ళి చేసుకుంది.

“మన వాడు పూర్వ జన్మ వాసనవల్ల మంచి గాత్రంతో పుట్టాడు. కాని సరిగమల దగ్గర్నుంచీ కట్టుగా నేర్చుకుంటేగానీ పాటగాడుగా రాణించలేడు ” అన్నడు జయలక్ష్మి అన్న గురునాథం…

…ఇప్పుడు సోమయాజులు పాడితే జయలక్ష్మి గుండె తటతట లాడడం లేదు. ఆమె వాణ్ణిప్పుడు పాట పాడమని అడగదు.

సోమయాజులుకు విద్వత్తు లేకపోవడం ఒక్కటే లోపమన్నట్లు వెనక మాట్లాడిన వాళ్ళు కూడా విద్వత్తు సంపాదించి వాడు పరిపూర్ణడైన నాడు హర్షించలేదు.

జయలక్ష్మి అన్నల్లో ఒకడైన పరబ్రహ్మశాస్త్రి పూర్తిగా వ్యాపారదృక్పథం గలవాడు. నాటకాలు కాంట్రాక్టులు, సినిమా పాటల రికార్డుల వ్యాపారం. ముఖ్యంగా హిందుస్థానీ సినిమా రికార్డులు.

దాని కొరకు వుపయోగించుకున్నాడు సోమయాజులను.

సోమయాజులు గొంతుకీ పంజాబీ సంగీతం – ఒక రాగలక్ష్యం గానీ, ఒక శాస్త్ర నిబంధనగానీ లేని ఈ కలగాపులగపు సంగీతం.

“ఇదేం సంగీతం? దీన్లో అర్థమేమిటి? దీన్ని నేర్చుకోవడమేమిటి? నాకిదెట్లా అబ్బుతుంది?” అని సోమయాజులు వాపోయాడు.

“వినడానికి సుఖంగానే వుంటుంది. అందులో ఏ లోపం వుంది?” అన్నది జయలక్ష్మి.

“అందులో వున్న సంగీత మేమిటి కనక?” అన్నాడు సోమయాజులు.

“అందులో ఏమీ లేదని మీరే అంటారు, అది ఎట్లా అబ్బుతుందని మీరే అంటారు. ఏది నిజం?” అన్నది జయలక్ష్మి సానుభూతి లేకుండా.

ఆకస్మికంగా సోమయాజులు సంగీతం విషయం ఆలోచించడం మానేసి జయలక్ష్మిని గురించి ఆలోచించసాగాడు. తన కోసం తన వాళ్ళందరి తోనూ పోట్లాడి పెళ్ళాడిన జయలక్ష్మి తనకు దగ్గరగా వుండి కూడా ఎంత దూరమైంది.

…నువ్వులు అటే నాగరికత లేని సరకు. అది బస్తీ చేర్చి గానుగ ఆడించి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకు ఎక్కి అనేక వంటిల్లను అలంకరించుతుంది. తెలకపిండి చెక్కను నువ్వులొక వేళ చూసినా పొల్చుకోలేవు. అది గొడ్లకూ, పేదవాళ్ళకూ ఆహారమమవుతుంది. నువ్వులు గానుగాడడం ఏమంత గొప్ప విషయం కాదు. నేను మనుష్యుల్ని గానుగాడగా చూశాను.

10.‘జేబురుమాలు’ – బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం

చిట్టిశాస్త్రి అంటే పురుషోత్తం. పద్మినికి మేనత్త కొడుకు.

“సావిత్రమ్మ కొడుకు లక్ష్మీనారాయణ కూడా నాకు మేనత్త కొడుకే. అయినప్పటికీ అతనంటే నా కంత అభిమానం లేదు. నువ్వంటేనే …” పద్మిని,

రెండేళ్ళ తర్వాత

“…రెండు సంవత్సరాలు మనం ఒకే కళాశాలలో ఒకే తరగతిలో వున్నాం కదా. ఇంకా మీరు నన్ను మీరు, మీరూ అనడం న్యాయమేనా? ‘లక్మీ కాంతం’ అంటూ వుండండి.”

“నిన్న సాయంత్రం నా గదిలో వున్న పిల్ల నాతో పొట్లాడింది. చీటికీ మాటికీ పొట్లాడుతుంది పిల్ల. కోపంతో నా చీర ఒకటి చింపేసింది. నేను మట్టుకు వూరుకునే రకం కాదులెండి. తన పెట్టెలోంచి క్రొత్త చీరె ఒకటి పైకి లాగి చింపేశాను. దానితో ఇద్దరం ఏడుస్తూ కూర్చున్నాం. తర్వాత యిద్దరం మళ్ళీ స్నేహితురాళ్ళమయిపోయాం లెండి. ఆడవాళ్ళం అందరం చాలా విచిత్రమైన జంతువులమని ఒప్పుకుంటారా?” అంది పద్మిని లక్ష్మీకాంతంతో.

“మధుసూదనరావు మన తరగతిలోనే ఉన్నాడు చూడండీ. అతనూ నేనూ స్నేహితులం. చాలా తెలివైనవాడు” అన్నాడు లక్ష్మీకాంతం పద్మినితో.

మరొక రెండేళ్ళ తర్వాత.

“నువ్వు కొద్ది రోజులలో సీమ వెళ్ళిపోతానని చెప్పినప్పట్నించీ నేనంత దుఃఖపడుతున్నానో నువ్వు ఆలోచించడం లేదు – ‘మధు’ ” అంది పద్మిని మధుసూధనరావుతో.

మరొక రెండేళ్ళ తర్వాత

పద్మిని పెళ్ళి కృష్ణశాస్త్రితో జరిగిపోయింది. “కృష్ణశాస్త్రి సీమలో కలెక్టరీ పరీక్షలో ఉత్తీర్ణడయ్యాడు. కృష్ణశాస్త్రి మధుసూదనరావు బంధువు!….”

11.‘కోడెత్రాచు’ – ‘శ్రీవాత్సవ’ (యండమూరి సత్యనారాయణరావు)

“మరి గంటేను తాతా! పాము కలలోకి వస్తే మంచిదంటావా?”

“మంచిది కాదంటారు మోహన్ సింగ్. నాగేంద్రుడు పగబట్టినాడు. నాగుల చవితికి పుట్టలో పాలేసుకున్నారా?… ఈ పీడపోవడానికి ఓ పాముని చంపిచాడు. ఒక్కసారి పామును చంపితే, యింక దాని వల్ల భయపడనక్కర లేదంటారు.”

మోహన్ సింగ్ కలల్లో ఎదురింటి కూరగాయలమ్మే అచ్చమ్మ కన్పించింది. ఆమె తాటకలాగా ఉంటుంది. పగలు చూస్తే రాత్రికి కలలోకి వచ్చి తీరుతుంది. అటువంటి అచ్చమ్మ తన కలలోకి రావడం తనను కౌగిలించుకొన్నట్లు అయితే సిగ్గుతో నీరై పోయేవాడు. అలాంటి సమయంలో అచ్చమ్మ బదులు దాని కూతురు లక్ష్మి కలలోకి వచ్చినా బాగుండును అన్పించేది. లక్ష్మి అంత అందమైంది కాదు. కాని 13,14 ఏండ్ల ప్రాయం. కూరగాలు అమ్మడంలో వాళ్ళ అమ్మకంటే నాలుగాకులు ఎక్కువే చదివింది.

లక్ష్మి కూరగాయల గంప పక్క నెట్టుకొని “సింగూ! కొంచెం గంపెత్తవూ?” అని అడిగేది. ఆ పిల్ల కొంటెనవ్వులు చూచి కోపపడేవాడు…

ఆఫీసులో – నాలుగు మూరల పొడవు పెద్ద పాము. ఆడపాము. పడగ లేదు. సింగు మూలగదిలో గోడకు చేర వేసివున్న పొడగాటి కొలత బద్ద తెచ్చి పామును కొట్టాడు – చంపాడు. దానికి దహన సంస్కారాలు కూడా సింగే చేశాడు.

తాత సింగును లోపాయికారిగా పిలిచి మరో భయం పెట్టాడు. “ఒరేయ్, సింగూ! భార్యాభర్తలకి ఎడబాపులు పెట్టావురా బాబూ! దాని భార్యను చంపిన పగ కోడె త్రాచు తీర్చుకు తీరుతుంది. అందు చేత నీవు ఆ మగ పామును కూడా చంపే వరకూ జాగ్రత్తగా వుండాలి.” అని చెవినివేశాడు. సింగును మరో భయం మరింత ఎక్కువయింది. ఇది వరకు ఒక్క స్వప్వంలోనే సర్పభయం వుండేది. ఇప్పుడు జాగ్రత్, సుషుప్తి, స్వప్నావస్థలు మూడింటిలోనూ భయం తప్పలేదు. దాంతో జ్వరం వచ్చింది.

తాత అన్నాడు. “ పాములకు మునుష్యుల కంటే ప్రేమ ఎక్కువ. అందుకే నాగ బంధం అంటారు. పాముల వాడిని తీసుకొస్తే వాడే చూస్తాడు ఆ పని.’

పాముల్ని పట్టేవాడు నాగస్వరం, బుట్ట వేసుకుని వచ్చాడు. రెండు తెల్ల మడతలు తెప్పించాడు, ఓ పక్క పరిపించాడు. చుట్టూ పొదలు, గురివెంద చెట్లు, సంపెంగ, రేరాణి, డీంకమల్లె, పురుగుడుచెట్లు గరికపోచలు…

‘మౌళి’ వాద్యం ప్రారంభమైంది. ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ’ ఆ పాటలలో ఏదో పిలుపు – ప్రియునకు ప్రేయసి లాగున, పురుషునకు ప్రకృతిలాగున. ఇది వినడానికి యమునా తీర సైకతస్థలాలు గోపికాగణాలతో లజ్జా విహీనములైనవి. ఇది వినడానికే మన్మథుడు శంకరుని శాపానికి గురియై అనంగుడైనాడు… మెరసిపోయే దేహ కాంతితో, విప్పిన పడగతో సంపెంగ పొదలోంచి కదుల్తూ వచ్చాడు నాగరాజు… పాము బుట్టలో బందీ అయిపోయింది.

అంతటితో కథ పూర్తి కాలేదు. ఇంకా అతని స్వప్నాలలో పాములు భయపెడ్తూనే వున్నవి. పూజలు, పునస్కారాలు చెయ్యమన్నాడు తాత. అవీ చేశాడు కానీ, కలల్లో పాములు తప్పలేదు. మోహన్ సింగ్ నానాటికీ చిక్కి శల్యమైపోతున్నాడు…

ఆ రోజు హోళీ పూర్ణిమ. ఎదురుగా చెరువు గట్టు మీద పొగడ చెట్టు క్రింద… రాలిన పొగడ పూలు మత్తుగా వాసనలు విరజల్లుతున్నాయి…

ఇందాకా లక్ష్మి ఘోరంగా వంటినిండా రుంగు కొట్టిపోయింది. ఈ ఆడదానికి ఎంత కావరం? ఈడ్చి తన్నే వాడు లేక! ఇది ఎవడిని కట్టుకుంటుందోగానీ వాడి పని అంతే! …తనే కట్టుకుంటేనో? ఎలాగ కట్టుకుంటాడు? తము బొందిరీలు. లక్ష్మి యెవళ్ళో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు… ఆ అచ్చమ్మతో యిష్టంగా వుంటాడు పోలీసు ఆయన! అతనికి తెలిస్తే చంపెయ్యడూ? ఇప్పుడు లక్ష్మి పెద్ద అయింది. ఆడది.

దగ్గరకు వచ్చిన లక్ష్మిని మెహన్ సింగ్ తన బాహువుల్లో బంధించాడు. ఏమి చేశాడో! ఏమై పోయాడో! కొంత సేపటికి పెద్ద ఏడ్పుతో లక్ష్మి యింటి ముఖం పట్టింది. మెహన్ సింగ్ తాను చేసిన అకార్యానికి మొగం చూపకుండా యింటికి వెళ్ళి తన గదిలో తలుపులు బంధించుకొన్నాడు.

మోహన్ సింగ్ IPC 324 సెక్షన్ క్రింద బాలికా బలత్కార నేరానికి అరెస్టు చేయబడ్డాడు…

ఆ డాక్టరు మానసిక చికిత్సలో కూడా పరిశోధన చేసిన వాడు అవడంచే మోహన్ సింగ్ యొక్క అధికారియైన ఇంజనీరుతో అన్నాడు “కలలో పాములకీ, నిజం పాములకీ ముడి పెట్టరు. కలలో పాములు మన్ససులో అణద్రొక్కివేసిన కోరికలు. అదే పురుషత్వ చిహ్నములైన సర్వములుగా కలల్లో కన్పించేవి… సింగ్‌కు పెళ్ళి చేస్తే సరి… లక్ష్మి, సింగ్ యిష్టపడుతూనే వున్నారు…”

12.‘ఉదబిందువులు’ – డా. జి.వి.కృష్ణారావు (1914-1979)

సుభద్రమ్మకు ఇద్దరూ కవలలు. ఒకటే పోలిక. ఒకే సంస్కారంలో పెరిగారు. అయినా గుణాలలో యిరువురికీ ఎంతో తేడా వుంది. పెద్దవాడు రామయ్య మనసు ఉదారం. చిన్నవాడు లక్ష్మయ్య కూడా మంచివాడే కానీ కాస్త లోభగుణం.

సుభద్రమ్మకు ఉన్న కొండ్ర తక్కువ. ఇద్దరు పిల్లలకూ ఇంగ్లీషు చెప్పంచే తాహతు లేదు. చిన్నవాడిని ఇంగ్లీషు చదువుకలకు పంపి రామయ్యను వీధి బడి చదువులో మానిపించి తనకు తోడుగా నిల్పుకన్నది.

రామయ్య – అతని స్నేహం వంటిదే పగ కూడా.

లక్ష్మయ్య లక్ష్మణరావై L.T. పూర్తి చేసి బస్తీలో బడి పంతులై ఒక గ్రాడ్యుయేట్‌ను పెళ్ళి చేసుకున్నాడు.

పెద్ద కోడలు మంగమ్మ చూలాలు… “అత్తయ్యా! పోటు పోడుస్తున్నదని కళ్ళు తీసివేసుకోగలమా? ” అన్నది.

“…అవునమ్మా. అంతే, మిన్ను కురవక చేలు, కన్ను కురవక బ్రతుకులూ పండవు.” అన్నది సుభద్రమ్మ కొంగుతో ముక్కు తుడుచుకున్నది.

ఒళ్ళు సరిగా వంచుకోలేక, చేతి వాటుకు వీలు పడక లక్ష్మణరావు పనిమనిషి మానుకున్నది.

లక్ష్మణరావు భార్య శ్యామల అత్తను సమర్థిస్తూ భర్తతో తగవు పెట్టుకొన్నది. “ఉన్న ఆస్తిలో పాలు అమ్ముకుని మీ సుఖం మీరు చూసుకుంటే సరిపోయిందా? ముందుగానే మీ అన్నదమ్ములిద్దరూ ఆమె యింటిని అమ్ముకుంటే ఆమె ఎక్కడ వుంటుంది? ఏమి తింటుంది? …లోగడ చిన్న కొడుకున్నాడని బయలుదేరి వచ్చింది. ఇప్పుడు మరెక్కడకు బయలుదేరుతుంది? ముసలితనంలో తల్లిని తరిమేసే అధికారం ఎవరిచ్చారు?” అంది శ్యామల.

కొలది రోజులకే, హంస లేచిపోయింది. అప్పుడు కూడా రామయ్య వెళ్ళి తన గొడ్ల చావట్లో కూర్చున్నాడే కానీ తల్లి శవాన్ని చూడ్డానికైనా రాలేదు. ఎందరు ఎన్ని విధాలుగా అన్నా కూడా తల్లి అంత్యక్రియల్లో పాల్గొన లేదు…

సుభద్రమ్మ చనిపోవడానికి ముందు రామయ్యకు రాసిన ఉత్తరాన్ని లక్ష్మణరావు కొడుకు రఘు యిప్పుడు విప్పి చదివాడు. ఆవుత్తరంలో-

“పెద్దబ్బాయ్! చిన్న వాడి మీద పక్షపాతం చూపించాననే కదా నీ కోపం? మానవులన్న తరువాత మమతల్లో ఎచ్చులొచ్చులుంటాయి. మనకు రెండు చేతులొక్కటే కానీ ప్రతి పనికీ ఒకరు కుడి చేతిని ముందుకు చాపుతారు, మరి కొందరు ఎడమ చేయి చాపుతారు. కలతలు లేక ఇద్దరూ ఒకరికొకరు తోడుగా వుంటారని ఆశపడి మోసపోయాను… పెద్దగా చదువుకొన్నంత మాత్రాన గుణాలు రావు… ”

13.‘ఏ చెట్టుకా విత్తు’ – కొడవటిగంటి కృష్ణమూర్తి

మోబనుడు చూశాడు – నరసయ్య తన వేపు పరుగెత్తుకొస్తున్నాడు – అమెరికాను చూసిన కొలంబస్ అల్లే. మోహనుడి గుండె జారిపోయింది. “ఏం రోయ్ మోహనాయి!” అని అతన్ని సమీపించి వీపు మీద చరిచాడు నరసయ్య. మెహనుడి మనసంతా రాబోయే ప్రళయాన్ని ఎలా ఎదుర్కోవటమా అని అలోచిస్తూనే వుంది.

“ఎవరండీ మీరు? మర్యాద కూడా తెలియదల్లా వుందే!” అన్నాడు వీపు మీద నరసయ్య చెయ్యి పడగానే. నరసయ్య నివ్వెరపోయాడు. మెహనుడి మొహం మటుకు అసహ్యంగా వుంది.

“అరె! జ్ఞాపకం లేదూ?” అన్నాడు నరసయ్య.

“ఎవరు మీరు?”

“నీ పేరు మోహనాయి కాదూ?”

“నా పేరు మోహనుడు. నన్నెట్లా ఎరుగుదురూ?”

“…క్షమించండి. పొరపాటు నాదే. చేసిన తప్పుకు చాలా చింతగా వుంది” అని వెళ్ళిపోయాడు నరసయ్య.

“ఎవరు ఆ బైతు?”

“నాకు తెలియదు.”

“మరిన్ని పేరు పెట్టి ఎలా పిలిచాడు? ”

“నా పేరు మోహనాయా ఏమిటి?” మోహనుడు.

పచ్చి అబద్ధం ఆడాడు. అతని అయిద్ధాల్లోకెల్లా ఈ ఆబద్ధానికి విశేషం ఉంది. నరసయ్య, అతనూ మెదట కలుసుకున్నది నాలుగో క్లాసులో. ఇతరులు తనని గోల చేస్చుంటే నరసయ్య అవసరమైతే తనను అల్లరి పెడుతూన్న వాళ్ళనందర్నీ తన్ని తను కాపాడేవాడు. అలా వచ్చేవాడు. పోతూ పోతూ తన నెత్తిన మొట్టిపోయే రకం అని నరసయ్య పైన మోహనుడి అనుమానం. అలా జరగగా అతను చూశాడు కూడా.

…చీకటి పడక మునుపే వెలిగించిన గ్లాసు లైటుకింద ఇలాయి బుడ్డీ వెలిగించి కూచుని వుంది గారెల లక్ష్మమ్మ. నరసయ్య జేబులో చేయి పెట్టి కానీ తీసి యిచ్చి ఆవడ వున్న ఆకును తీసికో బోయాడగా ఎవరో వెనుక నుంచి అతని చెవి పట్టుకున్నారు. వెనక్కు తిరిగి చూచాడు. మిరపకాయల కొరుకు దగ్గుతో వచ్చి నాయన –

“నీ పేరేమిటి?”

“నరసయ్యండీ” నరసయ్య చెవి వేడెక్కింది.

“పిల్లల్ని మహా ఏడిపిస్తావులే?” నరసయ్య చెవి నలిగి పోతున్నది. నరసయ్యకు ఏడుపు వచ్చింది కానీ ఏడవలేదు.

“ఇక ఎన్నడూ అలా చెయ్యవుకదా!” చెంప చెళ్ళు మనిపించి వెళ్ళిపోయినాడు ఆయన. నాలుగు గజాలు పోయిన తర్వాత ఆయన పక్క మోహనుడు ముక్కు కోయిస్తానంటూ సౌంజ్ఞ చేస్తున్నాడు! నరసయ్య ఆవడ అక్కడే పారేసి యింటికి పోయినాడు… మోహనుడు నరసయ్యను తనతో మాట్లాడవద్దన్నాడు. రెండేళ్ళు ఇద్దరూ ఒకే క్లాసులో చదువుకున్నారు. తరువాత నరసయ్య వెళ్ళిపోయినాడు… 15 ఏండ్ల తర్వాత యిప్పుడు కలిశాడు.

నరసయ్య అందంగా నాజూకుగా వుంటాడు. నరసయ్య పేరు గలవాడు బాగుండడం మోహనుడికి యిష్టంగా లేదు… ఇప్పటి మెహనుడు B.L. పాసై లాయరుగా తర్ఫీదు పొందుతున్నాడు. ఇంటి నుండి ఎక్కువ డబ్బులు రాకపోయినందున డొక్కలు మాడుతుండేవి. మోహనాకారుడు కావటం వల్ల కాదు అతనికి ఆ పేరు పెట్టింది… ప్రేమించకుండా వుండడం కంటే ప్రేమించి విఫలమనోరధుడు కావటం మంచిది అన్న టెన్నిసన్ మహాకవి వాక్యాన్ని అక్షరాలా అమలులో పెట్టాడు మోహనుడు. తన చెల్లెలుతో పాటు తన యింటికి వచ్చే ఆడపిల్లలనీ ప్రేమించాడు… వయసు ముదిరిన కొద్దీ గోంగూర సుబ్బినీ, అంటలు తోమే మాచామునూ, పాలు పోసే సీతాంనూ, ఇంట్లో అద్దెకుంటున్న విశాలక్షమ్మనూ ప్రేమించాడు. కాలేజేకి వెళ్ళిం తర్వాత లిల్లీజానునూ, పేతురు చెల్లెలునూ ప్రేమించాడు. గదికెదురుగా వున్న మస్తానును కూడా ప్రేమిద్దామనుకున్నాడు, కానీ వాడి దుంప – తెంచుకోనీ, దాని భర్త రజాక్ ముస్పింలీగ్ లో చేరడం మూలాన చూస్తూ చూస్తూ ధైర్యం చేయలేక పోయినాడు. మద్రాసు వచ్చింతర్వాత క్లాడెట్ కోల్బర్టునూ, నార్మా షీరరునూ, మార్లిన్ టెట్రిక్‌నూ ప్రేమించాడు. డోరథీ లేమరూ మీదికి గూడా అతని హృదయం పడుతూ వుండేది ఎప్పుడన్నా. లీలాదేశాయ్‌నీ, సాధనాబోసునూ, ప్రమీలనూ, నసీంనూ, శోభనా సమర్థ్‌నూ, జయఅమ్మాళునూ ప్రేమించాడు. శాంతా ఆప్టేను ఎలా ప్రేమించాలో అతనికి తెలియదు. వాసంతి యింకా చిన్నది. ఇది వరకు వారిలో గోహరూ, సూలోచనా, మాధూరీ అతడ్ని ఆకర్షించారు. గడచిన రోజులు మళ్ళీ అన్నరావాలి, లేక జ్ఞాపకం అన్నా రాకుండాలి. రెండూ జరగవు. ‘Goodbye Mr.Chipps’ చూచినప్పుటి నుంచీ గ్రీర్ గార్సనును ప్రేమించాడు!…

“… అచ్చంగా గ్రీన్ గార్‌సన్” అన్నాడు యోహానుడి స్నేహితుడు. మోహనుడు మాట్లాడలేదు.

“ఇటు వేపే చూస్తున్నది.”

థియేటర్‌లో లైట్లు ఆరినై.

మోహనుడు B.A. చదువుతుండగా ఆమె F.A. చదివింది. నాల్గు సంవత్సరాలు దాటినవి ఆమెను చూసి. అతను ప్రేమించిన వాళ్ళందరిలోనూ ఆమెదే అగ్రస్థానం. పదే పదే జ్ఞాపకం వస్తూ కూడా వుంటుంది. గ్రీర్ గార్సన్ చూచి నప్పుడల్లా ఆమె స్ఫురణకు వస్తుంటుంది.

ఆమె ఎవరితోనో దబదబా బైటకి వచ్చి కారు ఎక్కబోతున్నది. మెహనుడు ధైర్యం చేసి ఆమెను సమీపించి-

“ఏమండీ, మీరు ఈ వూళ్ళో వుంటున్నారా?” అన్నాడు.

లోపల్నించి ఎవరో తల బెటికి పెట్టి “ఎవరాయన?” అన్నాడు ఆమెతో.

ఆమె ఆశ్చర్యంగా మోహనుడి వంక చూచి “ఏమో!” అంది. మోహనుడు నివ్వెరపోయినాడు.

“ఏమండీ! మీరు నా భార్యను ఎరుగుదురా ఏమిటి?” అన్నాడు కారులో వున్నాయన మర్యాదగా.

మెహనుడికి మతిపోయింది. ఆ గొంతు అతను ఎరిగినదే. కారు లైట్లు వెలిగినై. కారు లోపల కూడా లైటు వెలిగింది. మెహనుడు ఆశ్చర్యానికిక అంతు లేదు. లోపల ఆమె పక్కన నరసయ్య కూర్చుని వున్నాడు!…

14.‘కరణం కనకయ్య వీలునామా’ – పాలగుమ్మి పద్మరాజు (1915-83)

స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని పెద్దలన్నది అక్షరాలా నిజం. భార్య ఎంత అందగత్తెయైనను, ఎంత అనుకూలవతి యైనను భర్త మనసు పరకాంతల మీదికి ముగ్గుతూయుండుట పురుష ప్రకృతిలో ఉండుకున్న ఒక విశేషం. భర్త తొక్కే చిన్న చిన్న తప్పు దార్లను చూసీ చూడనట్లు ఊరు కొనిగానీ లేక చిరునవ్వుతో హాస్యపూరకంగా సదరు విషయాన్ని భర్తతోనే పరామర్శించి కానీ, తాను మాత్రం సుముఖంగానే యిన్నట్లు అతనికి అభిప్రాయం కలిగించినట్లైతే ఆ దాంపత్యం అత్యంత సుఖంగా సాగిపోవుననిన్నీ నా అనుభవం వల్ల గ్రహించి యున్నటువంటి విషయం.

భర్త మనసు పరస్త్రీల మీదికి మొగ్గుట ఏ విధముగా ప్రకృతి సహజమో, భార్య మనసు పర పురుషుల మీదికి పోట కూడా సహజమేనని నేను యిందు మూలముగా అంగీకరిస్తూయున్నాను.

నేను చనిపోయిన తర్వాత దురాశాపూరితువైనటు వంటి పురోహితులు నీ చుట్టూ చేరి, నా అంత్యక్రియల విషయమై నిన్ను ఒత్తిడి చేసి, నీ మతి చెడగొట్టి, వారి స్వార్థం కోసం అనవసరమైన ధనవ్యయం నీచే చేయించుటకు పూనుకొనుట తథ్యం. నా అంత్యక్రియలకై వెరసి రూ.17.06 న.పై (అక్షరాల పదిహేడు రూపాయల ఆరు నయాపైసలు) కేటాయించగలదులకు నా నిర్ణయం. భౌతిక కాయాన్ని విసర్జించిన వెనుక నాకు అన్నమూ, నీరు అవసరముండదని నాకు నిశ్చయముగా తెల్సును…

… అంత సన్నిహితులైన ఇద్దరు మేధావుల మధ్య పొత్తు కుదరదు…

15.‘కాగితం ముక్కలు – గాజు పెంకులు’ – బుచ్చిబాబు (1916-67)

తల పెద్దదైతే భుజ బలం వుండదంటారు పెద్దలు.

ఆర్మీలో వున్న వారికి ఎక్కువ వినోదాల్ని కల్పించి మామూలు సమాజంలో సాధ్యం కాని స్వేచ్ఛలో ప్రవర్తించే అవకాశాలు కల్పిస్తారుట.

ఒకర్నొకరు ‘గారు’ అని సంబోధించే అవసరం వున్నంత వరకూ వారిని నిజమైన స్నేహితులుగా పరిగణించడం సాధ్యం కాదేమో.

ఇది వరకెన్నడూ చూడని అరుణని చూసాడు చంద్రం. తలంటు పోసుకున్న జుట్టు తువ్వాలుతో బిగించి ఆర్పుకొంటూ పల్చని తెల్ల చీర పూర్తిగా కట్టుకోకుండా ఒంటికి సగం సగం చుట్టబెట్టుకొని జూకెట్టు లేని భుజం పైన జారిన తడి కొంగు మడతగా మంచం క్రిందికి జారిన కొంగు, చటుక్కున కనబడిన తువ్వాలును లాగి మెడ చుట్టూ కప్పుకొన్న అరుణ – అదొక వింత దృశ్యం.

చిన్న రంధ్రం లోంచి సోకిన సూర్యకిరణంలా ఒక గీతగా పెదవులు చివరలో బిగుసుకున్నాయి. ఏదో మహావృక్షం ఎన్నాళ్ళు గానో భూమికి పెనవేసుకున్న వ్రేళ్ళు లాగా… భుజం మీద ఒంపు రొమ్ములను కదిపి, చీర మడతల్ని కదుపుతున్నాయి…

…అతని ఆవేశం వెనుక చరిత్రలో కాయకష్టం చేసి, సౌందర్యాన్ని ఆరాధించి విఫలుడైన లక్షలాది మానవుల – పురుషత్వం వుండి మీదికొస్తున్నాడు చంద్రం… నల్ల మేఘాన్ని తరుముకొచ్చిన పెనుగాలిలో అల్లల్లాడిపోయిన గడ్డి పూవ్వులా ఆమె వొణికిపోయింది. చీర కొంగు జారి రొమ్ముల మధ్య యిరుక్కుంది. చీర ముడి సరిగ్గా లేక నడుం మీదికి జారిపోతోంది. మంచం మీది దుప్పటిని పైకి లాక్కుని కప్పుకుంటోంది… అతన చెయ్యి డేగ పాదం కప్పపిల్ల మీద పడ్డట్టు…

16.‘జీవిత మాధుర్యం’ – విద్వాన్ మల్లాది సత్యనారాయణ

రెక్కలు ముక్కలు చేసుకుని పొలం పండించిన వారిని ఎంత నిరీక్షించినా మంచి రోజులు రావు. భూమిగల కామందుకు ఎప్పుడూ మంచి రోజులే… కష్టపడేదొక్కడు, అనుభవించేది యింకొకడు. మన దేశంలో మంచి రోజులు కొందరికే వస్తాయి.

దిగమింగుడు దేవతలు అంగుళ్ళు లేకుండా ఎంత మింగేస్తున్నారో. ఎందరో పానకాలరాయుళ్ళు పానం లాగా తాగేస్తున్నారో. దుబారా ఖర్చులు, కేళీవిలాసాలు…

ఒక ఆసామి “పక్షి పలుకుతుంది నీ భవిష్యత్తు రా తమ్ముడూ” అంటున్నాడు. పాపం ఎందరి భవిష్యత్తునైనా చెపుతాడుగానీ తన భవిష్యత్తే తెలియని ఆ ఆసామీ.

…ఆ రెండు నిమిషాలైనా స్వతంత్రం యిచ్చాడు పాపం, ఆ చిలుకకి. ఎగరడానికి వీలు లేకుండా చాటుగా రెక్కలు కత్తిరించి బహిరంగంగా స్వతంత్రం యిచ్చానని చూపించే ఆ ఆసామీ మోసం.

…లేబర్ యాక్టు ఏదో ఉద్ధరిస్తుందని – బ్రతుకు తెరువుకు కావాల్సింది సామరస్యం గానీ యాక్టులు, కోర్టులు కావు…

17.‘బల్లకట్టు పాపయ్య’ – మా గోఖలే (1917-1981)

“రత్తయ్య పెళ్ళాం కాంతమ్మ ఆ పొరుగింటి ఈరబెమ్మం పిలుస్తే దేశాంతరాలెల్లిందట” అన్నాడు సుబ్బయ్య.

“చా!” అంటా నోరు దెరిశాడు బ్లలకట్టు పాపయ్య.

“ఈ రత్తయ్యేమో నాలుగు డబ్బులు సంపాదించుకొద్దామన రెండు మూడు దినాల పాటు పొరుగూరు ఎల్తా వుంటాడు. మరి ఈ మద్దెన ఈరబెమ్మం ఏ పసర పూసాడో ఏమో – కాంతమ్మ కాస్తా మాయమయింది” అన్నాడు సుబ్బయ్య.

“అంతా మాయగా వుంది” అన్నాడు పాపయ్య.

“మనూరి రంగయ్యకు నువేమన్నా బాకీ పడ్డావంటయ్యా పాపయ్యా” అనడిగినాడు సుబ్బయ్య.

“ఆఁ వుంటే రూపాయో, రెండో వుంటదిలే.” అన్నాడు పాపయ్య.

“అబ్బే ఏం లేదుగానీ, వాడి గుణం మనోళ్ళు అందరికీ తెల్సిందే గదా? నువు యింట్లో లేనపుడు ఎల్లి నీ పెళ్ళాం బూసమ్మను ఏదించుకు తింటాడంట. ఆడ్ది ఆడికి పారేయరాదూ పీడా వదుల్తుందీ” అంటూ పంచె దులుపుకుంటూ లేచాడు సుబ్బయ్య.

మజ్జానం బువ్వ దెచ్చిన కొండాయికి బల్లకట్టు ఒప్పజెప్పి, యింటికి గబగబ ఎల్లి తనింటో రంగయ్య సుట్ట ముట్టింటుకుపోతుంటం సూసిన బల్లకట్టు పాపయ్య ఎల్లి బూసమ్మ ఒళ్ళు పచ్చడి జేసి బల్లకట్టు కాడికొచ్చి యిగ ఆడనే గెడకర్ర తీసుకు కూకుండాడు.

ఆ నిశి రేత్తిరి కిట్ట కాలవగట్టు కాడికొచ్చి, పాపయ్య కెదురుగా నిలబడ్డిది బూసమ్మ కొడుకు కొండాయితో.

“ఇంటికి ఎల్దాం రా” అంది బూసమ్మ ఏడుస్తూ.

“దెగ్గరికొచ్చావంటే సంపుతా – ఎల్లు” అన్నాడు పాపయ్య.

“సంపు. నేనే పాపం ఎరగను. నీ కేందో గుబులు తిరిగింది.” అంది బూసమ్మ…

రేత్తిరి మూడు గంటల యాలకు బల్ల కట్టు పాపయ్యను ఎంటబెట్టుకొని కొండాయితో యింటికి చేరింది బాసమ్మ.

అప్పట్నుంచి కొన్నేళ్ళు అయ్యా, అమ్మకు బెడుస్తారావడం కొండయ్య సుత్తా వొచ్చాడు…

ఆనాడు, కోడితో పాటు లెగిసి, పెల్లాం కట్టబెట్టిన సద్ది మూట దీసుకుని కర్ర పోడుసుకుంటూ బజన పాటలు పాడుకుంటూ ఎప్పటికి మల్లే కిట్ట కాలువ బల్లకట్టు వైపుగా ఎల్లాడు బల్లకట్టు పాపయ్య.

18.’ప్రొఫెసర్ భార్య’ – సంజీవదేవ్ (1924-1999)

ప్రొఫెసర్ దయానిధి, ప్రొఫెసర్ భార్యా మందాకిని.

స్వీడన్ నుంచి మన దేశానికి వచ్చిన ముగ్గుర్లో ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు. మందాకిని స్కాండినేవియా పర్యటన చేసినప్పుడు వీరు ముగ్గురు కూడా ఆమెతో పర్యటించారు. భారతదేశానికొచ్చి యిక్కడున్న ప్రాకృతిక వైభవాన్ని, మానవుల దారిద్ర్యాన్నీ, భారతీయ సంస్కృతిలోని వైవిధ్యాలనూ, జీవన విధానాల్లోని ఒడిదుడుకులను, భారతీయ తత్వశాస్త్రపు మహత్యాన్ని చూచి పొమ్మని వారిని ఆహ్వానించింది మందాకిని.

నిరక్షరాస్యులైన కోట్లకొలది ప్రజలను జూపి “వీళ్ళకు విద్య లేకపోతే మాత్రం ఏమి! మీ పాశ్చాత్యులలో విద్యావంతులకు కూడా తెలియని తాత్విక రహస్యాలు వీళ్ళకెన్నో తెలుసు” అనే అసత్యాలను వినిపించలేదు. నిజానికి ఏ దేశంలోనైనా ఆదర్శాలకూ, ఆచరణకూ భేదం వుండక పోదు. కానీ, యింత విపరీత భేదం మరెక్కడా లేదేమో! “అవును. అందులో ప్రత్యేకించి హిందూ సమాజంలోనే గోచరిస్తుంది” అన్నది మందాకిని గంభీరంగా. స్వీడిష్ వారు ఆశ్చర్యపోయి అడిగారు.

“ఏమిటి, ఇక్కడి హిమాలయ ప్రాంతంలో కూడా మనషులు యింత దుర్భలంగా, దీనావస్థలో వున్నారు? ఇటువంటి సుందర, ఆరోగ్య ప్రకృతి మధ్య గూడా మవుష్యులు యింత దుస్థితిలో వుండటం చాలా ఆశ్చర్యంగా వుంది. ప్రకృతి వైభవం అపారంగా వున్నది. దారిద్ర్యం, దైన్యం, వ్యాధులూ కూడా అపారంగా వున్నాయి.”

“ఇక్కడ మనం చూడాల్సింది, చెట్లనూ, జంతువుల్నీ, లోయల్నీ, హిమశృంగాన్నీ కానీ ప్రజలను కాదు.” మందాకిని విచార వదనంతో అంది.

డాక్ బంగళా వాచర్ అటూ యిటూ తిరుగుతున్నాడు. మందాకిని అతన్ని పిల్చి అతను హిమాయాలలోని ఏ భాగానికి చెందిన వాడో అడిగింది తాను పడమటగా వున్న ఔన్సార్ వాడు అన్నాడు.

 “మీ ప్రాంతంలో అన్నదమ్ములందరికీ ఒకే భార్య వుంటుందట నిజమేనా?” అడిగింది మందాకిని.

“నిజమే. ఎంత మంది అన్నదమ్ములున్నా వారందరికీ భార్య మాత్రం ఒక్కతే.” అన్నాడు… ఈ బహు భర్తృత్వ వ్యవస్థలో కుటుంబాల సంఖ్య ఎక్కవ కాదు.

19. ‘ఇజ్జత్’ – భాస్కరభట్ల కృష్ణారావు (1918-66)

రంగారావులో నిప్పుకు మల్లే మెదడు రాజుకుంటున్నది. పొగలకు మల్లే ఆలోచనలు. తన పెద్ద చెల్లెలు ఛాయ పెళ్ళకి పెళ్ళి ఖర్చులు కాక 1116 కట్నం. వివాహానికి 3000 దాకా ఖర్చు కావచ్చు. సంబంధం మంచిది. పెళ్ళికొడుకు B.A. తనకు మల్లే సెక్రటేరియట్‌లో గుమస్తా. మూడు వేలు తనెక్కడ తేగలడని? అప్పు ఎక్కడ పుడుతుందని? పుట్టినా తనకు తీర్చే తాహతు లేదు. రఘునాధ పల్లెలో ఒక బావి, 10 ఎకరాల ఖుష్కీ వున్నది. బావి కింద ఎకరంన్నర తరీ వున్నది. మల్లయ్య కుటుంబం తాతల కాలం నుంచీ ఆ భూమి సేద్యం చేస్తున్నది. బావిలోని నీరు వరి పొలానికి చాలవు. ఏ కారులోనూ ఆ పొలం పండడం లేదు. దాంతో మల్లయ్య తనకు కొలవ వలసిన ధాన్యం కొలవడం లేదు. పాపం అతను మాత్రం ఎలా కొలుస్తాడు పంట రానిదే…

…మొదట కౌలుగింజల విషయంలో ఒత్తిడి తేవాలి మల్లయ్యను. ఎట్లాగూ యివ్వలేడు. ఆ తరువాత గొడ్డో, గోదో వేలం వేయించాలి. అప్పుల బాధకు అతను యిటీవలే రెండు కోడెలు అమ్ముకున్నాడట… అప్పుడు భూమికి రాజీనామా యివ్వమని ఒప్పించాలి. అప్పుడు ఆ భూమిని అమ్మకానికి చూపితే తన గండం గట్టెక్కుతుంది. దీనికి కరణం రామచంద్రయ్య సహాయం అవసరం… తను రెండు వందల రూపాయలు రామచంద్రయ్యకు యిచ్చేటట్టు, అతను మల్లయ్య దగ్గర రాజీనామా యిప్పించి ఆ పొలాన్ని 3,4 వేలకి మధ్య అమ్మించి పెట్టేట్టూ ఒప్పదం చేసుకున్నాడు…

“ఇంకా ఎన్నాళ్ళు బ్రాహ్మలకి ఎగనామం పెడతావు?” అని అడిగాడు రామచంద్రయ్య మల్లయ్యను.

“ఒక ఎద్దు నాము తిని సచ్చింది. గిప్పుడు ఒక బక్క దున్నపోతున్నది నా తాన” అన్నాడు మల్లయ్య.

“వీడు మంచి మాటలతో వినేటట్టు లేడు. వంగబెట్టి వీపు మీద బండరాయి పెట్టండి.” అన్నాడు రామచంద్రయ్య కావలి వాళ్ళతో. పెట్టారు… స్పృహ తప్పి కుప్పకూలాడు మల్లయ్య బండతో సహా.

“పాపం! పట్టుమని పది వెతుకులు దిని ఎన్ని రోజులైందో?” అంటున్నారు ఎవ్వరో ఆ గుంపులో…

…చెంబు కుదువ బెట్టి భర్త తాగి వచ్చాడన్న సంగతి తెల్కుకుంది భార్య మల్లి…

“పిల్లా!” మల్లయ్య.

“ఊఁ” మల్లి.

“పొల్ల పెండ్లకి దెచ్చిన చీరగట్టుకొని, ఆ అద్దాల రయికె తొడుక్కో” అన్నాడు మల్లయ్య.

“ఊర పొద్దుగూక లేదు. ఏంది మామ ఈ సరసాలు” అని ప్రణయ కోపాన్ని నటించింది మల్లి… వొయ్యారంగా వచ్చి పక్కలో వాలింది… మల్లిని గట్టిగా ముద్దుపెట్టుకొన్నాడు…

రాత్రి రెండు జాముల తరువాత మల్లయ్య చడీ చప్పుడూ లేకుండా పక్క మీది నుంచి లేచాడు. మల్లి మైమరచి నిద్రపోతున్నది. మల్లయ్య నిద్రలోవున్న బుడ్డోడిని ముద్దు పెట్టుకుని, ఒక తాడుతో నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్ళి గది తలుపులు బంధించి వేశాడు. ఇజ్జత్ పోయింది… మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు…

మల్లి ఏడ్పులు ఊరంతా ప్రతిధ్వనించాయి.

రంగారావు, రామచంద్రయ్యలు చేరి రెండు వందలు పోలీసులకు తడిపి వ్యవహారాన్ని సర్దేశారు…

20.‘సత్యవ్రతుడు’ – ధనికొండ హనుమంతరావు (1919-89)

ప్రసాదరావు సిగరెట్టు ముట్టిద్దామనుకున్నాడు. కానీ, పెట్టె ఖాళీగా వుంది. కొత్త పెట్టె తెప్పిద్దానుకున్నాడు. చొక్కా జేబులో వుండవలసిన రూపాయి కాగితం కనిపించలేదు…

“నేను తియ్యలేదు… ఎంత?” అంది మృదువుగా భార్య

భార్యా తీయని పక్షంలో పెద్ద వెధవ సీనుగాడే తీసివుండాలి.

“ఏరా, జేబులో చెయ్యి పెట్టావా?”

“లేదే” అన్నాడు వాడు అమాయకంగా.

“తీస్తే తీసావ్. అబద్ధం మాత్రం ఆడొద్దు.”

“నేను తియ్యందే.”

“తియ్యలా?తియ్యలా?” అని తల్లి ఒక దెబ్బ వేసింది.

“లేదు” అన్నాడు వాడు నిబ్బరంగా. మరో రెండు దెబ్బలు పడినవి.

“ఏడవడేం వెధవ?” అనుకున్నాడు ప్రసాదరావు.

“తీశాడో లేదో చెప్పించండి” అంది భార్య. ప్రసాదరావుకు శివమెక్కింది. మనిషి కాదు అతను. సీనుగాడ్ని వొంచాడు. వీపు మీద బలంగా చరిచాడు.

“తీసావా?”

“లేదు” మరో దెబ్బ. అదే జవాబు. ఎన్ని దెబ్బలు కొట్టాడో లెఖ్ఖలేదు. వాడు మాత్రం ఏడుస్తూ గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడు తీశానని ఒప్పుకుంటే చాలు – తనకు మనశ్శాంతి దొరుకుతుంది. బాదాడు. ఎన్ని దెబ్బలు తిన్నా తియ్యలేదనే అంటున్నాడు. చివరకు ఏడుపులో వెక్కిళ్ళు ఆరంభమైనవి. ఊపిరాడనట్లు, గాలి కోసం పాకులాడుతున్నట్లుగా వున్నాడు. ప్రసాదరావు బాధ పడ్డాడు. తన అరచేతులు ఎంత కందినవో చూసుకుంటే, వాని వీపు మీద ఎన్ని ముద్దర్లు ఎంత లోతుగా దిగి, వుబ్బివుంటవో… భార్య అడ్డపడి నీళ్ళు తెచ్చి మోహన కొట్టి నీళ్ళు తాగిస్తే కాని వాడికి వూపిరాడలేదు.

“ఇల్లా పశువల్లే కొట్టుకుంటారా?” అందామె. ఆమె ముఖమంతా పాలిపోయివుంది.

“అసలు నువ్వే కొట్టించావు నా చేత. నువ్వే నా అసమర్థతను ఎగతాళి చేసి…”

ప్రసాదరావు హోటల్ లోకి దూరాడు. భోజనానికి సరిపోయేంత డబ్బు లేదు. టిఫిన్ సహించలేదు. ఊపిరి అందక నేల మీద పొర్లాడే సీను కన్పిస్తున్నాడు. తనను తాను దూషించుకున్నాడు ప్రసాదరావు. తాను బలవంతుడు కనుక తన అక్రమాన్నీ సీను భరించడం…

ఆఫీసు అయ్యాక సాయంత్రం యింటికి వస్తే భార్య కుర్చీలో కూర్చుని తన రాకకు స్వాగతం యివ్వకుండానే తనను ఈసడింపులో చూసి, లేసు అల్లుకుంటోంది.. సీను ప్రశాంతంగా ఓ మూల చాప మీద కూర్చుని చదవుకుంటున్నాడు. ఒక్కసారి తండ్రి మొహంలోకి ఏవగింపుతో చూసి, దృష్టి పుస్తకం మీదికి మరల్చుకున్నాడు.

నిజం తెల్కుకోవాలనుకున్నాడు ప్రసాదారావు.

“నాయనా నిజం చెప్పు” అన్నాడు దీనాతిదీనంగా.

 “లేదు” సీను.

“ఇదో, ఐదు రూపాయలిస్తాను!” ప్రసాదరావు.

“లేదు” సీను.

“పది రూపాయలిస్తాను” ప్రసాదరావు.

సీను కళ్ళల్లోని మెరుపు ఈసారి ఆగింది. సిగ్గుతో వేరొక దిక్కు చూస్తూ “నేనే తీశాను” అన్నాడు.

“ఏం చేశావురా మరి?” అంది తల్లి. వాడు జవాబు చెప్పలేదు.

మర్నాడు ఉదయం చాకలాడికి బట్టలు వేసే పనిలో వున్నాడు ప్రసాదరావు. నిన్నటి చొక్కా చేతి మడతల్ని విప్పుతుండగా రూపాయి నోటు కింద పడింది. నిన్న పోయిందని అంత రాద్ధాంతమూ చేసిన నోటే అది! …లంచం పెట్టి బలవంతంగా అబద్ధం ఆడించాడు. పొందిన శిక్షను క్యాష్ చేసుకునే అవకాశాన్ని వాడికి కలిగించాడు.

తనే వాణ్ణి వక్రమార్గానికి తోశాడు… సంగతి చెపితే భార్య కూడా విరోధమౌతాడు. ఒకసారి సీనును పరీక్షిద్దామనుకున్నాడు.

“…వెధవా. నిజం చెప్పు నా జేబులోది 5 రూ కాగితం తీశావా లేదా?” ప్రసాదరావు అడిగాడు. సీను వెర్రి మొహం వేశాడు.

“మళ్ళీనా? నీకీ దొంగ బుద్ధేంట్రా. చూస్తారేమంటీ,. నాల్గు వుతక్క?” అంది భార్య.

“చితక తంతాను.” ప్రసాదరావు.

“నిజంగా తియ్యలేదు నాన్నా” సీను.

“తీస్తే తీశానని చెప్పు. 10 రూ బహుమానం” ప్రసాదరావు సీను ఒక్క క్షణం ఆలోచించాడు.

నవ్వుతూ “తీశాను నాన్నా!” అని 10 రూ కోసం చేయి చాపాడు…

21. ‘అమాయకత్వం’ – పన్యాల రంగనాథరావు (1919-87)

పంతులు పెద్ద కూతురు పెద్ద అందగత్తె కాదు. ఆడపిల్లలకు ఈడే అందం. అందుకే డాక్టరు రమాపతిగాడే కన్నువేశాడు. దాని కాపరం బుగ్గి అయింది. కట్టుకున్న వాడు ఎటు పోయాడో, బ్రతికి వున్నాడో లేదో. అప్పుడు దానికి నాలుగునెల. దాని కడుపు పోయింది. దాని అమాయకత్వం గ్రహించి ఈ డాక్టరు గాడు దాన్ని కాస్తా బుట్టలో వేసుకున్నాడు. రెండో పిల్ల పెళ్ళికి సిద్ధంగా వుంది. భగవంతుడు తనకేదన్నా వరం ప్రసాదించాడు అనుకుంటే అది ఈ పిల్లకు అందం రూపంలో యిచ్చాడనుకున్నాడు. ఏ నిమిషాన దీన్ని ఎవడు ఎగరేసుకుపోతాడో అన్న భయమొకటీ పీకుతున్నది పంతులుకు.

నరసు రెండో ఏట తన భార్య పోయింది. పంతులు నరసును పిల్లలు లేని రమణయ్యకు పెంపకానికిచ్చాడు. రమణయ్య శ్రీమంతుడు. కాని, నరసు పెంపకానికి పోయిన (6) నెలలకే రమణయ్య భార్యకు వేవిళ్ళు ప్రారంభమైనవి- భార్య కాపరానికి వచ్చిన (20) ఏళ్ళ తర్వాత దీని వల్ల నరసు గాడి బ్రతుకు బండలవుతుందని తన మనసు కెలికినాడు ‘గురుతు’. గురుతు అన్నాడు పంతులుతో-

“ఒకటి మర్చిపోకు స్వార్థం లేకుండా ఎవడూ ఏ పనీ చేయడు” అని.

…“నెళ్ళాళ్ళ క్రిందట ఈ పక్క వీధిలోనే ఒక యింట్లో (10) ఏండ్ల పిల్ల నీళ్ళకు వెళ్ళి కాలు జారి బావిలో పడిందట. చనిపోయింది.” అన్నాడు పంతులు.

గురుతు అన్నాడు “ఏం కాదు. అంతా కల్పన. సవిత్తల్లి వయసులో వుంది. తండ్రి ముసలాడు. రెండో పెళ్ళి. ఆ పిల్లకు యింట్లో ప్రైవేటు మాస్టర్ని పెట్టి చదువు చెప్పిస్తూ వుండేవాడు. వాడికీ, యింటావిడకు బేరం కుదిరింది. ఓ రాజు పిన్నీ, మేస్టరూ గదిలో తలుపులు వేసుకున్నారని కనిపెట్టింది. రాత్రి తండ్రితో చెప్పివుంటుంది. ఆ ముసలాడు పెళ్ళాం మక్కెలు విరగదన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆ పిల్ల కాలు జారి నూతిలో పడిందన్నారు. ఇప్పుడా మేస్టరు ఆవిడకే చదువు చెప్పుచున్నాడు! ”… గురుతు అన్నాడు. కన్నకడుపు ఎట్లాగూ వేరు. ఇప్పుడు నరసుగాడ్ని పరాయివాడ్నిగానే చూస్తారు. రమణయ్య వన్నీ ప్లీడరు ఎత్తులు. వృత్తి దోషం లే. నీ చేత అరవ చాకిరీ చేయించుకున్నాడు. రమణయ్య కొడుకు పెద్ద వాడైతే ఆస్తిలో సరసుకి చిల్లగవ్వ దక్కనివ్వడు. నరసుని యింట్లోంచి వెళ్ళగొట్టడనే గ్యారంటీ ఎక్కడుంది? కూతుళ్ళ పెళ్ళిళ్ళు నరసు మీదనే అధారపడి వున్నాయి…

…రేపొద్దున జబ్బుపడిన రమణయ్య పిల్లాడి జబ్బు నయమైతే?…

డాక్టరు రమాపతి దగ్గర్నుంచి నువ్వే మందులు తెచ్చిపెడుతున్నావు గదా! పిల్లవాడికి నిమోనియా అని అనుమానిస్తున్నారు… నరసు భవిషత్యు గురించి నీవు ఏదో ఒకటి చేయాలి… ఆ పిల్లవాడిని లేకుండా చేయాలి!…

…మందు సీసాను రమణయ్యకు ఇస్తున్నప్పుడు పంతులు చేతులు వణికినై… ముచ్చెమటలు పోస్తున్నవి… వణికిపోతున్నాడు…

…పంతులు యింటికి పోలేదు. చీకట్లో గొడపక్కనే వర్షపు బురద నీటిలో చతికిల బడ్డాడు. అతని కాళ్ళలో శక్తిలేదు… వెంటనే పోయి ఆ మందు పోయవద్దని రమణయ్య భార్యను వారిస్తే?…

పంతులుకు ఒక కేక వినిపించింది… గదిలోంచి మరొకేక వినపడ్డది… రమణయ్య భార్య, నరసుల ఏడుపు వినబడుతున్నది. రమణయ్య ఎక్కడున్నాడో… “నరసు! నరసు!” నరసుకింక దిగులు లేదు… అనుకున్నాడు పంతులు…

22.‘తొగరుచెట్టు’ – అంగర వెంకట కృష్ణారావు (1920-74)

జిల్లా ట్రెజరీ హెడ్ అకౌంటెంట్ చిట్టి వెంకట్రామయ్య గారు. అతడు ఎప్పుడూ నవ్వకపోయినా ఏడుపు మొఖం పెట్టలేదు. ఎవర్ని ఎన్ని తిట్టినా పై అధికారితో చెప్ప అపకారం చేయించలేదు.

ఆయన సుమారు (30) ఏళ్ళకిందట పెళ్ళి అయిన కొద్ది నెలలకే భార్యపోయిందని కొందరికి తెలుసు. ఇంకా లోతైన విషయాలు చివరికి ఆయన ప్రైవేటు సెక్రెటరీ లాంటి బంట్రోతు అహమ్మదుకీ, (12) ఏండ్ల నుంచీ వంట చేస్తూన్న నరసింహానికి కూడా తెలీవు.

…పెరట్లో వున్న తొగరుచెట్టు పై భాగం కిటికీ నుండి సూటిగా అగుపిస్తుంది. తీరికగా వున్నప్పుడల్లా వెంకట్రామయ్యగారు దాని వేపు చూసేవాడు. ఆకులు లేకుండా మోడులా దానిని చూస్తూన్నంతసేపూ ఆయన మనసు శాంతియుతంగా వుండేది.

ఆయనకు అప్పుడే చాలా సర్వీసు అయిపోయింది. వయసు (50) లోపే అయ్యి పళ్ళూడిపోయి, దిగజారిపోయి (60) ఏళ్ళ వాడిగా అగుపించేవాడు.

డిసెంబరు నెల. హేమంతుడి ప్రతాపానికి తట్టుకోలేక పృధక్ శయ్యలు ఏకశయ్య లౌతున్నాయి… వెంకట్రామయ్యగారు ఒక్క నిద్ర తీసేరు. ఈదురుగాలికి తెలివి వచ్చింది. పెరటి వేపు కిటికీ ముసి వేద్దామని లేచారు. కిటికీ దగ్గరకు వెళ్ళగానే తొగరుచెట్టు మొండి కొమ్మల్లోంచి ఒక దృశ్యం అగుపించింది! అవతలి వీధి మేడ మీద కిటికీ తెరచివుంది. ఎలక్ట్రిక్ దీపకాంతి చక్కగా వుంది. ఒక యువకుడు – ఒక యువతి – నిటారుగా, నగ్నంగా గాఢాలింగనంలో పెనవేసుకుపోయి వున్నారు. – చెట్టు, తీగలాగా! వెంకట్రమయ్యగారి హృదయం వేగంగా కొట్టుకుంది. వెంటనే చలి పటాపంచలై ఆపాదమస్తకం వేడెక్కింది… వాళ్ళు నూతన దంపతులై వుంటారు. నిర్భయంగా, నిర్లజ్జగా, రక్తమాంసాస్తి నరాలను పంచభక్ష్య పరమాన్నాలతో విందుగా ప్రవర్తిస్తున్నారు. వెంకట్రామయ్యగారి శరీరం విపరీతంగా కంపిస్తూంది. నిత్య శిశిర జీవితం గడుపుతూన్న ఆ నిర్భాగ్యపు తొగరుచెట్టు అవతలి, జీవిత పరిణామంలో మహోద్రేక పూరితమైన ఈ ఘటపు విశ్వరూపం యిలా ఆ హేమంత నిశామధ్యంలో ప్రత్యక్షం అవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. ఆ సన్నివేశం ఆయన ప్రవృత్తిని పునాదులతో కుదిపింది.

కిటికిలో నాటకం ఆరంభం ప్రతి రోజూ సాయంత్రం ఆరుగంటలకే! ఆలసించిన ఆశాభంగమని రోజూ (5) గంటలకే ఆఫీసు విడిచి వచ్చేవాడు.

మార్చి నెల ప్రవేశించింది. హఠాత్తుగా పెరట్లో తొగరుచెట్టు చిగిర్చింది. పన్నెండేండ్ల తర్వాత. చెట్టంతా గుబురై పచ్చటి ఆకులు నిండి తొగరు పూల పరిమాళాలు వెంకట్రామయ్య గుండెల మీద దాడి చేస్తున్నాయి. ఏం లాభం! కిటికీ కన్పించడం లేదు! నిద్ర యిదివరకే లేదు. కాని, యిప్పుడు నిద్ర లేని సుఖం కూడా లేదు!… ఒకనాడు అహమ్మదుతో చెప్పాడు-

“సాయిబూ! మన పెరట్లో తొగరు చెట్టును నరికించెయ్, వెధవ చెట్టు.”

“అదేం అయ్యగోరూ – పాపం ఆ చెట్టు ఎన్నాళ్ళకో సిగిర్సింది, దాన్నెందుకు నరకాలి?”

“నీకు తెలీదు – సాయంత్రానికి నరికించేయ్”

ఒంటిగంటకి ఆఫీసుకు ఒక యువకుడొచ్చాడు – వెంకట్రమయ్యగారి కోసం… ఆయనకి సరిగా గుర్తు రాలేదు.

“మీ యింట్లో క్రింది భాగంలో నాకో గది అద్దెకిస్తారేమో అని అడుగుతామని వచ్చాను” అన్నడా యువకుడు.

“నేనెప్పుడూ ఎవరికీ అద్దెకివ్వలేదే!…మీరెక్కుడుంటారు?”

“ఇక్కడే. మా మేడ మీంచి మీ పెరట్లోని తొగరు చెట్టు అగుపిస్తుంది.”

వెంకట్రామయ్యగారు అదిరిపడ్డారు. అడిగాడు -“మీరు బ్యాచిలరా?”

“కాదండీ… మా ఆవిడ పురిటికి పుట్టింటికి వెడుతూంది. ఈలోగా నాకెందుకు అంత పెద్ద యిల్లని… మీ యింట్లో ఓ ఓ గది యిస్తే చాలు…”

 …“అహమ్మదు” వెంకట్రమయ్యగారు.

“అయ్యగోరూ” అహమ్మదు.

“తొగరు చెట్టును నరకొద్దురా…” చిట్టి వెంకట్రామయ్యగారు.

23.‘ముందుచూపు’ – దాసరి సుబ్రహ్మణ్యం (1921-2010)

చుట్టూ వున్న తాడి తోపులో ఎక్కడో ఓ పమిడికంటి ప్రాణం కడబట్టినట్టు బొంగురుగా కీచుమన్నది. ఆ వెంటనే సిరికి అవతలనున్న సరుగుడు చెట్లలోంచి మరో పమిడికంటి త్రీవంగా, తేటగా ఖంగుమని కంచు కంఠంతో జవాబు పలికింది… అప్పటికి చంద్రుడు అస్తమించి ఒక గంట అయింది. సముద్రం హోరు కూడా తగ్గిపోతున్నది. సింకిలో పోటుకు నిండుగా ఎక్కిన నీరు, పాటుకు జలజల మంటూ సముద్రం కేసి తిరిగి పోతున్నది. నీటి పోటుతో పాటు సింకిలోకి వచ్చిన చేపలు వేగంగా తిరిగి పోతున్న నీటిలో గిలగిల కొట్టుకుంటూ మధ్యమధ్య ఠపీఠపీమని గట్టు మీదికి ఎగిరి పడుతున్నవి. తాటి తోపులో నక్కలు రెండు భోరు భోరు మంటూ కూత వేసినై. ఆ వెంటనే పాక మీద రెక్కలు టపటపలాడిస్తూ గుడ్లగూబ ఒకటి కెవ్వుమని అరిచింది.

పానకాలరావు “పమిడికంట్లు ఎందుకు అరిచినట్లు?” అనుకున్నాడు. అవి పక్షుల అలికిడికీ, జంతువుల అలికిడికీ అరవవు. మనిషి కంటబడినప్పుడే అవి పెచ్చరికగా అరవడం జరుగుతుంది. ఎవరో మనుషులు తాటి తోపులోనూ సరుగుడు తోపులోనూ కూడా వాటికి కనిపించారు…

24.‘నవ్వు’ దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-66)

సరళ కనుక అంగీకరించి వుంటే రామచంద్రరావుకి ఈ ఒంటరితనం ఉండేది కాదు. సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి. నాజూకుగా వుంటుంది. సరళ, రామచంద్రరావు కలిసి చదువుకున్నారు. ఆ స్నేహం ప్రేమగా మరినట్టు కూడా మూర్తికి తెల్సు. (మూర్తి రామచంద్రరావుకు ఆప్త మిత్రుడు, సహోద్యోగి)

రామచంద్రరావు తన అభిప్రాయాన్ని సరళకు చెప్పాడు.

“రామం! నీ ఆస్తి ఎంత?” అడిగింది సరళ

“ఒక పాత పెంకుటిల్లు. అదైనా మా వూర్లో” రామచంద్రరావు.

“భూమి గట్రా ఏమైనా?” సరళ.

“లేవు” రామచంద్రరావు.

“నీ జీతం ఎంత” సరళ.

“120 రూపాయలు” రామచంద్రరావు.

ప్రేమ, ఇష్టమూ మొదలైన దౌర్బల్యాలకి లోబడి తన సుఖాన్ని, భద్రతనీ బలియిచ్చుకొనండి. (సరళ తల్లిదండ్రులు శ్రీమంతులు)

ఏ ప్రేమ వైఫల్యానికి మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారో అటువంటి దానికి హాయిగా నవ్వగలిగే ఈ రామచంద్రరావులోని విశేషం ఏమిటి? అని విస్తుపోయాడు మూర్తి.

సరళకి వివాహమైంది. ఆమె పెళ్ళికి రామచంద్రరావు వెళ్ళాడు. అత్తింటికి వెళ్తున్న సరళతో “నీ భర్త రూపసి! ఉత్తముడు. నువ్వు సుఖంగా వుండాలని కోరుతున్నాను. వచ్చే ఏడాదికి నువ్వు పాపాయినెత్తుకుని రావాలి” అన్నాడు రామచంద్రరావు. అతని స్నేహస్నిగ్ధ కంఠస్వరానికి సరళ హృదయం ఆర్ధమైంది. “థాంక్స్” చెప్పింది. కానీ అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు వెళ్ళి ధైర్యం చెప్పాడు. అలా ప్రతిరోజూ వెళ్ళి కబుర్లు, కథలు చెప్పేవాడు.

…అప్పుడు సరళ తండ్రి రామచంద్రరావును చాటుగా పిల్చి

“నువ్వు రోజూ యిలా రావడం బాగుండదు. లోకం ఏదైనా అనుకుంటుంది” అన్నాడు.

రామచంద్రరావు నవ్వుతూ “నిజమే. ఇంక నేను రాను” అని వెళ్ళిపోయాడు.

ఆఫీసు రిట్రెంచిమెంటులో అతన్ని ఉద్యోగం నుండి తొలగించి వేశారు. అయినా రామచంద్రరావు ఏమీ బెదరలేదు. స్వగ్రామంలోని పాత పెంకుటింటి లోగిలిని అమ్మివేసి 3000రూ తో తిరిగి వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని, ఒక టైపు మిషన్నుకొని “ఇచ్చట టైపు చేయబడును” అన్న బోర్డు కట్టాడు.

ఈలోగా సరళ తండ్రి చనిపోయినట్లు, ఇంటి భారం సరళ మీద పడ్డట్టు తెల్సి వెళ్ళి సరళను చూసి వచ్చాడు.

ఆరు నెలలు గడిచాయి. రామచంద్రరావుకు తీవ్రమైన జబ్బు చేసింది. (15) రోజులైనా జబ్బు తగ్గ ముఖం పట్టులేదు. మూర్తి సరళ ఇంటికి వెళ్ళాడు.

“…ఒకనాడు మీరు అతడ్ని మోసం చేశారు. డబ్బుతో ఏమైనా కొనవచ్చుగానీ అటువంటి అమృత హృదయాన్ని పొందలేము. మీరు అతని బాధ్యతను వహించాలి. లోకం ఏమనుకుంటుందో అని సంశయించకండి” అన్నాడు మూర్తి.

సరళ మూర్తితో బయలుదేరింది రామచంద్రరావు దగ్గరకు… పక్కగదిలో డాక్టరు “ఇతను బతుకుతాడని నమ్మకం లేదు” అని చెప్పడం రామచంద్రరావుకు విన్పించింది…

“…నేను డాక్టరు చెప్పింది విన్నాను. దానికింత భయమెందుకు?” అన్నాడు రామచంద్రరావు. అతని పెదవుల మీద చిరునవ్వు. మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు… కానీ, సరళ సపరిచర్యల్లో, మూర్తి సాన్నిధ్యంలో, పట్నం నుంచి పిలిపించిన పెద్ద డాక్టరు వల్ల వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. సరళ అతన్ని తన యింట్లో వుండిపొమ్మంది పూర్తిగా కోలుకునే వరకు (3) నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియ జేసి వెళ్ళిపోతానన్నాడు.

“అయితే నేనూ వస్తాను మీతోనే” అంది సరళ.

“నువ్వు రావడమేమిటి నాతో… నాతో వుంటాననడం ఏమిటి?”

“మరి భార్య భర్తను వదలి వుంటుందా?” అంది సరళ తలవంచి ఓరగా చూస్తూ… అతను తెప్పరిల్లి… ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు… సరళా రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గల్లేవు…

…రామచంద్రరావు (16) వ ఏట అతనూ, అమ్మా, నాన్నా చెల్లెలు, తమ్ముడూ భద్రాచలం వెడుతున్నారు. రామచంద్రరావు అనారోగ్యంగా వుండేవాడు. భద్రాచల రాముడి దర్శనంతో అతడు బ్రతుకుతాడన్న నమ్మకం వాళ్ళది. పాపికొండల దగ్గర పడవ బోల్తా పడి అతని కుటుంబ సభ్యులంతా చనిపోయారు. అతడు ఒక్కడు మాత్రం బ్రతికాడు… అతని నవ్వు, అనునిత్యపు నవ్వు వట్టి నవ్వు కాదు. ఆ నవ్వు వెనకాల భయంకర విషాదం, వేదాంతం వుంది.

~

కొద్ది మంది రచయితల గురించి –

పిలకా గణపతి శాస్త్రి (1911-83) : ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాలను మధించిన వారు.

శ్రీవాత్సవ (యండమూరి సత్యనారాయణ రావు) : అనేక భాషల్లో నిష్ణాతులు. మనస్తత్వ శాస్త్ర విషయాలలో కథలు రాశారు.

డా.జి.వి.కృష్ణారావు(1914-79): మద్రాసు విశ్వవిద్యాలయం నుండి Phd సంస్కృత ఆంధ్రంగ్ల భాషలను పుక్కిట పట్టిన అగస్త్యులు.

బుచ్చిబాబు(శివరాజు వెంకట సుబ్బారావు) 1916-67 : కథా రచనలో ‘చైతన్య స్రవంతి’ ప్రక్రియని తెలుగులో ప్రథమంగా పరిచయం చేశారు.

మా గోఖలే(1917-81) : శ్రామిక భాషలో మొదట కథలు రచించిన ఖ్యాతి గోఖలేగారికి చెందుతుంది.

సంజీవ్‌దేవ్ (1924-1999) : బహుభాష ప్రవీణులు.

ధనికొండ హనుమంతరావు (1919-89): తెలుగు సాహిత్యం సర్వతోముఖంగా వికసించడానికి దోహదమిచ్చిన ప్రతిభావంతుల్లో ముఖ్యుడు.

అంగర వెంకట కృష్ణారావు(1920-74) : సంస్కృతాంధ్రాంగ్ల భాషల్లో విద్యాధికులు.

చింతా దీక్షితులు(1891-1960) : కథకులలో ఆదిగురువు.

వేలూరి శివరామశాస్త్రి (1892-1967) : గొప్ప విద్వాంసులు, బహుభాషా కోవిదులు, శతావధానులు, కథా రచనలో సిద్ధహస్తులు.

కవి కొండలరావు (1892-1962): ‘ఆంధ్రా వర్డ్స్‌వర్త్’ బిరుదాంకితులు. చీర ఎలా మొల తిరిగి, మెడ సురిగి, సిగ నురిగి, ముమ్మెలికలు పడీ, ముయ్యే మేలి ముసుగ్గా అవుతుందో వీరి కథ అలా సాగిపోతుంది.

మొక్కపాటి నరసింహశాస్త్రి  (1895-1976) : కవిసమ్రాట్, సంస్కృతాంధ్రాంగ్ల భాషాకోవిదులు. విజయవాడలో నివాసం.

శ్రీనివాస శిరోమణి : మనో వైజ్ఞానిక చిత్రణలతో కథలు.

అందె నారాయణ స్వామి(1908-1982): ‘ఆంధ్ర మెపాసా’ బిరుదాంకితులు.

బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం : ఆంధ్రాంగ్ల భాషలలో చేయి తిరిగిన రచయిత. అరుదుగా రాశారు. మానసిక ప్రవృత్తులను ప్రదర్శించే కథలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు.

***

శత వసంతాల తెలుగు కథ.
(కథా సంకలనం)
సం॥. తాళ్ళూరి నాగేశ్వరరావు, హితశ్రీ
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, విజయవాడ.
ప్రథమ ముద్రణ 1974: స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్.
Revised edition: March 2017 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్.
పేజీలు: 553, వెల: 450/-
ప్రతులకు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్
33-22-2, చంద్రం బిల్డింగ్స్
చుట్టు గుంట, విజయవాడ-520004.
Ph. 0866-2430302,
Email: vphpublish@gmail.com
విశాలంధ్ర బుక్ హౌజ్ అన్ని శాఖలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here