శతక పద్యాల బాలల కథలు-1

0
2

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

తన కోపమే తన శత్రువు

[dropcap]స్కూ[/dropcap]ల్ నుండి వచ్చిన ప్రకృతికి హాల్‌లో అమ్మతో కబుర్లు చెబుతున్న అమ్మమ్మ తాత కనిపించారు. పట్టలేని ఆనందంతో “అమ్మమ్మ! యు అర్ బ్యాక్. ఐ లవ్ యు. తాత ఐ లవ్ యు” అని ఇద్దర్ని గట్టిగా హాగ్ చేసుకుంది. “అమ్మమ్మ, తాతా! రండి నా రూమ్ లోకి. నా న్యూ బెడ్, బుక్స్ చూపిస్తా” అంది. ఒకటే కబుర్లు వాళ్ళని వదలకుండా.

రాత్రి డిన్నర్ తర్వాత అమ్మమ్మ పక్కన చేరారు ప్రకృతి, మానస్.

“అమ్మమ్మా! టుడే ఇన్ మై క్లాస్” అంటూ మానస్ కబుర్లు స్టార్ట్ చేసాడు. అంటే వాడికి ఏదో తెలియని విషయానికి ఆన్సర్ కావాలి.

“అమ్మమ్మా! తెలుగు టీచర్ మనకి తెలుగులో ఎన్నో గుడ్ మోరల్స్ చెప్పే పోయెమ్స్ ఉన్నాయి. అందరు తెలుసుకోవాలి. వాటి పేరు? ఆ! శతక పద్యాలు అన్నారు.”

“ఓహ్! నైస్. తప్పకుండా నేర్చుకో. చెల్లికి నేర్పించు” అన్నారు అమ్మమ్మ.

“బట్ అమ్మని టీచర్ చెప్పిన పోయెమ్ మీనింగ్ అడిగితే నిన్ను అడగమంది” అన్నాడు మానస్.

“అన్నా! మే బి అమ్మకి తెలీదేమో” అంది ప్రకృతి.

“అదేం కాదు. అమ్మ వర్క్ from home + మీ అందరి వర్క్‌తో బిజీ. నేను వచ్చానుగా మీరు విని నేర్చుకుంటే నేర్పిస్తాను.”

“సరే అమ్మమ్మా, మేము మా బెస్ట్ friends ని కూడా పిలుస్తాము.”

“అలాగే. ఎంత మంది నేర్చుకుంటే అంత మంచిది.”

***

అమ్మమ్మ శతక పద్యాలతో పాటుగా కథలు చెప్పటం మొదలుపెట్టారు. మనము విందామా.

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

~

భావం: తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రువు. తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టటానికి తాను చేసే పనే తనకు బంధువు, చుట్టం. తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించే చోటుతో సమానం. తనకు ఉన్న బాధే దుఃఖాలను, ఇబ్బందులను కలిగిస్తుంది.

కోపంతో ఉన్న మనిషి పశువుతో సమానం. ఏం చేస్తున్నదీ వారికే తెలియదు. ఆ కోపంలో విచక్షణ పోగొట్టుకుంటారు. కోపం తగ్గిన తరవాత తాము చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందువల్ల కోపాన్ని అణచుకుంటే మంచిదని ఈ పద్యంలో కవి వివరిస్తున్నాడు.

“అమ్మమ్మా, మాకు అర్థం కాలేదు” అన్నారు పిల్లలు.

“అలాగా, సరే వినండి. మీకు తెలిసేలా ఒక స్టోరీ చెబుతాను”

“హే! స్టోరీ” అన్నారు కిడ్స్ హ్యాపీగా.

***

బంగారు హంసల కథ

“Long long ago.. చాల చాలా ఏళ్ల క్రితం ఒక రాజు.. king ఉండేవాడు. కింగ్ అంటే తెలుసుగా. ఆ కింగ్‌కి ఒక పెద్ద తోట.. గార్డెన్ ఉండేది. అందంగా ఉండేది. రకరకాల పువ్వులు, చెట్లు, fruits, birds, పెద్ద నీటి కొలను. అందులో తామరలు, కలువ పూలు ఉండేవి.”

“అంటే?” అంది ప్రకృతి

“అంటే big water pond. Lotus, water lilies flowers.”

“Ok, then?”

“ఆ flowers మధ్యలో తిరుగుతూ అందమైన బంగారు హంసలు.. Beautiful golden swans ఆ కొలనులో ఉండేవి.”

“Golden swans? Wow! How beautiful! Lucky king” అంది ప్రకృతి

అమ్మమ్మ నవ్వి కథ కొనసాగించారు.

“హంసలు ప్రతి ఆరు నెలలకు రాజు కి ఒక బంగారు ఈకని rent గా ఇచ్చేవి.”

“Golden feather? Wow” అన్నాడు మానస్.

“Yes. రాజు ఆ ఈకను చూసి చాలా ఆనందించేవాడు. ఒక రోజు ఆ బంగారు హంసలు ఉన్న కొలను దగ్గరికి ఒక పెద్ద పక్షి వచ్చి వాలింది. It’s so big. కొలనులో ఈదుతున్న హంసల నాయకుడు.. లీడర్.. దాన్ని చూసి “ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను ఎవరు రానిచ్చారు?” అన్నాడు కోపంగా.

దానికి ఆ పెద్ద పక్షి “ఫ్రెండ్! నేను ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాను. ఇంతలో మీ నీటి కొలను కనిపించింది. చాలా అందంగా ఉంది. మీ గార్డెన్.. తోట కూడా బావుంది. నాకు ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది. Pleasant గా ఉంది. Can i stay here? Please” అని స్నేహంతో request చేసింది.

హంసల నాయకుడు.. Leader.. “No! Never. ఇది మా కొలను. రాజుకి బంగారు ఈకను అద్దెగా ఇస్తున్నాము. కొత్త వాళ్ళు ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. Go away” అని కోపంగా పక్షిని తోసేసాడు.

ఇది చూసి మిగతా హంసలు ఏదో ఫైట్ అవుతున్నది, లీడర్ కోపంగా ఉన్నాడని దగ్గరకు వచ్చాయి.

పక్షి “మీరు కొలను రెంట్ కు తీసుకున్నారు, తోట కాదుగా” అంది.

అందుకు హంసల లీడర్‌కి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. “అది చెప్పటానికి నువ్వు ఎవరు? ఇది మా place. వీడిని కొట్టి పంపండి!” అని కోపంగా రెక్కలు ఆడిస్తూ హంసలకు చెప్పాడు.

పక్షికి అర్థం అయింది ఈ కోపిష్టి వాడితో మాట్లాడటం దండగ.. waste అని. వెంటనే గాల్లోకి వేగంగా ఎగిరిపోయింది.

మర్నాడు ఆ పెద్ద పక్షి రాజు దగ్గరకు వెళ్ళింది. రంగురంగు ఈకలతో అందంగా ఉన్న పక్షి రాజుకి బాగా నచ్చింది. పక్షి రాజు దగ్గరకి వచ్చి దానికి తెలిసిన విద్యలు చూపెట్టింది.

“అమ్మమ్మా! What bird did?” అంది ప్రకృతి.

“అబ్బా! పరి! ఉండు. అమ్మమ్మని స్టోరీ చెప్పని” అన్నాడు మానస్. మానస్ స్టోరీని కార్టూన్‌లా ఊహించుకుంటున్నాడు మనసులో. అది వాడి బాధ.

“పరి! ఆ bird colorful రంగు రంగుల రెక్కలను గాల్లో ఊపింది. రెండు feathers పడేసింది. తనకి వచ్చిన సాంగ్స్ పాడింది. అది చూసి రాజు చాల ఇష్టపడ్డాడు.”

ఆ పక్షి రాజుతో “ఓ వీరుడా! Brave king! నువ్వు చాలా మంచివాడివి. నీ తోటలో కొలనులో ఉంటున్న హంసలకు చాలా చాలా అహంకారం. They are very arrogant, proud” అంది.

“అవునా? నిజంగా! నాకు తెలీదే. ఏమి జరిగింది? what happened? హంసలు ఏమి చేశాయి?” అని అడిగాడు రాజు.

అందుకు పక్షి “రాజా! నేను కూడా తోటలోని కొలను దగ్గర ఉంటానని అడిగితే హంసలు ఒప్పుకోవటం లేదు” అంది.

“అలాగా! ఎందుకు ఒప్పుకోవు. నేను చూస్తాను” అన్నాడు రాజు.

“రాజా! అవి మీ మాట కూడా వినవు. ‘రాజు చెప్పినా నిన్ను ఉండనివ్వను. రాజుకు మేము బంగారపు ఈకను అద్దెగా ఇస్తున్నాము. ఫో ఫో!’ అని వెళ్ళగొట్టాడు వాటి నాయకుడు” అంది పక్షి.

రాజుకు చాలా కోపం వచ్చింది. “ఏంటి అంత మాట అన్నాడా? వాడి సంగతి చూస్తా! ఎవరక్కడ?” అని చప్పట్లు కొట్టి భటుల్ని పిలిచాడు.

“ప్రభూ!” అంటూ భటులు.. Soldiers వచ్చారు.

వాళ్ళతో రాజు “మీరు వెంటనే తోటకి వెళ్లి కొలనులో ఉన్న బంగారు హంసలను చంపి తీసుకు రండి” అన్నాడు.

“ఆజ్ఞ! ప్రభు. అలాగే” అని భటులు కొలను దగ్గరకు ఆయుధాలు తీసుకుని వెళ్లారు. గుర్రాల మీద వస్తున్నా సైనికుల గుంపుని చూసిన హంసల నాయకుడు ఆశ్చర్యం భయంతో “అదేంటి? రాజు గారి సైనికులు కత్తులు తీసుకుని మన దగ్గరకు వస్తున్నారు? ఎందుకో?” అన్నాడు.

హంసల్లోని ముసలి హాంస, “నాయకా! నిన్న నువ్వు ఒక పెద్ద పక్షిని కోపంతో అవమానించి పంపేసావు. బహుశా అది రాజుకు మన మీద ఫిర్యాదు చేసింది కాబోలు” అన్నాడు.

అది విన్న ఇతర హంసలు “నాయకా! నీ అతి కోపంతో మా అందరికి కీడు చేస్తున్నావు. మంచిగా స్నేహంగా చెప్పి ఉంటే ఆ పక్షి శత్రువు కాకుండా ఫ్రెండ్ అయ్యేది” అన్నాయి.

“నేను ఏమి చేయాలో నాకు చెప్పవద్దు” అన్నాడు కోపంగా హంస నాయకుడు.

“పదండి.. ఫాస్ట్ ఫాస్ట్! కొలను వదిలి దూరంగా ఇంకో చోటుకి వెళ్ళాలి. అదుగో భటులు వచ్చేసారు. పదండి” అని గాల్లోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకున్నాయి హంసలు.

నాయక హంస ప్రవర్తన మూలంగా అందరికి ప్రమాదం వచ్చిందని కోపంతో మిగతా హంసలు కోపిష్టి, ముందు చూపు, దయ, స్నేహం లేనివాడు నాయకుడుగా పనికిరాడు అని తిట్టి కొత్త నాయకుడిగా వృద్ధ హంసను ఎలెక్ట్.. ఎన్నుకున్నాయి.

***

“ఆ హంస తొందరపాటు, కోపంతో వివేకం మరిచిపోయి అనవసరంగా ఇబ్బందుల్లో పడి నష్టపోయింది. అందుకే పెద్దలు ‘నీ కోపం వల్ల నీకే కాకుండా నీ వాళ్ళకూ ప్రమాదం’ అని అంటారు. So anger is very bad. అర్థం అయిందా పద్యంలో కవి ఏమి చెప్పాడో?” అన్నారు అమ్మమ్మ.

“ఎస్ అమ్మమ్మా” అన్నారు పిల్లలు.

“అమ్మమ్మా! ఇంకో poem plus story చెప్పవా?” అని అడిగారు పిల్లలు.

మరో కథ మొదలుపెట్టేటప్పటికి పిల్లలతో పాటు పెద్దలు వచ్చారు వినటానికి.

మరి మీరు అమ్మమ్మ చెప్పిన మిగతా కథలు పద్యాలూ వినటానికి సిద్ధమేనా.

వచ్చే వారం ఇంకో శతక పద్య కథ.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here