(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)
బలవంతుడి నాకేమని
[dropcap]ఎ[/dropcap]ప్పటిలాగే పిల్లలు అమ్మమ్మ కథలు వినటానికి వచ్చి కూర్చున్నారు. మేడ మీదకు పాకిన పూల తీగలు వానలకు బాగా ఎదిగి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. సన్న జాజి, చమేలీ, నూరు వరహాలు, కృష్ణ కమల్, గార్లిక్ వైన్‌ల రంగురంగు పూలు, ఫ్రాగ్రెన్సు హాయిగా ఉంది. అరోమా థెరపీతో మూడ్‍ని బాగుచేస్తారని అమ్మ అంది.
పిల్లలు పూల పరిమళం ఆస్వాదిస్తూ, పూల తీగ పందిర్ల ముందర నుంచుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంతలో ఆంటీ, మానస్, ప్రకృతి వచ్చారు బాగ్స్ తీసుకుని. అంటే స్నాక్స్. అందరు లోపలి వెళ్లారు. అమ్మమ్మ వచ్చారు.
ఆంటీ అందరికి బాయిల్ చేసిన మొక్కజొన్న/కార్న్ ఉప్పు కారం నిమ్మ రసం పూసి ఇచ్చారు. మెడిటేషన్ తరువాత స్టోరీ సెషన్ స్టార్ట్ అయింది. మనమూ విందామా?
పద్యం:
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదే సుమతి
భావం:
నేను చాల బలవంతుడిని, నాకేం భయం లేదని నిర్లక్ష్యంగా ఉండి, గర్వంతో ఇతరులను బాధించి విరోధం తెచ్చుకోవటం మంచిది కాదు. అది హాని కలిగిస్తుంది. ఎంతో బలం ఉన్న పాము చిన్నవి అని అవహేళన చెయ్యబడిన చీమల చేతిలో చనిపోయింది.
~
“చీమలు పాముని చంపేయా? How?” అన్నాడు శరణ్.
“Why not? నిన్ను చీమ ఎప్పుడు కుట్టలేదా? బిగ్ రెడ్ యాంట్ butchuk యాంట్ ఒకసారి నేను టేబుల్ మీదపెట్టిన బిగ్ ఆపిల్‌ని మొత్తం తినేసింది” అంది ప్రియ.
“యా! మా తాత తోటలో పప్పాయ ట్రీ కి చీమలు పట్టి చనిపోయింది” అన్నాడు తరుణ్.
“అబ్బా! ఆపండి. అమ్మమ్మని స్టోరీ చెప్పనివ్వండి” అన్నారు అంకుల్ పవన్.
“It’s ok పవన్!” అని అమ్మమ్మ స్టోరీ స్టార్ట్ చేశారు.
***
ఒక అడవిలో నది ప్రవహిస్తూ ఉండేది. నీటికి దగ్గర్లో పెద్ద చీమల పుట్టలు ఉండేవి. అందులో ఒకటి చాలా పెద్దది. పుట్ట లోపల చీమలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు.. ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే చీమలు తెచ్చే ఫుడ్.. ఆహరం దాచటానికి గదులు, అందరు కలసి కూర్చుని తినడానికి పెద్ద డైనింగ్ టేబుల్, రూమ్, ఇంకా ఇంకా?”
“అమ్మమ్మా! చీమలు అన్నీ నిద్రపోవటానికి బెడ్ రూమ్స్” అన్నాడు వరుణ్.
“అమ్మమ్మా! ఆడుకోవటానికి ప్లే ఏరియా”
“అమ్మమ్మా! చదువుకోవటానికి బోలెడు బుక్స్‌తో లైబ్రరీ. ఇంకా జిమ్!” అన్నారు ఉత్సాహంగా పిల్లలు.
“You are right” అన్నారు అమ్మమ్మ.
“వానాకాలంలో సరిగ్గా ఫుడ్ దొరకదని చీమలు ఆహరం ఎక్కువగా దాచుకునేవి. అంతే కాదు చీమల సంఖ్యా పెరిగేది. సో పుట్ట సైజు పెరుగుతూ పోయింది. బిగ్, వెరీ బిగ్ అలా అలా హ్యాపీగా ఉంటున్న చలి చీమలకు ఒక రోజు పెద్ద సమస్య వచ్చిపడింది. దగ్గర్లో ఉన్న చెట్టు తొర్రలో ఒక పెద్ద పాము.. స్నేక్ ఉండేది. అది దాని ఇల్లు. స్నేక్ నది ఒడ్డున తిరిగే కప్పలను తిని చెట్టులో నిద్రపోయేది. కానీ స్నేక్ నిద్ర ఎండా, వాన, చలి మూలంగా disturb అయ్యేది. విసుక్కునేది.
ఒక రోజు పాముకి ఒక ఉపాయం తట్టింది. ‘ఐ గాట్ ఐడియా’ అనుకుంటూ ‘చీమ పుట్టలో వెళ్లి పడుకుంటే ఎవ్వరికి కనపడను, weather disturb చెయ్యదు’ అనుకుని వెంటనే పెద్ద పుట్టలోకి వెళ్ళింది.
“అయ్యో!” అన్నారు పిల్లలు
“అవును. అయ్యోనే. పాము పుట్టలోకి వెళ్ళటానికి పుట్ట కోన్ అంటే పుట్ట ఎంట్రీ పాయింట్స్‌ని విరగకొట్టి.. break చేసి లోపలి వెళ్ళేది. అందువల్ల పుట్ట విరిగేది. పుట్టలో ఉన్న చీమలు పాము క్రిందపడి చనిపోయేవి. ఆలా పాము రాకపోకల వాల్ల రోజు వేల చీమలు చనిపోవటం, దెబ్బలు తగలటం జరిగేది. ఇలా రోజు అవటంతో చీమలు, రాణి చీమతో మీటింగ్ పెట్టుకున్నాయి. చీమలన్నీ ఆ పాముని ఎలాగైనా రానీకుండా చెయ్యాలనుకున్నాయి. ఫస్ట్ టైం చీమలు ఒక లీడర్‍ని పాముతో మాట్లాడటానికి పంపాయి.
యాంట్ లీడర్ పాముతో ‘పాము! పాము! ఈ పుట్ట మా హౌస్. నువ్వు ఇలా రావటం తప్పు. మా చీమలు, పుట్ట నీ వల్ల నష్ట పోతున్నాయి. దయచేసి ఇంకా రాకు.’ అన్నాడు
అది విన్న పాము పెద్దగా నవ్వి ‘ఏంటి మీ ఇల్లా? నేను రాకూడదా? మీరెవరు నాకు చెప్పటానికి. నన్ను మీరేమి చెయ్యలేరు. నేను మిమ్మల్ని నాశనం చెయ్యగలను. ఫో ఫో!’ అని తోకలేపి గట్టిగా కొట్టింది. చీమలు కొన్ని చనిపోయ్యాయి.
దూరం నుండి జరిగింది చూసిన రాణి చీమకి చాలా కోపం వచ్చింది. ‘సైనికులారా! రండి. పాముని ఎలాగైనా చంపాలి’ అని పిలిచి ఒక ఉపాయం చెప్పింది. చీమలను భయపడవద్దని చెప్పింది. ఒక రోజు పాము పందెం వేసుకుని ఎక్కువ కప్పలు తిన్నది.”
“Wow! So snake tummy full” అంది ప్రకృతి.
“అవును. స్నేక్‌కి బాగా నిద్ర వచ్చింది. పుట్టలోకి వెళ్లి డీప్ స్లీప్ లోకి వెళ్ళింది. వెంటనే రాణి చీమ orders తో చీమలన్నీ పాము మీద ఎక్కి అన్ని వైపులా గట్టిగా కుట్టటం స్టార్ట్ చేసాయి. ఆ పెయిన్‍కి స్నేక్ పుట్టలోంచి బైటకి వచ్చి పారిపోవాలనుకుంది. బట్ ఫుడ్ ఎక్కవ తిన్నది కదా! కదలడానికి ఇబ్బంది పడింది. చాలా స్లీపీగా నిద్ర మత్తుగా ఉంది కూడా. చలి చీమలు పాముని వదలకుండా కుట్టాయి. పాము కష్టపడి పుట్ట లోంచి బైటకు వచ్చింది. ఈ గోలలో పాపం చాలా చీమలు చనిపోయాయి. పుట్ట బైటకు వచ్చిన పాముని చీమలు చనిపొయ్యే దాకా వదల్లేదు. పాముని చలి చీమలు చంపటం చూసిన కప్పలు వాటికీ ప్రమాదం తప్పినందుకు, రాణి చీమకు థాంక్స్ చెప్పాయి. వేరే పుట్టలోని చీమలు కూడా వచ్చి చేరాయి. బలహీనులు నన్ను ఏమీ చెయ్యలేవు అనుకున్న పాముని చీమలు అన్ని ఐక్యమత్యంతో కలిసి కట్టుగా చంపాయి. వాటి ఇళ్లను లైఫ్‌ని సేవ్ చేసుకున్నాయి.”
***
“పిల్లలూ! మితిమీరిన అహంకారంతో అందర్నీ బలహీనులని చిన్నచూపు చూసి బాధిస్తే పాములా బలం ఉన్నా చీమల ఐక్యత ముందు ఓడిపోతారు. Arrogance మంచిది కాదు” అని కథ ముగించారు అమ్మమ్మ.