[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సత్కర్మాచరణ’ అనే రచనని అందిస్తున్నాము.]
అవ్యక్తోఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే।
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి॥
(భగవద్గీత, 2వ అధ్యాయం, సాంఖ్య యోగం, 25వ శ్లోకం)
[dropcap]ఆ[/dropcap]త్మ అనేది అవ్యక్తమైనది (కనిపించనిది), ఊహాతీతమైనది, పరమాత్మ జనితమైనది. అన్ని కాలాలలోనూ వుండేది మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ శ్లోకం ద్వారా హితబోధ చేసాడు.
ఆత్మతత్వం బహు సంక్లిష్టమైనది, దశాబ్దాల పాటు కఠోర సాధన చేస్తేనే కాని అవగతం అవదు. దీనిని వర్ణించడం మహామహులకే సాధ్యం కాలేదు. ఎందరో విద్వాంసులు నిద్రాహారాలు మాని వేలాది తత్వ గ్రంథాలను పరిశీలించినా ఆత్మతత్వం గురించి లవలేశమైనా తెలుసుకోలేకపోయారు. అమెరికాలో 1970 దశాబ్ద కాలంలో కొందరు శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోడానికి ప్రయోగాలు జరిపారు. చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటికలో ఉంచి దానిని గట్టిగా మూసివేసారు. ఆత్మనిష్క్రమణ సమయంలో గాజు పగుళ్ళు సంభవిస్తాయేమో అని చూసారు. కానీ, గాజు పేటిక పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది.
దీనిని బట్టి ఆత్మ అనేది మానవ ప్రయోగాత్మక జ్ఞానంతో అవగతం కానట్టిది, ఆత్మ చైతన్య స్వరూపమని, చైతన్య సహితమైనదని మనం గ్రహించాలి. మార్పు రహితమైనదిగా వున్న ఆత్మ సదా అణురూపంలో నిలిచి వుంటుంది. దేహంలో మార్పులు జరుగుతున్నట్లు ఆత్మలో ఎట్టి మార్పులు సంభవించవు. పరమాత్మ అనంతుడు కాగా అణురూపమైన ఆత్మ అత్యంత సూక్ష్మంగా నిలిచి వుంటుంది. ఇంతటి గుహ్యమైన ఆత్మను గురించి పరమాత్మ భగవద్గీతలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగంలో అతి సులభంగా, విపులంగా వర్ణించారు.
శ్రీకృష్ణ పరమాత్మ వ్యవహారిక జీవితంలో ఎలా మసలుకోవాలో భగవద్గీత ద్వారా స్పష్టంగా నిర్దేశనం చేసారు. అందరిలోనూ ఆత్మ రూపంలో భగవంతుడు వుండడం వలన మానవాళి చెడు మాట్లాడకూడదు, ఎవరినీ ద్వేషించకూడదు, అసూయ పడకూడదు. అందరితో కలిసి మెలిసి ఉండాలి. మనం చేసే మంచి పనుల ఫలితాలు తరువాతి జన్మ లో కూడా సంచిత, ప్రారబ్ద కర్మల రూపంలో మనతో పాటు ఉంటాయి. ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా మనస్సును చెడు వైపుకు మరల్చకూడదు. మంచి పనుల వలన మంచి కర్మలను పోగు చేసుకొని మనం మంచి కుటుంబాలలో జన్మించగలము. చెడ్డ పనులు చేసినా, ఇతరులకు కష్టం కల్గించినా ఏ క్రూరజంతువు లాగానో, క్రిమికీటకాల లాగానో పుడుతాము. ఎవరైతే తల్లి తండ్రుల మాట, పెద్దల మాట వింటూ, వారిని గౌరవిస్తూ ఉంటారో, మంచి పనులు చేస్తూ ఉంటారో, అటువంటి వారు మంచి కుటుంబాలలో జన్మిస్తారు. అదే విధంగా మనం అంటే మన ఆత్మ ఏ దేహాన్ని పొందాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తారు. అదే దేహం మనం పొందేలా చూస్తారు. మనం ఏదైనా పూలవనం లోనికి వెళ్లినపుడు ఆ పూల సువాసన మనని అంటిపెట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళినా చాలా సేపు మనతోనే ప్రయాణిస్తుంది. ఆ పూల వాస్దన ద్వారా అందరూ మన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అదే విధంగా మనం చేసే మంచి పనులే మనకు అన్ని జన్మలలో తోడుగా ఉంటాయి. అందుకే మంచి పనులు చేయడానికే ఎప్పుడూ ముందు ఉండాలి. సత్కర్మాచరణ అనేది మనలో ప్రతీ కణజాలంలో నిండి వుండాలి.
ఈ సత్యాలను మనస్సులో పదిలపరచు కొని మనం సత్కర్మాచరణయే ధ్యేయంగా జీవనం సాగించాలి.