[dropcap]అ[/dropcap]ది జిల్లా జడ్జి సత్యానంద రావు గారి భవంతి. వారు మంచి పేరు ప్రఖ్యాతలు వున్న న్యాయమూర్తి. వీరి అర్ధాంగి సీతామహాలక్ష్మి వీరికి అన్నివిధాలా తగిన ఇల్లాలు. ఇద్దరు పిల్లలు. ఆడ, మగ. ఇరువురూ డాక్టర్లు. శ్రుతి, శ్యామసుందర్. శ్రుతి చిన్నది. సొంత హాస్పిటల్ నడుపుతున్నారు. ఉన్నవారి దగ్గర తీసుకొంటారు.. లేనివారికి ఉచిత చికిత్స చేస్తారు.
నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో సీతామహాలక్ష్మి పుట్టిన వూరు. అన్న ధర్మారావు, వదిన నీలవేణి. వారికీ వీరి వలే ఇద్దరు సంతానం. పెద్దవాడు పోకిరి – త్రివిక్రం. చిన్న పిల్ల జ్యోతి సాత్వికురాలు. ధర్మారావు రాజకీయ నాయకుడు. త్రివిక్రం బి.ఎ. వరకు చదివి.. తండ్రిలా తనూ రాజకీయ నాయకుడుగా కావాలని కలలు కంటుంటాడు. వీరి స్నేహితులూ వీరికి తగిన వారే. జ్యోతి మేనత్త ఇంట్లో నగరంలో ఉంటూ ఇంటర్ చదువుతూ వుంది.
ధర్మారావు తెరచాప లాంటివాడు. ఆ కారణంగా అతనికి మంచి పేరు లేదు. ఎంత వున్నా ఇంకా ఆర్జించాలనే తలంపు, ఆశ. ఆ విషయంలో తండ్రికి తనయుడి పూర్తి సహకారం. ఆ ప్రాంతంలో జరిగే కాంట్రాక్టు పనులన్నీ వీరి మూలంగానే, పేరు ఎవరిదైనా.. నిర్వాకం వీరిదే. ఈ కారణంగా తండ్రి ఆదేశానుసారం.. ఆ వ్యవహారాలన్నీ చూస్తూ.. అన్నింటినీ బాగా అలవాటు చేసుకొన్నాడు త్రివిక్రం.
చెల్లెలి కూతురు డాక్టర్ శ్రుతిని తన కోడలిగా చేసుకోవాలని ధర్మారావు గారి ఆశ. అది జరగదని వారి అర్ధాంగి నీలవేణికి బాగా తెలుసు. కారణం.. తన కొడుకును గురించి ఆమె వారూ వీరూ చెప్పగా విన్నందున; తండ్రీ కొడుకులు తన మాటను లెక్క చేయనందున.. తన కష్టాన్ని తిరుపతి వెంకన్నకు చెప్పుకోవడం.. మనసారా ఆ స్వామిని ఆరాధించడం.. దాన ధర్మకార్యాలు చేయడం ఆమెకు శాంతిని కలిగించే అంశాలు.
ఆ ఇంటి పనిమనిషి బుచ్చి.. దినానికి రెండుసార్లు వచ్చి యజమానురాలు చెప్పిన పనులు చేసి వెళుతూ ఉంటుంది. దాదాపు పదేళ్ళుగా ఆ ఇంట పనిచేస్తూ వుంది బుచ్చమ్మ. అమాయకురాలు. చదువుకోలేదు. అబద్ధం ఆడడం తెలియదు. ధర్మం తప్పి నడవడం చేతకాదు. తన సుఖం కంటే తను చేసే పనుల వలన ఎదుటి వాళ్ళు ఆనందించాలని ఎంతగానో తపించే పేదజీవి. ఈమె భర్త నారిగాడు. ఊరి కాపలాదారి. చుట్టూ వున్నా పొలాలకు క్రమంగా నీరు నింపి మంచి దిగుబడి వచ్చేలా చేయడం అతని బాధ్యత. నిప్పులాంటి మనిషి. బుచ్చికి వాడికి వివాహం జరిగి మూడేళ్ళయింది. ఆ ఇరువురు ఎంతో అన్యోన్యంగా కల్లాకపటం లేకుండా పాలూ నీళ్ళు కలసినట్లు ప్రేమానురాగాలతో అనందంగా ఆ పల్లె సీమలో బ్రతుకుతున్నారు.
***
ధర్మారావు గారి కారు.. జడ్జీ సత్యానంద రావు గారి పోర్టికోలో ఆగింది. అంతవరకూ లాన్‍లో కూర్చుని మాట్లాడుకొంటూ వున్న సీతామహాలక్ష్మి.. సత్యానంద రావులు రాత్రి భోజన సమయం అయినందున ఇంట్లోకి నడిచారు.
డైనింగ్ టేబుల్ మీద అన్నింటిని అమర్చే దానికి సీతామహాలక్ష్మి వంట గదిలోకి వెళ్ళింది. న్యూస్ చానల్ ఆన్ చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాడు సత్యానంద రావు.
హడావుడిగా.. అప్రసన్నంగా.. ప్రవేశించిన ధర్మారావును చూచిన సత్యనంద రావు.. సాదరంగా ఆహ్వానించాడు. ధర్మారావు ఎదుటి సోఫాలో కూర్చున్నాడు.
“బావా!.. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను..” ప్రారంభించాడు ధర్మారావు.
అతని ముఖభంగిమను చూచిన.. సత్యానంద రావు.. ఏదో సమస్యను గురించే ధర్మారావు తనతో మాట్లాడబోతున్నాడని గ్రహించాడు.
“చెప్పు బావా!..”
“మన వూర్లో ఒక ఘోరం జరిగింది. మన నారిగాడి తమ్ముడు నాగబాబు మన స్కూల్లో టీచర్‍గా పనిచేస్తున్న విషయం నీకు తెలిసిందే. ఆ నీచుడు వనజ అనే క్రొత్తగా ఆరుమాసాల క్రిందట వచ్చిన టీచర్‍ను బలవంతంగా చెరచి.. మన గెస్ట్ హౌస్ బావిలో పడేసి ఏటో వెళ్ళిపోయాడు”
“ఇది ఎపుడు జరిగింది..?”
“మొన్న! నిన్న ఉదయం శవాన్ని బావిలో నుంచి పోలీసులు తీశారు. పోస్ట్ మార్టం తర్వాత.. నిన్న సాయంత్రం ఆ శవదహనం జరిగింది. మన అపోజిట్ వర్గం వారు ఆ పిల్ల చావుకు కారణం మన త్రివిక్రం అని.. పోలీసులకు కంప్లైంట్ చేసారు. పోలీసులు వచ్చి మనవాణ్ణి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. మనవాడికి ఆ అక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. వైరి వర్గం వాణ్ని ఈ కేసులో ఇరికించారు. వాణ్ని బెయిల్ మీద వెంటనే విడిపించాలి బావా!..” ప్రాధేయపూర్వకంగా కోరాడు ధర్మారావు.
“మనవాడికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు కదా బావా!…” సాలోచనగా ఇంటి ముఖద్వారాన్ని చూస్తూ అడిగాడు జడ్జి సత్యానందరావు.
“లేదు.. ఎలాంటి సంబంధం లేదు..” ఆవేశంతో గట్టిగా చెప్పాడు ధర్మారావు.
సత్యానందరావు రెండు క్షణాలు ధర్మారావు ముఖం లోకి చూచాడు.. “అయితే నీకు భయమెందుకు?.. రేపు బెయిల్ మీద మనవాడు జైలు నుండి బయటకు వచ్చేలా చేస్తాను.”
“నాకు చాలా అవమానంగా వుంది బావా!..”
“నీవు రాజకీయ నాయకుడివి. మనవాడూ నీకు వారసుడు కావాలనేది నీ కోరిక. ఇలాంటి వాటిని లెక్క చేయకూడదు.” అనునయంగా చెప్పాడు సత్యానంద రావు.
సీతామహాలక్ష్మి హాల్లోకి వచ్చింది. “బాగున్నారా అన్నయ్యా!..” పలకరించింది ధర్మారావును.
వ్యాకుల చిత్తంతో వున్న ధర్మారావు తలను ఆడించాడు.
“పద బావా!.. భోం చేద్దాం..” అన్నాడు సత్యానంద.
“లేదు.. బావా!.. నేను వూరికి వెళ్ళాలి. మీ చెల్లెలు ఎంతో విచారంగా ఒంటరిగా ఇంటో వుంది. తను నా కోసం ఎదురు చూస్తూ వుంటుంది. నే వెళ్లొస్తాను.. రేపు మనవాడు బయటికొచ్చేలా చూడు బావా!..” అర్థించాడు ధర్మారావు.
“అలాగే!..”
ధర్మారావు వెళ్ళిపోయాడు. “విషయం ఏమిటండీ” అని అడిగిన అర్ధాంగికి సత్యానంద రావు, ధర్మారావు తనకు చెప్పిన విషయాన్ని భోజనం చేస్తూ వివరించాడు. మరు దినం.. లాయర్ ద్వారా బెయిల్ పేపర్స్ తయారు చేయించి త్రివిక్రంను జైలు నుంచి విడిపించాడు.
***
ఆ రోజు ఆదివారం.. ఐదుగంటలకు లేచి అరగంట సేపు యోగ.. అరగంట సేపు జాగింగ్ పూర్తి చేసి.. ఇల్లాలి చేతి కాఫీని సేవించి సత్యానంద రావు ఇంటి చుట్టూ వున్న పూలమొక్కలకు చెట్లకు పైపుతో నీళ్ళు పెడుతున్నాడు.
బుచ్చి.. నారిగాడు భయం భయంగా ఆ ఇంటి గేటును సమీపించారు. ఇంటిముందున్న సత్యానంద వారు తనకు బాగా తెలిసినవారైనందున లోనికి రమ్మని చెయ్యి విసిరాడు. ఆ ఇరువురూ మెల్లగా బిక్కముఖాలతో లోనికి వచ్చి ఆ అయ్యగారిని సమీపించారు. నమస్కరించారు. వాచ్‌మన్‌ను పిలిచి పైపును అతని చేతికి యిచ్చి.. సత్యానంద రావు వారిని రమ్మని తన ఆఫీస్ గదిలోకి ప్రవేశించాడు. వారిరువురూ ఆ గదిలో ప్రవేశించారు. సత్యానంద రావు కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ ముందున్న కుర్చీలను చూపి.. వారిని కూర్చోమన్నాడు.. కానీ వారు కూర్చోలేదు. వారి కళ్ళల్లో నీళ్ళు, ముఖాల్లో కాంతి లేదు. మనస్సులో ఎంతో వేదన.
“నారిగా!.. భయపడకండి.. విషయం నాకు తెలిసింది. మీ తమ్ముడు జైల్లో ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలుసు. నిర్భయంగా మీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పండి. మీ తమ్ముణ్ని నేను జైలు నుండి విడుదలయ్యేలా త్వరలో చేస్తాను.” ఆప్యాయంగా చెప్పాడు సత్యానంద.
నారిగాడు అతని కుర్చీ ప్రక్కనే క్రింద కూర్చున్నాడు. అతని ప్రక్కన ముడుచుకొని బుచ్చి కూర్చుంది.
“సామీ!.. ఆ రోజు నేను పంట చేలకి నీళ్ళు మళ్ళిస్తా వుండా. సుమారుగా సాయంత్రం ఆరున్నర గంట అయివుండొచ్చు. రొప్పుతూ రోజుతూ బుచ్చి నాకాడకు వచ్చింది. భోరున ఏడ్చింది. విషయం ఏమిటే అని అడిగినా. ‘మన చిన్నయ్య ఓ ఆడమనిషిని గెస్ట్ హౌస్ బావిలో పడేయడాన్ని నేను చూచినా. అమ్మగారు ఆ ఇంటిని కడిగి సుబ్బరం చేసి రమ్మని నన్ను ఆడకి పంపింది. నేను గేటుదాటి తోటలో కాలెట్టిన.. ఇంట్లో నుండి చిన్నయ్య బుజాన ఓ ఆడమనిసితో రావడాన్ని చూచి నేను చెట్టు చాటున దాగినా, ఆడమనిసిని బావిలో పడేసి స్కూటర్ మీద చిన్నయ్య ఎల్లిపోయిండు. నాకు ఎంతో భయమేసింది. ఆడనుంచి నేరుగా నీ కాడికి పరుగెత్తుకు వచ్చినా!..’ ఏడుస్తూ బుచ్చి నాకీ మాటలు సెప్పింది సామీ!..” కన్నీటితో చెప్పాడు నారిగాడు.
“సామీ!.. నా మరిదికి ఆ అమ్మ చావుకి ఎలాంటి సంబంధం లేదయ్యా.. వాడు చాల మంచోడు. ఆమె చావుకి కారకుడు మా చిన్నయ్యే!.. ఆ పిల్లను వాడు బావిలో పడేయటం నా కళ్ళతో చూచినా. ఇది సత్తెం.. సామీ.. సత్తెం చావకూడదు. మీరే దాన్ని బతికించాల.. మా నాగబాబును జైలు నుంచి ఇడిపించాలి. సామీ!.. ఈ సత్తేన్ని మీరు ఏడ చెప్పమన్నా చెబుతా. నాకు భయం లేదు..” భోరున ఏడుస్తూ సత్యానందరావు కాళ్ళు పట్టుకోంది బుచ్చి.
బుచ్చమ్మ ధైర్య సాహసాలకు సత్యానంద రావు ఆశ్చర్య పోయాడు. ఆ పేద మనసుల ఆవేదన.. వారి మాటల్లో నిజాయితీ.. వారి హృదయాల క్షోభనూ జడ్జీగారు.. అర్ధం చేసుకొన్నారు. ‘అవును.. సత్యం చావకూడదు..’ అనుకొన్నాడు మనస్సులో.
వారు గ్రామానికి వెళ్ళితే.. ధర్మారావు మూలంగా వారు కష్టాల పాలవుతారని, వారిని తన తల్లిదండ్రులు వున్న వారి వూరికి పంపించాడు.. విచారణ రోజున పిలిపించాలని.
***
ప్రతి కేసు.. తీర్పు చెప్పబోయే ముందురోజున.. ఆ కేసు గురించి.. తను చెప్పబోయే తీర్పును గురించి.. అర్ధాంగి సీతామహాలక్ష్మితో చర్చించి, తర్వాత ఆమె అభిప్రాయాన్ని వినడం సత్యానంద రావుకు అలవాటు.
నాలుగు నెలల తర్వాత.. తీర్పు రేపు అనగా ఈ కేసును గురించి చెప్పాడు.
“అవునండీ!.. మీరు జడ్జీగా ఉన్నంతవరకు నిష్పక్షపాతంగా ప్రతి కేసు తీర్పులోను ‘సత్య రక్షణ’ జరగాలి..” అంది సీతామహాలక్ష్మి.
ఆనందంతో భార్య కళ్ళల్లోకి ఎంతో ప్రీతిగా చూచాడు సత్యానంద రావు.
వారు ఇచ్చిన తీర్పు.. త్రివిక్రంకు యావజ్జీవ కారాగార శిక్ష.
(సమాప్తం)
[న్యాయవాద వృత్తి నీతి, న్యాయం, ధర్మం రక్షణకు. నేరం ఎవరు చేసినా శిక్ష ఒకే రీతిగా వుండాలి. జడ్జి గారి తీర్పుతో సత్య రక్షణ జరగాలి. సజీవంగా వుండాలి.]