స్మృతికావ్యాలలో చిరస్థాయిగా నిలిచే ‘సత్యారాధేయమ్’

0
2

[dropcap]వ[/dropcap]ర్తమాన కవులలో ప్రముఖుడూ, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకుడూ అయిన డా.రాధేయ వ్రాసిన కావ్యం ఇది. కొన్నాళ్ళ క్రితం దివంగతురాలైన తన సతీమణి శ్రీమతి సత్యాదేవిని స్మరిస్తూ చెప్పిన స్మృతి కావ్యమిది. దీనిని విజయవాడ సాహితీమిత్రులు పుస్తకంగా ప్రకటించారు.

తెలుగువారికి స్మృతికావ్యాలేమీ కొత్త కాదు. లోకం బాధను తన బాధగా పలవరించే కవి తన ఆత్మ బంధువైన భార్యో, భర్తో, కన్నబిడ్డో, తల్లి తండ్రులో, అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో ఎవరినో భౌతికంగా కోల్పోయినప్పుడు కలిగే బాధను కవిత్వీకరించకుండా ఎలా ఉండగలడు?

వడ్డాది సుబ్బరాయ కవి “సతీస్మృతి”, విశ్వనాథ సత్యనారాయణ “వరలక్ష్మీ త్రిశతి”, పింగళి లక్ష్మీకాంతం గారి “లక్ష్మీ నిర్గమనం”, బాలాంత్రపు వేంకటరావు “విరహసంగీతం”, దువ్వూరి రామిరెడ్డి “భగ్నహృదయము”, కొప్పురావూరి సత్యనారాయణ “స్మృత్యంజలి”, రావూరి భరద్వాజ “నాలోని నువ్వు”, “అంతరంగిణి”, “ఐతరేయం”, “అయినా ఒక ఏకాంతం”, “ఒకింత వేకువ కోసం”, ముదిగొండ శివప్రసాద్ “చందనశాఖి”, మసన చెన్నప్ప “ప్రమీలా త్రిశతి”, కుందుర్తి “హంస ఎగిరిపోయింది” మొదలైన కావ్యాలు, కావ్యఖండికలు సతీవియోగంతో కవులు వెలువరించిన రచనలు.

నాయని సుబ్బారావు “విషాద మోహనము”, మోటూరి వెంకటరావు గారి “ఓ చెల్లి”, కొలచలమ సుబ్బావధాని “స్మృతిగీతము”, కోవెల సుప్రసన్నాచార్య “అశ్రుభోగ”, ఆత్మకూరు రామకృష్ణ “అవ్యక్తం” మొదలైనవి ఇతర ఆత్మబంధువుల వియోగంపై వెలువడిన స్మృతికావ్యాలు. ఇవికాక మిత్రస్మృతులు, గురుస్మృతులు, జాతీయ నాయకుల నిర్యాణం సందర్భంగా వెలువడిన స్మృతిగీతావళులు ఎన్నో ఉన్నాయి. రాయప్రోలు, తుమ్మల, నాయని, బసవరాజు అప్పారావు, పుట్టపర్తి, పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు, దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణరెడ్డి, బాలగంగాధరతిలక్, జ్ఞానానందకవి మొదలైన వారెందరో స్మృతికావ్యాలనందించారు. ఈ కావ్యాలలో ఆవేదనా, ఆక్రోశమూ, ఆవేశమూ ప్రతిబింబిస్తుంటాయి. నిర్వేదం, నిర్లిప్తత, తత్త్వచింతన కానవస్తూ వుంటాయి.

ఇక ఈ కావ్యం సంగతికి వస్తే

“కొత్తది కాదు పాత కథే
ఎక్కడా విననిదీ కాదు విన్నదే
వియోగమూ కాదు
విరహం అంతకన్నా కాదు
ప్రేమను మళ్ళీ ఒకసారి
తలపోసుకోవడం” అని కవి స్పష్టం చేస్తాడు.

“ఇది సత్యారాధేయుల కథ
బతుకు నేతలో తెగిపోయి
అతుకుపడని
ఓ పట్టు పోగు కథ!” అని ప్రారంభిస్తాడు.

యామవరం నుండీ అనంతపురందాకా విస్తరించిన తమ జీవన యానాన్ని నెమరు వేసుకుంటాడు కవి. నిరుద్యోగ యువకవిగా తన ప్రస్థానం, పెళ్ళిచూపులు, తిరుగు ప్రయాణంలో ప్రమాదం, వివాహం, కళ్యాణవేదికే కవిసమ్మేళనం వేదికగా మారిన వైనం, సంతాన ప్రాప్తి, హిందీ పండితుడిగా ఉద్యోగం, భార్య ప్రోత్సాహంతో ఉన్నత చదువులు, “ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు” అంకురార్పణ, ఈ అవార్డు అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి పడ్డ శ్రమ, కాలేజీ లెక్చరర్గా పదోన్నతి, డాక్టరేట్, పిల్లల చదువులు, ఉద్యోగాన్వేషణలు, పెళ్ళిళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, అవార్డు రజతోత్సవ వేడుకలు, పదవీవిరమణ, భార్య అనారోగ్యం, ముప్పై ఏళ్ళ కవితోత్సవం, భార్య మరణం వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాడు.

ముఖ్యంగా తమ మానసపుత్రిక “ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు” ఆవిర్భావాన్ని తలచుకుంటాడు కవి. ‘మన ఇంటి పేరుమీద ఒక అవార్డును రూపొందించుకుందాం ప్రతియేటా ఒక కవిని అవార్డుతో సన్మానించుకుందాం’ అని ప్రతిపాదిస్తే ‘నీ ఆశయం గొప్పదైనప్పుడు నేనెందుకు కాదంటాను?’ అని బదులిచ్చి తన ప్రతిపాదనకు స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆమోదం తెలిపిన సన్నివేశాన్ని పాఠకుల ముందుంచుతాడు. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు, ఎన్నెన్ని కుటుంబపరమైన ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోని ప్రేమమూర్తిగా, తాను సూత్రధారిగా మారి తెరవెనుక నిలబడి కవిత్వాన్నీ, అవార్డును ముందుకు నడిపిన ధీరవనితగా తన సహచరిని వర్ణిస్తాడు. అవిశ్రాంతంగా ముప్పై సంవత్సరాలు అవార్డు ప్రదానాలు కొనసాగిన వైనాన్ని, రజతోత్సవ సభలో ఇక పురస్కారాన్ని కొనసాగించలేనని ప్రకటించినప్పుడు ‘మా ఆయన ఏమనుకున్నా సరే ఈ అవార్డును మరికొంత కాలం కొనసాగిస్తామని ఆయన తరఫున మాట ఇస్తున్నానని’ సభాముఖంగా ధైర్యంగా ప్రకటించిన సందర్భాన్నీ గుర్తు చేసుకుంటాడు. ‘ముప్పై ఏళ్ల కవితోత్సవానికి ఎక్కడెక్కడో ఉన్న అవార్డు విజేతలంతా రెక్కలు కట్టుకుని అనంతలో వాలిపోయారు. అందరినీ పేరుపేరునా పల్కరిస్తూ కుశల మడుగుతూ ఆతిథ్యమిచ్చావు. వారంతా నీ స్వచ్ఛ ప్రేమామృత ధారల్లో తడిసిపోయారంటే నమ్ము’ అంటూ ఈ కావ్యంలో కవి ఆనాటి సంఘటనలను స్మరించుకుంటాడు. చివరకు ‘ఇక నుంచీ మన అవార్డును “ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు”గా నీ స్మృతిలో కొనసాగిస్తానని నీకు మాటిస్తున్నాను’ ప్రకటిస్తాడు.

ఇరవై అధ్యాయాలుగా విస్తరించిన ఈ స్మృతి కావ్యంలోని కొన్ని ‘మెచ్చు’ తునకలు.

~
ప్రేమాభిమానాలకు
పుట్టినిల్లు కదా పల్లెటూళ్ళు
కృష్ణశాస్త్రి గారన్నట్లు..
పల్లె తల్లి వంటింది
పట్నం ప్రియురాలు వంటిది
నిజమే… ముప్పై ఏళ్ళ కిందటి
సూక్తులు ఇవాళ ఇసుకలో రాతలు
~
కవిత్వం జీవితం
జమిలి పోగులుగా సాగుతున్న
అన్యోన్య అనుబంధం మనది!

నా కవిత్వానికి తొలి శ్రోతవు నువ్వే
అర్థం కాలేదని చెప్పలేవు
కానీ ఆనందంగా వింటావు!

నీవిచ్చిన ఉత్తేజం
నాకు టానిక్కులా పనిచేసింది
ఉద్యోగం, చదువు, కవిత్వం
ముప్పేటలా సాగిపోయింది!
~
తమ కళ విస్తరింపబడాలంటే
కవులూ, కళాకారులూ కొత్త ఊర్లు
కొత్త ప్రాంతాలు తిరుగుతూ ఉండాలి
కొత్త పరిచయాలు పెరుగుతూ ఉండాలి!
~
జీవితాన్ని తడిసిన కన్రెప్పల కింద
తడారిన పెదాలను తడుపుకుంటూ
కాలం నదిలో మన బతుకు
పడవ సాగిపోతూ ఉంది!
~
ప్లీజ్!
దుఃఖాన్ని జయించిన
కవి ఎవరో చెప్పండి?
వారిని ఆశ్రయించి సేదదీరాలని ఉంది!
~
కవుల జీవితాలన్నీ
ఈ కన్నీటి చరిత్రలేనా?
సాహిత్యకారుల నేపథ్యాలన్నీ
ఈ ఉత్థాన పతనాలేనా?
~

ఈ కావ్యానికి అనుబంధంగా అనేక మంది కవిమిత్రులు, సాహితీవేత్తలు అందించిన సందేశాలున్నాయి. అవన్నీ రాధేయ, సత్యాదేవిల వ్యక్తిత్వాన్ని మనముందు ప్రదర్శిస్తున్నాయి. అవార్డు సభల ఫోటోలు కూడా అనుబంధంలో చేర్చారు.

సత్యాదేవి తాను కూడబెట్టిన కీర్తిని అంతా మిగిల్చి రాధేయునికి ఇచ్చి వెళ్ళిపొయింది.

***

సత్యారాధేయమ్
రచన: రాధేయ
పేజీలు:144
వెల: ₹100
ప్రచురణ: సాహితీమిత్రులు, విజయవాడ
ప్రతులకు: ఉమ్మిడిశెట్టి లిటరరీ ట్రస్ట్,
#13-1-606-1, షిరిడీనగర్,
రెవెన్యూ కాలనీ, అనంతపురము 515 001
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here