Site icon Sanchika

సత్యాన్వేషణ-1

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

కం॥
కరివదనుని కన్న జనని
పరిపరి విధముల కొలిచెద పరిగియ నడుపున్॥
మరి రచనలు సలుపగ నే
గురువును వెతుకుతు నడిచిన గురుతుల కథలన్॥

కం॥
వందనములు జగదంబకు
వందనము గురువుల కతిశమొందగ సేతున్॥
వందనము తల్లితండ్రికి
వందనము పలుకులకులికి, ప్రణతులు భక్తిన్॥

***

ఉపారంభము

“….యతో వా ఇమాని భూతాని జాయన్తే
యేన జాతాని జీవన్తి
యత్ర్పయన్త్యభిసంవిశన్తి …..
తద్రహ్మ”…… (తైత్తిరీయోపనిషత్తు 3-1)

ఈ దృశ్య మాన ప్రపంచం అంతా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో, దేని మీద ఆధార పడి జీవిస్తుందో, చివరకు దేని లోకి లయిస్తుందో – అదే పరబ్రహ్మ.

———

మధ్యతరగతి స్మార్త బ్రాహ్మణ కుటుంబములో జీవితము చాలా సాధారణముగా వుంటుంది. గొప్పగా చెప్పటానికి లేదా ఘనమైనవిగా వివరించటానికి ఏమీ వుండవు. ఎవరి జీవితాలైనా ఆ భగవంతుని ప్రసాదముగా బ్రతుకుతారు. ఉదయము లేచింది మొదలు రాత్రి వరకూ ఏదో సాధించాలని తపన, హడావుడి లేక వున్నంతలో తిని, చెయ్యగలిగిన దాన ధర్మాలు చేసుకొని బ్రతుకు వెళ్ళబుచ్చుతారు. అలాంటి అతి సామాన్యమైన కుటుంబ నేపథ్యము మాది.

ఎల్లప్పుడు ఇతరులను నొప్పించక వుంటూ, భగవంతుని చింతనలో గడిపే వారికి పరమాత్మ మీద అనిర్వచనమైన భక్తి, ప్రేమ అంతఃకరణలో వుంటుంది. అలా మా నాన్న నరసింహారావుగారు, వేదమాతను నమ్మిన భక్తుడు. భారధ్వాజస గోత్రీకులైన రేపల్లె యల్లాప్రగడ వారు. చిన్నతనముననే తండ్రిని కోల్పోయిన నాన్న అష్టకష్టాల కోర్చుకొని జీవితములో పైకొచ్చినవారు. అందుకే, కుదిరినంతలో పేద బ్రాహ్మలకు సహాయము చెయ్యటము, వేద పండితులను ఆదరించటమూ ఆయనకు అత్యంత ఇష్టమైన పనులుగా వుండేవి. ఆయన గురించి చెప్పమంటే ఆయన భక్తి, బంధుప్రీతి, ప్రతివారికీ సాయంగా నిలబడటము, గుర్తుకొస్తాయి ప్రతీవారికీ. అమ్మ,హనుమాయ్యమ్మగారు, చుండూరు వారి ఆడపడచు, మా నాన్న అడుగుజాడలలో నడిచే అమాయకపు ఇల్లాలు. మంచితనానికి రూపమామే. చుట్టాలలో పక్కాలలో మంచికి మారుపేరుగా వుండేది. నాయన చేసే పనులలో సగం కాదు, పూర్తి బాధ్యత తీసుకుని చేసేది.

మా చిన్నతనములో మా ఇంటికి వచ్చే వేదపండితులను మా తల్లితండ్రులు ఎంతో ఆదరించటము మాకు ఎంతో గుర్తు. నాన్న ఆఫీసు పనిపై బయట వూర్లకు వెళ్ళిన సందర్భములో ఒకసారి ఒక పండితుడు మిట్టమధ్యాన్నము వేళ మా గడప తొక్కాడు. అమ్మ ఆయనను ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టినది.

అప్పుడడిగారు ఆయన నాన్నా గురించి.

“క్యాంపుకు వెళ్ళారు” చెప్పింది అమ్మ.

ఆయన “అమ్మా! బయటూరి నుంచి వస్తున్నాము. భోజనము చెయ్యలేదు, ముఖ్యమైన పనిమీద సారుతో మాట్లాడవచ్చాను” చెప్పారు.

అమ్మ ముందు స్నానము చేసి రమ్మన్నది.

ఆయన స్నానము చేసి వచ్చారు. అనుష్ఠానానికి కూర్చున్నారు. అమ్మ అప్పటికప్పుడు మళ్ళీ మడితో వంట చేసి, ఆయనకు వడ్డించింది. మాకెందుకో సెలవ. మేము ఇంట్లోనే వున్నాము.

ఆయన భోజనము చేసి, వెళ్ళి వస్తానంటే, మా చేత తాంబూలము అందులో ఆయనకు కొంత డబ్బు ఇప్పించింది.

“ఎందుకమ్మా” అని ఆయన వెళ్ళాక అడిగాము.

“పాపము అవసరమై వచ్చారాయన ఎండలో. నాన్న వుంటే ఆయన అవసరము తీర్చేవారేమో. కనీసము ఆయన ఖర్చులకన్నా ఇవ్వాలి మనము. ఆయన వేద పండితుడు. వేద పండితులు బీదగా వుంటారు కానీ జ్ఞానములో ధనవంతులు” అని చెప్పింది.

ఇది ఒక ఉదాహరణే. ఇటువంటివి మా చిన్నతనములో ఎన్నో సంఘటనలు. అందుకే కాబోలు, ఇంట్లో సదా పూజలు, పారాయణాలు, హోమాలు, జపాలు.

నా చిన్నతనములో ఒక్క పదిహేను రోజులులైనా మా ఇంట పెద్ద ఎత్తున పూజా-పునస్కారాలు లేకుండా గడిచినది లేదు.

నాన్నగారికి పీఠాధిపతులంటే పరమ భక్తి. ఆయన శంకరమఠము పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారికి ఒకసారి హైద్రాబాదులో పాదపూజ చేసుకున్నారు. ఆనాటి ఆ పూజకు మేమంతా వెళ్ళాము. అదో హడావిడి కార్యక్రమము. కాని అలా పాదపూజ చేసి వారి సన్నిధిలో ప్రసాదం తీసుకోవటము మాకు చాలా కాలము గుర్తు వుండిపోయింది. మొన్నీ మధ్య రెండేళ్ళ నాడు, నేను శృంగేరిలో స్వామిని దర్శనము చేసుకునేనప్పుడు మాకు ఆయన పాదపూజ అనుగ్రహించారు. అదో విచిత్రమైన అనుభవం. నా చిన్నతనంలో నాన్నతో చేసినది, నేడు మా అమ్మాయిని తీసుకు వెళ్లి వారి ఆశీర్వచనం తీసుకోవటము. భక్తి కూడా పరంపరవలె ప్రవహిస్తుంది.

కంచి మహాపెరియవా శ్రీ చంధ్రశేఖర సరస్వతీ యతీవరేంద్రులంటే నాన్నకు పరమ భక్తి. ఆయన దర్శనము మా చిన్నప్పుడు చేయించారు కూడా.

ఈ స్వామివారు మహానుభావులు. ‘20వ శతాబ్దపు అసలైన సన్యాసి’ అని దలైలామా చేత కీర్తించబడినవారు, లుబ్ధమైన సన్యాస మార్గాన్ని పునరుద్ధరించటానికి మానవ జన్మ నెత్తినవారు. ఎవరి నామము తలచుకుంటే మన కర్మలు పటాపంచలవుతాయో, ఎవరి దర్శన మాత్రముచే మనకు జీవన్ముక్తి లభిస్తుందో , ఎవరు సాక్షాత్తు ఆ ఆది శంకరుల అవతారమని సర్వ లోకము కైమోడ్పులిచ్చినదో, ఎవరిని ‘నడిచే దైవ’మని భక్తులు తలుస్తారో, అటు వంటి మహా యోగి పుంగములు, మహా తపస్వి, అపరశంకర భగవత్పాదుల రూపము అయిన 20 వ శతాబ్దపు మహా సన్యాసి, కంచి కామకోటికి 68వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి యతివరేంద్ర మహాస్వామి.

శ్రీ మహాస్వామిని భక్తులు ప్రేమగా “పెరియవా” అని పిలుచుకుంటారు. వారి కనుచూపుల్లో ఎందరి జీవితాలో జ్ఞాన మార్గంలోకి నడిపించబడినాయి. ఎందరికో ఇహలోక కోరికలు తీరి పరలోక ప్రాప్తి కూడా పొందారు. ఎందరో భక్తులు మహాస్వామిని చూడగలిగారు, వారి కరుణను పొందగలిగారు. వారు మన ముందు తరానికి చెందిన స్వామి అయివుండటము మన అదృష్టము. వారి లీలలు తెలుసుకునే కొద్దీ మనకు అపరిమితమైన ఆశ్చర్యం, భక్తి తప్పక కలుగుతాయి.

ఎంత దూరంగా ఉన్నా, నిజమైన భక్తితో ఆర్తితో కొలిచిన, మహాస్వామి వచ్చి రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కామాక్షి దేవి గుడిలో నెలవై ఉంటే, మహాస్వామి రూపంలో కామాక్షి దేవి బయట తిరిగి భక్తులను అనుగ్రహించింది. మహా స్వామికి కంచి కామాక్షికి తేడా లేదని భక్తుల విశ్వాసం.

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరుణంలో, భారత రాజ్యంగంలో “Right to Religion” చేర్చాలని మహాస్వామి సంకల్పం. అది ప్రాథమిక హక్కుగా చేర్చబడింది మహాస్వామి కృప వలననే. సనాతన ధర్మము నిలపడానికి, ప్రజలను ధర్మం వైపు నడపటానికి ఈ భూమి మీద నడయాడిన దైవం మహాస్వామి.

ఒక శివరాత్రికి మహా పెరియవా అలంపురము విచ్చేశారు, అప్పటికి వారు చాలా వృద్ధులు. అలంపురము అప్పటి మహబూబ్‌నగరు జిల్లాలో వున్న శక్తి పీఠము. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అక్కడ అమ్మవారు జోగులాంబ. ఆమె శక్తి తాంత్రికమైనది. అర్చనలు మాత్రం సాత్వికంగానే వుంటాయి. కామాఖ్య తరువాత అంత శక్తివంతమైన క్షేత్రమీ అలంపురము. ఆ క్షేత్రం ఆ నాటి శివరాత్రికి భక్తులతో నిండిపోయి, కిటకిటలాడుతోంది. మహాస్వామివారు ఆనాడు మౌనదీక్షలో వున్నారు. నాన్న ఆ సమయములో ఆ క్షేత్రంలో ఉద్యోగములో వున్నారు. స్వామి వారిని చూడవలసిన పని కూడా మా నాయన డ్యూటీలో భాగమనుకుంటా. అందుకే ఎవ్వరికీ దొరకని మహాపెరియవా దర్శనము ఆ నాడు మాకు లభ్యమైనది. అప్పడు నాకు పదేళ్ళు కూడా లేవు. జర్వంగా వున్న నన్ను పట్టుకుపోయారు అమ్మా, నాన్న. ముందుగా వారు స్వామికి దగ్గరగా వెళ్ళి సాష్టాంగం చేశారు. తరువాత మేము నానమ్మ ఒకరి తరువాత ఒకరము దగ్గరగా వెళ్ళి నమస్కారము చేశాము. అలా నాకు పది సంవత్సరాల వయసు రాకముందే ‘నడిచే దేవు’నిగా పేరు పొందిన పెరియవాను దర్శించాను. అది నాకు ఆధ్యాత్మిక ఉన్నతినిచ్చిందని చెప్పలేను కాని నా మనసు పొరలలో నిలచిన ఆ జ్ఞాపకము ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో అపురూపమైనది.

నాన్నకు ఒక గురువుండేవారు. ఆయన పేరు డూబేగారు. హిందీ తప్ప మాట్లాడేవారు కాదు డూబేగారు. ఇరువై సంవత్సరాలు ఆయన హిమాలయాలలో వుండి వచ్చారని చెప్పేవారు నాన్న. ఆయన వయస్సు 120 సంవత్సరాలు. తెల్లగా వుండి తెల్లటి గడ్డంతో వంగి నడిచేవారు. అయినా చాలా ఎత్తుగా వుండేవారు. బొల్లారంలో వుండే వారి వద్దకు ఒకసారి నన్ను తీసుకువెళ్ళారు. నాకు సరిగ్గా గుర్తు లేదు కాని నాన్నకు మాత్రం ఆయన మాట వేదవాక్కుగా వుండేది. గురువంటే అదే కాబోలు. గురువు మాటకు మరో మాట లేకుండా అనుసరించాలని మా నాన్నను చూసి అనుకునేదాన్ని నేను.

వేద పండితుల ఆశీర్వాదాలతో, పీఠాధిపతుల దర్శనాలతో పెరిగినా నా చిన్నతనంలో నాకు గురుభక్తి అంటూ ఉండేది కాదు. కానీ పిల్లలు ఇలాంటి వాతావరణములో పెరిగితే కొంత భక్తితో పెరగటము, కొద్దిగా క్రమశిక్షణతో మెసలటము సహజమేగా. మాకు చిన్నతనంలో హనుమంతుని మీద చాలా గురి. మా అన్ని విషయాలు ఆయనకు చెప్పేసి పనియైపోయిందని అనుకునేవాళ్ళం.

అలా పెరిగి పెద్దవాళ్ళమై, పెళ్ళిళ్ళూ, మాకు పిల్లలు కలిగాయి.

సంసారములో వచ్చే ఆటుపోట్లు సర్వసాధారణము. మంచి భగవంతుని దయగా, కష్టాలు మన కర్మ అని సరిపుచ్చుకోవటము అలవాటు.

ఒక వేసవికి నేను హైద్రాబాదు వెళ్ళాను. ఆ సంవత్సరము ఎండలు బాగా వున్నాయన్నారు. ప్రతి వేసవి ఇదే మాట వింటాము మనము. ఆ వేసవిలో వెళ్ళినా వెంటనే బయటకురాలేకపోయాము, ఆ ఎండలకు. వెళ్ళిన తొమ్మిదో రోజున మేమంతా కలిసి భోజనాలు చేశాము.

ఆ నాడు నాన్న “మామిడిపళ్ళు వస్తున్నాయి, పిల్ల తింటుంది తీసుకువస్తాను” అని బయటకు వెళ్ళారు.

నేను, మా అమ్మాయి కలిసి షాప్ కని బయటకొచ్చాము.

మేము షాపులో కాలు పెడుతుండగా చిన్నఅక్క ఫోను చేసింది.

‘నాన్న పడిపోయారు రమ్మ’ని.

దారిలో అమ్మ ఆటోలో వస్తుంటే అమ్మతో పాటూ ఆటోలోకి ఎక్కేశాను.

పిల్ల కారులో వుండిపొయింది.

ఆంధ్రమహిళాసభ ఆసుపత్రికి వెళ్ళాము.

అక్కడ డాక్టర్లు చూసి “ఏం మిగల్లేదు. ఆయన రెండు సెకన్లలో పోయారు” అన్నారు.

ఒక్క రోజు మంచంలో లేరు.

గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఋణం తీర్చుకోలేదు.

నాతో ఒక్క మాటా చెప్పలేదు. అదేంటి ఆలా చేశారు??

ప్రాణము క్షణంలో వెళ్ళిపొతుందా?

***

నేను ఆ సమ్మర్‌లో వెళ్ళటానికి కారణం నాన్నతో గడపటానికి. అంటే ఆయనంటే నాకు చాలా గౌరవం, మించి చెప్పలేని ఇష్టం. ఆయనకి నేనేంటే తగని ప్రేమ. నన్ను చూసి చాలా సంతోషపడేవారు. ఆ ముందు ఏడు ఆయనకి నిమోనియా వచ్చింది. కొద్దిగా కంగారు పెట్టారు. కానీ తగ్గి మామూలు మనిషయ్యారు. తెగ హడావిడి కదా, ఒక్క రోజు మంచంలో లేరు. నేను చూసినప్పుడు కూడా ఆయన చాలా మామూలుగా, ఆరోగ్యంగా ఉన్నారు. తనకి బాగోలేదని అన్న విషయము తెలీలేదు.

చుట్టాలందరు ఆయన నా కోసం ఇన్నిరోజులు ఉన్నారని, నన్ను చూడగానే పని అయ్యిందని మాయమయ్యారని అన్నారు.

నాకు ఎంతగా అపరాధ భావన కలిగిందో.

నేను ఇండియా రాకపోతే బహుశా ఆయన ఉండేవారేమో అన్న ఆలోచన నాకు చాలా గాయం చేసింది.

***

నాన్న హఠాత్ మరణం అమ్మకు చేసే గాయం తక్కువ కాదు కదా. అలాంటి సమయములో అమ్మను వదిలి ఎలా?

అమ్మ వంటరిగా మిగిలిపొయ్యింది.

అమ్మను వదలలేక, పిల్లల బడి తెరవటముతో అక్కడే వుండలేక హృదయము చాలా నలిగింది.

తప్పదుగా, నాకో సంసారం, పిల్లా ఉన్నాయి. అమ్మను వదిలి వెళ్లేటప్పుడు నా హృదయం సగం వదిలి వెళ్ళాను.

వెంటనే అమ్మని చూడటానికి రాలేకపోయాను. అత్తగారు వాళ్ళు వచ్చి ఉన్నారు. తిరిగి అమ్మ వద్దకు రెండేళ్ళకు వెళ్ళగలిగాను మళ్ళీ.

అమ్మ చాలా మారిపోయ్యింది.

అకాల వృద్ధాప్యము మీద పడింది ఆమెకు. అరవై సంవత్సరాల అమ్మ ఎనభై సంవత్సరాలుగా కనపడుతోంది.

అన్నింటి మీద ముఖ్యంగా బ్రతుకు మీద మమకారం వదిలేసింది. ఆఖరికి పిల్లలతో ఆడుకునే అమ్మ చాలా నిర్లిప్తంగా మారింది.

మామూలుగానే మౌనంగా వుండే అమ్మ జడంలా మారింది. స్పందించటము మరిచింది.

ఇలాకాదని ఆమెను తీసుకు దక్షిణభారత యాత్రకు వెళ్ళాము.

చెన్నై నుంచి ఫైట్లులో హైద్రాబాదు వచ్చాము. అమ్మను చూస్తే కడుపు లోంచి దుఃఖం ఆగలేదు.

ఇక వదల్లేకపోయాను. అమ్మ నాతో కలిసి అప్పడు అట్లాంటా వచ్చింది.

కొన్ని రోజులుండి, తిరిగివెళ్ళింది. అప్పుడే అనుకున్నా, మా పిల్ల కాలేజీకి వెళ్ళాక ఇండియా తిరిగెళ్ళి అమ్మ దగ్గర వుండాలని.

ఆ వేసవిలో వెళ్ళి అమ్మతో గడిపి వచ్చాము. మా ఆలోచనలంతా అమ్మ గురించే. అమ్మ పూర్వంలా కాకపోయినా కనీసము మాములుగా వుండాలని కోరుకున్నాము.

అమ్మతో ఆడుతూ పాడుతూ గడిపాము, ఆ వేసవి. అమ్మ మాములు మనిషి అవుతుందని ఆశ కలిగింది. అక్కయ్య వాళ్ళు అమ్మకు దగ్గరగా వుండాలని హైద్రాబాదు వచ్చేశారు.

నాకు నిజంగా కొద్దిగ భరోసా కలిగింది. కొంత ఎడబాటుతో, కొంత ఊరటతో ఆ వేసవి నేను హైద్రాబాదు విడిచాను.

అప్పటికి నాన్న ఈశ్వరుని చేరి మూడు సంవత్సరములు.

ఎవరి జీవితమైనా మాములుగా, సాదాగా గడిచిపోతే కథ వుండదు. వానాకాలపు చిరుజల్లులు, లేదా దడదడ వానకు కదలనిది హృదయము, తుఫానుకు కదులుతుంది. ఆ తుఫాను ఉధృతమయితే హృదయపు రూపు మాసి కూడా పోతుంది.

మనమొకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడంటారు కదా!

నేను వెనకకు వచ్చిన తరువాత రోజూ అమ్మ చాట్ చేసేది. ఆరోజు పిల్ల బడి తెరిచి వారం రోజులైయ్యింది. నేను వెనకకు వచ్చి తొమ్మిది రోజులు. అమ్మతో చాటు లో విషయాలు మాట్లాడి నే పనిచూసుకుంటుంటే, అక్కయ్య ఫోను చేసింది.

“అమ్మ లేదు ఇక”….

ఏమీ అర్థం కాలేదు. కళ్ళు తిరిగాయి. ఇంతలో స్కూలు నించి మా అమ్మాయి వచ్చింది. ఆరోజు శ్రీవారు షికాగో వెళ్ళాడు.

నేను షికాగో ఫోను చేసి తనకు చెబుతుంటే పిల్ల విని నేల మీద పడి ఏడవటము అది. నా మిత్రులు ఇద్దరు వచ్చారు. టికెటు ఎవరో తీసుకున్నారు. గంటలో నేను విమానాశ్రయంలో వున్నాను.

నేను పిల్లా ఎలా వచ్చి ఫైటు ఎక్కామో, ఎలా చేరామో తెలియదు….. అంతా క్షణాలలో మారిపోతుంది.

మృదుమధురమైన ఆ గొంతు నే వినను ఇక. ఆ కరుణుతో కూడిన చూపులు, పిల్లలకోసము ఆమె ఆత్రుత, ఎప్పుడూ ఎలా ప్రక్కవారికి మంచి చెయ్యాలా అని ఆలోచించే ఆ హృదయము, ఈశ్వరుని కలిసింది. మంచి వారిని భగవంతుడు తన దగ్గరకు తీసుకుంటాడు త్వరగా.

అమ్మ ఆకారము కనుమరుగవడము సాధ్యమా? భౌతికమైన ఆమె రూపము పంచభూతాలలో, త్రివేణీ సంగమములో కలిసింది.

తరువాత పదో రోజు తరువాత నేను వెనక్కు వచ్చేశా……

నాకు క్లినికల్ డిప్రెషనుగా డాక్టర్లు డైగ్నోస్ చేశారు…..

“కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచాతాః।
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌॥(భగవద్గీత -2-7)

పిరికితనముతో గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మల విచక్షణ దూరమై నా కర్తవ్యము నిర్ణయించుకోలేకపోతిని. నాకు శ్రేయస్కరమైనదానిని తెలుపుము. శరణాగతుని.

(సశేషం)

Exit mobile version