సత్యాన్వేషణ-10

0
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]స్వా[/dropcap]మి దర్శనానికి గొప్ప సిద్ధపురుషులు కూడా వివిధ రూపాలలో వస్తూ ఉండేవారు. ఒక రోజు తోటలో కూర్చున్న స్వామి భక్తులతో అకస్మాత్తుగా లేచి, “రండి మీకొక మహాత్ముని చూపెడతాను” అన్నారు. యాభై గజాల దూరంలో పెద్ద పుట్ట వద్దకు తీసుకుపోతారు. అక్కడ పుట్ట నుంచి పెద్ద నాగుపాము వచ్చి స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది. స్వామి ఆ పాముతో కొద్ది దూరం నడచి వీడ్కోలు చెప్పారు. “ఆయన గొప్ప మహనీయుడు” అన్నారు స్వామి.

స్వామిని విద్యాశ్రీ, రాజశ్రీ, సౌందర్యశ్రీ పరీక్షించి, ఓడి స్వామి ఆత్మ సౌందర్యంలో కరిగిపోయాయి.

అక్కల్కోటలో ఒక మంగలి స్వామికి క్షవరం చేసి, గోళ్ళు తీసేవాడు. ఆ మంగలి తీసిన గోళ్ళను తాయత్తులో పెట్టి అమ్ముకునేవాడు. స్వామి శక్తి వలన ప్రజలను అనేక బాధల నుంచి ఆ తాయత్తులు రక్షించేవి. మంగలికి ధన లోభం ఎక్కువై భక్తి నశించింది. ఆ తాయత్తులు ఉపకరించటం మానుకున్నాయి. అతనా వృత్తి మానవలసి వచ్చింది. ఒక వేసవిలో ఆ ఊరిలో బావులన్ని ఎండిపోయాయి. చోళప్ప ఇంటిలోని బావి కూడా ఎండిపోతుంది. స్వామి ఆ బావిలో మూత్రవిసర్జన చేస్తారు. ఆనాటి నుంచి బావిలో నిండుగా నీరు ఉన్నాయి. నేటికి భక్తులు ఆ బావిని సందర్శించవచ్చు.

1857లో మొదటి సారి కోడాక్ కంపెనీ వారు స్వామిని ఫోటో తీశారు. ఆ ఫోటోలో స్వామి చుట్టూ పెద్ద కాంతిపుంజం ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది.

అప్పుడు మనదేశంలో ఫోటోలు లభ్యం అయ్యేవి కావు. ఆ ఖర్చు కేవలం మహారాజాలు మాత్రమే భరించేవారు. కోడాక్ కంపెనీ బొంబాయిలో ఆఫీస్ మొదలుపెడుతూ కంపెనీ పేరు కోసం స్వామి ఫోటో తీసి అడ్వర్టైజు చెయ్యాలని ఆలోచించారు. నిపుణులైన ఫోటోగ్రాఫర్‌ని స్వామి దగ్గరకు పంపారు. అతను స్వామి అనుమతి లేకుండా ఫోటో తీయాలని నిశ్చయించి, ఎంతో కష్టం మీద చిత్రం తీస్తాడు. ఫోటో చెప్పకుండా తీశానని గర్వపడతాడు. ఫోటో కడిగి స్వామికి చూపుతాడు. అది చూసి స్వామి నవ్వి చుట్టూ ఉన్న భక్తులకు చూపుతాడు. ఎవరి ఇష్టదైవం వారికి కనపడుతుంది. స్వామి ఫోటోగ్రాఫర్‌కి చూపితే అందుకో కోతి బొమ్మ ఉంటుంది.

ఫోటోగ్రాఫర్‌కి బుద్ది వస్తుంది. స్వామి ఫోటోగ్రాఫర్ గర్వ మణచడానికే ఇలా చేశారని అర్థమౌతుంది. స్వామిని శరణు వేడి మళ్ళీ ఫోటో తీస్తే, చక్కటి ఫోటో వచ్చింది.

స్వామి ఎందరెందరికో ఆత్మోన్నతి నొసగి వారిని మహాయోగులుగా మలచారు. స్వామి ఎందరో భక్తులకు తాను పూర్ణ దత్తావతారమని నిదర్శనం నిచ్చారు.

ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టవచ్చు కానీ, పరమాత్మ లీలలు లిఖించ ఎవరికీ సాధ్యం?

స్వామి నిర్యాణం చెందబోయే ముందుగా చూచాయగా భక్తులకు సూచించేవారు. స్వామి తను నిర్యాణం చెందబోయే ముందు జంగాల మఠానికి వెళ్ళి లింగాలకు పిడకలు పేర్చి నిప్పు పెట్టించారు. తాము ప్రతిష్ఠించుకున్న లింగాలను కాలుస్తున్న స్వామిని ఏమి అనలేక జంగాలు కేకలు వేసుకున్నారు. మరు రోజు బూడిద తొలగిస్తే కాంతివంతమైన లింగాలు దర్శనం ఇచ్చాయి. నిర్యాణానంతరం తాను మరింత ఉజ్జ్వలంగా ఉండబోతున్నామని సూచన అని భక్తులు తలచారు.

ఆయన నిర్యాణానికి నాలుగు రోజుల ముందు జ్వరం రావటం మొదలైంది. ఆయన మామిడి తోటకు బదిలీ అయ్యారు. భోజనం మానివేశారు. స్వామి అప్పుడే “మా వనానికి వెళ్ళాలి” అని అనటం మొదలెట్టారు.

“నేను సర్వత్రా ఉన్నాను, పిలిస్తే పలుకుతాను” అని చెప్పారు. మర్రి చెట్టు మొదట్లో పద్మాసనం వేసుకు కూర్చున్నారు. అలాగే శరీరాన్ని విడిచారు. స్వామిని అలానే ఊరేగించి, చోళప్ప ఇంటి ఎదురుగా సమాధి కట్టారు. దానిని ‘చోళ్ళప్ప మఠం’ అంటారు.

“అనంతకోటి బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కీ జై”! అని భక్తులు ముక్త కంఠంతో కేకలు వేశారు.

స్వామి సమాధి తరువాత కూడా భక్తులకు దర్శనం ఇచ్చి, రక్షిస్తున్న సంఘటనలు కోకొల్లలు.

అక్కల్కోట స్వామి సమర్థకి, శిరిడి సాయినాథునికీ ఎన్నో పోలికలు ఉన్నాయి. వారిరువురి చిన్నతనం, కులం గోత్రం తెలియదు. ఇరువురు దత్త సంప్రదాయం పాటించారు. ఇద్దరు స్థానిక ఖండోబా దేవాలయం వద్ద ప్రకటితమైనారు. ఇద్దరిని ముందు ఒక మహ్మదీయ భక్తుడు ఆదరించాడు. ఇద్దరు భక్తులను అనుగ్రహించటంలో తిట్లు, దెబ్బల వంటి విచిత్ర పద్ధతి పాటించారు. సకల దేవతలు తామే అని భక్తులకు చూపించారు. ఎందరో  భక్తులకు ఆత్మోన్నతి కలిగించి, యోగులుగా తీర్చిదిద్దారు.

వీరు సమాధి తరువాత కూడా భక్తులకు అందుబాటులో ఉన్నారు.

***

స్వామి వారి సమాధి మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మూడు పూటలా హారతి, ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజ, ఇత్యాదులు ఆ మందిరంలో జరుగుతాయి.

అక్కడ ఇదీ అని చెప్పలేని హాయిని ప్రశాంతతని కలిగిస్తుంది. ఆ ప్రశాంత వాతావరణములో నేను స్వామిని జపిస్తూ వుండిపోయాను.

 

కొంత సమయము తరువాత  ధనుంజయ పూజారి, నాతో మాటలు కలిపారు. ఆయన నా బాధా, గాథా విన్నారు. సరి అయిన స్థలానికి వచ్చానని హామీ ఇచ్చారు. ఆచార్య ఎక్కిరాల భరధ్వజ గారు కూడా ఇలా వచ్చి ఆ సమాధి మందిరములో కొన్ని రోజులున్నారని చెప్పాడాయన.

ఆంధ్రదేశములో గురువుల తత్వము, సాయి పూజలు పూర్వము ఎక్కువగా వుండేవి కావు. అవి మహారాష్ట్రలో ఎక్కువగా కనపడుతాయి. అందుకే ఎందరో మహానుభావులు ఆ నేలలో వర్ధిల్లారు. ఆంధ్రదేశములో సాయి తత్త్వమును వ్యాప్తిచేసి, ప్రజలను ఆధ్యాత్మికత వైపుకు మరల్చిన మహానుభావులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు. వారు శ్రీ అనంతాచార్యులు, బుచ్చమ్మ దంపతుల కడపటి సంతానము. చిన్నతనములో తల్లిని కోల్పోయిన వారిని తండ్రి పెంచారు. ప్రాథమిక విద్య తండ్రి వద్దనే నేర్చుకున్న భరద్వాజ మాస్టారు మెట్రిక్ వారాణాసిలో  పూర్తిచేశారు. హిందూ కాలేజ్‌లో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయము నుంచి ఇంగ్లీష్ లిటరేచరులో మాస్టర్సు పూర్తి చేశారు.

వారి అన్నగారు, చదువు సామర్థ్యాన్ని నిరూపించుకోమన్నారని, IAS రాసి, హిమాచల్‌ప్రదేశ్‌కు పోస్టింగు వస్తే కాదని, అధ్యాపక వృతిలో కొనసాగారు. వివిధ కళాశాలలో పనిచేసి, నెల్లూరు కళాశాలలో 1981 వరకూ వుండి తరువాత ఉద్యోగానికి స్వస్తి చెప్పారు.

తమ ప్రియమైన పెద్దన్నగారి రెండవ కుమారుడు మరణించిన తరువాత, మరణంపై ప్రశ్న తలెత్తి నాస్తిక వాదము వైపు మొగ్గచూపారు. ప్రతి దానినీ పరీశిలించటమూ, పరిశోధించటమూ, దాన్ని విశ్లేషించటమూ అలవాటు ఆయనకు. ఆ కోవలో చావు గురించి ఆయనకు కలిగిన భావ పరంపరలు అశాంతిని కలగచేశాయి. ఆ నేపథ్యంలో, రెండవ అన్న బలవంతంపై షిర్డి వెళ్ళి, సమాధి మందిరములో కూర్చుండిపోయారు. ఆయనకు కలిగిన దివ్యమైన అనుభూతితో మరల షిర్డి వెళ్ళి సాయినాథుని ధ్యానములో గడిపినప్పుడు, ‘జీవించి వుండగా సాయిని చూడలేదే’ అనే ఒక బాధ మనస్సులో వుండిపోయినది.

అది మొదలు ‘సాయి సాయి’ అంటూ తిరుగుతూ మహాత్ములను సందర్శిస్తూ, ఎందరోనో దర్శించారు. ఎవ్వరికీ దర్శనము ఇవ్వని మహాత్ములు కూడా ‘సాయి మాస్టారు’ను ఎంతో అభిమానముగా దగ్గరకు చేర్చుకున్నారు. ‘సాయి కా బేటా’ అంటూ ఆదరించారు.

వారు ఎందరినో దర్శించి వారిపై పుస్తకాలు ప్రచురించారు. ఆ విధంగానే మనకు పాకలపాటి గురువుగారు, చీరాల అవధూత, గొలగపూడి వెంకన్నస్వామి, చివటం అమ్మ వంటి మహాత్ముల మీద పుస్తకాలు లభిస్తున్నాయి. వారు ఎందరో మహాత్ములను దర్శించటము, గ్రంథాలు చదవటము చేసి, ఆ విషయ జ్ఞానము తోటి వారితో పంచుకునేవారు.

శ్రీవాసుదేవానంద స్వామి ప్రత్యక్ష శిష్యుడు గుళవణి మహారాజు, చందవోలు శాస్త్రి గారు, ఆనందయయి మా, అవదూత రామిరెడ్డి తాతా, మొదలైన పూజ్యుల ఆశీస్సులు వారికి లభించాయి.

జిలెళ్ళమూడిలో అమ్మ కోరికపై మాతృశ్రీ కళాశాలలో కొంత కాలము పనిచేశారు.

ఆ సమయములో అమ్మతో ఎన్నో సంగతులు చర్చించటమూ, తెలుసుకోవటము వంటివి చేసేవారు.

తన సాధనకు గృహజీవితము అడ్డు అని తలచి, వివాహము చేసుకోకూడదని తలచారు కాని, పాకలపాటి గురువుగారు ఆయనను వివాహము చేసుకోమని, వచ్చే అమ్మాయి సాధనకు అడ్డు తగలదని మాట ఇచ్చాకనే అలివేలు మంగమ్మ గారిని వివాహము చేసుకున్నారు.

సాయి తత్వమును బోధిస్తూ, ప్రజలను ఆధ్యాత్మికత వైపుకు మరల్చటంలో మాస్టారు చేసిన కృషి చెప్పలేము. ఎవరికి ఏ సందేహము కలిగినా మాస్టారు వద్ద సమాధానము వుంటుంది.  ఎవరికి ఏ సమస్య వచ్చినా మాస్టారు గారి వద్ద పరిష్కారముండేది.

ఒక భక్తుడు తన కష్టాలు తీరటము లేదని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. చివరిసారి మాస్టారు దర్శనము చేసుకోవాలని అనుకోని వెడతాడు. మాస్టారుగారు భక్తులతో మాట్లాడుతూ ‘మానవ జన్మ ఎంత ఉత్తమమో, సాధన ద్వారా ఎలా మనసును జయించాలో’ చెబుతూ, ఇతని వైపు చూసి ‘ఆత్మహత్య మహా పాపము. ఏది తీరకపోతే అన్నీ వదిలేసి నామ జపం చేసి కూడా బ్రతకవచ్చు’ అంటారు.

మరోక విద్యార్థి సన్యాసము తీసుకోవాలని వుందని చెబితే, అతనితో మాట్లాడి ఆ ఆలోచన మారుస్తారు. పరిపక్వత లేకుండా సన్యాసము తీసుకొని భ్రష్టులైన వారు ఎందరో వున్నారని, ముందు నామజపం సాధన చెయ్యమని చెబుతారు. ఒక భక్తుడు మాస్టారుగారి కోసము చపాతీలు తీసుకువెళ్ళాలనుకుంటాడు. వాళ్ళ పిల్లాడు తనకూ రొట్టె కావాలని మారాం చేస్తాడు. భక్తుడు పిల్లాడిని కసిరి రొట్టెలు పొట్లం కట్టుకు వెడతాడు. మాస్టారు ఆ నాడు అన్నం తినాలని వుందని హోటలుకు తీసుకుపోయి అన్నం తింటారు. పిల్లవాడిని ఏడిపించి తెచ్చిన రొట్టెల వంక ఆయన చూడనేలేదు.  విద్యానగరులో సాయి మందిరము కోసము స్థలము కొన్నారు. మాస్టారు ఆ స్థలములో ఒక చోట కొబ్బరికాయ కొట్టారు. వాస్తు తెలిసిన పండితుడు అక్కడే దేవాలయము కట్టమని చెబుతారు.

విద్యానగరు ధునిని, షిర్డి నుంచి తెచ్చిన ధునితో వెలిగించారు. ఆ ధుని నేటికీ వెలుగుతూ వుంటుంది.

ఆ దేవాలయము కట్టేటప్పుడు మధ్యలో ఫండ్స్ అయిపోతాయి. భక్తులు ఆందోళన పడుతారు. మాస్టారు మాత్రం వున్న కాస్త డబ్బుతో పేపరులో యాడ్‌ వేయించమని సలహా చెబుతారు. వాళ్ళకు ఇష్టం లేకపోయినా అలా చేస్తే డబ్బు కుప్పలుగా చేరుతుంది.

మాస్టారు ఒక భక్తుని ఉదయపూరులో జలాలుద్దీన్ బాబా అన్న యోగి దర్శనము చేసుకోమని, సమస్యలు తీరుతాయని పంపుతారు. ఆ యోగి ఈ భక్తునికి ఒక మంత్రం చెప్పి 40 రోజులు తన వద్ద వుండి వెళ్ళమని చెబుతాడు. తిరిగి ఒంగోలు వెడితే మాస్టారు ఆ మంత్రం ఒక కాగితంపై రాసి చూపుతారు.

మాస్టారు ఆధ్యాత్మిక చింతనంతా ప్రోగు చేసి చేసిన రచనలు – ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీచికలు, శ్రీసాయిలీలామృతము, శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయినాధ ప్రభోదామృతము, శ్రీసాయి సన్నిధి, దత్తావతార మహత్యము, పరిప్రశ్న, అక్కల్‌కోట స్వామి చరిత్ర, శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్ర, టిబెట్ యోగి మిలారేపా, నేను దర్శించిన మహత్ములు పాకలపాటి గురువుగారు, అవధూత చీరాలస్వామి, శ్రీ ఆనందమాయి, అవధూత వెంకన్నస్వామి ఇత్యాదులు.

మనకు పూర్వము తెలుగులో గురుచరిత్ర, సాయి చరిత్ర పారాయణ గ్రంథాలు లేవు. మాస్టారుగారు ఎంతో శ్రమకోర్చి వాటిని రాశారు. మరాఠిలో వున్న గురుచరిత్రను మరాఠి – ఇంగ్లీషు వచ్చిన వారిచే చదివించుకొని ఇంగ్లీషులో రాసి, దానిని తెనుగీకరించారు. సాయి చరిత్ర కూడా ఎందరినో ఇంటర్యూలు చేసి విషయ సేకరణ చేసి రాసిన పరిపూర్ణమైన గ్రంథం. నేటికి మన మానవ జీవితపు సమస్యలను దాటటానికి ఈ గ్రంథ పారాయణము అత్యుత్తమమైన సాధన.

సాయి పారాయణము చేసే భక్తులుగా ఆ విధంగా మాస్టారు గారికి ఎంతో రుణపడి వున్నాము. మన జీవితాలలో సాయి యన్న దీపము వెలిగించి జ్ఞాన దీపము ప్రసాదించిన మాస్టారు గారు పూజ్యనీయులు.

ఆయనకు స్వప్నములో సాయి సమర్థులు అగుపించి “నీకు గురువును నేనున్నాను. నీ బాధ్యత నాది” అని ముమ్మారు అన్నారుట. ఆనాటి నుంచి అఖండమైన శాంతి లభించిందని చెబుతారు మాస్టారుగారు.

ఆయనకు తన తనువు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలుసు. అందుకే ముఖ్యమైన భక్తులకు ఉత్తరాలు రాసి రమ్మని చెబుతారు.

1989 ఏప్రిల్‌లో సాయి ధ్యానము చేస్తూ గుండెపోటుతో మరణించారు. మాస్టారు గారి ఆత్మజ్యోతి ఆ సాయి జ్యోతిలో కలిసిపోయింది.

ఆయన శరీరమనంతరము కూడా నమ్మిన భక్తులకు కలలో కనిపించి ఆత్మబోధ చేస్తారని భక్తుల నమ్మకము.

ఆయన బోధ ముఖ్యముగా

“పరిశోధించు – సాధించు

విశ్లేషించు – వివేచించు

పరిశీలించు – విశ్వసించు

శరణు పొందు – సేవించు

శ్రమించు – పంచు

ఆచరించు – బోధించు

ప్రేమించు – క్షమించు” అని.

ఈ సూత్రాలను కనుక గుర్తు పెట్టుకొని సాధన చేస్తే తప్పక ఈ పరమపద సోపాన పఠములో కోరికలన్న సర్పాల బారిన పడకుండా విష్ణు పథమున పయనించవచ్చు!!

అటు వంటి సాయి మాస్టారు ఎక్కిరాల భరధ్వజ వారు అక్కల్కోటలో ఒక నెల రోజులు ఉన్నారని విని నా మనసు పులకరించిపోయింది.

***

అంతరాలయంలో ఉదయం అభిషేకం తర్వాత శుభ్రం చేసే సేవ  నేను చెయ్యవచ్చునని అనుమతి నిచ్చారు ధనుంజయ పూజారి. అది నాకు స్వామి సమర్థ ఇచ్చిన వరంగా నేను భావించాను. నేను అంతరాలయంలోకి వెళ్లి ఆ మండపం అంతా తుడిచి, ఆ ప్రక్కన కూర్చొని జపం, విష్ణు సహస్ర నామం చేశాను. నాకు నా గురువు దర్శనం కావాలని మరింత ప్రార్థన చేశాను. పూజారిగారు నాతో విశేష పూజ చేయించారు. నాకు స్వామి వస్త్రం బహుమతిగా ఇచ్చారు. నేను అక్కడే కూర్చొని గురు చరిత్ర కొంత చదివాను.  భక్తులు ఎక్కువౌతున్నందున అక్కడ్నుంచి బసకు వచ్చేసి, క్రింద హాల్‌లో వారి చిత్రపఠం ముందు నా జపం కానిచ్చాను.

 

సాయంత్రం  వారి అశ్వత్థ వృక్షపు దేవళానికి వెళ్లి, అక్కడ కొంత జపం చేశాను.

ఆ దేవాలయం లో  జనము చాలా ఎక్కువగా వుండి చాలా గొడవగా వుంది. నేను అలవాటుగా ప్రదక్షిణ చేయ్యబోతే నన్ను కర్రతో ఒక్కటి కొట్టారు. చురుకుమన్న దెబ్బకు అటు చూస్తే సెక్యూరిటీ వారు “స్త్రీలకు ప్రవేశం లేదు పో అవతలకు” అని తరిమారు.

“అహా పైన తొడుగు మాత్రమే చూచే వీరికి చెప్పేదేముంది?”

మౌనముగా నేను, నన్ను అనుమతించిన జాగాలో ఉండి కొంత గురుచరిత్ర చదువుకొని, నా జపం సాగించాను.

అక్కడ అంగళ్లలో అన్ని తీర్ధ స్థలాలలో మాదిరే వివిధ వస్తువులు పిల్లల ఆటబొమ్మలు అమ్ముతున్నారు.

నేను మాత్రం ఎప్పటిలా స్థల పురాణం, జీవిత చరిత్ర కోసం వెతుకున్నాను. దొరకలేదు. అక్కడ్నుంచి వచ్చే ముందు నాకు ధనుంజయ పూజారిగారు  ప్రేమతో ఇంగ్లీష్ లో ఉన్న స్వామి చరిత్రని బహుకరించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here