సత్యాన్వేషణ-15

0
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]సా[/dropcap]ధారణముగా వుంది ఆ గది. రెండు బెడ్లు రెండు గిన్నెలు, ప్లేట్లు వున్నాయి. ఆ రోజు నేనసలు ఏమీ తినలేదు. ఈ గోలకు మరింత నీరసపడ్డాను. చివరకు నా లగేజు ఆ గదిలో పెట్టి బయటకొచ్చాను. ముందుగా గంగమ్మ తల్లిని దర్శించాలని నా మనస్సు గోల పెడుతోంది. ఆగలేక ఆ ఆశ్రమము గేటు బయటే వున్న గంగా జననిని దర్శించటానికి వెళ్ళాను. నీరు నీలపురంగులో వుండి, నీలి ముత్యాలలా జలజల ప్రవహిస్తున్నది నది.

గంగానదికి వెళ్ళి ప్రేమ మీర ఆ నీటిని తీసుకు నమస్కరించి తలపై చల్లుకున్నాను. ఆ నీరు చల్లగా వున్నాయి. మెత్తని అమ్మ వడిలా వున్నాయి. ఆ నీటిని కొద్దిగా తీసుకు త్రాగితే మనసులోని దుఃఖము మాయమైనది. ఏ గురువుకై వెతుకుతూ నే తిరుగుతున్నానో, ఏ శక్తి నన్ను వేల మైళ్ళ దురాన్నీ దూదిలా త్రిప్పుతున్నదో ఆ శక్తే నన్ను కాపాడుతుంది. నాకేమిటి భయము, నేను గంగమ్మ వడ్డున వున్నాను. మా అమ్మ వడిలో వున్నాను.

గంగను తాకినప్పుడు, ఆ నీళ్ళల్లో ఆ చల్లదనంలో ఆ స్పర్శలో అమ్మ ప్రేమ గుర్తుకు వస్తోంది. అవును మరి ఆ పరమాత్మలో ఐక్యమైపోయిన అమ్మ, ఆ పరమాత్మ సన్నిధి నుంచి వస్తున్న ఆ గంగమ్మ తల్లితో తన ప్రేమ నాకై పంపి ఉంటుంది. అమ్మ స్పర్శలా వున్న గంగమ్మ వడికి వచ్చేశాను. నాకు తెలియకనే కన్నులలో నీరు….. ఎంతో భావోద్రేకము కలిగింది. ‘అమ్మా, అమ్మా’ అంటూ నా మనసు గొంతెత్తి పిలుస్తున్నది. నా పాదాల వద్ద గంగ చల్లగా తగులుతూ ‘నే వున్నా నీ దగ్గరే’ అని సమాధానమిస్తోంది.

మనసులో గంగమ్మ మీద ఉప్పొంగిన ప్రేమతో కవనము రాసుకున్నాను.

గంగ
వేగంగా
ఉరకంగ
చేరింది పదిలంగ
శివుని పాదముల తాకంగా॥

హరి పాదాల పుట్టిన గంగ
స్వర్గాలు దాటంగ
గంగోత్రిన భువిన తాకంగ
దుమికింది గంగ
పంచ ప్రయాగలను పలకరించిన గంగ
శివుని ధామము చేరి పులకరించింది గంగ॥

భాగీరథుని తపస్సు ఫలితంగ
శివుని శిరసు తాకంగ
మునుముందు కేగంగ
పాతాళపు లోకాల పావనమోనర్చంగ
నమ్మిన భక్తులను పాపములు కడగంగ
పరమ పావని గంగ॥

వేదాలగానాల గంగ సవ్వడులు
సప్తస్వరాలు గంగ గమనాలు
మహఋషుల జపాలు గంగ హాసాలు
పుణ్యక్షేత్రాలు గంగ ఆవాసాలు॥

గంగను కన్న కన్నులే కన్నులు
గంగను పూజించు పూజయే పూజ
గంగలో మునిగిన జన్మమే జన్మ
గంగ పుట్టిన నేలనే స్వర్గమేనేల॥

***

భావోద్రేకాల నడుమ చాలా సేపు గంగ ప్రక్కన వుండిపోయాను. సూర్యుడు పశ్చిమము వైపుకు జారిపోయాడు. గంగ మీద దీపాలు వెలిగాయి. హారతి ఇస్తున్నారు. మధురమైన ఆ ధ్వనులు పులకరింపచేశాయి.

అప్పడు తెలిసింది నాకు ఆకలి. ఆ ఆశ్రమ క్యాంటినుకు వెళ్ళి కొద్దిగా తిని, టీ త్రాగి వచ్చాను. రూముల మధ్యన పెద్ద మర్రి చెట్టు పరమ ప్రశాంతముగా అనిపించింది. ఇంతలో మామయ్య ఫోను చేసి స్వామి వారి ఆశ్రమముకు వెళ్ళమని, నాకు గది ఇస్తారని చెప్పాడు. నేను మరురోజు ఉదయమే వెళ్ళి ఆశ్రమములో నా పెట్టె పెట్టుకొని గంగకు నడిచి వెళ్ళే దారి చూసుకున్నాను. అలా మా స్వామివారి ఆశ్రమానికి, అదే పరమహంస పరివ్రాజక శ్రీ శ్రీ చిన్నజియరు స్వామి వారి “జియరు మఠాని”కి వచ్చి చేరాను.

“దుర్ముఖ్యబ్ధే తులాశుక్ల ప్రథమే స్వాతిభే శుభే।
ప్రాదుర్భూతం గురుం వన్దే శ్రీమన్నారాయణం మునిమ్॥
కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం।
శ్రీమన్నారాయణం వన్దే యతీశ్వర శ్రియా జుషమ్‌॥”
(చిన్నజియరు స్వామి వారి తనియమ్)

స్వామి వారిని తలుచుకొనగానే మనసులో గొప్ప సంతోషము కలుగుతుంది. వారి ప్రేమపూర్వకమైన నవ్వు, కరుణ కలిగిన చూపు మనలను దీవిస్తూ వుంటాయి. ఆయన చుట్టూ వున్న ఆ అద్భుతమైన ఆకర్షణ మనలను వారి పాదాక్రాంతులను చేస్తుంది. మామయ్య స్వామి వారికి అనుంగు భక్తులు. నన్ను చాలా సార్లు వారి దర్శనానికి తీసుకుపోవాలని ప్రయత్నించటమూ, వారున్నప్పుడు నేను వుండలేకపోవటమూ జరిగింది ఒకసారి కాదు చాలాసార్లు.

ఒక సారి విసుగేసి “నీకు వారి దర్శనము గతి లేదే” అనేశాడు. గురువులంటే నాకున్న సహజభక్తికి నేను చాలా ఖేదపడ్డాను. నా ఇష్టదైవమైన సాయినాథుని ప్రార్థించాను. ఆ ఏడు ఇండియా నుంచి వచ్చినప్పుడు అట్లాంటాకు స్వామి వారు వస్తున్న ప్రకటన చూచి నాకు ఆశ్చర్యముతో నోట మాట రాలేదు. వారిని మొదట దర్శించినప్పుడు నా కన్నుల నీరుతో వారి పాదాలమీద వ్రాలిపోయాను.

“నాకోసము నడిచి వచ్చావా స్వామీ” అని నా హృదయము, మనస్సు భక్తితో నిండినది. స్వామికి నా ప్రణామాలు సమర్పించాను. “అలాగే అనుకోండి” అన్నారు స్వామి నవ్వుతూ.

ఇది జరిగి పది సంవత్సరాలు దాటింది. స్వామి మా వూరు వస్తే మాకు మరో ధ్యాస వుండదు. స్వామితో కూడా వెళ్ళటము తప్ప. వారేది చెబితే అది వినటము, స్వామితో కలసి విష్ణు సహస్రనామము చదవటమూ. అదో ఉత్సవము. పరమాత్మ స్వరూపులైన వారు ఎక్కడ వుంటే అక్కడ పండగే. పండగే వారి వెంట సాగుతూ వుంటుంది. స్వామి వారి మఠములో వుండటము కన్నా నాకు క్షేమకరమైనదేమిటి? ఇంక కావలసినదేముంది? బహుశా ఇందుకే నాకు పరమార్థాశ్రమములో ఆశ్రయము దొరకలేదు. నా పరమార్థమిక్కడ వుంటే అక్కడ ఎలా దొరుకుతుంది? నన్ను స్వామి ఆశ్రమానికి చేరవెయ్యటానికి ‘కృష్ణమూర్తి’ అన్న అడ్డు పెట్టారు. ఆయన మాటల ద్వారా నా కర్మను కడిగేశారు పరమాత్మ. ఆరోజు నాకర్థము కాలేదా విషయము. కానీ నేడు ఆలోచిస్తూ వుంటే తరువాతి నా గతిగమనానికీ నేను అప్పుడు రుషికేష్‌లో వున్న దినముల ప్రభావము, స్వామి వారి కరుణ చాలా వుంది.

‘స్వామి మీద ఇంత భక్తి వుంటే మరి గురువు కోసమీ వెతుకులాట ఏమిటీ?’ అని ఎవరికైనా అనిపించవచ్చు. మా మామయ్య కూడా అదే అన్నాడు.

‘స్వామివారు నాకు గురువులైతే మరి నాకు చెప్పాలిగా ఆ విషయము. నా ఆత్మఘోష వారికి తెలియనిది కాదు కదా!’ అని నా సమాధానము.

“నీవు వారికి చెబితే వారు నీకు మార్గము చూపుతారు” అన్నది అత్త.

నా వాదన ‘వారే చెప్పాలి, నేను అడగటేమిటి?’ అని. మామయ్య విసిగి ‘ఏంటో నీ గోల’ అని వదిలేశాడు.

మొత్తానికి రుషికేష్ లోని స్వామి వారి మఠము చేరాను క్షేమముగా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here