[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
చీకటి కాలమది(అజ్ఞానపు!!).
ఏం జరిగిందో తెలియని కాలమది.
గుర్తు తెచ్చుకున్నా కూడా మదిలో లేని కాలమది.
కాలం కత్తి కట్టి నిలబడితే,
ప్రతిదీ ఎదురు తిరుగుతుంది.
వేధించే కాలం కఠినంగా ఉంటుంది…
కళ్ళు కన్నీటి కొలనులై
మనసులో వేదన అధికమై
జీవితం భారమై….
బ్రతుకు దుర్భలమౌతుంది.
కాలం వైద్యుడంటారు…. కానీ,
కలిసిరాని కాలంలో… కష్టంలా
సమస్తం కాష్టంలా మారుతున్న సమయమది.
“ఏతావానేన సంసార
ఇదమస్త్వితి యన్మనః” (యోగవాసిష్టము)
(ఇది కావాలి అన్న ఆలోచనే సంసారము. దుఃఖకారణము)
కాలము కదులుతున్నా నాకు మటుకు స్తంభించే వుండేది. నేను మాటలు మరిచాను. మిత్రులు కలవమన్నా కలవలేదు. నేను చేసే జాబు మానేశా. తిన్నానో లేదో తెలియదు.
ఎప్పుడూ మా సోఫాలో పడుకొని వుండేదాన్ని. అదొక్కటే గుర్తు.
శ్రీవారు డాక్టర్ల చుట్టూ తిప్పాడు. వాళ్ళు మందులు ఇస్తే, నిద్ర మందుతో ఎప్పుడూ పడుకోవటమే.
ఏం ఆలోచించేదాన్నో తెలియదు. ఒక పిచ్చిలో వుండటమే ఎప్పుడూ.
కౌన్సిలింగుకు వెళ్ళమని తమ్ముడు చెప్పాడు. వాడు పాపం రెండు తద్దినాలతో తంటాలు పడేవాడు.
మా అక్క ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేసేది. తాను నాకో హీలర్ ను పరిచయం చేసింది. ఆయన చాల మర్యాదగా మాట్లాడేవారు. కానీ ఎన్ని నెలలైనా తగ్గని నా ఉధృతమైన కన్నీటికి చాలా చిరాకుపడేవారు.
“ఎన్నిరోజులు ఏడుస్తారు? పోయినవారు తిరిగిరారు” అన్నారు ఒకనాడు ఆయన చిరాకుతో.
“ఎన్ని రోజులైతే మీరు ఏడుపు మానుతారు?” అన్నాడు తిరిగి నాతో .
“ఎన్ని రోజులైతే చచ్చినవారికి మర్యాద ఇచ్చినట్లు? ఎలా చెబుతారు మీరలా? నా దుఃఖం మీకెందుకర్థమౌతుంది?” అన్నాను నేను మరింత దుఃఖంగా. మిన్నుకున్నారాయన.
అలా నాకు తీరని దుఃఖం నా జీవితాన్ని ముంచెత్తిన సమయమది.
ఆ రోజులలో ఒక అరమైలు నడవటము నాకు అతి పెద్ద ఛాలెంజుగా వుండేది.
మా డాక్టరు మాత్రం చాలా ఎంకరేజింగుగా మాట్లాడేది. నిద్రకు ప్రాముఖ్యతనివ్వమని ఏదో ఒక పనిని చేస్తూ ఉండమని ఆమె నాకు సలహా చెప్పేది.
ఆ సలహాతో నేను స్థానిక తెలుగు సంస్థలో రాత్రి పగలు పని చేస్తూ, అన్నీ మరిచిపోయే ప్రయత్నం చేసేదాన్ని.
అయినా నామీద నాకు విపరీతమైన కోపము, ప్రపంచములోని అన్యాయమంతా నాకే జరిగిందని నమ్మకంతో కూడిన ఒక పిచ్చిలో వుండేదాన్ని.
నేను వెంటనే వచ్చేశాను కాబట్టి తేరుకోలేదని, మిగిలిన వారు బానే వున్నారని మా చుట్టాలంటూ వుండేవారు. హైద్రాబాదు మళ్ళీ వెళ్ళాలనిపించక చాలా సంవత్సరాలు వెళ్ళలేదు అమ్మపోయాక.
పుస్తకాలు చదవటం నాకు చిన్నప్పట్టి నుంచి చాలా అలవాటు. దానికి తోడు బుక్స్ కొని దాచుకునే అలవాటు కూడా ఎక్కువగా వుండేది మొదటినుంచి. అందుచేత నాకు చాలా హాస్యపుస్తకాలు, నవలలు పంపారు హైద్రాబాదు నుంచి నా మిత్రులు. అలాగైనా నేను మళ్ళీ మాములు మనిషిని కావాలని. అలా నేను మళ్ళీ చదవటము మొదలెట్టాను.
తెలుగులో సరదాగా చదివే నవలలతో పాటూ ఒక చిన్న పుస్తకము చదివాను అలాంటి గాఢమైన చీకటి రోజులలో. ఆ బుక్ నా జీవితాన్ని మరోవైపుకు మార్చింది. నన్నుతిరిగి మనిషిగా మారటానికి కారణమైంది.
అది -“శ్రీ రమణ మహర్షి : వారి ఉపదేశము – పాల్ బ్రంటన్”.
పాల్ బ్రంటను గురించి నాకు తెలియకనే ఒక రకమైన ఉత్సుకత కలిగింది. ఆయన గురించి తెలుసుకోవాలని ఒక బలమైన కోరిక. చాలా కాలము తరువాత మళ్ళీ నాలో చిన్న కదిలిక. బ్రంటను రాసిన “My Search in Secret India” లో, ఆయన రమణాశ్రమములో వున్న కాలానికి సంబంధించిన భాగమది. నాకు పూర్తి బుక్ “My search in India” చదవాలనీ, ఆయన ఏం చెప్పాడో అన్న ఆలోచనతో, ఆ బుక్ కోసం వెతికితే అమేజానులో దొరికిందది. చేతులకు ఆ పుస్తకము అంటుకు పొయ్యింది అనటము అతిశయోక్తి కాదు. మనం కొన్ని సార్లు మాత్రమే అలాంటి అద్భుతమైనవి చదుతాము.
పాల్ బ్రంటను ఒక బ్రిటీషు పౌరుడు. ఒక రకముగా వారి మతములో యోగి వంటి వాడు. దైవము అంటే ప్రేమ, గురువంటే భక్తితో వున్న ఆయనకు కొన్ని ప్రశ్నలు వుంటాయి. వాటి సమాధానము కోసము ప్రపంచములో నలుమూలలా తిరుగుతూ వుండేవాడు. ఆ వెతుకులాటలో ఆయన చాలా దేశాలు తిరిగి, తిరిగి చిట్టచివరకు ఆధ్యాత్మికతకు పుట్టినిలైన భారతావనికి వస్తాడు. ఎందరినో గురువులనూ, యోగులను కలుస్తాడు కాని తృప్తి కలగదు. ఎవ్వరూ ఆయన హృదయము లోపల కదలికనివ్వలేరు. చివరగా మద్రాసు లోని మిత్రుడు రమ్మంటే వెళ్ళాడు. ఆ ఎడిటరు మిత్రుడు బ్రంటన్ను కంచి మఠాధిపతి, నడిచేదేవుడు అయిన పరమాచార్య మహా పెరియవా వద్దకు తీసుకుపోతాడు. మహాపెరియవాను చూచి బ్రంటన్ చాలా కదిలిపోతాడు. తనకు ఎలాగైనా “సత్య దర్శనము” కలిగించమని ప్రార్థిస్తాడు.
పెరియవా, బ్రంటన్ లోని తపనను చూచి ఆయనకు గురువు కాతగ్గవారు రమణులని, అరుణాచలము వెళ్ళమని సలహా ఇస్తారు. తనకు వున్న మఠ నిర్వహణతో సమయము చాలదని కూడా చెబుతారు మహాస్వామి.
చెన్నై తిరిగి వెళ్ళిన బ్రంటను తిరిగి ప్రయాణమవుదామని తలుస్తాడు. ఆయన అప్పటికే ఎన్నో చోట్లు తిరిగి వుండటము వలన, వాతావరణం పడకపోవటము వలన, ఆహారము పడక చాలా జబ్బుగా వుంటాడు.
“ఇక తిరగలేను ఇంటికి పోవాలి” అనుకుంటాడు బ్రంటను.
ఆ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు ఆయన మంచం ప్రక్కనే మహాస్వామి స్పష్టంగా కనిపించి “అరుణాచలము వెళ్ళ”మని చెప్పి అదృశ్యమవుతారు.
బ్రంటను ఆ ఉదయము మిత్రునితో మరల కంచికి వెళ్ళి మహాస్వామిని దర్శిస్తాడు.
స్వామి “నేను వచ్చినది నిజం, స్పష్టంగా చెప్పానుగా… అరణాచలము వెళ్ళు” అంటూ ధ్రువీకరిస్తారు.
ఇక బ్రంటను ఆయన మాట మీద నమ్మకముతో అరుణాచలము బయలుచేరుతాడు.
***
శ్లో॥ “మహర్షిం రమణం నత్వా కార్తికేయం నరాకృతిం।
మతం తస్య ప్రసన్నేన గ్రంథే నోసనిబధ్యతే॥” శ్రీ రమణగీత. (గణపతిముని)
తాత్పర్యం: మనుష్య రూపము దాల్చిన కుమారస్వామి యగు రమణమహర్షి కి నమస్కారములు.
అరుణాచలము వెళ్ళి భగవాను రమణ మహర్షిని దర్శించి బ్రంటనే కాదు యావత్ పశ్చిమ ప్రపంచము, భారతదేశము కూడా తరించాయి. అది ఎట్లంటే, అప్పటి వరకూ భారతదేశములో మహర్షి గురించి తెలిసినది చాలా తక్కువ. “ఆయన బాహ్య స్పందనలకతీతుడు….. అంతటి ఆధ్యాత్మిక మహిమ ప్రత్యక్షముగా ఆయనను చుట్టి వుండగా ఆయన అతి నిరాడంబరముగా వినయముతో అతి సామాన్యుని వలెనే వ్యవహరించేవారు. సిద్ధులను కాని మహిమలను కాని ప్రదర్శించి, వాటి యందు ప్రీతి గల తన దేశపువారిని ఆకట్టుకోవాలని ఆయన ఏ మాత్రం ప్రయత్నించరు. తన ఘనతను ప్రకటించాలని ఏ మాత్రం ప్రయత్నించరు. తన జీవిత కాలములో తనను మహాత్మునిగ ప్రకటించాలని చెయ్యబడిన ప్రయత్నాలను ఆయన ఎంత మాత్రము ఆమోదింపలేదు” అంటారు బ్రంటను. అటువంటి మహర్షిని ప్రపంచానికి పరిచయము చేసిన ఘనత బ్రంటను మహాశయునికే ఇవ్వాలి. బ్రంటను, ‘మహర్షి’ గురించి వ్రాసిన వ్యాస పరంపరలు ఎందరో పశ్చిమదేశ సత్యాన్వేషులను అరుణాచలం వైపు నడిపించాయి. స్వదేశీయులలో ఉత్సుకతను కలిగించాయి.
భగవాను గురించి చదువుతూ వుంటే ఎంతో హాయిని పొందుతామన్నది నిజము.
మిగిలిని విషయాల మీద ఆలోచనలు పోవు. రమణుల మీదనే మనసు నిలబడుతుంది.
బ్రంటను మహాశయుని పుస్తకములానే మనలను ఆకర్శించే మరో పుస్తకము “ఒక యోగి ఆత్మ కథ”.
ఆ పుస్తకము నేను కొంత కాలము క్రిందట చదివాను. దానికీ బ్రంటను పుస్తకానికీ పోలిక అనిపించింది.
అవును సద్గరువుకై వెతికే ఆత్మసంవేదనంతా ఒకటే కదా!
పుస్తకము కొంత మస్తికమునకు ఊరట నిచ్చినా, దేని మీద మనసు నిలబడలేదు. అన్నీంటి మీద చిరాకు కోపము పోలేదు నాకు. ఇలాంటప్పుడు వైరాగ్యము కలుగుతుందట.
“న వైరాగ్యోత్పరో బంధుః
న సంసారాత్పరో రిపుః” (యోగవాసిష్టము. పూ.స. 127. శ్లో.59)
వైరాగ్యాని మించిన బంధువు లేదు. సంసారము మించిన శత్రువు లేదు.
అసలు ఈ “నేను” ఎవరు? ఎందుకు వచ్చానిక్కడికి. అమ్మా, నాన్నాలను ఎందుకు కోల్పోయాను? దీని వెనక గల భగవంతుని ప్లాను ఏంటి? నే చేసిన పాపము ఏమిటి?
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్స చ।
తస్మాతపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి॥” (భ.గీ.2 – 27)
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వారికి జననము తప్పదు. అపరిహర్యమైన ఈ విషయమునకు శోకింప తగదు।
ఇలా గీతలో చెప్పినా నాకెందుకు అర్థము కావటము లేదు. ప్రతిదానికీ ఒక ప్లాను వుంటే, నే ఈ భూమి మీద జన్మించటానికి కారణమేమిటి? ఆ విషయము తెలిస్తే ఆ పని చేసేయ్యవచ్చు. కాని నాకేమీ తెలియటము లేదు. అజ్ఞానమైన ధుఃఖము వదలటములేదు. నా గురించి నేను తెలుసుకోవటమెలా?
“నేను” అన్నదేమిటి? ఆత్మ అన్నదేమిటి?
***
నాయమాత్మా ప్రవచనే నలభ్యో
న మేధయా న బహూ నాశ్రుతేన।
యమేవైష వృణుతే తేన లభ్య
స్తస్సైష ఆత్మా వివృణుతే తనూస్వాం॥” (కఠోపనిషత్)
వేదపఠనము వల్ల కాని, మేధోసంపద వల్ల గాని, పవిత్ర గంథ్రాలు చదవటము వల్ల కాని, పాండిత్యము వల్ల గాని ఆత్మ స్వరూపము తెలియదు.
ఆత్మ కోసము అన్వేషించే వారికి మాత్రమే ‘ఆత్మ’ దర్శనమవుతుంది. ధ్యానులకు, తాపసులకు, యోగులకు మాత్రమే ఆత్మ రూపము ఎరుకపడుతుంది.
‘నేను’ తెలుసుకోవటము ‘జ్ఞానము’.
అంత వరకూ వున్నది ‘అజ్ఞానము’.
‘నేను’ ఎవరో తెలుసుకోవాలనుకోవటము జిజ్ఞాస.
శరీరము ‘నేను’ కాదని గ్రహింపు కొంత విచారణ వలన కలుగుతుంది.
లేదా దైవ అనుగ్రహం వల్లనో, గురు కృప వల్లనో కలుగుతుంది.
అలా కలిగిన ఆ తపనతో తపించి పోయే జీవి పడే ప్రస్థాన క్రమము మొదలయ్యేది వైరాగ్యముతోనే.
వైరాగ్యమంటే “రాగము” లేకపోవటమే. ఏ విషయమైనా అది సత్యమునకు దారి చూపకపోతే దాని గురించి చింత పెట్టకపోవటము.
నాకు కలిగిన అతి పెద్ధ దెబ్బనుంచి నేను కొలుకోలేకపోయానన్నది నిజం. బయటకు ఎన్ని జరుగుతున్నా నా మనసు మాత్రం ప్రగాఢ చీకటిలో మునిగి వుండేది.
నాకెందుకిలా అయ్యిందో తెలియాలన్న కోరిక పెరిగింది.
పైపెచ్చు నన్ను ఓదార్చేవారు, “ అమ్మా, నాన్నలది చాలా మంచి ‘చావ’ ని పొగిడేవారు. అది మరింత కష్టంగా వుండేది.
అమ్మ మరణించిన ఐదవరోజు మేము ప్రయాగ బయలుచేరాము. రైలులో వెళ్ళి మళ్ళీ అదే రోజు తిరిగి వచ్చెయ్యాలి.
మొత్తం మూడురోజులు మా ప్రయాణము. గంగలో కలపాలంటే, ప్రయాగ వెళ్ళమన్నారు. నలుగురము, అక్కా తమ్మళ్ళము బయలుచేరాము మా, మా పిల్లలతో.
దారిలో తమ్ముడు ఎటో వెళ్ళి వచ్చాడు.
రైలు స్టేషనులోకి ఒక కుండతో వస్తుంటే “ఏంటదని” అడిగాను.
అక్కయ్య చెప్పింది “ అమ్మ అస్తికలు” అని.
ఆ మాట నాకు శరాఘాతంలా తగిలింది.
గుండెలపై ఒక పెద్ద గుదిబండ పడేసినట్లుగా అనిపించింది.
అమ్మ ఆకారము, ఆమె కదలికలూ కళ్ళ ముందు నుంచి జారి అమ్మంటే ఈ “కుండ” మెదలటముతో అసలు జీర్ణించుకోలేకపోయాను.
అసలు ఈ జనన మరణ చట్రం ఏంటి? ఏం సాధించటానికి?
మనమంతా చివరకు కావలసినది బూడిదే కదా! దేని కోసమీ ఆత్రుత?
మరణము దేనికి సమాధానము?
(సశేషం)