సత్యాన్వేషణ-20

1
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]నే[/dropcap]ను ఇలా దేవ ప్రయాగ వెడుతున్నట్లుగా, భోజనానికి రాలేనని మఠములోని అర్చకస్వామికి చెప్పి ఉదయము బయటకొచ్చాను. టూరిస్టు ఆఫీసుకొచ్చే సరికే పది దాటింది. నన్ను తీసుకుపోవలసిన ఆవిడ రాలేదు. ఆవిడకు ఎదో సమస్య వచ్చిందని చెప్పాడు గైడు. నాకు అభ్యంతరము లేకపోతే మరో గైడును పంపగలనని చెప్పాడతను. సరే అన్నాను. ఒక డిగ్రీ చదివే పిల్లాడ్ని పట్టుకొచ్చాడు. వాడికి ఇలా గైడులా వెళ్ళటము పార్టుటైం జాబు అట. సరే పదమన్నాను. నాకు ఒక హెల్మెటు ఇచ్చారు. నా దగ్గర చలికి తగ్గ వస్త్రాలు లేవు. నా వద్ద వున్నవి నేను లేయర్సులా వేసుకొచ్చాను. చలి దేశములో మందపాటి వాటి కన్నా ఇలా లైయర్స్‌గా ఒకదాని మీద ఒకటి వస్త్రాలను ధరిస్తే ఎక్కువ ఫలితముంటుంది. నేను రుషీకేష్‌లో ఆ సమయములో అంత చలిగా వుంటుందని అనుకోలేదు. పైపెచ్చు టూవీలరు పై కాబట్టి మరికొంత జాగ్రత్త అవసరమైయ్యింది.

“గంగామాత దేవాలయము చుశారా దీది?” అడిగాడు గైడు.

“లేదు” చెప్పాను.

“సరే ముందు అక్కడికెడదాము” అని గంగామాత దేవాలయానికి తీసుకువెళ్ళాడు. అది గంగానది ప్రక్కన కొండపైన వుంది. ‘మకరవాహినీ గంగా మందిర్’ అని పిలుస్తారు. గంగా మాత మొసలినెక్కి వుంటుందక్కడ. నల్లరాయి విగ్రహము. కళగా వున్న గంగమ్మతల్లి మొఖము చూసేవారికి భక్తిని కలిగిస్తుంది.

ప్రక్కనే మహాదేవుని గుడి కూడా వుంది. చల్లిటి గంగపై నుంచే వచ్చే గాలితో ఆహ్లదకరమైన ఉదయము. ఎండ వెచ్చదన్నానిస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో గంగమ్మ తల్లిని ప్రార్థన చేసుకున్నాను.

“రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతికలాపమ్।

త్రిభువన సారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే॥” (గంగా స్తోత్త్రము. ఆదిశంకరవిరచితం)

అమ్మా భగవతి! నా రోగ, శోక, తాప, పాప, దుర్వర్తనాలను పరిహరించు. నీవు త్రిభువనాల సారానివి. ఈ భూమాత హారానివి. ఓ దేవీ! ఈ సంసారములో నాకు నిశ్చలగతివి నీవు మాత్రమే.

దేవప్రయాగ రుషీకేష్ వద్ద నుంచి డెభై ఏడు కిలోమీటర్లు ఎగువకు వుంటుంది. ఆ దారి ఒక వైపు ఎత్తైన పర్వతము, మరో వైపు లోయ. లోయలో గలగల ప్రవహిస్తున్న గంగానది. పర్వతము పైపైకి రోడ్డు వెళ్ళే కొద్దీ నది మనకు సన్నగా, చిన్నగా, అయినట్లు కనపడుతుంది. నిజానికి అది నిజము కాదు. మనము పర్వతము పైపైకి వెడతాము. అందుకే నది చిన్నగా కనపడుతుంది.

అక్కడ ఆ నది రంగు పాలపిట్ట నీలము. ఆ ప్రవాహములో వంపులు, కొండల మధ్యగా తిరుగుతూ సాగుతుంటే సామాన్యులకు కూడా కవిత్వమొస్తుంది, భోజరాజును చూసిన సామాన్యులలా. (భోజరాజును చూసిన ప్రతివారు కవిత్వము చెప్పేవారని నానుడి) నాకు గంగమ్మ పర్వతాలను చుట్టి తిరగటము చూసినప్పుడు విశ్వనాథవారి కిన్నెరసాని గుర్తుకువచ్చింది. కిన్నెరసాని నదిగా మారి కొండచుట్టూ తిరుగుతుందట. మరి మన విశ్వనాథవారు ఇక్కడి గంగను చూస్తే ఏమనేవారో కదా!

ఒక కొండ చుట్టూ నది తిరగటము మనకు శివుని మెడలో సర్పమా అన్నట్లుగా వుంది. గంగాదేవి సౌందర్యము ఈ దేశ కవులకు జలతారు శాలువే కదా. అందుకే గంగను పొగడని కవి లేడు భారతావనిలో. ఆ నది అందము అమ్మవారి చిరునవ్వులా వుందని చెబుతాడో కవి. అమ్మవారి నవ్వు చిరు మొలకలా వుంటుందట. అలానే ఆ నది చూడటానికి చిన్నగా పైనుండి కనిపిస్తూ మెరుస్తూ వుంటుంది. అంత స్వచ్ఛమైన రంగు మనము మళ్ళీ ఎక్కడా చూడము. ఏ కల్మషము అంటక స్వచ్ఛముగా, పసిపాప నవ్వులా పారిజాతపూల జడలావుంది. వానకాలములో నది నీరు కొంత మట్టిని తెస్తూ మట్టి రంగులో వుంటుంది. కేవలము శీతాకాలపు నది ఇది. పింఛం విప్పని నెమలిలా వుంది. నది మీద ఎండ పడి వజ్ర సమానముగా మెరువులు మెరుస్తున్నది. చూస్తున్నకొద్ది అమృతం త్రాగుతున్నాయి కళ్ళు ఆ అందాన్నీ చూసి అనిపించింది. ఆహ్లాదకరమైన అందమైన రోడ్డు ప్రయాణాలలో నాకు తెలిసి ఇప్పటి వరకూ అద్భుతమైనది మాత్రము ఈ మార్గమే సుమా! మనకు అమెరికా దేశములో క్యాలిపోర్నియా రాష్ట్ర రోడ్డు నెంబరు ఒకటి అందమైనదంటారు. ఒక వైపు కొండలతో మరో వైపు సముద్రముతో. కానీ ఆ రోడ్డు కూడా ఈ గంగా నది ప్రక్కన వెడుతున్న దారికి సమము కాదు. అంతటి అద్బుతమైన ప్రయాణమిది.

నెమ్మదిగా మూడు గంటల తరువాత మేము దేవప్రయాగ వూరు దగ్గరకు చేరాము.

భగీరధి నదీ, అలకనందా నదితో కలిసిన ఈ సంగమ దేవప్రయాగ అత్యంత పవిత్రమైనది, సుందరమైనది కూడా. పంచప్రయాగలలో చివరిది. అలకనందా నది మనా గ్రామము పైనుంచి వస్తుంది. అక్కడే మరో నది అయిన సరస్వతీ నది కూడా జన్మిస్తుంది. ఆ సరస్వతీ నది, అలకనందా మొదట సనకసనందన ఋషి వాటికలో కలుస్తాయి. అది మొదటి సంగమము. రుద్ర ప్రయాగ, కర్ణ ప్రయాగ, నంద ప్రయాగ, విష్ణు ప్రయాగలలో మరో ఉప నదులను కలుస్తూ అలకనంద ప్రయాణిస్తుంది.

దేవప్రయాగలో భగీరథిని కలిసిన అలకనంద తన ఉనికిని భగీరథిలో కలిపేసుకుంటుంది. ఆ రెండూ కూడా తమతమ ఉనికి కోల్పోయి గంగామాతగా పేరు మార్చుకు ముందుకు సాగుతాయి. అలా ‘గంగా నది’ అన్న నామము దేవప్రయాగ నుంచి ఈ నదికి మొదలవుతుంది. అటు తరువాత కూడా ఎన్నో ఉపనదులు కలిసినా గంగానదికి పేరు మారదు. అందుకే దేవ ప్రయాగ ఎంతో ప్రముఖ్యమైన నదీ సంగమము.

ఇక్కడ నదులు రెండు, రెండ రకాలైన నీలి రంగులో వుంటాయి. ఒకటి నీలి నీలము, మరోటి ఆకుపచ్చ నీలము. అవి వచ్చి కలిసినప్పుడు, కొంత రంగులు అటూఇటూగా సాగి ఒక వందగజాల తరువాత నెమ్మదిగా ఒక రంగులో మారటము చూడటానికి చాలా బావుంటుంది. దేవఋషి తపస్సు చేసిన ప్రదేశమని దేవప్రయాగ అని పేరొచ్చినది. ప్రయాగ అంటే సంగమము.

మూడు శిఖరాల మీదకు వ్యాపించి వున్న చిన్న వూరు ఈ దేవప్రయాగ. ఒక శిఖరము మీద నుంచి మరో వైపుకు వెళ్ళటానికి చిన్న వుయ్యాల వంతెనలు వున్నాయి. మేము ఆగిన రోడ్డు నుండి క్రిందకు వచ్చాము. అక్కడ వెళ్ళటానికి మెట్ల మార్గము తప్ప మరో దారి లేదు. మెట్ల మీదుగా క్రిందిగి దిగి, వంతెన మీదుగా మరో వైపుకు వెళ్ళి మరిన్ని మెట్లు దిగి నదీ సంగమము చేరాము. ఆ సంగమము మధ్యగా వుంది అందుకే అక్కడ రెండు నదులను మనము తాకవచ్చు. సంగమములో దిగి, ఆ నీటిని ప్రోక్షణ చేసి, గంగకు రోజూ చేసే పూజ చేసుకున్నాను. మరి నేను ఉదయము రోజూవారి నదీమతల్లికి చేసే పూజ పూర్తి చెయ్యలేదుగా.

“అలకానన్దే పరమానన్దే కురు కరుణామయి కాతరవన్ద్యే।

తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుణ్ఠే తస్య నివాసః॥” (గంగాస్తోత్త్రము, ఆది శంకర విరచితము)

ఆర్తత్రాయ పరాయణి గంగామాత! స్వర్గానికే ఆనందాన్ని ప్రసాదించే పరమానందమయీ నన్ను కరుణించు. ఓ మాతా! నీ ప్రవాహతీరాన నివసించుట వైకుంఠవాసానికి సమానమైనది.

నే తరువాత గట్టున చేరి నా ఆసనము వేసుకు జపము మొదలెట్టాను. రుషీకేషుకు వచ్చేముందు హైద్రాబాదులోనే ఆసనము కొనుక్కున్నాను. నా గైడు ఓపికగా, దూరముగా వుండి నా జపము అయ్యే వరకూ ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నేను ఒక గంట తరువాత లెచ్చి అక్కడ వున్న ఒక బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చాను.

అక్కడి బ్రాహ్మలను పండాలంటారు. ఈ పండాలందరు బదిరిలో వుంటారుట ఆరునెలలు. ఆరునెలలు బదిరి మూసివేసినప్పుడు వారంత అక్కడినుంచి దేవప్రయాగ వస్తారు. వారంత కృష్ణయజుర్వేద బ్రాహ్మలు, పూర్వము ఆదిశంకరులతో కలసి పూర్వమే వచ్చి వుండిపోయారుట. సంవత్సరములో ఒక్క నెల మాత్రమే వారి సొంతవూరు వెళ్ళివస్తారట. యాత్రలకు వచ్చే వారు వీరిలో ఎవరో ఒకరినో ఇద్దరినో తీసుకు చార్‌ధామ్ యాత్ర చేస్తారు. అన్నీ దగ్గరుండి చూపించి అందరిచే పితృకార్యాలు చెయ్యించటము, ఇత్యాది వాటిలో వీరి పాత్ర చాలా ముఖ్యమైనదే.

భక్తులు బాగా వచ్చే నెలల్లో పర్వాలేదు కానీ, ఇలాంటి డ్రై నెలలో కొద్దిగా వారికి ఇబ్బందిగానే వుంటుందని, వచ్చిన నాలాంటి ఒక్కయాత్రికులనూ వదలరనీ చెప్పాడు మా గైడు. ఒక్కరికి దక్షణ ఇవ్వగానే చాలామంది వచ్చేశారు ఎక్కడ నుంచో మరి. నా చుట్టూ అందరూ మూగారు. నేను నా దగ్గర వున్న క్యాష్‌ను మొత్తము పంచేశాను. ఇంక ఏమీ మిగుల్చుకోలేదు. గైడు వద్దకొచ్చి ‘చలో’ అంటే అతను తల వూపాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here