[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]అ[/dropcap]తను పండాల గురించి చెబుతూ కొంచము చీత్కారముగా మాట్లాడాడు. నా మనసుకు కష్టం వేసింది. అతనితో అలా అనవద్దన్నాను. స్వజాతి అభిమానము ఇంకా నా మనసు మూలలో పట్టుకు వదలటములేదుగా దేవుడా. కాని… పేదరికము ఏమైనా చేయిస్తుంది. అయినా బిక్షమెత్తటము అహమును చంపటము కోసమే కదా. బ్రాహ్మలైన వారు భక్తుల ముందు చేతులు చాచటములో అహం నిర్మూలన వున్నదా???
వున్నదనే అనుకోవాలి. అహం తల ఎత్తకుండా సిక్కు మిత్రులు గురుద్వారాలలో చెప్పులు తుడుస్తారు. సన్యాసులకు అహం నిర్మూలము కోసమే ఏమీ వుంచుకోకుండా జీవించాలి. అదే సిద్ధాంతాలతో బ్రహ్మణీకము పాట్టించే విప్రులు సదా కడు పేదరికములో పరమాత్మకు అనుసంధానము చేసుకు బ్రతుకుతుంటారు. యోగసాధన అహం నిర్మూలను మంచి ఉపకరము. సాధకులు ముందు చెయ్యవలసినది అహం విడవటమే.
“మనోబుద్ధిరహంకార చిత్తం” అంతఃకరణాలను నిరోధించమని యోగం చెబుతుందికదా.
“భోగౌఘ వాసనాం త్యక్త్వాత్యజ భేదవాసనామ్।
భావాభావౌ తతస్త్వక్త్వా నిర్వకల్ప స్సుఖీభవ॥” (యోగవాశిష్ఠము. ఉ.ప్ర. స. 112 శ్లో 23)
భోగాలను విడిచి భేదాలను ఆలోచనలను విడిచిన వారికి అవిద్య నాశనము జరుగుతుంది.
సంగమము నుంచి మెట్లు ఎక్కుతూ గిద్దాంచల పర్వత శికరము వరకూ వచ్చాము. అక్కడే ప్రఖ్యాత రఘునాథుని దేవాలయము వుంది. దేవాలయము ఒక ఇల్లులా వుంది. ప్రతి చిన్న గదిలో ఒక దేవతామూర్తి వున్నది.
“రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ, నాథాయ, సీతాయాః పతయే నమః”
అలా ఆ దేవాలయము చుట్టూ తిరిగి చూసి దర్శనము చేసుకొని ఒక చెట్టు క్రింద కూర్చున్నాము. మా గైడు అడిగాడు నన్ను “మీకింత భక్తి చిన్నప్పటి నుంచి వుందా? అంత సేపు ధ్యానము చేస్తున్నారు” అని.
నేను చిన్న నవ్వు నవ్వి వూరుకున్నా.
“జ్యోషిమఠ్ చూశారా?” అడిగాడు అతను.
“లేదు. ఏముంది అక్కడ?” ప్రశ్నించాను.
“శంకరమఠ్ మరియు కల్పవృక్షము” అన్నాడు. నేను రెట్టించలేదు.
”ఇక్కడ ప్లానిటోరియం వుంది వెడదామా?” అడిగాడు.
“వద్దులే పద. వెనకకు” అంటూ నడిచాను.
***
మేము మళ్ళీ మెట్లు దిగి వుయ్యాల వూగుతున్న వంతెన మీదుగా శాంతిబజారు వైపుకు వచ్చాము. ఆ రోడ్డులో మనకు ఇప్పుడు చాలా సస్పెన్షను వంతెనలు కనపడుతాయి. మొట్టమొదటిది ‘లక్ష్మణా ఝూలా’ కాబట్టి దానికి ఎంతో పేరు వచ్చి ఒక గుర్తింపు వచ్చి వర్ధిల్లుతోంది. హిమాలయాపు పల్లెలలో అంతా కాలి నడకనే. మెట్లు ఎక్కటము దిగటము. మొదటసారి మనకు చాలా కష్టము, కాని మనమక్కడే వుండి కొంత అలవాటు చేసుకుంటే మనమూ అలా వుండవచ్చని అనిపించింది. కానీ పెద్దవారు, వృద్ధులకూ ఎంత కష్టమో కదూ. ఎలా వుంటారో వారు పాపం.
వారింత లోపలకి వచ్చి నివసించటానికి కారణమేమిటా యని నాకు ఎంత ఆలోచించినా అర్థము కాలేదు. కేవలము సాంప్రదాయక జీవన విధానము కూడిన ఆయుర్వేదముతో వారు జీవితాన్నీ సాగిస్తారు. అందునా వారు ఆ ప్రదేశాన్ని పరమ భక్తిగా పూజిస్తారు. అక్కడ వుండటము కేవలము వారి పూర్వ జన్మలలో చేసిన సత్కర్మల వలన అన్న భావము కూడా కనపడుతుంది. వారంతా ఎంతో భక్తితో వుంటారు. నుదుట బొట్టు లేని పురుషులనునే చూడలేదు గార్వాల్ హిమాలయాలలో అంటే అతిశయోక్తి కాదు. చాలా సాధారణమైన జీవితము గడిపే వారిని చాలా మటుకు ఆధునిక హంగుల పొంగులు అంతగా అంటక పోవటానికి కారణము కేవలము వారికి సనాతన ధర్మము మీద వున్న శ్రద్ధగా నాకనిపించింది. వారికి స్వామి రామా ఒక ఉచిత ఆసుపత్రి కట్టి ఆరోగ్యముపై దృష్టి చూపే వరకూ వారిని పట్టించుకున్న ప్రభుత్వము లేదు. అక్కడ వారిని బ్రిటీషు వారు అంటలేదని గర్వముగా చెబుతారు. వారికి సర్వస్వతంత్రభావన కూడా ఎక్కవ. కష్ట జీవులా ప్రజలు.
మేము వచ్చి తిరిగి మా బండి ఎక్కి వెనకకు మరలినప్పుడు అ గైడు కుర్రాడు “భోం చేద్దామా?” అని అడిగాడు.
“సరే” అంటూ తలాడించాను.
వెనకకు వచ్చే దారిలో చిన్న దాబా వంటి దాని వద్ద ఆపాడు అతను బండిని. ఆ చిన్న హోటలు పరిశుభ్రంగా వుంది. ఆ రెస్టారెంటు కొండ పైన అంచున వుండి క్రింద గంగ కనపడుతోంది. ఎంత అద్భుతమైన లోకేషన్లో కట్టారో యని ఆశ్చర్యపోయాను. రొట్టెలు, రెండు రకాల కూరలు తప్ప ఏమీ దొరకటం లేదక్కడ. ‘లే’ చిప్స్, ప్లాస్టికు వాటరు బాటిల్స్ మాత్రము విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. రెండు రొట్టెలు తిని బయలు చేరాము. దారిలో ఎందరో సాధువులు నడుస్తూ పోతూ వున్నారు. అక్కడ ఆధ్యాత్మకత గాలిలో వుంటుందనుకుంటా. అందుకే ఈ పర్వతాలు ప్రపంచ ఆధ్యాత్మకతకు మూలవిరాట్‌లా వెలుగుతున్నాయి.
హిమాలయ గుహలలో ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ భౌతికమైన ప్రపంచాన్ని తలదన్నిన సాధువులు ఎందరో వున్నారని కథనాలు వింటూ వుంటాము. మన భారతీయ సైనికులు చెప్పే కథలని ఎన్నో ప్రచారములో కూడా వున్నాయి మనకు.
సిద్ధాశ్రమము అలాంటిదే. సిద్ధభూమికలు వున్నందునే హిమాలయాలు ఎంతో శక్తి కేంద్రముగా వర్దిలుతున్నాయి. బ్రంటెను మహశయుడు చెప్పినట్లుగా “బ్రిటీషువారు ఓడలలో భారతీయ సంపదను తరలించారు కానీ, వారు తరలించలేనిది భారతీయ ఆధ్యత్మికతే. ఎవ్వరూ అందుకోలేని ధనం” యన్న మాట గుర్తుకు వస్తుంది. భౌతిక ప్రపంచము వేషభాషలతో సంచరించే ఒక అస్థిమిత ప్రపంచము, ఇక్కడ గడ్డిపోచ కన్నా హీనము.
ప్రత్యేకముగా ఇదీ అని చెప్పలేని భావన తప్పక కలుగుతుంది. ప్రతీవారు జన్మలో ఒక్కసారన్నా హిమాలయ సందర్శన చెయ్యాలని అనిపించింది. నేను నా భావ పరంపరను ఆపలేకపోయా. నా మనస్సు పూర్తిగా హిమలయాలపై భక్తి, ప్రేమతో మునిగిపోయింది. నేను ఇంకా తెల్లటి మంచు కప్పిన శిఖరాలను దర్శించలేదు. అయినా రుషీకేషు, గంగా ప్రవాహము భువిలోని స్వర్గములా వుండి మనసును పులకరింపచేస్తాయి.
దారిలో నేను చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశము వశిష్ఠ గుహ.
***
వశిష్ఠ గుహ
ఈ గుహ రుషీకేష్‌కు ఇరువై కిలోమీటర్ల దూరములో వుంది. దేవప్రయాగ దారిలోనే వుందది.
“నమో వై బ్రహ్మనిధయే వాశిష్ఠాయ నమో నమః”
వశిష్ఠుడు సత్త్వగుణ ప్రధానుడు. మహా శక్తివంతమైన ఋషి. సప్త ఋషులలో ఒకరు. ఆయనే నవబ్రహ్మలలో కూడా ఒకరు. బ్రహ్మదేవుని మానసపుత్రుడు. భూమి మీద సంతతిని వృద్ధి చెయ్యమని నవబ్రహ్మలను సృష్టించాడు బ్రహ్మదేవుడు. వారిలో వశిష్ఠులవారు ఒకరు. ఆయనకు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన ఊర్జతో వివాహమై తరువాత, పుట్టిన తొమ్మిది మంది కొడుకులు, గొప్ప తపః సంపన్నులు పుడతారు. శుక మహర్షి అలా వశిష్ఠుల వారికి కలిగిన సంతానము. మహ తేజోమూర్తి. జ్ఞానసంపన్నుడు. ఆయనే పరీక్షిత్తు మహారాజుకు భాగవతము చెప్పిన మహఋషి. అలా మనకు భాగవతము అందింది.
కుమారులు కలిగాక వశిష్ఠుడు అగ్నిరూపము దాల్చి తపస్సు చేస్తాడు. తరువాత ఆయన ఇక్ష్వాకు మహారాజు కోరికపై గురువై వారి వంశానికి కుల గురువుగా వుండటానికి సమ్మతిస్తాడు. ఆ వంశములో మహావిష్ణువు పుట్టబోతున్నాడని గ్రహిస్తాడు ఋషి. అలా ఆయన శ్రీరామచంద్రునకు కూడా కులగురువై వర్ధిల్లినాడు. ఇక్ష్వాకుని తరువాత నిమి అన్న రాజు రాజ్యానికి వస్తాడు. ఆయన యజ్ఞము చెయ్య సంకల్పించి వశిష్ఠుని హోతగా వుండమని కోరుతాడు. అప్పుడే ఇంద్రుడు కూడా యాగము చేస్తున్నాడని, అది అయ్యాక వస్తానని చెబుతాడు వశిష్ఠుడు. నిమి మాట్లాడడు కానీ ఇంటికి వచ్చి యజ్ణము సిద్ధము చేసుకుంటాడు. గౌతమ మునిని యజ్ఞ హోతగా పెట్టుకు యజ్ఞము చెయ్యటము మొదలెడతాడు.
(సశేషం)