సత్యాన్వేషణ-27

0
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ఆ[/dropcap]యన నా వైపు చూసి వివరాలు అడిగారు. నేను హైద్రాబాదు నుంచి వచ్చానని, నేను మఠము చూడలనీ, శంకరులు తపస్సు చేసిన చెట్టును చూడాలని వచ్చానని చెప్పాను. ఆయన తలవూపారు. కానీ దీని కోసమే వచ్చానంటే నమ్మినట్లుగా అనిపించలేదు. నేను గురువు కావాలని కోరుతూ గత పది రోజులుగా రుషీకేషులో వున్నానని చెప్పాను. ఆయన సంతోషించాడు.

శంకరభగవత్పాదుల గురించి ఆయన గొప్పతనము గురించి చాలా మాట్లాడాడు. ‘ఆ రోజులలో శంకరులు చెక్క చెప్పులతో ఎలా వచ్చి వుంటారో ఊహకందని విషయమ’ని అన్న నా మాటకు ఆయన చాలా చెప్పారు. చివరకు శంకరులు మానవులు కారని కేవల భగవంతుని రూపమని అన్నారు. నేను అంగీకారముగా తలవూపాను.

‘శంకర సాక్షాత్‌ శంకరః’!!

ఇక్కడ లోయలోకి దిగితే కేవలము పదిహేను కిలోమీటర్ల దూరములో హనుమాన్‌చెట్టీ వుందని, ఉదయము అక్కడికి వెళ్ళి రమ్మని తోడు పిల్లాడిని పంపుతానని చెప్పారాయన.

శంకరులను ప్రార్థిస్తే గురువు తప్పక దొరుకుతారని కూడా చెప్పాడు. మంచు గురించి, కూరగాయల గురించి ఇలా చాలా విషయాలు పిచ్చాపాటిగా మాట్లాడాడు. ఆయనకు మరో వ్యక్తి మాట్లాడటానికి దొరికి ఎంతకాలమై వుంటుందో అనిపించింది.

“దక్షిణభారత దేశములో శంకర మఠములా వుండక ఇది ఇంత నిర్మానుషముగా ఎందుకు వుంది?” అని అడిగాను.

దానికి ఆయన ‘ఇక్కడ మఠము కొంత గురు పరంపర తప్పింద’ని చెప్పారు. మళ్ళీ కేవలము కొంత కాలము మునుపే తిరిగి ఆ మఠానికి ఇప్పుడున్న తీరులా వుంచి ఈయనని కేర్‌టేకర్‌లా వుంచారని వివరాలు చెప్పారు. గర్హ్వాల్ రాజులు మఠాన్ని చాలా బాగానే చూశారు కానీ తరువాత కాలక్రమేపి తగ్గింది. యాత్రికులు బదిరి వెడుతూ మఠాన్ని సందర్శించి వెడుతూ వుంటారుట.

కానీ శంకర మఠము, కంచి కామకోఠి మఠాల పాత్ర, ప్రాముఖ్యత వేదపాఠశాలలూ ఆ వైభవమూ ఒక్కసారిగా నా కళ్ళ ముందులు కదిలి ఇక్కడి ఈ స్థితికి హృదయము ద్రవించింది. ఇక్కడి మఠానికీ మంచి రోజులు రావాలని ప్రార్థించాను.

ఆ సాధువే చెప్పారు “కల్పవృక్షము సందర్శన ఎవరో గాని చెయ్యరు. నీవు చాలా భాగ్యవంతురాలివి” అని.

నేను సంతోషముగా తల వూపాను. కానీ ఆయన మాటలలో ఏం మత్తు వుందో గానీ నాకు సర్వము త్యజించి హనుమాన్‌చట్టీ వెళ్ళి, అక్కడ నుంచి అలా గుహలు వెతుకుతూ వెళ్ళిపోవాలని అనిపించిన మాట వాస్తవము. కానీ పిల్లాజెల్లా ఏమవుతారు?

“స యధా శకుని స్సూత్రేణ ప్రబద్ధో దిశ న్దిశ మ్పతిత్వాఽన్యత్రాయ తన మలబ్ద్యా బన్దనమేవో పశ్రయత ఏవమేవ ఖలు సోమ్య తన్మనో దిశందిశం”…..(ఛాందోగ్యోపనిషత్తు).

తాడు కట్టిన పక్షి ఎంత ఎగిరినా కట్టిన చోటకు వస్తుంది.

అలాగే సంసారమునంటుకు తిరుగుతున్నా. వదిలి వెళ్ళగలనా?

సాధువుగారు ఇచ్చిన టీ త్రాగి ఆయనకు నమస్కరించి కల్పవృక్షము వైపుకు నడచాను. మఠము నుంచి మరో అర కిలోమీటరు దూరములో వుందా చెట్టు. చూడగానే చాలా పాతచెట్టు అని తెలుస్తుంది. దానికి చుట్టూ గ్రిల్లు కట్టారు. ప్రదక్షిణలు చెయ్యవచ్చు. ఆ చెట్టు వద్ద బోర్డు వుంది. అది శంకరులు తపస్సు చేసిన స్థలమని, ఆ చెట్టు నీడన ఆయన కొంతకాలము వున్నారని. చెట్టు మొదలు దాదాపు ఒక చిన్న గది అంత పెద్ద కాండము. ఆ చెట్టు క్రింద చిన్న గుడిలా కట్టారు. అందులో శంకరులు చిన్న విగ్రహము, శివలింగము వున్నాయి. ఆ చిన్న గుడి ముందు త్రిశూలము గ్రుచ్చి వుంది. చెట్టు తాకటానికి రాకుండా కాపాడటానికి చుట్టూ ఇనుప కంచె. కొన్ని కొమ్మలు క్రిందికి దిగాయి. వాటిని ప్రేమగా తాకాను.

“వృక్షరాజమా నీ జన్మధన్యము సుమా! సాక్షాత్‌ శంకర భగవత్పాదులకు నీవు నీడనిచ్చావు” మనసులో అనుకున్నా. ఆ ప్రాంగణములో చిన్న బల్లలు వున్నాయి కూర్చోటానికి. ఆ చెట్టు కొండ అంచున వుంది. అక్కడ్నుంచి ఒక ప్రక్క మరో కొండ, మరో వైపు లోయ. పైన ఆకాశము నీలము నుంచి ఆరెంజు నుంచి నల్లటి నలుపు పులుముకుంటున్నది. నేను అఖండమైన మౌనాన్నీ అనుభవిస్తూ అలానే కుర్చుండిపోయా. గురువు కావాలని తపన మొదలయ్యిన దగ్గర్నుంచి నాకంత ప్రశాంతత తెలియదు. అసలు నా జీవితములో అంతటి శాంతము అనుభవించానా అంటే అనుమానమే. అంత శాంతముగా వుంది ఆ చెట్టు క్రింద. అటు వంటి అనుభవము నాకు మళ్ళీ ఎక్కడా కలగలేదు.

అలా చిత్తరువులా కుర్చుండిపోయాను. ఎంతసేపు వున్నానో తెలియదు. చుట్టూ చిమ్మచీకటి. దూరముగా వీధిదీపాలు వెలుతురు. లేచి వచ్చిన దారినే ఆ రోడ్డు ప్రక్కగా నడుస్తూ హోటలుకు వెళ్ళాను.

నాకు మళ్ళీ నా గుండె పట్టెయ్యటమూ, విపరీతమైన తలనొప్పి మొదలయ్యాయి. నాకేదో అవుతోందని, రేపన్నది చూడగలనా? అని అనిపించింది. నా నోటుబుక్ మీద నా ఎమర్జెన్సీ నంబర్లు రాసి, ధ్యానము చేస్తూ వుండిపోయాను. అక్కడ సిగ్నల్స్ లేవు. లాండులైను ఫోను నుంచి అక్కకు ఫోను చేశాను. డిన్నరుగా కొద్దిగా మజ్జిగలాంటిది త్రాగి ఉదయము యోగ నరసింహుని చూడాలని అనుకొని పడుకున్నాను.

జ్యోషిమఠ్ సముద్రమట్టానికి 6158 అడుగుల ఎత్తున వుంటుంది. అంత ఎత్తున వున్న ప్రదేశముకు వెళ్ళటము నేనదే మొదటిసారి. నాకు ఆ ఎత్తుకు వూపిరి అందక కష్టపడ్డాను. ఉదయము లేవలేకపోయాను. లేచే సరికే ఆరు దాటింది. తయారు అయి బయటకు వత్తును కదా ఉహాతీతమైన సౌందర్యముతో హిమాలయ మంచు శిఖరాలు సూర్యుని వెలుతురును నింపుకు మిళమిళా మెరుస్తూ కనిపించాయి. జ్యోషిమఠ్ నుంచి కనీసము మనము మరో ముఫై కిలోమీటర్ల వెడితే కానీ అవి మనకు ఎదురుగా కనపడవు. ఆ రోజు మబ్బులు లేనందున చాలా స్పష్టముగా కనిపించాయి.

కాళీదాసు హిమాలయాలను ‘పరమశివుని అట్టహాసరూపము’ అని వర్ణించాడు.

‘ద లెగస్సీ ఆఫ్ ఇండియా’ అన్న తన పుస్తకములో F.W. Thomas హిమాలయాలను ‘శివుని తెల్లని పలువరస’గా ఉహించాడు.

మన కావ్యాలలో హిమాలయాలను అద్భుతముగా అల్లసాని పెద్దనగారు వూహించి రచించారు. ప్రఖ్యాతి గాంచిన ఆ పద్యము మనుచరిత్రలోనిది.

“ చ. అటఁజని కాంచె,భూసురుఁ డంబర చుంబిశిరస్సరజ్ఘరీ
పటలముహుర్ముర్లుఠద భంగతరంగమృదంగనిస్స్వన
స్పుటనటనానుకూలపరిపుల్లకలాపిజాలమున్
గటకచరత్క రేణుకరకంపితసాలము శీతశైలమున్‌”

ప్రవరుడు హిమాలయాలను చూచినాడు. ఆకాశము తగులు శిఖరాగ్రములు.

అందు సుందరమైన పర్వత శిఖరాలు. హేమవర్ణము. జగదంబ పుట్టిల్లు మరి హేమమే కదా!!

చాలా హాయినిచ్చిన దృశ్యము కనులారా చూచాను. కాని ఆ రంగులు త్వరిత్వరిన మారి తెల్లని తెలుపులోకి వెడతాయి. ఆ బంగారు రంగు ఉదయము కాసేపే వుంటుంది. హిమముకు అంత దగ్గరగా వచ్చాను. ఆ మంచులోకి వెళ్ళిపోతే ఎలా వుంటుందో అన్న ఆలోచన మెదిలింది. ఒక జిజ్ఞాసువైన యాత్రికుడు మంచుకొండలలో తప్పి తిరుగుతూ వుంటే చిన్న పాప తొమ్మిది సంవత్సరములది కనపడి దారి చూపినదట. తిరిగి చూస్తే కనపడలేదట. బాలా త్రిపుర సుందరి అలా వచ్చినదని ఆ భక్తుడు తలచాడు. అలాగే మరి ఒకరికి బాబాజీ కనిపించి దారి చూపారట. అలాంటి కథనాలు ఎన్నో మెదడులో రీళ్ళు తిరిగాయి. నేను ఆ మంచు కొండలలోకి పోతే అన్నీంటికీ ఒక సోల్యూషను దొరకగలదేమో యన్న ఆశ కలిగింది. కానీ ధైర్యం చెయ్యలేకపోయాను. అన్నింటికీ సమయము వుంటుంది. నాకు ఇంకా సమయము వున్నట్లుంది.

నేను నా లగేజు కారులో పెట్టి, యోగనారసింహ దేవాలయానికి వెళ్ళాను.

బదిరిలో దేవాలయము మూసివేసిన ఆరునెలలు అక్కడి దేవుడిని ఇక్కడి యోగనారసింహుని దేవాలయములో వుంచుతారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here