Site icon Sanchika

సత్యాన్వేషణ-33

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ప్ర[/dropcap]జలు ఎందుకు ప్రతివారిని జడ్జ్ చేస్తారని చిన్నబోయాను. నాలో లోలోపలికి ఎలా వెళ్ళాలని అల్లల్లాడిపోయాను. ప్రతి చోట నా గురువు వద్దకు నన్ను చేర్చమని ప్రార్థించాను. నేను నడిచే దారి సరి అయినదే యని అన్నా చెప్పమని పదేపదే దత్త గురువుకు మొర పెట్టుకున్నాను.

జీవిత పరమపదసోపాన పటంలో
నిచ్చనలే ఎక్కానో,
పాము నోట్లో పడ్డానో,
చెల్లించాల్సిన కాలముతో కాని బహిర్గతము గావు
కదలని కాలము ఎంత లాగినా వేగమవ్వదు
సమస్యలను కౌగిలించుకు నడుస్తున్నప్పుడు
ఎత్తుపల్లాల గురించి ఎవరికి మొరపెట్టుకోను?
నిరాశలు నీరస నిట్టూర్పుల గురించి ఎవరికి
అర్జీ పెట్టను?
సద్గురువు కరుణ దృష్టి పడేవరకూ తిప్పలు తప్పవు.
ఆత్రము సరికాదు
గమ్యము తప్పక చేరుతాను. అని నన్ను నేను సమాధాన పరుచుకున్నాను.

నా వరకు నాకు సాధనలో ముఖ్యముగా రెండు ప్రశ్నలు సదా విసిగిస్తూ వుంటాయి.

అవి, నేను సరి అయిన దారిలోనే వున్నానా? నేను ఎప్పటికి చెప్పుకోతగ్గ మజిలీ చేరుతాను? వాటి గురించి ఆలోచించక సాధనలో సాగాలని చెబుతారు విజ్ఞులు. ముఖ్యముగా ఓపిక వుండాలి. మన ఎన్ని జన్మల సంచిత కర్మల పర్వతాలను కదల్చాలో మనకు తెలియదు కదా.

గత రెండు నెలలుగా నా మూలాలను వెతుకుతూ తిరగిని నేను, మళ్ళీ విధి విసిరే గోలలో పడక తప్పలేదు. బాధ్యతలను వదలలేదుగా పూర్తిగా. తను వున్న రెండు వారాలలో నిజానికి క్షణం కూడా నిదానముగా వున్నది లేదు. ఎవరో నెత్తిన కత్తి పెట్టినట్లుగా పరుగు పరుగుల మధ్యన వున్నాము. హైద్రాబాదులో తను అనుకున్న పని జరగలేదు. మనము ఒకటి తలిస్తే పరమాత్మ మరోటి తలుస్తాడు. ఆయనకే మనకంటే మన గురించి తెలుసు. మనము ఆ విషయము నమ్మితే చాలు కదా! పని కాలేదు. మాకు సర్దుకోవలసిన పైకము అందుబాటు కాలేదు.

నేను ముందు ఆలోచించుకున్న విధముగా నేను ఈ రెండు వారాల తరువాత తెలిసినవారితో కలిసి కాశీకి వెళ్ళ వలసి వుంటుంది. కానీ నేను ఈ పైకపు ఇబ్బందుల మధ్య నా ప్రయాణ ప్రవాహమును కొంత ఆపి, వెనకకు అట్లాంటా వెళ్ళిపోవాలని అనుకున్నా. మావారు ఒప్పుకోలేదు. అనుకున్న ప్రకారమే ప్రయాణాలన్నీ చేసి ఇంటికి రమ్మని, అప్పుడు నేను కొంత శాంతముగా వుండగలనని ఆయన భావించారు. అందుకే, కాశీని, విశ్వనాథుని దర్శించి రమ్మని నాకు నచ్చచెప్పారు. పైగా నేను కొందరు ఘనాపాటిలతో సాగిద్దామనుకున్న ప్రయాణము. వారు అక్కడ కాశీలో హోమము, దానము ఇత్యాదివి చేస్తున్నారు. ఏమీ తెలియని వారు, అలా తెలిసినవారితో వెడితే చక్కగా అన్నీ దర్శించుకోవచ్చని కూడా ఆయన భావించి నన్ను వాళ్ళతో వెళ్ళమని ప్రోత్సహించారు. అలా నేను రెండు వారాల సంసారపు గొడవలలో ఈజీగా కొట్టుకుపోయి, మళ్ళీ పూర్వపు స్తబ్ధ స్థితిలోకి నెమ్మదిగా జారుతూ కాశీకి వెళ్ళటానికి సిద్ధమయ్యాను.

కాశీ అన్న వారణాసికి వెళ్ళటము నా జీవితములో నేను తప్పక చెయ్యాలనుకున్న ప్రయాణాలలో ఒకటి. నన్ను మరణించే లోపల ఏదైనా చెయ్యాలా అంటే గంగా స్నానము, కాశీ యానము, విశ్వనాథ దర్శనము అని చెప్పుకుంటాను. ప్రతిఒక్కరు జీవితములో చెయ్యవలసిన పనులను ఒక పట్టిక చేసుకుంటే ఈ వారణాసి వెళ్ళటము దాదాపు హిందువులందరి లిస్టులో వుంటుందనుకుంటా. మావారు కూడా వచ్చి వుంటే బావుండును కానీ ఆయనకు అంత సమయము లేదని హడావిడిగా వున్నారు. వెనకకు వెళ్ళిపోవాలని తొందరలో వున్నారు. కాబట్టి నేను తిరగాలనుకున్న ప్రదేశాలన్నీ తిరిగి మనస్సు నెమ్మది చేసుకొని ఇంటికి రమ్మని మరీమరీ చెప్పారాయన.

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరి నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్‌॥ (విశ్వనాధాష్టకమ్‌)

మాకు తెలిసిన వారు అప్పటికే కాశి రైలు ఎక్కేశారు. నేను వారితో కలిసి వెళ్ళాలనుకున్నా, ఆ రైలులో ఇక అందుకోలేను. వారితో కలసి వెళ్ళలేను. అందుకే ఫైటులో వెళ్ళి వారిని కాశిలో అందుకోవాలని అనుకున్నా. తను అట్లాంటా తిరిగి వెళ్ళిన మరురోజు సాయంత్రము ఫ్లైటుకు నేను వారణాసి బయలుదేరాను.

హైద్రాబాదు విమానాశ్రయములోకి ప్రవేశించాను. అతి పెద్ద వరుస వున్నది స్పైస్ జెట్ వారి కౌంటరులో. నేను లైనులో ప్రవేశించే పూర్వము ఆ వరసకు కొద్ది దూరములో నిలబడిన వారిపై నా దృష్టి నిలబడిపొయ్యింది.

ఆశ్చర్యముతో నా కళ్ళు పెద్దవయినాయి. నా హృదయము వేగము గంగానదిలా కొట్టుకుంది. వెన్నులోంచి వణుకు నరనరాలుగా ప్రాకింది. కళ్ళు ధారాపాతముగా వర్షిస్తుందగా పరుగు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కారము చేశాను. నేను వున్నదెక్కదో ఆక్షణం నాకు తెలియటము కూడా లేదు. ఆ ఎయిర్‌పోర్టులో ఆ రోజు నేను అక్కడ చూసింది సాక్షాతూ పరమహంస పరివ్రాజక శ్రీ. శ్రీ. సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. భక్తులుగా ప్రేమగా కుర్తాళం స్వామి వారిని పిలుచుకుంటారు. మహా తపస్వీ, కరుణామయులు భక్తుల యడ అపారదయ కలిగిన వారు కేవల జ్ఞానస్వరూపులు….

“ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః॥
నిధయే సర్వవిద్యానాం భిషయే భవరోగిణామ్‌।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః॥”

భూమి సజీవమైనది. దానికి ఆత్మ వుంది. అందుకే భూమిపై ప్రతి ఒక్కటీ నిరంతరము మారుతూ వుంటుంది. ఆ ఆత్మలో భాగమైన మనకి అనుకూలముగా ఆ శక్తి పనిచేస్తూ వుంటుంది. కాని మనము ఎప్పుడో కాని గుర్తించము. ఏదైనా విషయముకై మనము తపనతో వుంటే ప్రకృతి శక్తులు మనకు అనుకూలముగా వుంటాయి. మనకు దారి కూరుస్తాయి. అందుకే సాధకులు నిరంతరము చురుకుదనముతో వుంటూ, చుట్టూ పరిశీలిస్తూ ఆత్మ విచారణ చేసుకోవాలి. నేను ఒక చీకటి రాత్రి (ఆ రోజు కరెంటు లేదు) హోరున పడుతున్న వర్షములో పవిత్రా గంగా నది సాక్షిగా ఈ శక్తిని దారి చూపమని వేడుకున్నాను. దారి చూపటానికి నా కర్మ అడ్డు పడుతుంటే కనీసము నేను నడిచే దారైనా సరైనాదా లేదా అని అన్నా తెలపమని బ్రతిమిలాడాను. అది రెండువారాల సంసార గోలలలో ఆ విషయము నా హృదయములో మరుగున పడింది. కానీ ప్రకృతికీ, పరమాత్మకు కాదు. అందుకు సాక్షమే ఈ గురుదేవుల హఠాత్తు దర్శనము. అది నిజంగా ఎంతో నాటకీయముగా సాగిందో నేడు ఆలోచిస్తూ వుంటే అనిపిస్తుంది. సదా మనలను ఒక దృష్టి చూస్తూ వుంటుంది. మన అడుగులు తడపడితే చేయూతనిస్తుంది. దెబ్బ తగిలితే స్వాంతన చేకూరుస్తుంది. నిజం! పరమాత్మను నమ్మిన వారికి అడుగడుగూ ఆయన లీలా విలాసమే దర్శనమిస్తుంది.

హఠాత్తుగా స్వామి, అనుకోకుండా అలా నా కళ్ళకు కనిపించారు. నేను వారికి ప్రణామాలు సమర్పించగానే

నన్ను ఆదరముగా దీవించి వివరాలు అడిగారు స్వామి.

నేను కొంచం కినుకగా “స్వామి మీరు అట్లాంటా వచ్చి మంత్రమిచ్చి మీపాటికి మీరు వెళ్ళారు. నేను మంత్రము జపించినా నాకు ఫలితము లేదు.” అన్నాను.

ఆయన ప్రేమగా నవ్వి “ఏ మంత్రము” అన్నారు.

వివరాలు, గురు మంత్రము నా జపము గురించి విషయము చెప్పాను.

“ఆ మంత్రము సరి అయినదేనమ్మా” అన్నారు.

“ఎంత దాకా ప్రయాణము స్వామి?” అని అడిగాను.

“వారణాశి” అన్నారు.

మరో ఆశ్చర్యము. ఏమిటీ ఈ వింత మీద వింత. దత్తస్వామి నామీద అపార కరుణ చూపుతున్నాడు. నా తపము ఫలించుచున్నదా? నాకు గుండె వేగము హెచ్చినది.

(సశేషం)

Exit mobile version