సత్యాన్వేషణ-4

0
1

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]మ[/dropcap]నం సేవ కోసం అన్నట్లు ఉండాలంటే, దానికి ముందు నిద్ర, బద్ధకాలని ఎలా జయించాలని ఒక ప్రశ్నఅలాగే ఉంటోంది. దీనికి నాకు తోచిన సమాధానం క్రమశిక్షణ. క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం అవలంబిస్తే వీటిని జయించవచ్చు. మా అమ్మ ఉన్నప్పుడు, ఆవిడ ప్రతిరోజు ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని, ఆ రోజు ఆ తిథికి పాటించి, ఆయా విధులు పాటించేది. అట్లతద్దె, ఏకాదశి, చతుర్థి, షష్ఠితో పాటు, రధసప్తమి, ఇత్యాది వంటి వాటితో పాటు ప్రతి నెల ఏదో ఒకటి చెబుతుండేది, పాటించేది. రోజువారీ బద్ధకం లేకుండా ఉదయమే పూజ అయి మహా నైవేద్యం అయితే గాని ఏమి తినకపోవటం, ఆ పూజ పునస్కారం జరిగిన తర్వాతే మిగతా విషయాలు చూడటం వంటివి తెలియకనే జీవితాన్ని ఒక క్రమ మార్గంలో నడుపుతాయి. ఇలాంటివి పాటించటం, విసుగు లేని, విరామము లేని జీవన శైలి, క్రమశిక్షణ మన పెద్దలనుంచి నేర్చుకోవాలి అందుకే. ఇవి మనకు క్రమశిక్షణతో పాటు మన జీవిత గమ్యాన్ని నేర్పిస్తాయి.

ఇక్కడ, ఆ మాటకొస్తే ఎక్కడైనా వేగంగా మారిన జీవన విధానం ఒక రకమైన విసుగును కలిగిస్తుంది. ఒక క్షణం ఆగి ఆలోచిస్తే అసలు ఎందుకో, ఎవరి కోసం ఈ పరుగు అంటే సమాధానం తట్టదు. ఇలాంటి పరిస్థితులలో జపం ఒక్కటే చేస్తూ ఉండటం అంటే కష్టమే కానీ నా గురువుని కలుసుకోవాలని ఆత్రంలో అది పెద్ద లెక్క అనిపించలేదు.

కానీ చాల తొందర, హడావిడి మాత్రం కలిగింది. సాధనలో ఓర్పు ఉండాలి.

సాయిబాబా అదే చెప్పేవారు కదా! ఓర్పు, సడలని శ్రద్ధ ఉండాలని శిష్యులకి.

ఓర్పు శ్రద్దా ఉన్నా సంసారంలో పడి కొట్టుకుపోతుంటే ఇంక టైం ఏది?

ఈ సంసారము నన్ను జపము చెయ్యనియ్యదే !

సంసారజీవితం అడ్డు పెట్టుకొని మనవల్ల కాదు, అనుకునే వారికి సమాధానంగా క్రియాయోగి శ్రీ శ్యామాచరణ లాహిరి మహశయ జీవించి చూపించారు, “సాధనకి సంసారం అడ్డం కాదని”.

పురాణపురుషులైన శ్రీ లాహిరి మహాశయ అతి నిరాడంబర జీవితము గడిపిన క్రీయాయోగి. సంసారము సాధనకు అడ్డుకాదని నిరూపించటానికే పరమాత్మ శ్రీ లాహిరి మహాశయుని రూపములో తిరుగాడారు. వారణాసిలో వుంటూ సామాన్యమైన సంసార జీవితము గడుపుతూ ఎందరికో క్రియాను బోధించి, క్రియా ద్వారా మోక్షం పొందొచ్చని నిరూపించారు యోగిరాజులు.

మామూలు సాదారణ ఉద్యోగిలా కొంత ధనము కోసము ఉద్యోగము చేస్తూ, వచ్చిన దానితో సంసారమును నడుపుతూ వుంటారాయన. శ్రీగురునికి ప్రత్యక్ష్య శిష్యులు. గురువానుగ్రహముతో, క్రియా యోగమును సాధన చేసి, ఎందరికో బోధించినారు. ముక్తి మార్గం చూపారు. ఆయన సంసారంలో ఆటుపోట్లను నిలబడి తట్టుకొని చూపారు. కూతురు మరణం, భార్య అసమ్మతిని భరించారు.

“సంసారులు కూడా మోక్ష కాములే. మోక్షానికి అర్హులే! వారికీ మార్గం చూపితే, వారు కూడా తరిస్తారు ” అని శ్రీగురువు శ్యామచరణ లాహిరితో చెప్పారని అంటారు.

యోగిరాజు భోదనలలో ముఖ్యముగా క్రియ ద్వారా పరమ సత్యమును ఎలా తెలుసుకోవచ్చునో చెబుతారు.

‘ఏదో రోజు మనము సర్వము వదిలి వెళ్ళిపోవాలి. అందుకే బ్రతికివుండగానే పరమాత్మతో సంబంధము ఏర్పరుచుకుంటే, మరణాంతరము పనికి వస్తుంద’ని చెప్పేవారు.

‘భగవంతునితో నిజ సంబంధాన్ని కలగచేసేది క్రియా మాత్రమే’.

‘రోజూవారి జీవితములో ఆటుపోటులకు కృంగవలదు. సదా పరమాత్మతో అనుసంధాన పరచుకుంటే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. క్రియ యోగా ద్వారా ఆ సంబంధము సాధ్యము’.

గురుశిష్య పరంపరలో తప్ప ఈ క్రియా యోగ ఎవ్వరూ ఎవ్వరికి భోదించరాదని లాహిరి మహాశయ నొక్కి వక్కాణించేవారు. ఆ సూత్రము నేటికి క్రియా యోగులు పాటిస్తారు. క్రియను గురువు చెప్పినట్లుగా పాటించమని, గురువు మీద నమ్మకముతో వుండమని చెప్పేవారు యోగిరాజులు.

యోగిరాజులకు తన శిష్యులతో ప్రత్యేకమైన సంబంధము వుండేది. వారికి కావలసినది వారికి అందించేవారు గురుదేవులు.

సత్యమును పాటించమని, ఇంద్రియ నిగ్రహము ముఖ్యమని చెప్పేవారు. అంతేకాదు మానవులకు వారి వ్యక్తిగత నిబద్ధత ఎంతో ముఖ్యమైనదని, దానికై సదా జాగరూకతతో వుండాలని కూడా చెప్పేవారు.

ఆయన తన అవతార సమాప్తికి ముందుగానే శిష్యులకు చెప్పి అందరి సమక్షంలో తన శరీరాన్ని వదిలివేశారు.

“మర్తే మర్తే జగ్ మరా, మర్నా న జానే కోయ్‌
ఐసా మర్నా కోఈ న మరా, జో ఫిర్ నా మర్నా హోయ్‌,
మర్నా హై దుఇ భాఁతికా, జో మర్నా జానే కోయ్‌,
రామ్‌దుఆరే జో మరే, ఫిర్ నా మర్నా హోయ్‌” (లాహిరి మహశయ డైరి)

ప్రతిరోజూ మరణిస్తూనే వుంటారు. తిరిగి పుడుతూనే వుంటారు. ఈ ప్రతిదినపు మరణము మనకొద్దు. రామద్వారము వద్ద మరణిద్దాము.

అంటే భ్రూమధ్యస్థానంలో ప్రాణాన్నీ మనస్సును స్థిరముగా నిలిపి ఆ పరమపురుషుని దర్శిస్తూ…. సత్యమైన సాధనతో…. ఇది సాధ్యము.

***

రాజర్షిగా జనక మహారాజుని ఉదహరిస్తారు. జనకుడు రాజ్యం చేస్తూ కూడా యోగిలా జీవించాడని, శుక మహర్షి అంతటి వానికి జ్ఞానబోధ చేశాడని మనకు పురాణాలలో తెలుస్తుంది.

ఎక్కడ ఉన్నా, ఎలాంటి పనిలోఉన్నా సాధనకి ముఖ్యంగా కావాల్సింది మనో సంకల్పం. మనోసంకల్పం ఉంటే ఎక్క లేని ఎత్తులు లేవు, కొలవలేని దూరాలు లేవు.

మనకు గురువుల, యోగుల చరిత్రలు, పెద్దల చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యముతో పాటు ఇన్సిఫిరేషను కూడా కలుగుతుంది.

సత్యమును తెలుసుకొనుటకు సాధనతో ఇది సాధ్యము.

సాధన ఒక్కటే మార్గము!!

“ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వడి యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునినే శరణంబు వేడెదన్” (పోతన భాగవతము)

***

సాధనకు మనము మన చుట్టూ వాతవరణము ఏర్పచుకోవాలా? అది ఎలా చెయ్యాలి?

ముందు సాధన చేయ్యాలంటే సంకల్పము వుండాలి.

ఎలాగైనా చెయ్యాలి అన్న పట్టుదల వుండాలి. అలాంటి పట్టుదల మనకు “స్వామి రామ”లో కనపడుతుంది. “హిమాలయ పరమ గురువులతో జీవనము” లో సాధకులకు వుండవలసిన క్రమశిక్షణ, పట్టుదల గురించి చాలా వివరముగా చెబుతారు స్వామి రామ.

సాధకుడు, గురువు, రచయిత, యోగి మీదు మిక్కిలి ప్రజా బంధువు అయిన శ్రీ స్వామి రామ హిమాలయ లోయలో చిన్న పల్లెటూరులో జన్మించారు. చిన్నతనము నుంచే బెంగాలీబాబు అన్న హిమాలయ యోగి చేత పెంచబడతారు. ఒక హిమాలయ గుహ నుంచి మరొక గుహకు, ఒక విద్యా పీఠము నుంచి మరొక పీఠముకు తిరుగుతూ ఆధ్యాత్మిక విద్యను, యోగాను అభ్యసించారు. వాటితో పాటు మామూలు చదువులు కూడా చదివారు ఆయన. ఆయన తిరగాడని హిమాలయా ప్రాంతము కానీ, పర్వతము కానీ లేవన్న విషయము అతిశయోక్తి కాదు. తన 14వ ఏట ఒక అవధూత స్వామీ రామాను ‘ఈ ప్రపంచము నీకు అల్పమైనదిగా వుండుగాక. నీవు ఆధ్యాత్మిక పథంలో పయనింతువు గాక!’ అని ఆశీర్వదిస్తారు. ‘అన్ని భయాల నుండి విముక్తి పొందాలనేది’ హిమాలయ ఋషుల యొక్క ప్రథమ సందేశము. ‘మన లోపలి అంతర్గతమైన నిజాన్ని తెలుసుకోవాలన్నది’ రెండవ సందేశము’. ఆశ్చర్యకరమైన జీవితము జీవించిన స్వామి రామా సాధకులకు వుండవలసిన పట్టదలకు నిదర్శనము.

జీవితము కలిగించిన ఆటుపోట్లను ఆయన ఎదుర్కున్న తీరు అద్భుతము. ఆయన గురువు ఆజ్ఞ ప్రకారము, నర్మద వడ్డున సాధన చేస్తూ తన 24వ ఏట దక్షణ భారత దేశపు పీఠాలలో ముఖ్యమైన కరవీర(కొల్హాపుర) పీఠానికి శంకరాచార్యులుగా బాధ్యత తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో దాని ఆధ్యాత్మిక కట్టుబాట్లను తనదైన పద్ధతిలో ఎంతగానో ప్రభావితము చేశారు. అర్థము లేని కర్మకాండలను, లాంఛనాలను త్రోసిపుచ్చి, సంఘములోని అన్ని వర్గాలవారికి ఆధ్యాత్మికతను దగ్గర చేశారు. జాతి మత కుల వివక్షత లేకుండా అందరికీ ఆలయ ప్రవేశము ఏర్పాటు చేశారు. ముఖ్యముగా మహిళల ధ్యాన శిక్షణను ప్రొత్సహించేవారు. రెండు సంవత్సరముల తరువాత ఆ బాధ్యత తన సాధనకు అడ్డు అని తలచి, అది వదిలేసి హిమాలయాలలో తన గురువు వద్దకు తిరిగి వెడతారు.

విస్తారముగా దేశ సంచారము చేశారు. హిమాలయాలలో, టిబెట్ లో మానస సరోవరము వద్ద ఎంతో కాలము తపస్సు సాధన చేశారు. ఎందరినో మహాత్ములను కలసి వారితో సంభాషణలు, బోధనలు స్వీకరించారు.

ఎందరినో ఆకట్టుకొని, యోగా బోధించి, ఆధ్యాత్మిక మార్గములోనికి వారిని మరల్చారు శ్రీరామా. ఆయన నెలకొల్పిన మొదటి ఆశ్రమము నేపాల్ లోని ఖాట్మండ్ దగ్గరి యోగా కేంద్రము.

అమెరికాలో శాస్త్రవేత్తల పరిశోధనలకు సహయపడి తన మీద పరిశోధనకు అనుమతిస్తారు. ఆనాడు ఆయన మెదడును పరిశీలించిన వారు ఆయన ఒకే సమయములో నాలుగు విభిన్నమైన సిగ్నల్స్ మెదడు నుంచి ఇవ్వటము, ఆయన గుండె రక్త ప్రసరణ ఆపివెయ్యటము, తన శరీర ఉష్ణోగ్రతలను తాను కంట్రోలు చెయ్యటము వంటివి గమనిస్తారు. యోగి, యోగసాధనతో చెయ్యగల ఎన్నో విశేషాలను స్వామి రామా పశ్చిమ దేశ ప్రజలకు చూపుతారు. ఆయన ఉత్తర పెన్సిల్వేనియాలో ‘హిమాలయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియూ ఫిలాసఫీ’ అన్న సంస్థను ప్రారంభిస్తారు. కొంత కాలము అమెరికాలో వుండి తిరిగి హిమాలయాలకు వెళ్ళిన స్వామీ రామ హిమాలయాలలోని పేద ప్రజల కోసము ‘హిమాలయా ఆసుపత్రిని డెహరాడూన్‌ లో ప్రారంభిస్తారు. హిమాలయాలలో ప్రజలకు వైద్యం కోసం ఎంతో దూరము వెళ్ళవలసి వచ్చేది. వారి పేదరికము గురించి ఎంతో వ్యధ చెంది స్వామి రామా వారికి ఈ ఉచితవైద్యశాల ప్రారంభించారు. ఇది నేడు ఆ ప్రాంతములో అత్యుత్తమమైన ఉచిత ఆసుపత్రి.

ఒక స్త్రీ గురించి ఆయన ప్రపంచపు అనుమానాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటారు. తరువాత ప్రపంచము నిజం గ్రహిస్తుంది. ఆయన మార్గమే కాదు ఆయన రచనలు కూడా ఎందరికో మార్గము చూపినాయి. ఆయన శిష్యులు ఎందరో నేటికీ హిమాలయ పేద ప్రజలకు సహయపడుతూ, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా యోగాను వ్యాప్తిచేస్తున్నారు.

మనము సాధనతో సాదించవచ్చని నిరూపించి మహాత్ముల జీవితము ఎంతో ప్రభోదానందముగా వుండి, మనసుకు ధైర్యం ఇస్తుంది.

కుర్తాళం స్వామివారు నా సాయి భక్తిని గమనించి ఇచ్చిన గురు మంత్రం సాయి పరంగానే ఇచ్చారు. కాబట్టి నా ముందు వున్న లక్ష్యము వారు చెప్పినట్లుగా ఆ మంత్రం లక్ష సార్లు జపించి గురువును దర్శించాలి. ఆయన నాకు తదుపరి మార్గోపదేశం చేస్తారు. అంటే నేను ముందు ఈ మంత్రమును పట్టుదలగా సాధన చెయ్యాలని నిశ్చయించుకున్నాను.

“సదా నింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుధా స్రావిణం తిక్తమప్యప్రియంతమ్
తరుం కల్ప వృక్షాధికం సాధయంతమ్
నమామీశ్వరం సద్గురుం సాయినాథం” (ఉపాసినీబాబా)

***

మనకు పట్టుదలగా వుంటే సరిపోదు. మన చుట్టూ మనము, చేసే పనికి తగ్గ పరిస్థితి కలిగించుకోవాలి. బారులో పూజ చేయ్యలేము. పూజాగృహములో తత్సంబంధము కానివీ చెయ్యలేము. మిత్రులను బట్టి వారి గుణాలు తెలుస్తాయంటారుగా. అంటే మన చుట్టూ వున్న వాతావరణం కూడా మనకు ఇతోధికంగా తోడ్పడాలి. దానికి కావలసిన పరిస్థితులని మనం కల్పించుకోవాలి కూడా కదా! చదవటానికి పుస్తకము సిద్ధం చేసుకున్నట్లుగా…..

అదే విషయము జగద్గురు ఆదిశంకరులు వారు కూడా అందుకే ‘మోహముద్గరము’ లో సత్సంగత్వం గురించి చెప్పారు.

“సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం
నిశ్చలతత్త్వ జీవన్ముక్తి “(మోహ ముద్గరము -శంకరభగవత్పాదులు)

సత్పురుషుల (లేదా మంచి నడత కలిగిన వ్యక్తుల వలన, మిత్రుల) సాంగత్యము చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాలపై సంగభావం తొలిగి పోతుంది. దాని వల్ల క్రమముగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుని మీద నిలుస్తుంది. అలా సకల కర్మ బంధనాలనుంచి విముక్తి లభిస్తుంది. జీవించి వుండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తి.

కాబట్టి సాధనకు క్రమశిక్షణ, శ్రద్ధ తో కూడిన ఓర్పు, తగ్గ వాతావరణం కూడా కావాలె కాబోలు. నాకు అలాంటి వాతావరణము వున్నదా?

ఇలాంటి వాతావరణము కోసము, మనసులో తృష్ణతో హిమాలయాలకు వెళ్ళి గురు శుష్రూతలు చేసిన ఎందరో మహానుభావుల గురించి మనము వింటాము. అవ్వన్నీ పూర్వకాలములో అని అనుకోటానికి వీలు లేదని, నేటి కాలములో కూడా మానవాతీతమైన ఎన్నో జరుగుతాయని మనకు శ్రీ. M చరిత్ర చదివితే తెలుస్తుందని. వారు మన మధ్య తిరగాడుతున్న మహాపురుషులు.

నాకు 2014లో ఒక మిత్రుని ద్వారా తెలిసింది శ్రీ. ఎమ్ గురించి. యూట్యూబులో ఆయన ఇంటర్యూ వుంది. అది మొదలు వారి గురించి మరింత తెలుసుకోవాలని ఆత్రుత కలిగింది. వారి పుస్తకము “ Apprentice with Himalayan Gurus” అన్న ఆ బుక్కు ఆ సంవత్సరము బెస్టు సెల్లింగు బుక్.

వారు ఒక మహ్మదీయ కుటుంబములో పుట్టి, మనసులో కలిగిన తపనతో గురువు కోసము హిమాలయాలకు వెళ్ళినవారు. 1948లో కేరళలోని ఒక మహ్మదీయ కుటుంబములో జన్మించారాయన. చిన్నతనము నుంచి తన తొమ్మిదవ ఏట వరకూ సామాన్యమైన జీవితమే ఆయనది. తన తొమ్మిదవఏట ఆరు బయట ఆడుకుంటుంటే ఆయనకు దూరాన వున్న పనసచెట్టు వద్ద ఒక విచిత్రవ్యక్తి కనిపించి పిలుస్తాడు. దగ్గరకు వచ్చిన ఆ బాలునితో “ఏమైనా గుర్తుకు వచ్చిందా” అని అడుగుతాడు. ఏమీ బదులు చెప్పక వున్న బాలుని తలపై చెయ్యి వేసి “సమయము వచ్చినప్పుడు తెలుస్తుందని” చెప్పి తృటిలో మాయమవుతాడు.

ఈ బాలుడు తన 19వ సంవత్సరము ఇల్లు విడిచి ఎవ్వరికీ చెప్పక హిమాలయాలలో వున్న బదిరి క్షేత్రం చేరుతాడు. బదిరి చేరటానికి రుషీకేష్ నుంచి కాలి నడకన బయలుచేరి మూడు నెలలకు చేరుకుంటాడు. అక్కడ ఏం చెయ్యాలో తెలియదు ఆయనకు. హృదయం నుంచి లోలోపలి పిలుపు ఆయన్ని అంత దాకా తీసుకువస్తుంది. అక్కడే కొంత కాలమున్న తరువాత మనసులో కలిగే అలజడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకుంటుండగా ఆయనకు వారి గురువుల దర్శనము కలుగుతుంది. వారే గురువులు శ్రీ మహేశ్వర్‌నాథబాబాజీ. మహావతార్‌ బాబాజీకి ప్రత్యక్ష శిష్యులు.

శ్రీ ఎమ్‌ను సాదరంగా తీసుకొని నాథసాంప్రదాయంలోకి ప్రవేశపెడతారు. ఆయనకు గురువిచ్చిన నామము మధుకర్‌నాథ్. గురువులతో ఆయన సాంగత్యము, వారు నేర్చిన విద్యలు కోకొల్లలు. గురువులు ఆయనను సన్యాసము తీసుకోనివ్వరు. సంసారములో వుండి జీవించి మోక్షము పొందమని ఆదేశిస్తారు వారి గురువులు. కొంత కాలము తరువాత అంటే దాదాపు ఐదు సంవత్సరము తరువాత ఆయనను వెనక్కు వెళ్ళమని ఆదేశిస్తారు గురువులు. ఆయన తిరిగి వచ్చి కొంత కాలము జిడ్డు కృష్ణమూర్తితో సత్యాంగత్యములో వుంటారు. అక్కడే ఆయనకు వివాహము జరుగుతుంది. స్వతహాగా మోహమాటస్థులు కావటము వలన, ఆయన ప్రచారాలకు దూరంగా వుండి స్కూలు నడుపుతూ వుండిపోతారు చాలా కాలము. ఎన్నో జన్మల నుంచి వున్న సంస్కారము, జ్ఞానము, వారి ప్రతిభ, మబ్బుల మాటున సూర్యుణిలా వుండిపోయింది అంత కాలము. కాని వెలుగు ప్రకాశవంతమవటము తప్పదు. వారి గురువుల ఆజ్ఞతో, ప్రజలందరికీ ఉపనిషత్ జ్ఞానము ఇవ్వాలన్న సంకల్పముతో ప్రస్తుతము ఎన్నో కార్యక్రమాలు నడుపుతున్నారు.

ముఖ్యమైనది: అర్హులకు క్రియాయోగా ను బోధించటము. ప్రతి సమస్య మనలను పరమాత్మ దగ్గరకు మరింతగా చేర్చటానికే అని చెప్పే శ్రీ ఎమ్‌, క్రియాయోగా అన్నింటికీ సమాధానమని చెబుతారు.

“కస్తూరి మృగము తన నుంచి వచ్చే సువాసన గుర్తించనట్లు, మానవులు తమ లోని పరమాత్మను గుర్తించటము లేదని” చెబుతారు. క్రియాసాధనతో ఇహలోకములో సర్వం సమకూరుతుందని, తుదకు మోక్షము కూడా సంభవమని చెబుతారు.

మనిషిని చూడగానే వారి పూర్వాపరాలు, భూతభవిష్యత్తులు తెలిసినా, ప్రేమగా అందరినీ ఓదార్చి సాధన చెయ్యమని, క్రియా యోగా మాత్రమే సమాధానమని చెబుతారు.

వారి పూర్వ జన్మ వృతాంతాలు, నేటి ఈ జన్మలో వారి ప్రహసనము పుస్తకాల రూపములో ప్రచురించారు.

తెలుగులో కూడా అవి అనువదించబడినాయి. నేను మాత్రము ఇక్కడ తెలుగులో దొరకని కారణాన ఆ ఆంగ్ల గ్రంథాన్ని చదివాను. నాకు మనసులో ఏదో మూల చిరు బీజముగా ఆలోచన మొదలైయ్యింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here