సత్యాన్వేషణ-40

0
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ఆ[/dropcap]మె నిరాహార యోగిని మాతా మాణిక్యేశ్వరి.

“ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః।
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః॥”

నేను రాఘవేంద్రస్వామి మఠము వరకూ వచ్చి కూడా తనను చూడకుండా వెళ్ళానని నా బాల్యమిత్రుడు చిన్నబుచ్చుకున్నాడు. నేను తను వున్న చోటుకు తప్పక రావాలని, అక్కడ మంచి హ్యాండులూమ్‌ చీరలకు ప్రపంచ ప్రఖ్యాతి వుందని చాలా చెప్పాడతను. నేను గురువు కోసము వెతుకుతూ ఏవీ పట్టించుకోవటములేదని మా చుట్టాలంతా అనుకోవటము అతనికి అందింది. తనున్న వూరు దగ్గర ఒక నిరాహారియోగిని వుందని, మహా శక్తివంతురాలైన ఆమెను దర్శించి కోరిన ఏ కోరిక అయినా తప్పక తీరుతుందని మరీ మరీ చెప్పగా, నేను ఆ యోగిని దర్శనానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను.

ఆమె పేరు మాణిక్యమ్మ. 1934 లో బుగ్గప్ప, ఆశమ్మలకు జన్మించినది. ఆమె కర్ణాటకలో మల్లాబాదు అన్న చిన్న గ్రామములో జన్మించినది. ఆమె తల్లి తండ్రులకు నలుగురు పిల్లలలో ఆఖరుది. చిన్నతనము నుంచే కొంచము వేరే వుండేది ఆమె ప్రవర్తన. పిల్లలతో కలసి ఆటలు వంటి వాటి జోలికి పోక, మౌనముగా వుండటము, కళ్ళు మూసుకు కూర్చోవటము వంటివి చేసేది. ఆమె ప్రవర్తన వింతగా వుండేది ఆ గ్రామములోవారికి. తండ్రికి వున్న కొద్దిపాటి పొలము సరిగ్గా పండకపోవటము వలన ఆ కుంటుబము పేదరికముతో వుండేది. ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయస్సు వచ్చే సరికే తల్లి తండ్రులు ఆమెకు వివాహము చెయ్యాలని ప్రయత్నించారు. పెళ్ళి, సంసారము అంటక యోగినిలా నివసించాలనుకున్న అమ్మకు వివాహ ప్రయత్నం నచ్చలేదు. తాను వివాహము చేసుకోనని తల్లికి చెప్పినా, పెద్దలు ఆమె మాట వినిపించుకోలేదు. వారి యత్నాలు మానలేదు. ఆ సమయములో చనిపోవాలని ప్రయత్నించింది.

ఆమె తన చేతి గాజులు మెత్తగా నూరి త్రాగింది. ఆమెకు ఏమీ కాలేదు. తన పెళ్ళి తప్పించమని శివుడిని చాలా ప్రార్థనలు చేసింది. అయినా ఆమె ప్రార్థన ఫలించలేదు. అదే సమయములో ఆమె ప్రక్క ఇంటి తోటి పిల్లకు పెళ్ళి జరగటము, అత్తవారింట ఆ ప్రక్కింటి పిల్ల పడే కష్టాలు చూసి అమ్మ చలించిపోయింది. తనకేమైనా జరిగి పెళ్ళి ఆగిపోవాలని, ఇంట్లో ఏదైనా గండమొచ్చి పెళ్ళి తప్పించమని తల్లడిల్లినది. ఆనాటి నుంచి తినటము మానివేసి కేవలము పాలు త్రాగుతూ వుండేది. అయినా ఆమెలో ఎలాంటి నీరసము వంటి లక్షణాలు కనపడలేదు. కానీ ఆ ప్రార్థన ఫలించలేదు. ఆమెకు తల్లి తండ్లులు మాణికయ్య అన్న అతనితో వివాహము జరిపించారు.

అత్తవారింట ఆమెకు కష్టాలు ఎక్కవయినాయి. ఆమె తినటము లేదని, మాట్లడటము లేదని ఆమెను భూతవైద్యుని వద్దకు తీసుకుపోయారు అత్తగారు వారు. భూతవైద్యుడు ఎంత చెప్పినా వినక, ఆమె చేత లేపనము త్రాగిస్తాడు. చాలా రకాలుగా ఆమెను హింసిస్తారు. హింసను తట్టుకోలేక ఆమె స్పృహ తప్పితే ఆమెను గదిలో వేసి తలుపులు మూసివేస్తారు. ఆమె త్రాగే గ్లాసు పాలు కూడా ఇవ్వరు. మరురోజు తలుపులు తీస్తి చూస్తే అమ్మ కనపడదు. అంతటా వెతికి చివరకు వారికి మరో గదిలో చిన్న బుట్టలో పడుకొని కనపడుతుంది. ఈ భూతవైద్యడు పని కాదని, మరో భూతవైద్యుని వద్దకు తీసుకుపోతే, మళ్ళీ హింస మొదలెడతారు. ఆమె వారికి కనపడకుండా మాయమవుతుంది. వెతకగా బయట చెట్టిన చిటారు కొమ్మన పద్మాసనము వేసుకు కూర్చొని వుంటుంది. ఆమెను దించలేకపోతారు. అంత చిటారు కొమ్మకు వెళ్ళటము కూడా కష్టమవుతుంది. పల్చటి చిన్న కొమ్మ ఆమె బరువు భరించటము చాలా వింతగా వుంటుంది. అది చూడటానికి వూరంతా కదిలివస్తారు.

చివరకు ఆ వూరి మస్తాను వచ్చి ఆమె దైవాంశ సంభూత యని, ఆమెను కష్టపెట్టవద్దని చెప్పాక ప్రజలు ఆమెను దేవతగా చూడటము మొదలెడుతారు. ఆమె సంసారము అంటక వంటరిగా వుండటానికి తల్లిగారింటికి వెడుతుంది. ఖర్చులే లేని అమ్మ తన ధ్యానములో శివునకు రోజుకొక అగరుబత్తి వెలిగించేది. ఆ ఖర్చుకూడా ఇవ్వటానికి తల్లితండ్రులు వప్పుకోరు. ఆనాటి నుంచి తన అవసరానికి తనే డబ్బు సంపాదించాలనుకున్న అమ్మ బీడీలు చుట్టి డబ్బు సంపాదించుకునేది. ఆమె తన నివాసము వూరి బయట వున్న చిన్న దేవాలయానికి మార్చుకుంది. తనకు మిగిలిన డబ్బుతో ఆ దేవాలయము బాగు చేయించింది.

ఆమెను వూరిలో వారు గౌరవించేవారు. కొందరు ఆమె గురించి చెడ్డ మాటలు మాట్లాడేవారు.

ఒక నాటి రాత్రి ముగ్గురు ఆమెను అవమానపర్చాలన్న ఉద్దేశముతో దేవాలయానికి వెడతారు. ఆమెను తాకగానే వారి కళ్ళు పోతాయి. మర్నాడు ఉదయము వారి పెద్దలు వచ్చి ప్రార్థన చేసినాక చూపు వస్తుంది. ఆనాటి నుంచి ఆమె జోలికి ఎవ్వరూ వెళ్ళరు. కాని ఆమెకు అక్కడ వుండాలనిపించక యనగొండి కొండ పై పులి తిరుగుతున్నదని తెలిసి ఆ కొండ పైకి వెడుతుంది. అక్కడ వున్న గుహలో వుండిపోతుంది. అక్కడే ఆమె తపస్సు చేసుకుంటూ వుండగా అక్కడి శివాలయ పూజారి ఆమెను చూచి ఆమెకు సేవ చేస్తూ వుంటాడు.

ఒకనాడు ఆమెకు చదవాలని అనిపించి ఆ పూజారిని నేర్పమని అడుగుతుంది. ఆయన సంతోషముగా ఆమెకు అక్షరాలు నేర్పుతాడు. ఆమె ‘క్ష’ పలకలేక ఇబ్బంది పడి దుఖముతో తల శివ లింగానికి కొట్టుకొంటే, లింగము నుంచి వచ్చిన పలుకులు ఆమెకు విద్యను నేర్పాయి. శాస్త్రాలు, వేదాలు ఆమెకు తెలియవు. ఆమె తన తపస్సుతో అన్నీ తెలుసుకుంది. ఆనాటి నుంచి ఆమె శివుని ఆరాధిస్తూ యనగొండి గుట్ట మీద వుండిపోయింది. చుట్టు ప్రక్కల ఆమె పేరు వ్యాపించినది. ఆమె ఎన్నో శివుని మందిరాలను, ఆశ్రమాలను కట్టించింది.

భక్తులతో ఈ క్షణము ఇక్కడ కనిపించి ఒకనాడు శ్రీశైలము వెళ్ళవలనని చెప్పినది. మరురోజు ఆమె అదృశ్యమైనది. వెతకగా శ్రీశైలములో దర్శనమిచ్చింది.

ఆమె భక్తులకు ఎన్నో విషయాలను చెప్పేది. శివరాత్రి రోజు భక్తులు అమ్మ దర్శనానికి తండోపతండాలుగా వస్తారు. ఆమె ఎతైన శిఖరము మీద నుంచి దర్శనమిస్తుంది.

కొందరికి మాత్రమే దగ్గరగా దర్శించుకునే భాగ్యము వుంటుంది. ఆమె సమక్షములో సర్వ బాధలు తీరుతాయని ప్రజల నమ్మకము. ఆమె దర్శనము అందరికీ దొరకదు. చూడాలనుకుంటే ఆమె దర్శనము ఇస్తుంది. లేదంటే ఆమె కనపడదు. ఎంత పెద్ద రాజకీయనాయకులైనా, ధనవంతులైనా పడిగాపులు పడవలసినదే గానీ, ఆమె కృప వలన మాత్రమే ఆమెను దర్శించగలరు.

ఆమె చెప్పిన సూక్తులలో ముఖ్యమైనవి “నిన్ను తెలుసుకో. సర్వ ప్రాణుల యందు కరుణ, ప్రేమ కలిగి వుండు. అహింసను పాటించు. ప్రాణహాని వలదు. సంపద పంచుకోవటానికే పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి తోటివారితో పంచుకో. నీ కర్మ వలన ఈ జన్మ తీసుకున్నావు. ఆ కర్మ లను తుడుచుకునే యత్నం చెయ్యాలి. నీ ప్రతి భావానికి దుఃఖానికి కారణము నీలోనే వుంది తెలుసుకో. తల ఎత్తి, వెన్నెముక నిటారుగా వుంచి ధ్యానము చెయ్యి. ధ్యానము సర్వమునకు సమాధానము”.

మిత్రులు చెప్పిన వివరాలు ఇవన్నీ. ఆమె దర్శనముకు వస్తే ప్రత్యేకముగా ఏర్పాటు చెయ్యగలనని చెప్పినా అవన్నీ వద్దని నేను బయలుదేరాను. హైద్రాబాదు నుంచి దాదాపు మూడు గంటలు పైగా పట్టింది చేరటానికి యదగొండ. అది కర్ణాటక అయినా మహబూబ్‌నగర్‌కు బార్డరులో వుంది. దగ్గరలో వున్న పెద్ద పట్నము నారాయణపేట్. నారాయణ్ పేట్ మగ్గం చేనేత చీరలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వూరు. అక్కడ నేతవారికి హైద్రాబాదు తీసుకు వచ్చి అద్దాల దుకాణములో అమ్మటము తెలియదు. కాబట్టి, వారికి సాంప్రదాయకముగా దళారుల చేతులలో మోసాలు తప్పవు.

నేను ఉదయమే కారులో బయలుదేరి వెళ్ళే సరికే పదింటి కల్లా యనుగొండ చేరిపోయాను. అక్కడ నాకోసము ఇద్దరు వచ్చారు. వారికి ఆ పూజారి, పరిసరాలలో వారు తెలుసనుకుంటాను. నా మిత్రుడు పంపారు వారిని. నాకో రూము ఇచ్చారు. నేను కొంత సేపు లోపల కూర్చొని, తరువాత బయట వున్న దేవాలయాలను, అక్కడి రాగి వృక్షానికి ప్రదక్షిణ చేసి, తోటలో తిరిగి, కాలక్షేపము చేశాను.

“అమ్మను చూడాలంటే నాన్‌వెజ్‌ తినకూడదు” అన్నారక్కడ.

నేను తిననని చెప్పాను. జన్మతా నాకు వచ్చినవి ఇవేనని కూడా చెప్పాక వారు కొద్దిగా తృప్తి పడ్డట్టుగా వున్నారు.

మధ్యాహ్నము భోజనము ఉచితముగా పెడతారుట. ప్రసాదము తినమని పిలచారు. తిన్నాము కొద్దిగా. తరువాత అక్కడ కడుతున్న కోటి లింగాల దేవాలయము ఇతరము చూపించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here